Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్టోబరు 18న అమెరికా, ఇజ్రాయిల్, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశం సగం ఆన్‌లైన్‌లోనూ, సగం ముఖాముఖిగానూ జరిగింది. ఈ సమావేశంతో పశ్చిమాసియాలో ఒక కొత్త గ్రూపు ఆవిర్భవించింది. నఫ్తాలి బెర్నెట్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇజ్రాయిల్‌లో పర్యటిస్తున్న తరుణంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వాణిజ్యం, వాతావరణ మార్పులు, ఇంధనం, సముద్ర జలాల భద్రత అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయని అమెరికా తెలిపింది. పశ్చిమాసియాకు సంబంధించి ఈ గ్రూపింగ్‌ను క్వాడ్ 2గా పేర్కొంటున్నారు. ఈ గ్రూపును ఏర్పాటు చేయడం ద్వారా చైనాకు వ్యతిరేకంగా అమెరికా మరో చర్య చేపట్టినట్లు భావిస్తు న్నారు. అలాగే గ్రూపులోని సభ్య దేశాలను బట్టి చూసినట్లైతే ఇది ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉంటుందని కూడా భావించాల్సి వస్తోంది.
పశ్చిమాసియాలో మోడీ ప్రభుత్వం వేసిన ఈ ముందడుగు రెండు కారణాల రీత్యా ప్రాధాన్యతను సంతరించుకుంది. మొదటిది, పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఇండో-పసిఫిక్ ప్రాంతానికి క్వాడ్‌ను ఏర్పాటు చేసిన తర్వాత పశ్చిమాసియా కోసం ఈ నాలుగు దేశాల గ్రూపును ఏర్పాటు చేయడంలో అమెరికా చొరవ తీసుకుంది. ఇందుకోసం భారత్‌ను కూడా రంగంలోకి దింపింది. ఇదంతా చూస్తుంటే, భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, రాజకీయ పొత్తు ఎంతగా బలపడిందో అర్థమవుతోంది. అమెరికా నీచపుటెత్తుగడ ల్లో మోడీ ప్రభుత్వం రాన్రాను కూరుకుపోతోంది.
ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలగిన తర్వాత, పశ్చిమాసియాలో తమ వ్యూహాన్ని తిరిగి రూపొందించేందుకు అమెరికా, దాని పశ్చిమాసియా మిత్రపక్షాలు కలిసి మార్గాలను అన్వేషించాయి. ఈ వ్యూహాత్మక అన్వేషణలో భారత్‌ను సుముఖత కలిగిన భాగస్వామిగా అమెరికా కనుగొంది. అంటే చైనాకు వ్యతిరేకంగా బైడెన్ ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాల్లో భారత్‌ను ఎంతలా చొప్పించిందో అర్థమవుతోంది. సెప్టెంబరులో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భారత్‌లో పర్యటించినపుడు ఈ కొత్త దౌత్య చర్య గురించి చర్చించి ఉండాలి. ఆ తర్వాత జై శంకర్‌తో ఇతరత్రా చర్చలు జరిపి ఉంటారు.
ఇక రెండవ కోణం, పశ్చిమాసియాలో అమెరికా ఎత్తుగడలకు మద్దతుగా ఇజ్రాయిల్-భారత్ కూటమి ఈ గ్రూపింగ్తో మరింత బలపడింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో, ఇజ్రాయిల్‌తో ఈ వ్యూహాత్మక పొత్తును భారత్ మరింత ముందుకు తీసుకెళుతోంది. మొదట నుండి, ఇజ్రాయిల్‌కు భారత్‌తో సన్నిహిత భద్రత, సైనిక సహకారం పునాదిగా ఉంది. భారత్‌కు పెద్ద మొత్తంలో రక్షణ సరఫరాలను, భద్రతా పరికరాలను అందచేసే దేశాల్లో ఇజ్రాయిల్ ఒకటి. హిందూత్వ, యూదు తీవ్రవాదానికి మధ్య గల సైద్ధాంతిక సంబంధాలు ఇందుకు సుస్థిరమైన కారణంగా ఉన్నాయి.
ఈ ప్రాంతంలో సౌదీ అరేబియాతో పాటుగా అమెరికాకు సన్నిహిత మిత్రపక్షమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గతేడాది ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు పెట్టుకుంది. ఇజ్రాయిల్‌తో ఇప్పటికే ఇంటెలిజెన్స్, భద్రతా సహకారాన్ని కలిగివుంది.
భారత్‌కు సంబంధించినంత వరకు, ఇటువంటి గ్రూపులో భాగస్వామి కావడమంటే సుదీర్ఘకాలంగా అనుసరిస్తూ వచ్చిన విదేశాంగ విధానం నుండి తీవ్రంగా పక్కకు మళ్ళడమే కాగలదు. ఈ గ్రూపు వ్యవస్థాగతమైతే, చైనా మాదిరిగానే ఇరాన్‌కు కూడా వ్యతిరేకం కాగలదు. ఎందుకంటే, ఇరాన్‌ను తమ శాశ్వత శత్రువుగా ఇజ్రాయిల్ పరగిణిస్తోంది. దీనివల్ల ఇరాన్‌తో భారత్‌కు దీర్ఘకాలంగా గల సంబంధాలు దెబ్బతింటాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం నుండి ఏకపక్షంగా ట్రంప్ ప్రభుత్వం బయటకు వచ్చేసిన తర్వాత అమెరికా విధించిన అక్రమ ఆంక్షలతో మోడీ ప్రభుత్వం కూడా చేతులు కలిపింది. అప్పటి నుండి క్రమంగా సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్లిష్టమైన, సున్నితమైన పరిస్థితుల్లో ఈ ప్రాంతం లో జోక్యం కోసం ఇజ్రాయిల్‌తో చేపట్టే ఏ సంయుక్త చర్య అయినా భారత్‌కు వ్యతిరేక ఫలితాలను ఇవ్వగలదని భావించాల్సి వస్తుంది.
సమావేశంలో ''సముద్ర జలాల భద్రత''పై చర్చించారు. సముద్ర మార్గాలపై పెట్టాల్సిన నియంత్రణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా అరేబియా సముద్రాన్ని, అడెన్ జలసంధిని ఎర్ర సముద్రంతో, సూయజ్ కాల్వతో అనుసంధానించే బాబ్-ఎల్-మన్దేబ్ జలసంధి గురించి చర్చ జరిగింది. ఇండో-పసిఫిక్ ప్రాంతానికి ఏర్పడిన క్వాడ్ పరిధిలోకి వచ్చే మలక్కా జలసంధి మాదిరిగానే, బాబ్-ఎల్-మన్దేబ్ జలసంధి కూడా చైనా నౌకలకు, నావికా కార్యకలాపాలకు చెక్ పాయింట్‌గా ఉండగలిగే అవకాశాలున్నాయి.
చైనాకు వ్యతిరేకంగా సమగ్రమైన అంతర్జాతీయ వ్యూహాన్ని రూపొందించేందుకు బైడెన్ ప్రభుత్వం ఎడతెగకుండా ప్రయత్నిస్తున్నందున ఈ ప్రయత్నంలో జూనియర్ భాగస్వామిగా ఉండాలని భారత్ భావిస్తోందా? క్వాడ్, అకస్, ఆఫ్ఘనిస్తాన్ కుప్పకూలడానికి ముందుగా సెంట్రల్ ఆసియా (మరో క్వాడ్)పై ప్రకటించిన నిష్ఫల నాలుగు దేశాల గ్రూపు (అమెరికా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్థాన్)-ఇవన్నీ చూస్తుంటే చైనాను అదుపు చేయడానికి, ఏకాకిని చేయడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలను, చర్యలను అమెరికా చేపడుతోందని తెలుస్తోంది. చైనాకు అన్ని వైపుల నుండి - ఆర్థిక, సాంకేతిక, సైనిక పరంగా పెరుగుతున్న ప్రస్తుత వాస్తవికతలను దృష్టిలో ఉంచుకుంటే, ఇవన్నీ కూడా విఫలమయ్యే వాటిగానే కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో జూనియర్‌గా, ఏ మాత్రమూ ప్రభావం చూపని భాగస్వామిగా మారడం వల్ల భారత్‌కు ప్రయోజనాలు నెరవేరతాయా?
భారత్ ఇటువంటి పాత్రను పోషించడం, ఇప్పటికే సన్నిహిత, మంచి స్నేహ సంబంధాలు కలిగిన ఇతర అగ్ర రాజ్యాలు ముఖ్యంగా ఇరాన్, రష్యా వంటి దేశాల నుండి దూరమవడానికే దారి తీస్తుంది. పశ్చిమాసియాలో తాజాగా అమెరికా చేపట్టిన చర్యతో భారత్ చేతులు కలిపిన తీరు చూస్తుంటే, భారతదేశ విదేశాంగ విధానాన్ని అమెరికాకు మరింత వేగంగా తాకట్టు పెడుతున్నదని అర్ధమవుతోంది.
-'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం