Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన మెగా సూపర్ పవర్ స్టార్లకు ఏమాత్రం తీసిపోని తమిళ హీరో, దక్షిణాది ప్రముఖ కథానాయకుడు సూర్య, భార్య జ్యోతిక అందించిన జైభీమ్ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఒక విభిన్న సంచలనం. జ్ఞానవేల్ దర్శకత్వంలో నిజమైన హీరోయిజం అంటే ఏమిటో, సమాజంలో అన్యాయాలపై పోరాటం అంటే ఏమిటో కొత్త నిర్వచనం ఇస్తున్నది. చిత్రం కథ, నటీనటుల ప్రతిభ, సంభాషణలు సాంకేతిక నైపుణ్యాలతో పాటు ఈ మొత్తానికి ప్రేరణగా నిలిచిన సామాజిక సంఘర్షణ న్యాయపోరాట చరిత్ర నీరాజనా లందుకుంటున్నాయి.
వాస్తవ గాథ, సాహసిక చిత్రణ
బ్రిటిష్ వారి హయాంలోనే అనేక ఆదివాసి వెనకబడిన జాతులపై నిష్కారణంగా నేరస్త ముద్ర వేశారు. స్వాతంత్రానంతర పాలకులూ వాటిని సరిదిద్దలేదు. ఆ విధంగా అణగారిన జాతులు, ఆదివాసులపై అనాగరిక నేరస్త ముద్ర వేసి అయినదానికి కానిదానికి బలితీసే అన్యాయవ్యవస్థ అమానుషత్వంపె, సీపీఐ(ఎం) నాయకుడు గోవిందన్ తదితరుల సాయంతో సాహసికుడైన న్యాయవాది చేసిన పోరాటం, అంతిమంగా సత్యాన్ని నిరూపించడం ఈకథ. తమిళనాడులోని కడలూరు జిల్లా వృద్దాచల్ పట్టణం పరిసరాల్లో జీవించే ఒక ఆదివాసి తెగ అందై కురుంబర్. ఎన్నో కలలతో జీవితానికో గూడు నిర్మించాలనుకుంటున్న యువ జంట రాజకన్ను, సెంగాని (తెలుగులో రాజన్న, చిన్నతల్లి) బుట్టలల్లుతూ పొలాల్లో పనిచేస్తూ జీవితం సాగిస్తుంటారు. కలుగుల్లో ఎలుకలు పందికొక్కులు పట్టుకుంటూ ఉంటారు. 1993లో రాజకన్ను ఊళ్లో పనిలేకపోవడంతో ఏదైనాచేసుకోవాలని పక్క ఊరికెవెళతాడు. ఆ సమయంలోనే స్వంత ఊరి పెత్తందారు ఇంట్లో బంగారం పోతుంది. రాజకన్నుపై సందేహం వ్యక్తం చేస్తాడు యజమాని. గర్భవతిగాఉన్న సెంగానిని పోలీసులు హింసిస్తారు. ఆ అమాయకుణ్ని ఘోర చిత్ర హింసలపాలుచేసి ప్రాణాలు తీస్తారు. శవాన్ని కాల్వలో పడేస్తారు. స్టేషన్ నుంచి పారిపోయాడని కథ అల్లుతారు. అక్కడి నుంచి భర్త కోసం సెంగాని అన్వేషణ మొదలవుతుంది. ఈ క్రమంలో సీపీఐ(ఎం) కార్యకర్తలను ఆశ్రయిస్తుంది. అధికారులతో ఎంతగా మాట్లాడినా నిజం చెప్పరు. అప్పుడే న్యాయవాది చంద్రు దగ్గరకు వెళతారు. తనుకూడా ఉద్యమాలలో పనిచేస్తూ సమాజం కోసం పోరాటానికే న్యాయవిద్య అభ్యసించిన వ్యక్తి. అధినేతలు పోలీసుల ఒత్తిళ్లు, వేధింపులు అన్నిటినీ ఎదుర్కొని 1996 నాటికి తాత్కాలిక ఉత్వర్వులు, పార్వతికి పరిహారం వస్తాయి. సిబిసిఐడి విచారణ తర్వాత మరో మరో పదేండ్లకు అంటే 2006లో పూర్తి తీర్పు వెలువడి పోలీసులకు 14ఏండ్లు శిక్షలు పడతాయి.
