Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజురాబాద్ ఉప ఎన్నికలో అహంభావం మీద ఆత్మగౌరవం గెలిచిందని నియోజక వర్గం ప్రజల భావన. ఈ ఫలితాలతో టీఆర్ఎస్ నాయకత్వం గుణపాఠం తీసుకుంటుందా లేక తాను తవ్వుకున్న గోతిలో తానే పడుతుందా అన్నది వేచి చూడాలి. ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకంతో 'విజయ గర్జన' సభకు పథక రచన చేసి ఉంటారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నాయకత్వానికి కావల్సింది 'ఆత్మ పరిశీలన సభ'. ఇదొక భాగం. గెలుపు ఈటలదా? లేక బీజేపీదా అన్న చర్చ పెద్దగా లేదు. నియోజకవర్గం ప్రజలు గానీ, రాష్ట్రంలో మీడియాగానీ, రాజకీయ శ్రేణులుగానీ.. ఇది ఈటల గెలుపుగానే పరిగణించారు. అందుకే అది ఆత్మగౌరవం గెలుపుగా చూస్తున్నారు. సాంకేతికంగా చూసినప్పుడు గెలిచిన ఈటల బీజేపీ అభ్యర్థి. కాబట్టి బీజేపీ గెలపుగానే భావించాలని కొందరు బీజేపీ నాయకులు చెప్పేందుకు ప్రయత్నించినా ఎవరూ సీరియస్‌గా తీసుకోవటం లేదు. నిజానికి బీజేపీ నాయకులు కూడా అంత ఆత్మవిశ్వాసంతో చెప్పగల స్థితిలో లేరు. ఇది బీజేపీ గెలుపే అయితే, అదే రోజు దేశంలో జరిగిన ఇతర ఉప ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందన్న మీమాంసలో వారు ఉండటం సహజమే! అంతే కాదు... నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీలోనే నిలదొక్కుకోలేకపోయిన విషయంకూడా తెల్సిందే. అందువల్ల, ఏ కోణంలో చూసినా గెలుపు ఈటలదేనన్న విషయం నిర్వివాదాంశం. ఎన్నికల ప్రచారంలో కూడా తనను తాను బీజేపీ అభ్యర్థిగా కన్నా, ఈటల రాజేందర్‌గానే ప్రజల ముందు చూపించుకున్నారు.
ఇదంతా గతం. ఇప్పుడు చట్టపరంగా చూస్తే ఈటల బీజేపీ శాసనసభ్యుడు. బీజేపీ నాయకుడుగానే ప్రజలముందుకు వెళ్ళవల్సి వస్తుంది. ఇప్పటికే ఆయన మెడలో నిరంతరం కాషాయ కండువా ఉండే విధంగా బీజేపీ నాయకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈటల గెలుపును బీజేపీ అభివృద్ధి కోసం వాడుకుంటారు. శాసనసభలో కూడా తాను బీజేపీ నాయకుడుగానే మాట్లాడవల్సి ఉంటుంది. అందువల్ల రాష్ట్రంలో బీజేపీ ప్రమాదం పెరుగుతుంది. ఈటల వ్యక్తిగత ప్రతిష్టనూ, గెలుపునూ బీజేపీ వాడుకోవటం కోసమే తన పార్టీలో చేర్చుకున్నది. సహజంగానే ఇప్పుడు ఆ పని చేస్తుంది.
ఈటలను గెలిపించిందెవరన్నది మరో కీలక ప్రశ్న. ఈటలను గెలిపించటమంటే ఏమీలేని హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ప్రాణం పోయటమే. అంతే కాదు... దేశమంతా అప్రతిష్టపాలవుతున్న బీజేపీకి తెలంగాణలో ఊతమివ్వటమే. ఈ పాపం ఎవరిది? ఇట్లా ప్రశ్నించుకునే వారెవరికైనా కనిపించేది కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకత్వాలే! కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకత్వాలు ఈటలను గెలిపించటం ఏమిటి? నిజమే! ఇతర సందర్భాలలో ఇలాంటి పరిణామాలు ఎవరూ ఊహించజాలరు. కానీ ఇది నిజం. అందుకే ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారి ముందు ఈ రెండు పార్టీల నాయకత్వాలే ముద్దాయిలుగా నిలబడవల్సి వస్తున్నది. బీజేపీ, ఆరెస్సెస్‌ల ప్రమాదం పట్ల తెలంగాణ ప్రజలను చైతన్యపర్చవల్సిందిపోయి, అవకాశం దొరికినప్పుడల్లా ఢిల్లీ నేతలతో రాష్ట్రముఖ్యమంత్రి లాలూచీ కుస్తీ నడిపారు. మరోవైపు ప్రజల పట్లా, తన సొంత పార్టీ శ్రేణులపట్లా అహంభావం ప్రదర్శించారు. రాష్ట్ర ప్రజలు ఇలాంటి ధోరణులను అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మరోవైపు ఈ పరిస్థితిని బీజేపీ వాడుకునే అవకాశం ఇవ్వకుండా