Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా రోజులకు మీ అందరితో మాట్లాడాలన్పించింది. అందుకే మీ ముందుకు వచ్చాను. నన్ను గుర్తుపట్టలేదు కదూ! అవున్లే గుప్పుడెప్పుడో తెలంగాణ రాకముందు నేనో వెలుగు వెలిగాను. ఆఁ బాగానే గుర్తుపట్టారు. నేనే ధర్నా చౌక్‌ను.
తెలంగాణ రాకముందు ఎన్నో పోరాటాలు చేయటానికి నన్నో పోరాట వేదికగా ఎంచుకున్నారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌లో పోరాటాలు బాగా జరుగుతున్నాయి. మన జిల్లాలో కూడా ఒక ధర్నా చౌక్ ఉంటే ఇక్కడా పోరాటాలు చేయవచ్చునని, అన్ని జిల్లాల్లో నన్ను స్ఫూర్తిగా తీసుకుని ధర్నాచౌక్‌లు ఏర్పాటు చేస్తే నాకు భలే సంతోషమయ్యింది.
తెలంగాణ వస్తే ధర్నాలు, చౌక్లు ఉండవని, భీకరమైన ఉపన్యాసాలు విని నిజమేననుకున్నాను. నన్ను లేకుండా చేస్తామంటే నాకేమీ బాధన్పించలేదు! ప్రజలు తమ సమస్యల పరిష్కారానికే ధర్నాలు చేస్తారు. ధర్నాలు, చౌక్లు లేకుండా చేయటమంటే ప్రజలకు సమస్యలు లేకుండా చేయటమే కదా! అందుకే బాధన్పించలేదు. పైగా సంబరపడ్డాను.
కాని తెలంగాణ వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. ప్రజల సమస్యలు పెరిగాయి తప్ప తగ్గలేదు. అందుకే నాకు డిమాండ్ పెరిగింది. అంటే పాలకుల ప్రభ తగ్గినట్లే కదా! ధర్నాలు బాగా జరిగాయంటే, పాలన అఘోరిస్తుందని అర్థం! అందుకే ధర్నాలకూ చౌక్లకూ రావద్దంటూ నిషేధం విధించారు. ఎవరెన్ని చెప్పినా వినలేదు! అధికారం అంధకారంలోకి నెట్టడం మామూలే కదా!
కారణమేమైనా కానివ్వండి! నాపై నిషేధం విధించిన వారే నాదరికి రాక తప్పలేదు. సమస్యలే లేవు! ధర్నాలు - చౌక్లూ ఎందుకన్నవారు, ఎకాఎకిన వేల మందిని నా దగ్గరికి తీసుకుని రావల్సి వచ్చింది. బహుశా ప్రజలను దారి మళ్ళించటానికి నన్ను అవకాశంగా తీసుకుంటున్నారేమోనని అనుమా నించటంలో తప్పేముంది?
బీజేపీ, తెరాస పార్టీలు వెంట వెంట ధర్నాలు చేస్తుంటే చాలా తమాషాగా అన్పించింది! రెండూ పాలకపార్టీలే! ఒకరు కేంద్రంలో, మరొకరు రాష్ట్రంలో తిరుగులేని అధికారం వెలగపెడు తున్నవారే! తమకు తోచిన రీతిలో ప్రజల చెమడాలు ఒలుస్తున్నవారే! మరెందుకీ ధర్నాలు? ఎవరి మీద చేస్తున్నారు? ఇదేమి భేతాళ ప్రశ్న కాదు! చాలా సులభంగా జవాబు దొరికేదే! రైతులూ, వడ్లూ ఇదే కదా జవాబు?
అవును జవాబు అదే! కాని అందులో మతలబేమిటీ అన్నది మరో ప్రశ్న! కేంద్రం వడ్లు కొంటలేదు! కాబట్టి వడ్లు వేయొద్దు అంటాడు కేసీఆర్. వడ్లు కొనాల్సిందేనంటారు బీజేపీ నాయకులు. ఈ రెండింటిలో కామన్ పాయింటు ఒకటుంది గమనించారా? అదే కొత్త వ్యవసాయ చట్టాలు! రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనదంటూ పార్లమెంటులో చట్టాలు చేసిన బీజేపీ నాయకులు, వడ్లు రాష్ట్ర ప్రభుత్వమే కొనాలంటూ ధర్నాలు చేస్తారు! పార్లమెంటులో రైతు చట్టాలను నోరు తెరవకుండా ఒప్పుకుని, రాష్ట్రం వద్ద కేంద్రం కొననప్పుడు మేమెలా కొంటామంటాడు కేసీఆర్!
బీజేపీ, టీఆర్ఎస్లది రైతు చట్టాలలో ఒకే వైఖరి. అందుకే కేసీఆర్ ఇప్పటి వరకూ రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలకలేదు! అర్నెల్లకోసారి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు. కానీ టిక్రీకో, సింఘాకో వెళ్ళిన పాపాన పోలేదు. కేసీఆర్ తప్పుల చిట్టా మొత్తం మా దగ్గర బీరువాలో ఉందంటారు బీజేపీ వారు. కాని ఆ చిట్టాను మాత్రం బయటకు తీయరు! ఇంతకన్నా గూడు పుఠాణీ ఏముంటుంది చెప్పండి?
అధికారంలో ఉన్న రెండు పార్టీలు ధర్నాలకు దిగాయంటే సామాన్యుడి సంగతేమిటో బోధపడుతూనే ఉంది! తప్పు నీదంటే నీదని ధర్నాలకు దిగుతున్నారంటే అందులో కొంతైనా వాస్తవముండే ఉంటుంది! కొంతేమిటి ఇద్దరిదీ తప్పు ఉంది! అందుకే సామాన్యులను గందర గోళ పర్చటానికే ఇలా నాటకాలు ఆడుతున్నారని మనము అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది!
ధర్నాలు చేస్తున్నవారంతా నిజంగా సమస్యలతో ఉన్నవారే కానవసరం లేదని, బట్ట కాల్చి ఎదుటివారి మీద పడేయాలన్న తాపత్రయంతో చేస్తున్నారని ''వడ్లూ - రైతులు'' అనే ఈ ఎపిసోడ్ మనకు నేర్పుతుందన్న మాట!
అందువల్ల వెనకటికో పెద్దాయన, ఎవరి మాటల వెనక ఏ వర్గ ప్రయోజనముందో తెలుసుకోవాలని చెప్పాడు. అలాగే ఎవరి ధర్నాల వెనక ఏ వర్గ ప్రయోజనాలు దాగి ఉన్నాయో కూడా సామాన్య ప్రజానీకం గుర్తించాలి! లేకపోతే మరో ఏడేండ్లపాటు మోసపోక తప్పదు!
ఇలాంటి మోసపూరిత ధర్నాల కన్నా కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు జరిగితేనే నాకు ఆనందం! నా జీవితం సార్థకం! అలాంటి దర్నాల కోసమే నేను ఎదురుచూస్తుంటాను.
సెలవు.... ఇట్లు మీ ధర్నాచౌక్.
- ఉషా కిరణ్