Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపావళి నాడు
చీకటి లాంటి వార్త!
జలజం ఇక లేడూ అంటే
మానస సరోవరం చిన్నబోయింది.
పొద్దున చినుకులు పడుతుంటే
ఏమిటో అనుకున్నాను
కారణం తెలియని దుఃఖంలా
తెల్లారిందివాళ.
అనగనగా ఒక జలజం సత్యనారాయణ
పదేళ్లుగా అతని పేరే నిత్య ధారణ
బుద్ధి పుట్టగానే నూరు మైళ్లను
పక్కింటికి వెళ్లినంత అలవోకగా సంచారణ.
పాలమూరు భాగ్యనగరాల మధ్య
ఆసు పోసే సాహితీ వాహన
స్నేహమంటే అతనిదే
భావుకత అతని వొడువని కథ.
స్కూలు పెట్టి
పేద పిల్లలకు
ఆయన అందించిన విద్య
ఫ్యూడల్ సంస్కృతి పట్ల
ఆయన ధిక్కారం.
ఆయన జీవితం తిరిగిన మెలికలు
మసక బారని వ్యక్తిత్వం తళుకులు
ఎనిమిది పదులు దాటిన వయస్సులో కూడా
యువకులను దాటి పోయే చురుకైన నడకలు.
'మానవుడే మా సందేశం' నాటి సీనియర్ కవి
కరుణను ప్రకాశంగా వెదజల్లిన సాహితీ రవి
'అనల'తో మొదలైన ఆయన కవిత్వం
జ్వలన గుణాన్ని కోల్పోలేదు.
అనువాద మహాయజ్ఞంలో
ఆయన ఆహుతిచ్చిన సమిధలు అనర్ఘం.
తన తర్జుమాతో
కబీరునుజి
తెలుగువాడిగా మార్చేసిన సృష్టికర్త
వాజ్పారు కవిత్వ శిఖరాన్ని
బెత్తలతో కొలిచిన ధీశాలి.
అతని పునః సృజనను చూస్తే
ఫైజ్ ఎంత ముచ్చట పడే వాడో
ముదిమి వయః పరిపాకంతో
వేలాది పేజీల జ్ఞానాన్ని దున్ని పారేసిన కృషీవలుడు.
ప్రొఫెసర్ కాదు
పీహెచ్.డీ.ల కోసం కాదు
ప్రమోషన్ల ప్రసక్తి లేదు
జ్ఞానతృష్ణనుజి
ఉష్ణ రుధిర ప్రసారంగా మార్చుకున్న ఘన పిపాసి.
నేను చైనాకు వెళ్లినప్పుడు
ఎయిర్పోర్టులో
తానే వెళ్తున్నంత హడావిడి చేశాడు.
మా యింటికి రాగానే
మేడ మెట్లను
పాదాలతో నిమురుతూ పలకరించే వాడు.
నా మిత్రుడు
అక్షర బాంధవుడు
పరిపూర్ణ పథికుడు
అతడివాళ లేడంటే
పాలమూరి ఆకాశం మరింత శూన్య మయ్యింది.
అతనికి
నా కన్నీటి నివాళి.త
4 నవంబర్ 2021 ప్రముఖ కవి, అనువాదకుడు, విద్యావేత్త జలజం సత్యనారాయణ గారి అస్తమయానికి పరితపిస్తూరి..
- డా. ఎన్. గోపి