Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాకవి, పండితుడు, సాహితీవేత్త, స్వాతంత్య్ర సమర యోధుడు కాళోజీ నారాయణరావు మననుండి దూరమై 19 సంవత్సరాలు అయింది. పౌరహక్కుల ఉద్యమాల్లో, తొలి తెలంగాణ ఉద్యమంలో.. నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించిన 'పద్మభూషణ్' కాళోజీ నారాయణరావు పూర్తిపేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాజారాం.. తల్లి రమాబాయమ్మ (కన్నడ), తండ్రి రంగారావు (మహారాష్ట్ర) దంపతులకు 1914 సెప్టెంబర్ 9న కాళోజీ కర్నాటకలోని బీజాపూర్ జిల్లా దట్టహళ్ళిలో జన్మించారు. 1918నాటికే మణికొండలో వీరి కుటుంబం స్థిరపడింది. స్వేచ్ఛ, సమానతల కోసం చివరి దాకా పోరాడిన ప్రజాకళా యోధుడు కాళోజీ. అహింసా వాదిగా, పేదల పక్షపాతిగా, అణిచివేత, అసమానతలపై ఎదురొడ్డి పోరాడిన ధీరుడు కాళోజీ.. ప్రజల బాధల్ని ''నా గొడవ'' (కవితా సంపుటి)లో ప్రతిధ్వనింపజేసారు. అణాకథలు, నా భారతదేశ యాత్ర, జీవనగీత, తుది విజయం, మనది నిజం - పార్థీవ న్యాయం - తెలంగాణ ఉద్యమ కవితలు ఆయన రాసిన ప్రముఖ పుస్తకాలు. తెలుగు, ఉర్ధూ, హిందీ, మరాఠీ భాషల్లో కాళోజీ రచనలు చేసారు. ''జాలువారే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక'' అన్న విప్లవ ఝరి కాళోజీ. బడి పలుకుల భాష కాదు - పలుకు బడుల భాష కావాలి. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతపు (అమ్మభాష) (మాండలీకంలో) వ్యవహార భాషలోనే రాయాలన్న కాళోజీ ఒక కవితలో ఇలా అన్నారు. ''తెలుగుబిడ్డ వురోరి - తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియేదట సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు - సకలించు ఆంధ్రుడా చావవెందుకురా?'' అని గర్జించిన తెలుగు - వెలుగు కాళోజీ!
''మీరు గొప్ప పండితులు - కావ్యాలు రాసారు.. జనం భాషలో జనానికి అర్థం అయ్యేలా రాయండి!'' అంటూ విశ్వనాథవార్నే ప్రశ్నించిన ప్రజాకవి కాళోజీ.. పార్లమెంటరీ, పార్లమెంటరీయేతర రంగాల్లో గొప్ప రాజకీయ అనుభవం ఉంది. వాన మామలై సోదరులు, పల్లా దుర్గయ్య, బిరుదురాజు రామరాజు ద్వారా తెలుగు సాహిత్యంపై మక్కువ, పట్టు ఏర్పరచుకున్న కాళోజీ విద్యార్థి దశలోనే ఉద్యమాల దారి పట్టాడు. తప్పుని వ్యతిరేకించి ప్రశ్నించే తత్త్వం ఆయన సొంతం... నాటి గోల్కొండ పత్రికలో తరచూ కవిత్వం రాసేవాడు. ఇంటర్ దాకా వరంగల్‌లోనే చదివిన కాళోజీ ప్రజా గొంతుగా కలం కదిలించాడు.
'రైతే రాజు' అంటూ నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి కన్నుమూసేదాకా ప్రభుత్వాలపై ధైర్యంగా పోరాటం చేసాడు కాళోజీ. 1978లో జలగం వెంగళరావుపై (సి.యం) ఎన్నికల్లో పోటీకి దిగిన ధీశాలి. ఆయన ఖలీల్జీబ్రాన్ 'ప్రాఫెట్' తెలుగు అనువాదం పాఠకుల్ని విశేషంగా ఆకర్షించింది. ఆయన తన కొన్ని ముఖ్య కవితల్లో...
''అన్నపురాసులు ఒక చోట - ఆకలి మంటలు ఒక చోట - సంపదలన్నీ ఒక చోట - గంపెడు బలగం ఒకచోట'' అంటారు.
''చావు నీది - పుట్టుక నీది - బ్రతుకంతా దేశానిది'' అంటూ జయప్రకాశ్‌కు నివాళి ఇస్తారు.
''బతుకమ్మ బతుకు - అమ్మల మరవని సంతానముగని బతుకమ్మ బతుకు'' అంటారు. ఆయన గొప్ప ప్రగతిశీల ఆశావాది... అందుకే ఓ కవితలో త్తాత్వికతతో ఇలా రాసాడు...
''సాగిపోవుటే బ్రతుకు - ఆగిపోవుటే చావు - బతుకు పోరాటం - పడకు ఆరాటం''
''అన్యాయాన్నెదిరిస్తే / నా గొడవకు సంతృప్తి /
అన్యాయం అంతరిస్తే / నా గొడవకు ముక్తి ప్రాప్తి -
''అన్యాయాన్నెదిరించినోడు / నాకు ఆరాధ్యుడు'' అంటాడు. ఆయన జన్మదినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం జరుపుతూ ఆయన పేరిట ఒక రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని గత ఏడేండ్లుగా ఇస్తోంది!! ఆయనపై ఆయన సోదరులు రామేశ్వరరావు ప్రభావం బాగా ఉంది అంటారు. 'కాలే-జీ' అనే ఆయన ఇంటిపేరు కాలక్రమంలో వాడుకలో కాళోజీ అయ్యింది. కాంగ్రెస్ వాదిగా... పౌర హక్కుల నేతగా.. పీడిత ప్రజల గొంతుగా - వాడుక భాషా ప్రియుడిగా, నిష్కళంక దేశభక్తునిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, ప్రజాకవిగా వెలుగొందిన కాళోజీ గొప్ప క్రాంతిదర్శి.. ''ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరుముతాం.. ప్రాంతీయుడే ద్రోహం చేస్తే పాతరేస్తాం'' అన్న ఆయన కలం బలం యువకవులకు నిత్యస్ఫూర్తి దాయకం. పాలకులకు పీడించే శక్తులకు హెచ్చరిక. 2002 నవంబర్ 13న ఆయన పె(క)న్ను మూసారు. తన భౌతిక కాయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి వైద్య పరిశోధనలకై 'దానం' చేసిన ప్రాత:స్మరణీయుడు కాళోజీ! నేడు ఆయన వర్థంతి సందర్భంగా అక్షర నివాళులు!!
- తంగిరాల చక్రవర్తి
సెల్: 9393804472