Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో పెరుగుతున్న అసహనాన్ని, మతతత్వ విద్వేషాన్ని తీవ్రంగా నిరసిస్తూ... ఆరేళ్ళ క్రితమే దేశంలోని పలు ప్రాంతాల నుండి రచయితల నిరసనలు బలంగా వినిపించాయి. ''వ్యక్తిగత స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్రమైన ఆటంకం కలిగిస్తున్నందువల్ల.. ప్రజాస్వామ్య విలువల్ని కాలరాచి, దౌర్జన్య పూరితమైన వాతావరణం సృష్టిస్తున్నందువల్ల మేం మా సాహిత్య అకాడమీ అవార్డుల్ని వెనక్కి పంపి మా వేదనని, బాధని, నిరసనని తెలియజేస్తున్నాం! ఆరు దశాబ్దాల కాలంలో దేశంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి! ఇంత విశృంఖలంగా, ఇంత విచ్చలవిడిగా స్వేచ్ఛను అణగదొక్కడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. సాహిత్యకారులుగా సిగ్గుపడుతున్నాం'' అని రచయితలంతా దేశవ్యాప్తంగా ఘోషించారు. నరేంద్ర దబోల్కర్, పన్సారే, కల్బుర్గి వంటి సామాజిక కార్యకర్తలు, హేతువాదులు, మానవతా మూర్తులు, రచయితల హత్యల పట్ల కలత చెంది నిరసనలు తెలియజేశారు. గుజరాత్ అల్లర్లూ, మైనారిటీలపైన దాడులూ గుర్తుచేశారు. ముఖ్యంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా రచయితలు హత్య కావించబడడాన్ని ఎత్తి చూపారు. ఎక్కడి వారక్కడ పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రకటనలు విడుదల చేశారు. కొందరు నేరుగా కేంద్ర సాహిత్య అకాడెమీకి ఉత్తరాలు రాశారు. సోషల్ మీడియాలోనూ, వివిధ భాషా పత్రికల్లోనూ తమ అసంతృప్తిని వెల్లడించారు. భారతీయ సాహిత్య ప్రపంచానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఒక మేరు పర్వతం లాంటి సంస్థ! రచయితల హత్యపట్ల, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం పట్ల అదిసరిగా స్పందించలేదన్నది వీరి బాధ! మంత్రిత్వశాఖ గాని, ప్రధాని గాని భరోసా ఇవ్వలేదన్నది వీరి ఆవేదన!!
2015 అక్టోబర్ 11న తన సాహిత్య అకాడెమీ అవార్డు తిప్పి పంపుతున్నట్టు ప్రకటిస్తూ గణేశ్ ఎన్. దివే ఇండియన్ ఇంగ్లీష్ కవి చెప్పిన విషయం ఆలోచించదగ్గది. ''యం.యం.కల్బుర్గి హత్య జరిగిన ఒక వారం తర్వాత నేను సాహిత్య అకాడెమీ నిర్వహించిన సెమినార్‌కి వెళ్ళాను. వెళ్ళి, దిగ్భ్రాంతికి లోనయ్యాను. అకాడమీ పురుస్కారం పొంది హత్యకు గురైన కన్నడ రచయిత మాజీ వైస్ ఛాన్సలర్ యం.యం. కల్బుర్గి గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా సెమినార్ ముగించారు. పైగా అకాడమీ న్యూఢిల్లీలోని రవీంధ్ర భవన్లో ఉంది. అది విశ్వకవి రవీంద్రడి పేరు మీద ఉన్న భవనం. కనీసం WHERE THE MIND IS WITHOUT FEAR (ఎక్కడ మేధస్సు భయరహితంగా ఉంటుందో) అని రాసిన రవీంద్రుడి కవితా చరణమైనా అకాడమీ వారు గుర్తుతెచ్చుకోవాల్సింది'' గణేశ్ దివే బరోడా సయాజిరావ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్. 1992లో AFTER AMNESIA అనే స్వీయ కవితా సంపుటికి అకాడమీ అవార్డు స్వీకరించిన వారు. దేశ విదేశాల్లోని యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా నిరంతరం ప్రయాణిస్తున్నవారు.
నయనతార సెహెగల్ (88) తన అవార్డు వెనక్కి పంపినప్పుడు సాహిత్య అకాడమీ ఛైర్మన్ విశ్వనాథ్ ప్రసాద్ తివారి వ్యంగ్య వాఖ్యలు చేశారు. ''ఈ అవార్డులన్నీ వారికి ఎప్పుడో ఇచ్చినవి. వారు అవి స్వీకరించడం వల్ల వారి పుస్తకాలు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. వారికి రావాల్సిన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. గుర్తింపులు వచ్చాయి. ఇప్పుడు వారు అవార్డులు తిప్పిపంపడం వల్ల లాభమేమిటీ?'' అని! అందుకు నయన తార సెహగల్ ఘాటుగానే స్పందించారు. తనకు సాహిత్య అకాడమీ అవార్డు పట్ల గౌరవముందని, అయితే అకాడమీ అవార్డు రాకముందే తనకు తన పుస్తకాల ద్వారా మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు వచ్చాయని ఆమె అన్నారు. రచయితలకు సాహిత్య అకాడమీ ద్వారానే పేరు ప్రఖ్యాతులు వస్తాయనుకుంటే పొరపాటు. అకాడమీ అవార్డులు రాని మహా రచయితలు, మహానుభావులు భారతీయ భాషల్లో చాలా మందే ఉన్నారు. వారికా గౌరవం, విలువ రావడంలో అకాడమీ పాత్ర ఏమీలేదు. అయినా తమ రచనల ద్వారా ప్రజల మనసులు గెలుచుకున్నందుకే వారిని అకాడమీ గుర్తిస్తుంది. పైరవీలతో అకాడమీ అవార్డు వచ్చినా, ప్రజలు గుర్తించని వారు కోకొల్లలుగా ఉన్నారు. మరి దానికేమిటీ? అయినా వివాదాలకు తావులేకుండా తనకు అకాడమీ ఒకప్పుడు బహుమతిగా ఇచ్చిన డబ్బు ఇరవై అయిదువేలు. దాన్ని రెండింతలు చేస్తే యాభైవేలు.. అయినా దాన్ని ఆవిడ నాలుగింతలు చేసి లక్షరూపాయల చెక్కు జత చేసి అవార్డు తిప్పి పంపారు. ''దీని వల్ల అకాడమీ దాని పరిధి అది తెలుసుకుంటుందని, బాధ్యతగా వ్యవహరిస్తుందని, రచయితల పక్షాన ఎల్లవేళలా నిలబడుతుందని ఆశిస్తున్నాను'' అని ఉత్తరం రాసి, అకాడమీ ఛైర్మన్‌కు ధీటైన సమాధాన మిచ్చారు. ఆత్మగౌరవం ఉన్న కవుల, రచయితల ఆలోచనలు అలా ఉంటాయి. పైరవీలు చేసి అవార్డులు, పదవులు పొందిన వారు ప్రతిదానికి, ప్రతిచోట రాజీపడి బతకాల్సిందే! నయనతార సెహెగల్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ చెల్లెలి కూతురు. అంటే నయనతార మేనమామే సాహిత్య అకాడమీకి రూపకల్పన చేసింది. డెహ్రడూన్‌లో తన తల్లి విజయలక్ష్మీ పండిట్ ఇంట్లో నివాసమున్న ఈమె, స్వతంత్ర భావాలు గల మహిళ. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే వ్యతిరేకించారు. ఈ దేశాన్ని ఒక కుటుంబమే ఎందుకు పాలించాలని ప్రశ్నించి సంచలనం సృష్టించారు. RICH LIKE US అనే ఇండియన్ ఇంగ్లీష్ నవలకు 1985లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు.
