Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని తెరై ప్రాంతంలో ఉన్న లఖీంపూర్ ఖేరీ హిందూత్వ రాజకీయాలకు యుద్ధభూమిగా మారింది. సిక్కు రైతులు ఎక్కువగా ఉన్న ఆ జిల్లాను 'మినీ పంజాబ్' అనవచ్చు. సంవత్సరం క్రితం మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతు ఉద్యమం పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. ఇటీవల కాలంలో ఉద్యమం తూర్పు ప్రాంతానికి కూడా విస్తరించడంతో స్థానిక బీజేపీ నాయకులు దీన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముప్పుగా భావిస్తున్నారు. బీజేపీ నాయకుల ఈ భావన, అక్టోబర్ 3న ఆ జిల్లాలో ఒక ఘోర సంఘటనకు దారి తీయడంతో కొన్ని రైతు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా తన సహచరులతో మూడు కార్లను రైతులపై తొక్కించిన సంఘటనలో నలుగురు రైతులతో పాటు మొత్తం 8 మంది మరణించగా, 15మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని బన్వీర్పూర్కు చెందిన అజరు మిశ్రా రాజకీయాల్లోకి రావడానికి ముందు ఒక నేరస్థునిగా, కలప, రసాయనాల స్మగ్లర్‌గా ఉండేవాడు. గ్రామంలో జరిగే పంచాయతీల పరిష్కారానికి మిశ్రా, అతని కుమారుడు చట్టవిరుద్ధంగా దర్బార్‌ను నిర్వహించేవారు. ప్రజలంతా, తండ్రీకొడుకులు బలవంతులని భయపడుతూ, గౌరవించేవారు. కానీ పెద్ద మొత్తంలో భూమికి యజమానులుగా ఉన్న సిక్కు రైతులు మాత్రం దర్బార్‌కు హాజరయ్యేవారు కాదు. 2010లో గ్రామ ప్రధాన్‌గా ఎన్నికై, 2012లో నిఘాసన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి, 2014, 2019లో వరుసగా ఎంపీగా ఎన్నికయ్యాడు. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ నియోజకవర్గ ఉపశమనం కోసం జూలై నెలలో జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అతనికి స్థానం కల్పించారు.
నల్ల జెండాల ప్రదర్శన
తెరై ప్రాంతంలో పెరుగుతున్న రైతుల నిరసనలతో అజరు మిశ్రా కోపోద్రిక్తుడయ్యాడు. ఆయన రైతులను హెచ్చరిస్తున్న వీడియో బాగా వైరల్ అయింది. తాను తలచుకుంటే 'సర్దార్లను' లేకుండా చేస్తానని అన్నాడు. దానికి నిరసనగా అక్టోబర్ 3న, లఖీంపూర్ ఖేరీలో అజరు మిశ్రా నిర్వహించే కుస్తీ పోటీల వేదిక దగ్గర్లో నల్ల జెండాల ప్రదర్శన చేసి, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య దృష్టికి కూడా ఆ సమస్యను తీసుకెళ్ళాలనేది రైతుల ఉద్దేశం. ఆశిష్ మిశ్రా, అతని సహచరులు నిరసన వేదిక వద్ద ఉన్న రైతుల మీద నుండి కాన్వారుతో తొక్కించుకుంటూ వచ్చారు. కారు ఒక రైతును సుమారు 20అడుగుల దూరం లాక్కెళ్ళింది, అతని శరీరం రెండు ముక్కలైందని సుఖ్జీత్ సింగ్ అనే రైతు నాయకుడు చెప్పాడు. ''ఆశిష్ మిశ్రా పేల్చిన ఐదారు రౌండ్ల బుల్లెట్ శబ్దాలను మేము విన్నాం. రైతులు ఆందోళన మొదలుపెట్టే సమయానికి అతడు తప్పించుకొని పారిపోయాడని'' సుఖ్జీత్ సింగ్ చెప్పాడు. కోపోద్రిక్తులైన రైతులు కారును తగులబెట్టారు.
