Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మాదేమన్నా అహోబిల మఠం అనుకున్నరా... ఫక్తు రాజకీయ పార్టీ... మాకు రాజకీయ ప్రయోజనాలు కచ్చితంగ ఉంటయి...' 'ప్రతీ రాజకీయ పార్టీ... తన విస్తృతీ, విస్తరణ కోసం కచ్చితంగా ప్రయత్నం చేస్తది. అది తప్పు కాదు. మేం కూడా అట్లనే టీఆర్ఎస్ విస్తృతి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తం. ఇది తెలీక చానా మంది ఇతర పార్టీల వాళ్లని ఎట్ల చేర్చుకుంటరు అంటూ తెలివి తక్కువగా మాట్లాడుతున్నరు...' కారు సారు ఇటీవల విలేకర్ల సమావేశంలో చేసిన కామెంట్లివి. సరే.. సారు చెప్పిందే కాసేపు కరెక్టని అనుకుందాం. మరి 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇదే టీఆర్ఎస్కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు 'తెలంగాణ భవన్..' గోడ దూకి, 'గాంధీ భవన్...' మెట్లెక్కేందుకు ప్రయత్నిస్తే కేసీఆర్ సారు యమ సీరియస్ అయ్యారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి లాగుతున్నారంటూ ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. 'ఏం... రాజశేఖరరెడ్డి.. ఏమనుకుంటున్నవ్.. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తావ్.. తెలంగాణ జనం ఊరుకుంటరనుకున్నవా...? నిన్ను చీరి చింతకు కడతరు...' అంటూ నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో క్యాలెండర్లలోని పేజీలు ఎగిరిపోయాయి. గడియారంలోని ముళ్లు గిరిగిరా తిరిగాయి. 2009 నుంచి కాలచక్రం గిర్రున తిరిగి 2021లోకి వచ్చి పడ్డాం. కానీ ఆనాడు పార్టీ ఫిరాయింపుల గురించి, ఆ చట్టాల గురించి స్పష్టీకరించి, వైఎస్ చర్యలపై మండిపడ్డ టీఆర్ఎస్ బాస్... ఇప్పుడు 'పార్టీ విస్తృతి, విస్తరణ కోసం ఏదైనా చేయొచ్చు, ఎవర్నైనా చేర్చుకోవచ్చంటూ' చెబుతుండటంతో అసలైన తెలంగాణ ఉద్యమకారులు నోరెళ్లబెడుతున్నారు. గతంలో అదే విస్తృతి, విస్తరణ కోసం వైఎస్ కూడా ప్రయత్నించారు, అప్పుడు ఆయన్ను ఏకిపారేసిన కేసీఆర్... ఇప్పుడు తాను కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు కదా...? అంటే ఇతర పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తే తప్పు... కేసీఆర్ చేస్తే ఒప్పా..? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 'ఆహా కేసీఆర్ సార్ ఏం సెప్తిరి..? ఏం సెప్తిరి...? ఎప్పుడూ ఇట్లనే సెపుతారా..?' అంటూ కల్కి సినిమాలో హీరో రాజశేఖర్ చెప్పిన డైలాగును వారు ఈ సందర్భంగా వదులుతున్నారు. రేపు కాంగ్రెసో లేక బీజేపో ఇలాగే గులాబీ నేతలకు వలేస్తే... అప్పుడు కూడా ఆ రెండు పార్టీలు తమ విస్తృతి, విస్తరణ కోసమే మా వాళ్లని తీసుకున్నారంటూ సీఎం ఊరుకోగలడా...? ఆ చర్యలను సమర్థించగలడా..? అంటూ రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు. అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే ఈ లొల్లే ఉండదు కదా..? విజ్ఞులైన తెలంగాణ జనాలు దీనిపై జర సోచాయించాలె... -బి.వి.యన్.పద్మరాజు