Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుర్గాదేవి, కాళికామాత, గ్రామ దేవతలైన మైసమ్మ, పోచమ్మ వంటి దేవతా విగ్రహాలన్నీ భీతి గొలిపే విధంగా పెద్ద పెద్ద బొట్టుతో నాలుక బయటికి పెట్టి కళ్ళు పెద్దగా తెరిచి కొన్ని సందర్భాలలో త్రిశూలం చేతబట్టి రాక్షసులను క్రింద పడవేసి త్రొక్కుతూ, చంపుతూ ఉన్నట్లుగా దర్శనమిస్తాయి. మరికొన్ని చోట్ల మనుషుల పుర్రెలు మెడలో మాలగా వేసుకుని చేతుల్లో కత్తులు బల్లెం పట్టుకొని విలయ తాండవం చేస్తూ ఎదుటి వాళ్ళు తమను తాము సమర్పించుకునే విధంగా కనిపిస్తుంటారు. కొన్నిచోట్ల శివుడి విగ్రహాలు తప్ప పురుష దేవుళ్ళెవరూ ఇలా లేరే... ఎందుకబ్బా దేవతలను ఈ విధంగా చూపిస్తారు లేదా ప్రతిష్టిస్తారు అని చిన్నప్పుడు సందేహం కలిగేది. కానీ స్త్రీలపై ఈ మధ్యకాలపు పోకడలను చూశాక అర్థమవుతుందేమంటే ఆ రోజుల్లోనూ స్త్రీలపై జరిగిన అణచివేతలను తీవ్రంగా ప్రతిఘటించడం వల్లనే ఈ విగ్రహ ప్రతి రూపాలన్నీ ఆ నాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వెలసి ఉంటాయి. అనగా ఆ రోజుల్లో ఎంతటి నిర్బంధం, ఎంతటి దాష్టీకం, ఎంతటి బలప్రయోగం, ఎంతటి అణచివేత స్త్రీలపై జరిగిందో... దానివలననే స్త్రీలు తిరుగుబాటు చేసి ఆ రకమైన భద్రకాళికామాతలై సమాజంలో తమకు తాము గుర్తింపు తెచ్చుకున్నారేమో అని అనిపిస్తుంది. చరిత్ర కనుమరుగవు తున్నకొద్ది స్త్రీల పౌరుషాన్ని విగ్రహాలకే పరిమితం చేసి వంటింటి కుందేళ్ళలా, వాకిట్లో పిడకలు పిసికే గొబ్బెమ్మలుగా, భర్త కాళ్లు నొక్కే దాసీ తనానికే పరిమితం చేయాలనుకునే మతాధిపత్యపు దురుద్దేశం మళ్ళీ జడలు విప్పుతూనే ఉన్నది. తమ ఆధిపత్య దోరణికి సాంప్రదా యమనే ముసుగును తొడిగి స్త్రీకి తానే స్వీయ నిభంధనలు పెట్టేలా తయారుతున్నది. స్త్రీలకు నిబంధనలు పెట్టడమే సంప్రదాయానికి ఆనవాలుగా అన్ని మతాలు పాటిస్తున్నాయంటే ఈ మతాల మనుగడకు స్త్రీని ఎంతలా వంచిస్తున్నాయో చూడండి. నేటి సమాజంలో స్త్రీలంతా ఈ విగ్రహాల ప్రతి రూపాల్లో పరకాయప్రవేశం చేయాల్సిన అవసరం ఉందేమో. తానోడి నన్నొడ్డెనా? నన్నొడ్డి తానోడెనా? అని నిలదీసిన ద్రౌపది ధైర్యం నేటి అవసరం.
