Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముస్లింలు మన దేశంలో మెజారిటీగా మారేందుకు కుట్ర చేస్తున్నారనే ప్రచారం... వాట్సాప్ పండితులు, కాషాయ దళాల ప్రచారంలో భాగంగా... నిరంతరం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 24వ తేదీ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ వెబ్సైట్లో ''భారత్‌లో హిందూ జనాభా వృద్ధి రేటు తగ్గుదల, ముస్లింలలో గర్భధారణ శక్తి ఎక్కువ: పూ సర్వే సంస్థ నివేదిక'' శీర్షిక కింద కొన్ని వివరాలు ఇచ్చారు. నిజానికి ఈ నివేదిక గురించి సెప్టెంబరు 21నే పూ సంస్థ సర్వే వివరాలను ఇచ్చింది. ఈ శీర్షిక తప్పుదారి పట్టించేదిగా, తప్పుడు ప్రచారం చేసే వారిని సంతోషపరిచేదిగా ఉంది.
ఇంతకాలంగా ఆర్ఎస్ఎస్ పరివారం... బీజేపీతో సహా దాని సంస్థలు, వాటి భావ ప్రచారకులు చేస్తున్న ప్రచారం ఏమిటి? 2017లో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మీరట్ సభలో మాట్లాడుతూ ''నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించు కొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి'' అని చెప్పారు. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్ తొగాడియా గుజరాత్‌లోని బహరుచ్ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు... ''మత మార్పిడి వద్దనండి, ఘర్‌వాపసీకి అవునని చెప్పండి. లవ్ జీహాద్ ఒద్దు. ఉమ్మడి పౌరస్మృతి కావాలనండి. బంగ్లా ముస్లింలు వద్దనండి. హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.'' ఇటీవల ఆర్ఎస్ఎస్ సర్‌సంఫ్‌ు సంచాలక్ మోహన్ భగవత్ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డీఎన్ఏ ఒకటే అని చెప్పారు. కానీ అదే పెద్దమనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు? ''ఇతరుల జనాభా పెరుగుతున్నప్పుడు హిందువుల జనాభా పెరగకూడదని ఏ చట్టం చెప్పింది?'' అని ప్రశ్నించారు. ఆరెస్ఎస్ మరో నేత దత్తాత్రేయ హౌసబలే అంతకు ముందు చెప్పిందేమిటి? ''చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది'' అన్నారు. 2018లో రాజస్థాన్ బీజేపీ ఎంఎల్ఏ బన్వారీలాల్ సింగ్ సింఘాల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. ముస్లింలు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12-14 మందిని కంటున్నారని ఆరోపించారు. ముస్లింలు పాలకులైతే హిందువులు రెండోతరగతి పౌరులవు తారన్నారు. ముస్లిం జనాభా పెరుగుతోందనే ప్రచారం కొనసాగింపుగా ఫలానా సామాజిక తరగతి అనే పేరు లేకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లును ముందుకు తెచ్చింది. అసోం కూడా అదే దారిలో ఉంది. రెండు చోట్లా ముస్లింల మీద తప్పుడు ప్రచారం వెనుక ఎన్నికల లబ్ధే అసలు కథ.
పూ సంస్థ కనుగొన్న ముఖ్య అంశాలంటూ ఆర్గనైజర్ రాసిన కొన్ని అంశాలూ, అది చేసిన వ్యాఖ్యానం ఎలా ఉన్నప్పటికీ వాటి నిజానిజాలేమిటో చూద్దాం. కాషాయ దళాలు చేస్తున్నది గోబెల్స్ ప్రచారం, వక్రీకరణ అని అనేక వివరాలు వెల్లడించినా ఆ ప్రచారం కొనసాగుతూనే ఉంది. మన జనాభా వివరాలు 2011లో సేకరించినవి మాత్రమే అధికారికంగా ఉన్నాయి. ఆ తరువాత పెరిగిన జనాభా సంఖ్య అంచనా మాత్రమే. 1951-2011 మధ్య మొత్తం జనాభా 36.1 కోట్ల నుంచి 120 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో హిందువుల జనాభా 30.4 కోట్ల నుంచి 96.6 కోట్లకు పెరిగింది. ముస్లింలు 3.5 నుంచి 17.2 కోట్లకు, క్రైస్తవులు 0.8 నుంచి 2.8 కోట్లకు, సిక్కులు 0.68 నుంచి 2.08 కోట్లకు, బౌద్ధులు 0.27 నుంచి 84 లక్షలకు, జైనులు 17 నుంచి 45 లక్షలకు పెరిగారు. పార్సీలు 1.2 లక్షల నుంచి 60 వేలకు తగ్గారు. 1990 దశకానికి ముందు మొత్తం జనాభా పెరుగుదల రేటు 22శాతం ఉండగా 2000 నాటికి 18శాతానికి తగ్గింది. ఇదే కాలంలో హిందువుల పెరుగుదల రేటు 24 నుంచి 17శాతానికి తగ్గగా, ముస్లింల రేటు తగ్గుముఖం పట్టి 25శాతం వద్ద, క్రైస్తవుల రేటు 16శాతం వద్ద ఉంది. ముస్లింల రేటును చూపే కాషాయ దళాలు కుట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం హిందువులు 79.8శాతం, ముస్లింలు 14.2, క్రైస్తవులు ఆరు శాతం ఉన్నారు. 1951-2011 కాలంలో హిందువులు నాలుగు శాతం తగ్గగా ముస్లింలు నాలుగుశాతం పెరిగారు. అలాంటప్పుడు 2035 నాటికి ముస్లింలు హిందువులను మించి పోతారని ఏ గణాంకాలు లేదా ఏ వాస్తవాలను బట్టి చెబుతున్నారు? దేశంలో జరుగుతున్నదేమిటి? 1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4 మంది పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్థం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి? గర్భధారణకు, మహిళల విద్యకు సంబంధం ఉంటుందనేది అంతర్జాతీయంగా రుజువైన అంశం. 2015 సమాచారం ప్రకారం మహిళా విద్య క్రైస్తవుల్లో సగటున ఏడున్నర సంవత్సరాలు, హిందువుల్లో 4.2, ముస్లింలలో 3.2 సంవత్సరాలు ఉంది. అందువలన ముస్లింలలో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది. విద్యతో పాటు మత విశ్వాసాలు, పరిసరాలు, సంపద, ఆదాయం వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.
దేశంలో ఇప్పుడున్న స్థితి ఏమిటి? 35రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు. దేశ జనాభాలో వీరు ఐదు శాతమే, 95శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్ (20 లక్షలు), మిజోరం (పది లక్షలు), మేఘాలయ (30 లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. మరి హిందువులు? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54 శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం హిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింలలో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి? 2011-21 కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్థం ఏమిటి కుటుంబ నియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా? దేశంలో పురుషులు-స్త్రీల నిష్పత్తి 1000-940, అదే పిల్లల్లో చూస్తే 1000-916 మాత్రమే ఉంది. ఇలా ఉన్న దేశంలో బహు భార్యలను కలిగి ఉండటం సాధ్యమా? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946, 911 గానూ జమ్మూ కాశ్మీరులో 889, 862గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా?
మేకిన్ ఇండియా (భారత్‌లో తయారీ), మేక్ ఇండియా (భారత్ తయారీ) పేరు ఏదైతేనేం... బీజేపీ నేత నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపులతో... ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే మన జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దానికి అవరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయిల్, అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. లేదా అక్కడ నైపుణ్య శిక్షణ పొందారు. పుంఖాను పుంఖాలుగా అవివేకం, కుహనా వార్తల ఉత్పత్తి జరుగుతోంది. దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది.
''ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయవంతం కావు. ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి. దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి. ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే'' తన మీన్ కాంఫ్ గ్రంథంలో నరహంతకుడు నాజీ హిట్లర్ రాసిన అంశమిది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశంలో కాషాయ దళాల ప్రచారాల తీరు ఎలా ఉందో కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా అవగతం అవుతుంది.
- సత్య