సుఖ్జీత్ సింగ్ కథనం ప్రకారం, ఆ ప్రాంతంలో స్థానిక రైతు నాయకుడైన తజిందర్ సింగ్ విర్క్‌ను లక్ష్యంగా పెట్టుకోవాలని మోనూ(ఆశిష్ మిశ్రా) అనుకున్నాడు. నల్ల జెండాల ప్రదర్శనలో పాల్గొనాలని ప్రజలను కోరుతూ విర్క్ ఒక వీడియోను విడుదల చేశాడు. మోనూ, అతని సహచరులు వీలైనంత ఎక్కువ మందిపై దాడి చేసే లక్ష్యంతో వచ్చారు. విర్క్ తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తర్వాత జరిగిన ఘర్షణల్లో కాన్వారులో ఉన్న నలుగురు మరణించారు. నిరసనను చిత్రీకరించడానికి వచ్చిన ఒక టీవీ జర్నలిస్ట్ రామన్ కాశ్యప్‌ను హత్య చేశారు. భుజానికి బుల్లెట్ గాయం కావడంతో అతడు చనిపోయాడు. కానీ, రైతులు తీవ్రంగా కొట్టడంతో, గాయాలై చనిపోయాడని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. చనిపోయిన జర్నలిస్టు సోదరుడు పవన్ కాశ్యప్, రామన్ కాశ్యప్‌ను కొట్టి చంపారన్న నిందను కొట్టిపారేశాడు. ''మార్చురీలో అతని బట్టలను తొలగించి చూస్తే, కొట్టడం వల్ల అయిన గాయాలేమీలేవు. అలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని'' పవన్ మీడియాను కోరాడు.
ఉద్రిక్త పరిస్థితి
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో, రాష్ట్ర పాలనా విభాగం ఆ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోలీసు బలగాలను మోహరించాలని ఆజ్ఞలు జారీ చేసింది. టికూనియా పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. దాడి,హత్య చేసినందుకు ఆశిష్ మిశ్రాతో పాటు 13 మందిపై నేరం మోపుతూ కేసు నమోదు చేశారు. ఆ సంఘటన జరిగిన సమయంలో తన కుమారుడు లేడని అజరు మిశ్రా చెపుతుంటే, ఉన్నాడని సాక్షులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఐపీసీ 144వ సెక్షన్ విధించి, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. సమీప ప్రాంతాల నుండి వేల సంఖ్యలో రైతులు వచ్చారు. వివిధ పార్టీల నాయకులను సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించకుండా అడ్డుకున్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ''రైతులపై జరిపిన అనాగరిక దాడిలో బాధిత రైతులను కలవకుండా రాజకీయ పార్టీలను అడ్డుకోవడం తప్ప బీజేపీ ప్రభుత్వానికి వేరే ఏ పనిలేదని, అధికారంతో ప్రజాస్వామ్యం గొంతు నొక్కిన తీరును తీవ్రంగా ఖండిస్తూన్నామని'' ట్వీట్ చేశారు. ''గతంలో జలియన్ వాలాబాగ్‌లో సృష్టించిన పరిస్థితినే మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో చూస్తున్నాం. నేడో, రేపో వారు దానికి తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని'' నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నాడు. ఇంకా వివిధ పార్టీల నాయకులు ఈ ఘోర సంఘటనను ముక్త కంఠంతో ఖండిస్తూ, దీనికి పాలక బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
లఖీంపూర్ ఖేరీ సంఘటన రాష్ట్రంలో దిగజారుతున్న పాలనను రుజువు చేస్తుంది. సంఘీభావం తెలిపే క్రమంలో, ప్రతిపక్షాలన్నీ ఈ ఘటనపై ఏకం అవుతున్నాయి. బీజేపీకి చెందిన పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ కూడా, రైతులను తొక్కిస్తూ వేగంగా వెళ్ళిన కార్ల వీడియోను షేర్ చేస్తూ.. ''ఈ దృశ్యం ఎంతటి వారినైనా కదిలిస్తుందని, ఈ వీడియోలోని దృశ్యాలను పరిగణలోకి తీసుకొని, నిందితులపైన చర్యలు తీసుకోవాలని'' ట్వీట్ చేశాడు. తర్వాత అతనితో పాటు అతని తల్లి మేనకా గాంధీని బీజేపీ జాతీయ కౌన్సిల్ నుండి తప్పించారు.
