Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలే ఉద్యమ పార్టీ. పైగా ఏడేండ్ల నుంచి చేతులొట్టిగుండె. అంతా పెద్దసారు, చిన్నసారుదే హవా. అడపాదడపా మాత్రమే మంత్రులు, ఎమ్మెల్యే సాబ్లది. దీంతో చోటామోటా నాయకులకు వేదికలెక్కి స్పీచ్‌లు దంచే అవకాశమే లేకుండా పోయింది. ఇన్నేండ్ల తర్వాత లేకలేక ధాన్యం కొనుగోళ్లపై పెద్దసారు ధర్నాకు పిలుపునిచ్చాడు. అవకాశమొచ్చిందే తడవుగా వీరలెవల్లో టీఆర్ఎస్ నాయకులంతా రోడ్లెక్కారు. ఇంకా ఉద్యమ వాసనలు పోలేదో ఏమోగానీ నలుదిక్కులూ పిక్కటిల్లేలాగా గొంతులెత్తి 'ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం.. ఇదేమి పాలన.. ఇదేమి పాలన.. దోపిడీ పాలన.. దొంగల పాలన' అని పెద్దపెట్టున నినదించారు. అధికారంలో ఉన్నామనే సోయినే మర్చిపోయారు. ఇది విన్న జనాల మైండ్ గిర్రున తిరిగి బ్లాక్ అయిపోయింది. 'ఏందిర బై.. గీల్లే అధికారంలో ఉంటరు. కమ్యూనిస్టోళ్ల నినాదాలిస్తుండ్రు' అంటూ చెవులు గొరుక్కున్నరు. ఓకాడనైతే కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా మైకు దొరకంగానే ఓ జెడ్పీటీసీకి పూనకమొచ్చింది. అధికారంలోకి వచ్చాక ఉద్యమాలు చేయకపోవడంతో గా సారు మైండ్ల ఇంకా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఫీడ్ అయినట్టుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గాదు ఏకంగా ప్రత్యేక తెలంగాణ దేశమే కావాలంటూ లొల్లిబెట్టిండు. 'ఏహె పండించిన ప్రతి ధాన్యాన్ని కొనే దమ్మూ ధైర్యం లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మా తెలంగాణను మాకు ఇచ్చినట్టే ప్రత్యేక తెలంగాణ దేశం ఇవ్వండి. మా ప్రధాని మాకే అయితడు' అనటంతో ఆ ధర్నాలో పాల్గొన్నవాళ్లంగా ఒకరిమొహం మరొకరు చూసుకున్నరు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీ.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరినప్పటికీ పాత పార్టీల వాసన పోలేదో ఏమోగానీ ఓకాడ ధర్నాలో 'కేసీఆర్ డౌన్.. కేసీఆర్ డౌన్..' అంటూ నినదించడంతో అక్కడున్నోళ్లు ముక్కుమీద వేలేసుకున్నరు. చిత్రవిచిత్రాలను చూసిన రాష్ట్ర ప్రజలు 'ఎక్కకెక్కక రోడ్డెక్కితే గిట్టనే నలుగుట్ల నవ్వులపాలవుతరు' అని అనుకుంటున్నరు. జనం సమస్యలను తెలుసుకుని నడుసుకోవాలని సూచిస్తున్నారు.
- అచ్చిన ప్రశాంత్