Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మామూలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాను పిలిచిమాట్లాడారంటే ప్రత్యర్థులపై పిడుగులు కురిపిస్తారని పేరు. తీవ్ర పదజాలంతో దూషణలు కూడా మేళవించి సాగే ఆయన వాగ్ధాటికి ఎవరు ఎప్పుడు గురవుతారని చూస్తుంటారు. కానీ, గత వారంలో రెండురోజులు వరుసగా ఆయన బీజేపీపైన, కేంద్రంపైన విరుచుకుపడినా అంతతీవ్ర ప్రభావం లేకపోవడం యాదృచ్చికం కాదు. తెలంగాణలో యాసంగి(రబీ) వడ్ల కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వంగా తాముకొనలేము గనక రైతులు వరి పండించవద్దని కోరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజరు అసత్యాలు చెబుతూ వరి వేయవలసిందిగా రెచ్చగొడుతున్నారని కేసీఆర్ ఆగ్రహించారు. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధాన్యం కొంటారోలేదో స్పష్టంగా చెప్పాలని, అనుమతి తెప్పించాలని సవాలు చేశారు. సంజరు వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటూ తనను టచ్ చేసి చూడాలనీ, తన ఫామ్‌హౌజ్‌కు వస్తే ఆరుముక్కలవుతారని, సిబిఐ దాడులకు సిద్ధమేనని సవాళ్లు విసిరారు. చాలా కాలంగా కేసీఆర్‌పై అనేక విధాల దాడి చేస్తున్న బండి సంజరు ఈ సవాళ్లపై అంతే తీవ్రంగా సమాధానమిచ్చారు. తమ వాళ్ల బాష బాగాలేదంటున్న ముఖ్యమంత్రి తన స్థాయి మర్చిపోయి అంతకన్నా దారుణంగా మాట్లాడారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఆయనతో సహా బీజేపీ నేతలెవరూ వడ్లకొనుగోలుపై హామీ ఇవ్వలేదు. కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయమని మరో ఎంపీ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నదీజలాలపై మళ్లీ ట్రిబ్యునల్ వేయాలని తాము కోరితే కేంద్రం నాటకాలాడుతుందని ముఖ్యమంత్రి చేసిన విమర్శకు కేంద్ర మంత్రి గజేంద్రషెకావత్ జవాబిస్తూ... సుప్రీంకోర్టులో కేసు వేసిన తెలంగాణ ప్రభుత్వం రెండురోజుల్లో ఉపసంహరించుకుంటానని చెప్పి ఏడునెలలు తీసుకుందని, అందుకే తాము జోక్యం చేసుకోలేకపోయామని పేర్కొన్నారు.
'నాన్నా పులి' చందమైన విమర్శలు
కేసీఆర్ తన విమర్శలో రైతాంగ వ్యతిరేక శాసనాలు, లఖింపూర్ఖేర్లో రైతులపైకి కేంద్రమంత్రి కుమారుడు వాహనం నడిపించడం, బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం, సరిహద్దుల్లో పరిస్థితిపై ఉద్వేగాలు రగిలించడం వంటి అంశాలు కూడా ప్రస్తావించారు. పెట్రోలు డీజల్ రేట్లు విచక్షణా రహితంగా సెస్సుల రూపంలో పెంచి రాష్ట్రాలకు అన్యాయం చేయడం, ప్రజలపై భారంమోపి ధరలు పెరగడానికి కారణమవడం గురించి కూడా మాట్లాడారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఆ సమయంలోనే ఏపీ ప్రభుత్వం కూడా బీజేపీ, టీడీపీ విమర్శలకు సమాధానంగా పూర్తిపేజీ అడ్వర్టయిజ్మెంట్లు ఇచ్చి పెట్రోలియం రేట్ల విషయంలో కేంద్రం మూడు లక్షల కోట్లకు పైగా కొల్లగొట్టిన సంగతి వెల్లడించింది. టీడీపీ హయాంలో పెంచిన వ్యాట్ తప్ప తాము పెంచలేదనీ, రోడ్ల బాగు కోసం మాత్రం లీటరుకు రూపాయి చొప్పున పన్ను వేశామని వెల్లడించారు. కరోనా కాలంలో పెట్రోలియం ధరలు మైనస్‌కు పడిపోయినా పెంచుకుంటూ పోయిన మోడీ ప్రభుత్వం ఇటీవలి ఉప ఎన్నికల దెబ్బ తర్వాత తగ్గించడం కంటితుడుపు అని అందరికీ తెలుసు. ఆ వెంటనే బీజేపీ అంతకు మించి టీడీపీ రాష్ట్రాలు తగ్గించాలంటూ చేసిన హడావుడికి ప్రతిస్పందనగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అరుదైన ప్రకటనను కేసీఆర్ ప్రస్తావించారు కూడా. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గనక తాము సర్దుబాటుగా అన్ని బిల్లులకు మద్దతునిస్తూ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బలపర్చామని కేసీఆర్ గుర్తు చేశారు. ఈధోరణి జగన్‌కు మరింతగా వర్తిస్తుంది. ఇలా కేంద్రాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా బలపరుస్తూ వస్తున్నారు గనకనే కేసీఆర్ ఆకస్మిక విమర్శలకు అందరూ ఆశ్చర్యపోయారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సర్శశక్తులూ ధారవోసినా ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించడాన్ని ఆపలేకపోయారు గనక ఆ ఓటమి నుంచి దారి మళ్లించడానికి ఈ ప్రహసనం మొదలెట్టారని చాలా మంది అన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైనాక దూకుడు పెంచతున్న కాంగ్రెస్‌ను తక్కువ చేసి బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా ప్రజలముందు ప్రదర్శించడానికి ఇదో వ్యూహమని ఆ పార్టీ నాయకులు అన్నారు. పైన చెప్పిన నేపథ్యంతో పాటు గత నెలలోనే కేసీఆర్ ఢిల్లీలో పదిరోజులు మకాంవేసి అమిత్‌షా తదితరులను అనేకసార్లు కలుసుకుని మంతనాలు జరిపి రావడం కూడా అపనమ్మకానికి ఒక కారణం. వాస్తవానికి హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓట్లు ఈటెల రాజేందర్‌కు మళ్లకపోయి ఉంటే ఆయన అంత సునాయసంగా గెలిచేవారు కాదన్నది అందరూ ఒప్పుకున్న విషయం. ధాన్యం విషయంలోనూ కేంద్ర రాష్ట్రాలను ఒకేగాట కట్టి మాట్లాడటం తప్ప ప్రధాన పాత్ర ఎవరిదో కాంగ్రెస్ నాయకులు చెప్పడం లేదు.
2019 ఎన్నికలకు ముందు ఆతర్వాత కూడా కేంద్రంలో స్థానం, ఫెడరల్ ప్రంట్ వంటివి మాట్లాడినప్పుడు కేసీఆర్ బీజేపీపై పోరాటాన్ని ప్రధానంగా చెప్పలేదు. ఈ సమాంతర వేదికలు పరోక్షంగా బీజేపీకి మేలు చేయడానికే ఉపయోగమని పరిశీలకులు భావించారు. జగన్ ఏ దశలోనూ బీజేపీ విధనాలపై పోరాటం గురించి మాట్లాడిందేలేదు. తాను ఎంతగానో చెప్పిన ప్రత్యేకహోదా, విశాఖ ఉక్కు అమ్మకం వంటి విషయాల్లో కూడా రాజకీయ లాంఛనంగా తప్ప ప్రభావశీల కార్యాచరణకు ఎన్నడూ సిద్ధం కాలేదు. ఇటీవల నదీజలాల విషయంలో విమర్శలు చేసుకుంటున్నా మొత్తంమీద ఆయన కేసీఆర్‌కు సన్నిహితుడనే భావమే బలంగా ఉంది. నదీజలాల విషయంలో కేంద్ర బోర్డులకు ప్రాజెక్టులు అప్పగించేందుకు సిద్ధమై ఆ తర్వాత కొన్ని షరతులు పెట్టింది. మొత్తంపైన కేసీఆర్ తీవ్రాతి తీవ్రమైన భాషలో తిట్టిపోసినా నాన్నాపులి కథలాగా తయారైంది గాని టీఆర్ఎస్ నిజంగా బీజేపీపై నికరంగా పోరాడుతుందనే విశ్వాసం ఎక్కువ మందికి కలగలేదు. వరికొనుగోలుపై టీఆర్ఎస్ ధర్నాలు చేసినా గతంలో ధర్నాచౌక్ ఎత్తివేసిన పార్టీ తానే ధర్నాలు చేస్తున్నదని వ్యాఖ్యలు తప్పలేదు. భవిష్యత్తులో కేంద్ర విధానాలపై నికరంగా పోరాటం కొనసాగిస్తామని టీఆర్ఎస్ నిరూపించుకుంటే తప్ప ఈ పరిస్థితి మారడం కష్టం.
రాష్ట్రాల మధ్య తగాదా ఎందుకు?