''దేశంలో జరుగుతున్నదంతా చాలా బాధాకరం'' అని ఎంతో వేదనతో తన అవార్డు తిప్పి పంపుతున్నట్టు పంజాబీ నాటక రచయిత ఆత్మజిత్ సింగ్ ప్రకటించారు. ఆయన నాటకరంగ రచయిత, దర్శకుడు. నాటకరంగమ్మీదే పరిశోధనలు చేసి డాక్టరేట్ తీసుకున్న వారు. సాహిత్య అకాడమీ అవార్డు (2009) సంగీత నాటక అకాడమీ అవార్డు (2010) వరుసగా రెండు సంవత్సరాల్లో రెండు అవార్డులు తీసుకున్న రచయిత దర్శకుడు దేశంలో మరొకరు ఉండి ఉండరు. ''రచయితల అభ్యుదయ కాముకుల స్వేచ్ఛాలోచనను చంపేస్తున్నారు కాబట్టి సాహిత్యలోకం సమైక్యంగా నడుంబిగించాలి! తమ నిరసనలతో హౌరెత్తించాలి!! అకాడమీ ఛైర్మన్ మౌనాన్ని ఈ విషయం మీద ప్రధాని మౌనాన్ని బద్దలు కొట్టాలి. అధికారం అండదండలతో జరుగుతున్న దుశ్చర్యల్ని ఎండగట్టాలి'' అని మరో పంజాబీ నాటక రచయిత అజ్మీర్‌సింగ్ అవులక్ తన అవార్డు తప్పి పంపుతూ పిలుపునిచ్చారు. ''రచయితల్ని, కళాకారుల్ని, హేతువాదుల్ని, సామాజిక కార్యకర్తల్ని, మైనారిటీ వర్గాలను అణగొక్కడమే తమ ధ్యేయంగా చేసుకుని జరుగుతున్న హత్యలు, దాడులు, ఒత్తిళ్ళు తేలికగా తీసుకోరాదు అన్న భావనతో నేను నా అవార్డు తిప్పి పంపుతున్నాను'' అని ప్రకటించారు పంజాబీ కథా రచయిత గురుచరణ్‌సింగ్ బుల్లార్. ''గతంలోని ప్రభుత్వాలు తప్పు చేయనివి, మరక అంటనివి ఏమీ కాదు కానీ... అవి మరీ ఇంత నీచానికి దిగజారలేదు. ప్రస్థుత ప్రభుత్వ పెద్దలు మాత్రం అనుకున్నది సాధించుకోవడానికి వక్రమార్గాల్ని ఎంచుకున్నారన్నది సుస్పష్టం!'' అని కూడా అన్నారాయన! 'అగ్నికలస్' కథా సంపుటికి 2005లో అకాడమీ అవార్డు తీసుకున్న ఆ రచయిత.
సనాతన సంస్థ, దాని అనుబంధంగా పనిచేసే ఇతర సభ్యులూ కలిసి హేతువాదులైన నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే, యంయం కల్బుర్గిలను హత్య చేశారని, వారి చర్యల్ని నిరసిస్తూ గోవాలో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలోనే కొంకణి కథా రచయిత ఎన్. శివదాస్ తన సాహిత్య అకాడమీ అవార్డు తిప్పి పంపుతున్నట్లు ప్రకటించారు. వృత్తిరీత్యా ప్రొఫెసర్ అయిన శివదాస్ 'బంగార్ సల్ల్' కథల సంపుటికి 2005లో అవార్డు స్వీకరించారు. కన్నడ రచయిత కుమ్. వీరభద్రప్ప తను 2007లో తీసుకున్న అకాడమీ అవార్డును తిప్పి పంపారు. హేతువాదుల హత్యలు, దాద్రి సంఘటన తనను కలచివేసిందని... ఈ విషయమ్మీద ప్రభుత్వం మౌనం సహించరానిదని అన్నారు. ప్రసిద్ధ పంజాబీ రచయిత మేఘరాజ్ మిట్టర్ తన 'శిరోమణి లేఖక్' పురస్కారాన్ని ప్రభుత్వానికి తిప్పిపంపారు. అది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రచయితలకిచ్చే అత్యున్నత పురస్కారం. ఇండియన్ ఇంగ్లీషు కవి ఆదిల్ జుస్సావాలా దేశంలోని సంక్షోభాల్ని, అస్థిరతను, అలసత్యాన్ని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ దేశ ప్రధాని నిర్లిప్తతను వీడి మాట్లాడాలని, దేశంలో భావప్రకటన స్వేచ్ఛ కాపాడబడుతుందన్న భరోసా ఇవ్వాలని ఉత్తరం రాశారు.
రచయిత(తు)ల నిరసనలు పెద్ద ఎత్తున పెల్లుబుకుతున్న ఆ సమయంలోనే 2015 అక్టోబర్ 12న ఢిల్లీలో నివాసమున్న నాటకరంగ కళాకారిణి మాయాకృష్ణారావు కూడా తన సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రభుత్వానికి తిప్పి పంపారు. దాద్రి సంఘటనతో తన మనసు వికలమైందని, రచయితల్ని, హేతువాదుల్ని, మానవవాదుల్ని చంపుతూ ఉండటం వల్ల దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోయిందని, రంగస్థల నటిగా తన నిరసనను తెలియజేయడానికి మాత్రమే తను అవార్డు తిప్పి పంపుతున్నట్లు ఆమె చెప్పారు. ఒకప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా పనిచేసి 'ఇండియన్ లిటరేచర్' వంటి జర్నల్‌కు సంపాదకుడిగా ఉండి, వివిధ స్థాయిలలో అకాడమీతో సుదీర్ఘమైన అనుబంధమున్న మళయాళ - ఇండియన్ ఇంగ్లీషు కవి కె. సచ్చిదానందన్ అకాడమీతో తెగతెంపులు చేసుకుని బయటపడ్డారు. ''అకాడమీ ఉండాల్సిన రీతిలో లేదు. నడవాల్సిన పద్ధతిలో నడవట్లేదు'' అని ప్రకటించారు - ఇంగ్లీషు రచయిత్రి శశీ దేశ్ పాండే. కన్నడ దళిత కవి అరవింద్ మాలగట్టి అకాడమీ జనరల్ కౌన్సిల్‌కు రాజీనామా చేశారు.
అవార్డు తిప్పి పంపే ప్రక్రియ హిందీ కవి ఉదయ ప్రకాశ్‌తో మొదలై, లలిత కళా అకాడమీకి ఛైర్మన్‌గా పనిచేసిన అశోక్వాజ్పేరుతో కొనసాగి, ఉరుదూ కవి రహమాన్ అబ్బాస్, హిందీకవి రాజేశ్ జోషి, పంజాబీ కథకుడు వర్యమ్‌సింగ్ సింధూలతో ముందుకు పోయింది. మళయాళ రచయిత్రి సారోజోసెఫ్, హిందీకవి మంగ్లేష్ దర్వాల్, కన్నడ అనువాదకుడు డి.ఎన్. శ్రీనాథ్ మాత్రమే కాక, ఇంకా నిరుపమ బోర్గొహె, హామెన్ బోర్గెహె (అస్సామి) రహమత్ తరికిరి (కన్నడ) గులాబ్ నబి ఖయాల్ (కశ్మీరి) ప్రథాన్ పవార్ (మరాఠీ) అనువాదకుడు చమన్‌లాల్ మొదలైన వారంతా తమ తమ అకాడమీ అవార్డుల్ని తిప్పి పంపారు. పంజాబీ రచయిత్రి దలీప్‌కౌర్ తివానా ఏకంగా తన పద్మశ్రీనే ప్రభుత్వానికి తిప్పి పంపి నిరసన గళానికి మరింత బలాన్నిచ్చారు. ఏది ఏమైనా కవుల, రచయితల, కళాకారుల సంఖ్య సమాజంలో చాలా తక్కువది. వీరి నిరనసనల వల్ల ఓటుబ్యాంకుకు పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ జరిగిన, జరుగుతున్న నిరసనల ప్రభావం సమాజం మీద ఏమీ ఉండదనుకోవడం పొరపాటు. దేశ, రాష్ట్రాల పరిపాలకుల దిగజారిన నైతికతకు అవి అద్దం పడుతున్నాయనడం వాస్తవం! (అవార్డు వాపసీకి ఆరేండ్లు)
- సుప్రసిద్ధ సాహితీ వేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు