Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని రాయప్రోలు సుబ్బారావు తన దేశభక్తి గీతంలో ఉద్భోదించారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్ వివక్ష వ్యతిరేక చర్యల్లో భాగంగా కుల వివక్షను గుర్తించేందుకు పూనుకుంది. కోల్బి కాలేజీలో కులవివక్షపై నిషేధం విధించారు. ఈ చర్యతో మన కులం కంపును అంతర్జాతీయంగా వ్యాపింప చేస్తున్నామని మరోసారి లోకానికి వెల్లడైంది. ఇప్పటి వరకు దీనిని తెలియని వారు కూడా తెలుసుకొని ముక్కుమీద వేలేసుకుంటున్నారు. పరాయి దేశాలకు పోయినా కులాల కుంపట్లు రాజేసుకొని రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తున్నాం. ప్రస్తుతం నడుస్తున్న జైభీమ్ సినిమా దర్శకుడు జ్ఞానవేల్ తన సినిమాలో గిరిజనులపై పోలీసు కస్టడీలో చిత్ర హింసల గురించి చెబుతూ అవి పదే పదే జరగటం కంటే వాటి పట్ల సమాజం మౌనం పాటించటం తీవ్ర అంశమని చెప్పారు. కులవివక్ష కూడా అలాంటిదే. అనేక మంది తాము పాటించటం లేదని చెబుతారు. అది అభినందనీయమే కానీ ఇతరులు పాటిస్తుంటే ప్రేక్షకులుగా, మౌనంగా ఉండటాన్ని ఏమనాలి? అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురతున్నారు. కానీ వారిలో అగ్రకులం అనుకొనే వారు మిగతా వారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఉన్నారు. మొత్తం పాతికలక్షల మంది అమెరికాలో భారత సంతతికి చెందిన వారున్నారు. రెండు లక్షల మంది దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్దులు అమెరికాలో ఉన్నట్లు అంచనా.
గతేడాది జూన్‌లో అమెరికాలో వివక్ష కేసు ఒకటి దాఖలైంది. సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్నది ఫిర్యాదు. సదరు కంపెనీ ఎలాంటి చర్యతీసుకోకపోగా తమ వద్ద అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళితుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెలువడిన తరువాత అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈక్వాలిటీ లాబ్స్‌కు ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్థితి ఉందంటూ అనేక ఫిర్యాదులు అందాయి. సిలికాన్ వ్యాలీలో ''అగ్రహార వ్యాలీలు'' ఉన్నాయని ఈక్వాలిటీ లాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తనిమొళి సౌందర్‌రాజన్ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతి రూపాలుగా ఉన్నందున వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది తప్ప కేవలం బ్రాహ్మణ సామాజిక తరగతిని లేదా అగ్రకులాలు అని భావిస్తున్న సామాజిక తరగతులందరినీ తప్పు పట్టటంగా భావించకూడదు) తమిళనాడులోని ఐఐటి-మద్రాస్‌ను అయ్యర్ అయ్యరగార్ టెక్నాలజీ అని గుసగుసలాడుకుంటారు. కులపరమైన వివక్ష దేశంలో నిషేధించబడిందనే అంశం తెలిసినప్పటికీ ఖరగ్‌పూర్ ఐఐటి ప్రొఫెసర్ సీమా సింగ్ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను బ్లడీ బాస్టర్డ్ అంటూ తూలనాడిన దురహంకార ఉదంతం తెలిసిందే. అమెరికాలోని హిందూమతానికి చెందిన స్వామినారాయణ సంస్థ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పని చేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వారు కార్మికులు కాదని, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న నిపుణులైన చేతిపని స్వచ్చందసేవకులని, వారినెంతో గౌరవంగా చూస్తున్నామని సంస్థ అధిపతి కాను పటేల్ సమర్థించుకున్నారు. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.
ఈక్వాలిటీ లాబ్ 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నట్లు చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ఈ సర్వే జరిగింది. పని స్థలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిపింది. కార్నెగీ సంస్థ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తెలిసింది. పది మందిలో ఎనిమిది మంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పగా భారత్‌లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని 53శాతం మాత్రమే చెప్పారట.
ఇటీవలి కాలంలో అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్ ఒకరు. ఆమె ఆర్గనైజ్ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలస వెళ్లారు. తాము భారత్ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కులముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్థితిలో తనను అగ్రకులస్తురాలిగా అనేక మంది భావించారన్నారు. ఒక ఆసియన్‌గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు. తన రూమ్మేట్గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని కరాఖండితంగా చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది కనుక ఏదో ఒకటి చేయాలనే తపనతో ఆర్గనైజ్ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమెరికాలో జాత్యహంకారం, భారత్‌లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయనీ, రెండూ అణచివేతకు పాల్పడేవేననీ అన్నారు. ముందుగా వాటి గురించి మాట్లాడుకోవాలి, అర్థం చేసుకోవాలని సెల్వి చెప్పారు. భారత హాకీ ఒలింపిక్ టీమ్‌లో ఎక్కువ మంది దళితులు ఉన్న కారణంగానే జట్టు ఓడిపోయిందని క్రీడాకారిణి వందనా కటారియా కుటుంబ సభ్యులను అగ్రకుల దురహంకారులు నిందించిన ఉదంతాన్ని సెల్వి గుర్తు చేసింది. కులదురహంకారం, జాత్యహంకారం ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయంటూ 1959లో అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ భారత పర్యటన అనుభవాన్ని సెల్వి ఉటంకించారు. తిరువనంతపురంలోని ఒక ఉన్నత పాఠశాలను కింగ్ దంపతులు సందర్శించారు. అక్కడి హెడ్మాస్టర్ దళిత విద్యార్థులకు వారిని పరిచయం చేస్తూ కింగ్ మీకులపు వారే అని పేర్కొన్నట్లు సెల్వి చెప్పారు.
మన దేశంలో రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు తెలివితేటలు, ప్రతిభాపాటవాల్లో ఇతర కులస్తులకంటే పుట్టుకతోనే తక్కువ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అమెరికాలోని శ్వేతజాతి వారితో పోలిస్తే ఆఫ్రో-అమెరికన్లలో జన్యుపరంగానే ఐక్యు (తెలివితేటలు) తక్కువ అంటూ 1994లో బెల్‌కర్వ్ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన అంశం తెలిసినదే. 2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు, 59శాతం మంది కులపరమైన వివక్షకుగురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది. 2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్యకులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్ అనే దళితయువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితకులానికి చెందినట్లు తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్థి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయ లేదని చెప్పింది.
అమెరికాలోని దళితుల గురించి ఈక్వాలిటీ లాబ్ జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి... సర్వేలో పాల్గన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని స్థలాల్లో మూడింట రెండువంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్ లేదా మాటలను ఎదుర్కొన్నారు. నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్థలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు. తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు. తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయంతో ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరు ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకిస్తూనే ఆత్మన్యూనతకు లోను కాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికిి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288