ఉత్తరప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఇదే ఐక్యతను కొనసాగిస్తే, బీజేపీ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాని ఫలితమే కేంద్రంలో బీజేపీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పాలనకు, రైతులకు మధ్య శాంతిని నెలకొల్పడంలో, తీక్షణతలను తగ్గించడంలో సంయుక్త కిసాన్ మోర్చా ప్రాధాన ప్రతినిధులలో ఒకరైన రాకేష్ టికాయత్ కీలక పాత్రను పోషించాడు. అజరు మిశ్రాను మంత్రివర్గం నుండి తొలగించాలని, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయాలని, మరణించిన రైతుల ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అక్టోబర్ 9న, 12 గంటల విచారణ అనంతరం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) నిందితులను అరెస్ట్ చేసి మూడు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. డెంగ్యూ సోకిందని ఆశిష్ మిశ్రాను అక్టోబర్ 24న జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. సుప్రీంకోర్టు ఈ సంఘటనను సూమోటోగా స్వీకరించి, అక్టోబర్ 26న ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అధిపతిగా, సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన బెంచ్ ఈ హింసాయుత ఘటనకు సాక్ష్యాలుగా ఉన్నవారికి రక్షణ కల్పించాలని ఆదేశించింది. వందల వేల సంఖ్యలో ఉన్న ప్రజల నుండి కేవలం 23మంది సాక్షాలను మాత్రమే నమోదు చేశారని బెంచ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
కుల దుర్మార్గం
అక్టోబర్ 15న సింఘూ సరిహద్దు ప్రాంతంలో నిరసన వేదిక వద్ద ఉన్న పోలీస్ బారికేడ్‌కు 35 సంవత్సరాల దళిత సిక్కు వ్యవసాయ కార్మికుని (లఖ్బీర్ సింగ్) శవం వేలాడబడి ఉండడంతో రైతుల నిరసనలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అతని చెయ్యి తెగిపోయి, శరీరంపై గాయాలయ్యాయి. నిహాంగ్స్ సిక్కు సభ్యుడైన సరబ్జిత్ సింగ్ ఈ ఘోరమైన నేరాన్ని చేసినట్లు ఒప్పుకున్నాడు. అతనితో పాటు మరొక ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి పవిత్ర గ్రంథాన్ని తాకడం ద్వారా అతడు అగౌరవ పరిచాడు కాబట్టి చేసిన నేరానికి మేము విచారించడం లేదని అన్నారు. తరువాత వారి మొత్తం కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేశారు. తార్న్ తరణ్ జిల్లాలోని చీమాకాలన్ గ్రామం లఖ్బీర్సింగ్ అంత్యక్రియలు చేయడానికి స్థలం కేటాయించకుండా, అంత్యక్రియలను కూడా బహిష్కరించింది. గురు గ్రాంథ్ సాహిబ్ సత్కార్ కమిటీ, సిక్కుల ఆచారం ప్రకారం లఖ్బీర్ అంత్యక్రియలు చేయకుండా నిషేధించింది.
ఈ సంఘటనను రైతు ఉద్యమంలో ఒక ''ప్రమాదకరమైన దృష్టి మళ్ళించే చర్యగా'' పేర్కొంటూ, ఇలాంటి కుట్రపూరిత చర్యలకు రైతులెవరూ ఎరగా మారొద్దని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) విజ్ఞప్తి చేసింది. ఎస్కేఎం ఒక ప్రకటన విడుదల చేస్తూ, దీని వెనుక రైతుల ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చే, హింసతో లోబరచుకునే ఒక కుట్ర ఉందని పేర్కొంది. ఇంత దుర్మార్గమైన హత్యకు పాల్పడిన నిహాంగ్ సింగ్, ఇతర నాయకులను కలిసిన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కైలాష్ చౌదరీలు వెంటనే పదవులకు రాజీనామా చేయాలి. రైతులను చులకనగా చూస్తూ, వారిని లోబరచుకునే కుట్రను విచారించేందుకు సుప్రీంకోర్టు జడ్జిని నియమించాలని ఎస్కేఎం డిమాండ్ చేస్తున్నది. ఇది రైతు ఉద్యమం తప్ప, మత ఉద్యమం కాదని చెపుతున్నది.
దాదాపు సంవత్సరం క్రితం ప్రారంభమైన రైతు ఉద్యమంలో 600పైగా రైతులు ప్రాణాలను కోల్పోయారు. 2017లో యోగీ ముఖ్యమంత్రి అయిన తరువాత మోడీకి, ఆయనకు మధ్య అధికార ఆధిపత్యపోరు ఉన్న విషయం రహస్యమేమీ కాదు. ఆదిత్యనాథ్‌ను బలహీనపర్చేందుకు కేంద్రం కొన్ని ఎత్తులు వేసిందని, కానీ కొన్ని రైతుల డిమాండ్లను అంగీకరించడం ద్వారా ముఖ్యమంత్రి ఆ ఎత్తులను చిత్తుచేశాడని కొన్ని వర్గాలు అభిప్రాయపడు తున్నాయి. కుల, మత హింసను ప్రోత్సహించడం బీజేపీ ఎన్నికల వ్యూహం. ఈ వ్యూహం ఈసారి సఫలం కాకపోవచ్చు. (''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్,
- దివ్యా త్రివేది
సెల్:9848412451