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి తప్పుగా ఉన్న మాట నిజమే గాని రాష్ట్రం తన పాత్ర నిర్వహించలేదనే విమర్శ కూడా అధిగమించాల్సి ఉంటుంది. కరోనా సమయంలో కోట్ల టన్నుల ధాన్యం మగ్గిపోతున్నా సుప్రీం కోర్టు చెప్పినా కూడా ప్రజలకు ఉచితంగా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం కాలేదు. మరోవైపున గోదాములు నిండుగా ఉన్నాయంటూ కొనుగోలుకు నిరాకరిస్తున్నది. బీజేపీ నాయకులు మాత్రం అదే అహంభావంతోనూ మతతత్వంతోనూ మాట్లాడటాన్ని ఖండించవలసిందే. అయితే ఈ కథలో అవాంఛనీయమైన మలుపు ఏమంటే టీఆర్ఎస్ ధర్నాలలోనూ విమర్శలు ఆంధ్రప్రదేశ్‌వైపు మళ్లడం. తెలంగాణలో తాము అద్బుతమైన అభివృద్ధి సాధిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అప్పుల కోసం అడుక్కుంటున్నారని వేములు ప్రశాంతరెడ్డి అనే మంత్రి నోరుపారేసుకున్నారు. నిజానికి టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలోనూ కేసీఆర్ ఈ ధోరణిలో మాట్లాడారు. విభజన తర్వాత ఏపీతో పోల్చి తమ పాలన గొప్పలు చెప్పుకోవడం టీఆర్ఎస్కు పరిపాటిగా మారింది. నదీజలాల వివాదం తర్వాత ఇంకా పెరిగింది కూడా. ఆ వెంటనే ఏపీ మంత్రులు వైసీపీ నేతలు అదే భాషలో ప్రతిస్పందించడం, మీడియాలో వ్యర్థ వివాదాలు సాగుతూనే ఉన్నాయి. ఏపీలో కూడా పార్టీ పెట్టాలని తనను కోరుతున్నారని కేసీఆర్ చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిపేస్తే సమస్యే లేదు కదా అని ఏపీ మంత్రి పేర్నినాని అన్నారు. ఇప్పుడు కూడా ఆయనే వేములకు సమాధానమిస్తూ తాము కేంద్రం విషయంలో ఇంట్లో కాళ్లు పట్టుకుని బయట కాలర్ ఎగరేసిన చందంగా వ్యవహరించేవాళ్లం కామని వ్యాఖ్యానించారు. మరో విధంగా చెప్పాలంటే లోపలా బయటా కూడా స్నేహంగా ఉంటామని అర్థం! అసలు ఇదంతా బూటకమనీ, జగన్ కేసీఆర్ కూడబలుక్కుని జనాన్ని గందరగోళపర్చడానికి ఇలా చేస్తున్నారని ఒక బలమైన విమర్శ. వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించిన తర్వాత ఆ పార్టీని కూడా కలిపి వ్యాఖ్యానాలు సాగుతున్నాయి. ప్రాంతీయపార్టీలైన టీఆర్ఎస్. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అనుకూల ముద్రతో తమ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతుంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ కూడా రెండుచోట్లా అంతకు మించిన అవకాశవాదం ప్రదర్శిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి అయితే మరీ ముందుకుపోయి రెండురాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతున్నదని కూడా ఆరోపించారు. ఇక బీజేపీ నేతలు కొందరు హైదరాబాద్ గురించి లేనిపోని కథలు ప్రచారంలో పెడుతున్నారు. ఈ పాలకపార్టీలన్నీ రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజల భావోద్వేగాలతో ఈ విధంగా ఆడుకోవడం బాధ్యతా రహితం, ఆందోళనకరం కూడా.
దక్షిణాది సమావేశం భవితవ్యం
ఈ పూర్వరంగంలోనే ఈ రోజు తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరుగుతున్నది. ప్రధానంగా నదీజలాల గురించిన సమస్యలే గతంలో ఈ సమావేశంలో చర్చకు వచ్చేవి. తెలంగాణ చేపట్టిన పాలమూరు రంగారెడ్డికి కర్నాటక కూడా అభ్యంతరం చెబుతున్నది. నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్రం ఏకపక్షంగా చేసిన ప్రతిపాదనలకు చాలా రాష్ట్రాలు సుముఖంగా లేవు. కావేరి విషయంలో కేరళ, తమిళనాడు, కర్నాటకలకు తీవ్ర సమస్యలున్నాయి. ఏపీ తెలంగాణ సమస్యలు సరేసరి. కేరళ ముఖ్యమంత్రి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ఈ సమావేశానికి హాజరుకావడం లేదనే సూచనలున్నాయి. హోమంత్రి అమిత్‌షా ఈ సమావేశానికి హాజరవుతారు గనక రాజకీయ ప్రాధాన్యత ఉన్నా రాష్ట్రాల సమస్యలు అయితే వీటిని సకాలంలో సహేతుకంగా పరిష్కరించాలనే ఉద్దేశం గాని ఆలోచన గాని కేంద్రానికి లేవు. వివాదాలు సాగదీయడమే విధానంగా ఉంది. ఆ ధోరణి మార్చుకుని ప్రజాస్వామికంగా ప్రజల మధ్య సుహృద్భావం కాపాడే విధంగా కేంద్రం వ్యవహరించడం అవసరం. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి కర్నాటక మినహా మరెక్కడా ప్రభుత్వం లేదు. (ఈమధ్య పాండిచ్చేరిలో కూడా మిశ్రమ ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు) కనుక కేంద్రంపై ఒత్తిడి తేవడానికి బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు దీన్ని ఒక అవకాశంగా వినియోగించుకోవచ్చు. అయితే అలా జరుగుతుందా అనేది అనుమానమే.
- తెలకపల్లి రవి