చూడవల్సిన కాంగ్రెస్ బాధ్యతారహితంగా వ్యవహరించింది. నియోజకవర్గంలో బీజేపీని ఓడించే లక్ష్యాన్ని గాలికి వదిలేసింది. టీఆర్ఎస్ను దెబ్బకొట్టే ప్రయత్నమే తప్ప, బీజేపీని ఓడించే ఎత్తుగడలు వేయలేదు. నియోజకవర్గంలో వామపక్షాలకు సొంత బలం పెద్దగా లేకపోవటంతో అవకాశవాద రాజకీయాలదే పైచేయి అయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, మరో మాజీ ఎంపీ కలిసి ఈ పథక రచన చేసారన్న వార్తలు ఎన్నికలకు చాలాముందుగానే గుప్పుమన్నాయి. ఈ సలహా తానే ఇచ్చానని ఆ మాజీ ఎంపీ బహిరంగంగానే చెప్పుకున్నారు. అధికారం యావలోపడి అధికారపార్టీలో లుకలుకలు సృష్టించాలన్న ఎత్తుగడలే తప్ప, మతోన్మాదానికి అవకాశం ఇవ్వొద్దన్న సోయిలేదు. ఒక జాతీయపార్టీగా, జాతీయ స్థాయిలో బీజేపీకి తానే ప్రత్యామ్నాయంగా చెప్పుకునే పార్టీ ఇక్కడ సంకుచితంగా వ్యవహరించింది. కాంగ్రెస్ లౌకిక పార్టీగా కూడా చెప్పుకుంటుంది. కానీ హుజురాబాద్ ఎన్నికలలో ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. బీజేపీ అభ్యర్థిని తానే ఓడిస్తానని సవాలు చేయవల్సిన కాంగ్రెస్, ఉప ఎన్నిక ప్రకటన కూడా రాకముందే చేతులెత్తేసింది. నిజాయితీగా నిలబడి గట్టిగా ప్రయత్నిస్తే త్రిముఖ పోటీ కావాలి. కాంగ్రెస్ నాయకత్వం జబ్బలు జారేసి, నామమాత్రపు పోటీ పెట్టింది. గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు 60వేల ఓట్లు పోలయ్యాయి. అవన్నీ టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు. ఇప్పుడవి గణనీయంగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఈటలకు పడటంతో ఆశ్చర్యం లేదు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోతే, ఆ పార్టీ శ్రేణులలో అవిశ్వాసం పెరుగుతుందని కాంగ్రెస్ నాయకుల అంచనా. ఆ మేరకు లుకలుకలు పెరిగి టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ వైపు చూస్తారని వారి ఆశ. ఎంతసేపూ తమ రాజకీయ ప్రయోజనమే తప్ప ప్రజల ప్రయోజనం, దేశ ప్రయోజనం కాంగ్రెస్‌కు పట్టదు. ఒక పథకం ప్రకారమే టీఆర్ఎస్ను ఓడించటం కోసం ఈటలను కాంగ్రెస్ గెలిపించింది. ఇది ఆత్మహత్యా సదృశ్యమైన ఎత్తుగడ.
కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి రావటంతో ఆ పార్టీ శ్రేణులు, తమకు యువ నాయకత్వం వచ్చిందని ఉత్సాహపడ్డారు. ఈ ఆనందం హుజురాబాద్ ఓటమితో నీరుకారడం సహజం. కాంగ్రెస్ ఓట్లు ఎందుకు నామమాత్రమైనాయన్న ప్రశ్నకు నాయకులు ఏమి సమాధానం చెబుతారు? గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్‌రెడ్డి బలమైన వాడనీ, అవన్నీ తమ ఓట్లు కాదని చెప్పగలరా? అలా ఒప్పుకుంటే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పునాది లేదని అంగీకరించటమే! అలా కాదంటే, అవి టీఆర్ఎస్కు పడ్డాయా లేక ఈటలకు పడ్డాయా... వారే చెప్పాలి. ఎందుకు పడ్డాయో కూడా చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా 40వేల ఓట్లకు ఎప్పుడైనా తక్కువరాని నియోజకవర్గం అది. కాంగ్రెస్‌కు యువ నాయకత్వం రావటంతో ఇక కాంగ్రెస్ బాగుపడుతుందని కొందరు భావించారు. గతంలో కాంగ్రెస్‌కు తగిన నాయకత్వంలేకనే పార్టీ శ్రేణులలో విశ్వాసం సడలిందనుకున్నారు. గత పార్లమెంటు ఎన్నికలలో గానీ, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో గానీ ఈ కారణంతోనే కాంగ్రెస్ చతికిల బడ్డదని కాంగ్రెసేతరులు కూడా కొందరు భావించారు. ఇప్పుడు గట్టినాయకత్వం ఉన్నదని భావించాలి. పార్టీ శ్రేణులలో విశ్వాసం నింపగల యువ నాయకత్వం వచ్చినందుకు కాంగ్రెస్ దశ, దిశ మారుతుందనుకోవాలి. ఈ అంచనాతోనే కొందరు కాంగ్రెస్‌కు పునరుజ్జీవనం జరిగిందని భావించి ఉండవచ్చు. కానీ, ఈ పరిస్థితుల్లో కూడా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు చేతులెత్తేసిందో పరిశీలించాలి. ఇప్పుడెందుకు గట్టిగా నిలబడలేదో, తన ఓట్లైనా ఎందుకు కాపాడుకోలేకపోయిందో గమనించాలి. ఇక్కడ అసలు సమస్య ముందుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అసలు సమస్య నాయకత్వమా? విధానమా? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం వెతకటమే కీలకం. సరిగ్గా ఉంటే... బీజేపీని ఓడించగల శక్తిగానీ, నిజాయితీగానీ తనకే ఉన్నదని నిరూపించుకునేందుకు ఈ ఉప ఎన్నికల్లో గట్టి ప్రయత్నం చేసి ఉండాల్సింది. కానీ సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేటంత స్పష్టంగా, ఈటల గెలుపునకు మార్గం సుగమం చేసే ఎత్తుగడ వేసింది. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈటలకు పడిన ఓట్లలో ఇప్పుడు అధిక భాగం టీఆర్ఎస్ అభ్యర్థికి పడే అవకాశం సహజమే. ఆమేరకు కాంగ్రెస్ ఓట్లు ఈటల లోటును భర్తీ చేసాయి. అందువల్ల ఈటలను గెలిపించింది కాంగ్రెస్ పార్టీ.
ఇలాంటి అవకాశవాద ఎత్తుగడలు కేవలం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల పొరపాటు మాత్రమే కాదు. కాంగ్రెస్ విధానంలోనే దీనికి పునాదులున్నాయి. కాంగ్రెస్ పార్టీ అఖిలభారత నాయకత్వం నుంచే ఈ అవకాశవాదం అన్ని స్థాయిల్లో విస్తరించింది. 2014 పార్లమెంటు ఎన్నికలలో సాక్షాత్తూ రాహుల్‌గాంధీ, లౌకిక విలువల గురించి నిలబడే ప్రయత్నం కాకుండా గుడులను సందర్శించటం మీద కేంద్రీకరించాడు. తానే స్వచ్ఛమైన హిందువునని రుజువు చేసుకునే ప్రయత్నం చేసాడు. శంకర్ దయాళ్ శర్మ లాగా మొదటి నుంచీ భక్తుడైతే ఆలయాల సందర్శనను ఎవరూ ఆక్షేపించరు. రాహుల్‌గాంధీ అంత నిష్టగల భక్తుడుగా ఎప్పుడు మారాడన్నదే ప్రశ్న. గత పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వం 'లౌకిక విలువలు' అన్న మాట ఉచ్ఛరించడానికి కూడా సిద్ధపడలేదు. పైగా బీజేపీ మీద పోటీ చేసి, మతోన్మాద వ్యతిరేక శక్తులకు ఊపునివ్వవల్సిందిపోయి, రాహుల్‌గాంధీ స్వయంగా కేరళ మీద కేంద్రీకరించాడు. కమ్యూనిస్టుల మీద పోటీ చేసాడు. దక్షిణ భారతదేశంలో కేంద్రీకరించాలనుకుంటే కూడా కర్నాటకలో తాను పోటీ చేయాలి. అట్లా చేయలేదు. ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలు వదిలిపెట్టి, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదిపార్టీ మీద తన శక్తినంతా ప్రయోగించి దాడి చేసింది. ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికలలో, రాహుల్‌గాంధీ బెంగాల్లో క్యాంపెయిన్ చేయడానికి విముఖత ప్రదర్శించాడు. బెంగాల్ తమ కైవసం కాబోతున్నదని బీజేపీ విచ్చలవిడిగా దాడులు చేస్తున్నప్పటికీ రాహుల్‌గాంధీ మాత్రం వెళ్ళడానికి సిద్ధపడలేదు. అందువల్ల ఈ అవకాశవాదం, కేవలం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానిది మాత్రమే కాదు. ఇది వ్యక్తులకు మాత్రమే సంబంధించిన బలహీనత కాదు. కాంగ్రెస్ పార్టీ విధానాలలోనే అంతర్లీనంగా ఉన్న జాడ్యం. అది ఇప్పుడే మొదలైంది కూడా కాదు. చరిత్రను అధ్యయనం చేస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయమే. స్వాతంత్య్రానికి ముందుగానీ, ఆ తర్వాత గానీ... కాంగ్రెస్ చరిత్ర అంతా అవకాశవాదమే. లౌకిక విలువల కోసం నికరంగా నిలబడిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీకి లేవు.
- ఎస్. వీరయ్య