ఫ్యాబ్ ఇండియా అనే దుస్తుల కంపెనీ దీపావళి సందర్భంగా విడుదల చేసిన వ్యాపార ప్రకటన (అడ్వరటైజ్మెంట్) పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరుకు చెందిన పార్లమెంటు సభ్యులు తేజస్వి సూర్య పెద్ద దుమారం లేపారు. సదరు అడ్వరటైజ్మెంట్లో ఉర్దూ పదాలను ఉపయోగిం చడం వలన అది బ్రాహ్మణిజానికి వ్యతిరేకమనీ, దీపావళిని ఉర్దూలో ఉచ్చరించట మేంటనీ భాషాపరమైన వివాదాలను మొదట్లో రేకెత్తించారు. ఆ తర్వాత స్త్రీలు ధరించిన దుస్తుల్లో తప్పులు వెతికారు. అంతటితో ఆగక వారు నుదుటిపై కుంకుమ పెట్టుకోక పోవడం హిందూ సంప్రదాయానికి వ్యతిరేకమని మరో వివాదం రేకెత్తించారు. బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయానికి ప్రతీక, గుర్తింపు అని సెలవిచ్చారు. అలాగైతే ఈ దేశంలో కుంకుమ కొనుక్కోలేని వాళ్ళు లక్షలమంది దళిత గిరిజన జాతులు ఉన్నారు. మరి ఇప్పుడు దేశమంతా స్త్రీలందరికీ బొట్టు బిల్లలు కుంకుమ భరణిలు ఉచితంగా పంచి పెడుతుందా కేంద్ర ప్రభుత్వం? అయినా కట్టు బొట్టులోనూ స్త్రీలకి స్వేచ్ఛ లేదా? ఒక్కో అవసరానికి ఒక విధంగా ఎవరైనా తయారవుతుంటారు. ఆ మాత్రం స్వాతంత్య్రం లేదా? స్లీవ్ లెస్ జాకెట్ వేసుకున్నారు అని మరో వివాదాన్ని రేకెత్తించారు. జాకెట్‌గుడ్డ కొనుక్కోలేని దుస్థితి గల స్త్రీలెందరో మన దేశంలో ఉన్నారన్న విషయం ఈ ప్రజా ప్రతినిధులకు అగుపడటం లేదేమో! అయితే జాకెట్లు వేసుకోకూడదు అనే సంప్రదాయాలు కూడా అనేక కులాల్లో ఉన్నవి. మరి వీరికి భయపడి అలాంటి సంప్రదాయాన్ని వదిలి అందరూ తమ కట్టూ బొట్టును మార్చుకోవాలా? సౌకర్యవంతమైన వస్త్రధారణ కూడా స్త్రీల పట్ల శాపంగా పరిణమింపజేసే ఈ సంప్రదాయం మరణశాసనమే. గత సంవత్సరం తనిష్క్ జ్యువెలరీ వాళ్లు తీసిన మరో అడ్వర్టైజ్మెంట్లో హిందూ స్త్రీ ముస్లిం ఇంటికి కోడలిగా వెళ్లడమేంటి... అని మతపరమైన కోణాన్ని అందులో తీశారు. నిజానికి ఆ ప్రకటనలో ముస్లిం కుటుంబంలోనూ కోడలిగా వచ్చిన హిందూ స్త్రీకి సీమంతం జరిపినట్టుగా ఉన్నది. అంటే ఇస్లాం మతంలోలేని ఆచారాన్ని ఆ స్త్రీ గౌరవార్థం వారు పాటిస్తున్నారని అభినందించాల్సింది పోయి, ముస్లిం ఇంటికి హిందూ స్త్రీ వెళ్లడం ఏంటి అని వాదించి ఆ ప్రకటనను రద్దు చేసుకునేలా చేశారు. ఇది కాదా పేట్రేగిన మూర్ఖత్వం? ఇస్లాం మతంలోని బురఖా విధానమైనా, హిందూమతంలోని మేలిముసుగు లాంటి కొంగు కప్పుకోవడం వంటివైనా, క్రైస్తవ మతంలోని మరో విధమైన నిర్బంధమైనా స్త్రీని అదుపులో పెట్టే లేదా స్వేచ్ఛలేని తనన్ని తెలుపుతాయి. మతాలన్నీ స్త్రీ చుట్టూ, స్త్రీ యొక్క పాతివ్రత్యం చుట్టూ ఇంకా చెప్పాలంటే స్త్రీ శరీరం చుట్టు మాత్రమే తిరుగుతాయి తప్ప స్త్రీకి మానసిక స్వేచ్ఛను గానీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికినీ అవకాశం ఇవ్వలేదు.
పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లవ్ జిహాద్ వంటి అనేక చట్టాలను చేసి హిందూ స్త్రీలెవరూ ఇతర మతస్తులను ప్రేమించకుండా, పెళ్ళి చేసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి చట్టాలు స్త్రీ యొక్క పరిపక్వతణూ స్వేచ్ఛణు అణచివేస్తాయి. మోసపూరిత ఉద్దేశాలను ఒక మతానికి ఆపాదించడం ఎంత వరకు సబబు? ఉత్తరప్రదేశ్‌లో కుల్దీప్ సింగ్ సింగర్ అనబడే హిందూ మతస్తుడైన ఒక ప్రజా ప్రతినిధి మైనర్ బాలికను అత్యాచారం చేయడం, కుటుంబాన్ని మొత్తం హత్య చేయించే ప్రయత్నం చేశారని జైలు పాలు కావడం దేనికి సంకేతం? మతానికి. హిందూ సమాజోద్దరణకు పూనుకున్నామని ప్రగల్భాలు పలికి అత్యాచారాలు, హత్యలు చేసిన నేరాల్లో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఆశారాం బాపు, గుర్మీత్ రామ్ రహీం అనబడే డేరా బాబా జీవితాల చీకటి కోణాలు చూశాక మరి అట్లాంటి చర్యలను అడ్డుకునేందుకు చట్టాలు చేయరెందుకు? ఎందుకంటే హిందువులైన మగవాడు ఏమైనా చేయవచ్చా? అందులోనూ సన్యాసిగా మారితే మరింత స్వేచ్ఛా! ఇదేనా హిందూ సమాజ పునరుద్ధరణ? ఇస్లాం మతం కూడా ఇలాంటి అకృత్యాలకేమీ తీసి పోలేదు. ఇప్పటికీ తెలివైన యువతులెందరో ఉపాధికి నోచుకోక పోవడానికి మత కట్టుబాట్లే కారణం. అనేక ఇస్లామిక్ దేశాల్లో స్త్రీలను అణచివేసే పోకడలు ఉన్నవి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు స్త్రీలపై విధిస్తున్న ఆంక్షలు ఆక్షేపణీయం. వాటిని అనేక హిందూ సంస్థలు ఖండిస్తున్నాయి. మరి ఇదే దేశంలో స్త్రీలపై విధించబడుతున్న అంక్షలను ఎందుకు ఖండించరు? పబ్‌కు వెళ్ళారని బెంగుళూరులో శ్రీరాం సేన నాయకులు మహిళలను ఈడ్చుకెళ్ళి కొట్టిన సంఘటన దారుణం. సతీసహగమనాన్ని రూపుమాపి నందుకు అప్పటి ప్రభుత్వాలు సర్ అనే బిరుదు రాజారామ్మోహన్ రారుకి ప్రకటించాయి. ఒక వ్యాపార ప్రకటనకే తట్టుకోలేని ప్రజా ప్రతినిధులు ఉన్న ఇప్పుడైతే ఆయనను హిందూ వ్యతిరేకిగా, దేశద్రోహిగా ముద్రవేసి అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద జైల్లో పడేసే వారేమో! స్త్రీలను అర్థనగంగా ప్రదర్శిస్తూ క్యాలెండర్లు రిలీజ్ చేసిన కింగ్ ఫిషర్ అధినేత విజరు మాల్యా ఇదే పెద్ద పెద్ద మతాలకి సంబంధించి మాట్లాడే నాయకులకు మిత్రుడు. అడ్వర్టైజ్మెంట్ కోసం అర్థ నగత్వాన్ని ప్రదర్శింప చేసే కంపెనీలన్నీ ఎన్నికల నిధులు సమకూరు స్తాయి కాబట్టి అది తప్పు అని అనిపించదు. స్త్రీ కేవలం ఒక భౌతిక వస్తువు కాదు. చలం అన్నట్టుగా స్త్రీకి శరీరంతో పాటు మనసు కూడా ఉన్నది.
వ్యాపార ప్రకటనల్లో బొట్టు పెట్టుకోలేదని, చీర సరిగ్గా కట్టుకోలేదనీ లేదా తక్కువ సాంప్రదాయంతో కనిపించారని లేదా ఎక్కువ అందంగా ఉన్నారని, అవన్నీ హిందూత్వానికో లేదా మరో మతాచారాలకో విరుద్ధమని, ఇలాంటి ఆలోచనకు చరమగీతం పాడకుంటే మొదట్లో చెప్పిన కాళీమాతలు మైసమ్మలు పోలేరమ్మలు తిరగబడే రోజులు తప్పకుండా మళ్ళీ చూస్తాం.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016