Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమి అక్కడ పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారం చేసిన ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న చందంగా తయారైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాక ముందే ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను పెద్దసారు అక్కడ పురామాయించారు. ఎక్కడెక్కడ, ఏయే వర్గాలకు దగ్గరవ్వాలో కూడా నిర్దేశించారు. పెద్దాయన ఆదేశాలతో ఎమ్మెల్యేలు సుమారు నాలుగునెలలపాటు సొంత నియోజకవర్గాలను వదిలి అక్కడే తిష్టవేశారు. పోలింగ్‌కు ముందు రోజు నానా అవస్థలు పడిన వార్తలను మీడియాలో చూశాం. కొంత మంది ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది చావు దెబ్బలు కూడా తిన్నారు. అందరూ ఉహించినట్టే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విజయం సాధించారు. హుజూరాబాద్‌లో పని చేసిన మంత్రి, ఎమ్మెల్యేలపై కౌంటింగ్ రోజు రాత్రి పెద్దసారు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆలస్యంగా సదరు ఎమ్మెల్యేల చెవిలో పడింది. నిస్సాహయులైన వారు... తమ పరిస్థితిని ఎక్కడా చెప్పుకోలేక వారికి సన్నిహతంగా ఉండే సీనియర్ జర్నలిస్టులతో ఆవేదన పంచుకున్నారు. ఇంత కష్టపడినా తమ శ్రమను గుర్తించలేదని వాపోతున్నారు. తాము వెళ్లిననాటికి టీఆర్ఎస్ అభ్యర్థికి అక్కడ ఐదుశాతం కూడా ఓటింగ్ లేదని, అన్ని విధాలా కష్టపడి అమాత్రం పోటీ ఇవ్వగలిగామనీ, అంతా తెలిసినా పెద్దమనిషి ఆవిధంగా అనడం చాలా బాధ కలిగిస్తోందని వారు మదనపడుతున్నారు. హుజూరుబాద్‌లో దళిత బంధు గురించి ఊరూవాడా ప్రచారం చేసిన దళిత ఎమ్మెల్యేలకు ఇప్పుడు వారి ఇలాఖాలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. హుజూరాబాద్‌లో ఇప్పించి మాకెందుకు ఇవ్వరనీ, దళిత కుటుంబాలు నిలదీస్తున్నాయి. దీంతో ముఖం చాటేయటం తప్ప ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు. కాగా ఎమ్మెల్యేల అసంతృప్తి ఎక్కడోచోట, ఎప్పుడోకప్పుడు బద్ధలవుతుందనీ, అప్పుడు టీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
- గుడిగ రఘు