పోలీసు హింసలు, అమాయకులను ఇరికించడం, వివక్షలు వంటివి చూపించిన సినిమాలు గతంలోనూ వచ్చాయి గాని జైభీమ్ ఎలాంటి నాటకీయత లేకుండా సినిమా హైప్‌లు లేకుండా ఇతివృత్తంపైనే కేంద్రీకరించి నడవడం ప్రత్యేకత. సూర్య ఆ పాత్రలో ఎంతో నిగ్రహంతో నటించగా, సెంగానిగా లిజోమల్జోస్ కష్టమైన ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. మణికంఠన్ రాజకన్నుగా బాగా నటించారు. ప్రకాశ్‌రాజ్, రావు రమేష్ వంటివారు కూడా చిత్రాన్ని రక్తి కట్టించారు.
అసలైన ప్రేరణ జస్టిస్ చంద్రు
అప్పట్లో లాయర్‌గా పోరాటం చేసిన కె.చంద్రు తర్వాత హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 2006లో మదురై బెంచికి తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేసిన చంద్రు 2009 నుంచి 2013 వరకూ మద్రాసు హైకోర్టులో పనిచేసి రిటైరయ్యారు. తన పదవీ కాలంలో ఆయన అనేక ప్రత్యేకతలు సృష్టించారు. మిలార్డ్ అన్న పదాన్ని వినియోగించకుండా ఉత్తర్వులు చేశారు. మొత్తం 96,000 కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించారు. ఆయన ఇచ్చిన అనేక తీర్పులు సంచలనం సృష్టించాయి. స్త్రీలు అర్చకులుగా ఉండవచ్చునన్న తీర్పు వాటిలో కీలకమైంది. మతాల అంతరాలతో బతికింది గాక మరణానంతరం శ్మశానాలు కూడా కులాలు మతాల వారి ఉండనవసరం లేదని ఆయన ఒక తీర్పులో చెప్పారు. తన పదవీకాలంలో పరిష్కరించిన కీలకమైన 20 కేసుల వివరాలతో ''లిజన్ టు మై కేస్'(నా కేసులు వినండి) అన్న పుస్తకం రచించారు, ఇంగ్లీషులో దాన్ని లెఫ్ట్‌వర్డ్ ప్రచురించింది. ఇదే తమిళంలో అంబేద్కర్ ఒలియల్ ఎనదు తీర్పుగళ్(అంబేద్కర్ వెలుగులో నా తీర్పులు) పేరుతో వచ్చింది.
న్యాయం కోసం మహిళలు చేసే పోరాటమే తనను ఉత్తేజపర్చిందంటారు జస్టిస్ చంద్రు. ఎమర్జన్సీలో డీవైఎఫ్ఐ కార్యకర్తగా పనిచేస్తున్న కాలంలో నాగమణి అనే మహిళ అందుకు ప్రేరణ అయింది. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం లేని హక్కుల అణచివేత కాలం అది. అయితే ఆ దశలో నాగమణి తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రం దేశం దృష్టికి తేగలిగింది. ఎమర్జన్సీ అత్యాచారాలపై నియమించిన కమిటీ ముందుకు ఆమెకేసు వెళ్లింది. తమిళనాడులో ఒక రిటైర్డు న్యాయమూర్తి అధ్యక్షతన ప్రత్యేకంగా విచారణ కమిషన్ ఏర్పాటైంది. అక్షరం ముక్క రాని నాగమణి అంత ప్రభావం చూపగలిగినప్పుడు తానెందుకు న్యాయం కోసం పోరాటం చేయొద్దని ఆలోచించిన చంద్రు ఆ మార్గం పట్టారు. మన దేశంలో మహిళలు కోర్టులకు వెళ్లి పోరాడటం మరింత కష్టమనేది ఆయన అభిప్రాయం, అనుభవం. ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. వారికి న్యాయం జరిగేలా చేయడానికి కావలసిన భాష కూడా ఇంతవరకూ ఏర్పడలేదంటారు. పాండ్యన్ అనే ట్రాన్స్‌జెండర్‌పై సోదరి కేసు వేసింది. ఈ కేసులో తీర్పు రాయడానికి పాండ్యన్‌ను ఏమనాలి? అనివార్యంగా అయిష్టంగా 'అతను' అని రాయాల్సి వచ్చినందుకు ఎంతో బాధపడ్డానంటారు. మరో కేసులో ఒక మహిళను మతిస్థిమితం లేదని ఉద్యోగం నుంచి తొలగించారు. చంద్రు ఆ కేసును లోతుగా కృషిచేశారు. ఆమెకు న్యాయం చేయడం కోసం మానసిక వైద్య పరీక్ష చేసుకోమని కోరారు. అయితే ఆ మహిళ అందుకు ఇష్టపడలేదు. ఆయనే ఎలాగో నచ్చజెప్పి పరీక్షలు జరిపించారు. శారీరిక అస్వస్తత ఎలాంటిదో మానసిక అస్వస్తత కూడా అలాంటిదేనని, దానికి గాను వారిని పనినుంచి తొలగించడం వంటి శిక్షలు వేయడం అన్యాయమని చెప్పారు. ఈ కేసులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది గాని అప్పటికే ఆమె చనిపోవడం ఆయనకు ఎంతో బాధ కలిగించిన విషయం.
శ్రమ జీవులు ఆదివాసులు దళితులు అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా మన చట్టాలు వ్యవస్థ ఎలా పనిచేస్తాయో ఆయన ప్రత్యక్షంగా చూశారు. అన్యాయం జరిగినా అందుకు సంబంధించిన వాస్తవ నిబంధనలు ఏమిటో, ఎలా ఉల్లంఘించబడ్డాయో ఎలా చెబితే కోర్టు ముందు నిలుస్తుందో వారికి తెలియదు. ఆ హడావుడిలో బాధలో క్రాస్ ఎగ్జామినేషన్ ఒత్తిడిలో, లాయర్ల అనవసర సలహాలతో తమకు నష్టం కలిగించేలా కూడా మాట్లాడవచ్చు. అందుకే జైభీమ్‌లో సెంగాని తనదగ్గరకు వచ్చినప్పుడు చంద్రు జరిగింది జరిగినట్టు చెప్పమని అడుగుతాడు. దాన్ని తమిళంలోనే రాసుకుని ఆమెను మళ్లీ అడిగి నిర్ధారించుకుంటాడు. తర్వాతనే ఇంగ్లీషులో రాసుకోవడం. ఉన్నది ఉన్నట్టు అనేది ఇక్కడ సూత్రం. న్యాయం తప్పక జరుగుతుందని చెప్పడం నిజమే గాని దాన్ని సాధించేందుకు పోరాటం చాలానేర్పుతో ఓర్పుతో నైపుణ్యంతో చేయాలంటారు. చట్టం వ్యవస్థపై ఆధారపడివుంది గాని వ్యవస్థ చట్టంపై ఆధారపడి లేదన్నది కారల్ మార్క్స్ ప్రసిద్ధవాక్యం. ప్రజా పోరాట కార్యకర్తగా, హక్కుల న్యాయవాదిగా, ఉన్నత న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రు జీవితం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఆ రోజుల్లో ఆయన నిరుపేదల దగ్గర రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా వాదించేవారట. న్యాయమూర్తిగా తన పదవీ కాలం చివరిరోజున మీడియాను పిలిచి మాట్లాడారు. తాను సుప్రీం కోర్టులో ప్రాక్టీసు చేయబోననీ, ఏ ట్రైబ్యునల్ లోనూపదవి తీసుకోబోననీ ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తులే రాజ్యసభలకూ, ఇతర పదవులకు ఎగబడే కాలంలో ఇది అరుదైన ఆదర్శం! జై భీమ్ విడుదలైన తర్వాత మీడియా సంస్థలలో జస్టిస్ చంద్రు ఇంటర్వ్యూలు విస్తారంగా వస్తున్నాయి. సోషల్ మీడియా ఆయనను ఒక హీరోగా అభినందిస్తున్నది. భారత రత్న ఇవ్వాలని కూడా అనేకమంది అంటున్నారు. అన్నట్టు జస్టిస్ చంద్రు విజయవాడ హైదరాబాద్‌లతో సహా తెలుగు నగరాల్లోనూ పర్యటించారు. ఐలూ సభలకు విచ్చేశారు. చాలా నిరాడంబరుడు. ఈ వ్యాసకర్త ఆయనను అనువదించారు కూడా.
తెరపై సామాజిక న్యాయ పవనాలు
తమిళనాడులో కమ్యూనిస్టు ఉద్యమం మొదటి నుంచి గ్రామాలలో కుల వివక్షపైన పెత్తందార్ల దౌర్జన్యాలపైన పోరాడుతోంది. ఇటీవలనే తెలుగులో వచ్చిన నారప్ప చిత్రం (తమిళంలో అసురన్) అయిదున్నర దశాబ్దాల కింద కీలవెన్మణిలో దళితులను సజీవ దహనం చేసిన సంఘటనకు చిత్రరూపమే. అది కూడా సీపీఐ(ఎం), వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలను అణచివేసేందుకే జరిగింది. ద్రవిడ భావజాలం, బ్రాహ్మణేతర ఉద్యమం తర్వాత కాలంలో వెనకబడిన కులాల పోరాటం వంటివి దీన్ని మరింత పదునెక్కించాయి. తెలుగు రాష్ట్రాలలో కెవిపిఎస్లాగే తమిళనాడులో అస్పృశ్యతా నిరోధక సంఘం పనిచేస్తున్నది. ఇప్పటికీ రాష్ట్రంలో ఏదో మూల వివక్షపై పోరాటం కథలు వింటూనే ఉంటాం. ఏవోకొద్ది మినహాయింపులు తప్ప మామూలుగా మన సినిమాలలో పేద ధనిక తేడాలు చూపినంతగా కుల వివక్షనూ కింది కులాల పేర్లనూ వినం. దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు కూడా మూలపీఠమైన మద్రాసులో రజనీకాంత్ లాంటి మాస్హీరో కూడా పా రంజిత్ నిర్దేశకత్వంలో కబాలి, కాలా వంటి చిత్రాలలో ఉపేక్షిత వర్గాల (సబ్ అల్ట్రన్) కథలను తీసుకోవసలసిన పరిస్థితి రావడం గమనించదగింది. మాస్ మసాలాకు ఫార్ములా కథలకు పేరుమోసిన తెలుగులోనూ రంగస్థలంతో మొదలుపెట్టి ఈ తరహా కథలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తీరులో తేడాలున్నా ఈమధ్య కాలంలో కలర్‌ఫొటో, ఊపిరి, లవ్‌స్టోరి వంటి చిన్న పెద్ద చిత్రాలు కుల సమస్యను తీసుకోవడం యాదృచ్చికం కాదు. పాతికేండ్ల కిందటే ఆదివాసులపై పోలీసు దౌర్జన్యం మిస్సింగ్ కేసును తీసి జాతీయ అవార్డు సాధించిన ఉమామహేశ్వరరావు ఈమధ్య ఇట్లు అమ్మ చిత్రంలో ఇలాంటి అంశాన్ని మరోకోణంలో చూపించడం గమనించదగ్గది. మీడియాలో సోషల్ మీడియాలాగా సినిమాలకు ఓటీటీ(ఆన్ ఆ టాప్) సమాంతర ప్రయత్నాలకు దోహదం చేస్తున్నది. జైభీమ్ ఈ కోవలో మైలురాయి వంటి ప్రయత్నం. మహిళల సమస్యపైనే వచ్చిన పింక్‌ను తెలుగులో వకీల్‌సాబ్‌గా తీసిన తీరుకూ, జైభీమ్కూ తేడాను విమర్శకులు చెప్పుకోవడమే గాక ప్రేక్షకులూ గమనించారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి చారిత్రక పాత్రలకు కూడా లేనిపోని కల్పనలు జోడించి భారీ వాణిజ్య చిత్రాలుగా తీసే కాలంలో, అతిసామాన్యులతో కలసి అభ్యుదయ శక్తులు సాధించిన విజయం జైభీమ్ అంటూ ముందుకు రావడం ఎంత గొప్ప విషయం!
- తెలకపల్లి రవి