Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత 12 నెలలుగా గడ్డకట్టే చలిలో, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, సొంత ఊరు వదిలిపెట్టి లాఠీ దెబ్బలు తింటూ ఈ దేశ ప్రజల ఆకలి తీర్చడం కోసం, ఆహార భద్రత కోసం రైతులు ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో గత సంవత్సరం నవంబర్ 26న మొదలైన రైతు ఉద్యమం ఈ నవంబర్ 26 నాటికి ఏడాది పూర్తి చేసుకుంటుంది. అయితే ఇంత వరకూ రైతుల ఉద్యమ స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదు. అవసరమైతే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల దాకా ఉద్యమం కొనసాగుతుందని రైతులు ప్రకటించారు. భారతదేశం మౌలికంగా వ్యవసాయ ఆధారిత దేశం. నూటికి 70శాతం మంది ప్రజలు ఈ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం మన ఆర్థిక వ్యవస్థకు ఇరుసు, ఆక్సిజన్ వ్యవసాయమే. ఇంతటి ప్రాధాన్యత గల ఈ వ్యవసాయ రంగాన్ని దేశ, విదేశీ కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో కార్పొరేట్ కంపెనీలకు లాభాలు వచ్చే విధంగా విధానాలు చేపట్టారు. రైతు వ్యతిరేక విధానాలు రానురాను తీవ్రమై నేటి ఈ దుస్థితికి దారితీసింది. దేశానికి అన్నం పెట్టే రైతులు 12 నెలలుగా రోడ్లపై నిలబడి పోరాడుతున్నారు.
2020 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికిన మోడీ దేశ ప్రజల ఆహార, ఆరోగ్య భద్రత, జీవించే హక్కులను కాలరాసే దుర్మార్గపు చట్టాలు తీసుకొచ్చారు. ఈచట్టాల ద్వారా ఆదానీ, అంబానీ లాంటి బడా బాబులకు ఈ దేశ ప్రజల సర్వం దోచిపెట్టాలని పూనుకున్నారు. ఎందుకంటే భారతీయ వ్యవసాయ రంగాన్ని ఈ బడా బాబుల చేతిలో పెడితే ప్రజలకు ప్రాథమికంగా జీవించడానికి అవసరమైన ఆహారాన్ని నియంత్రించవచ్చు. అలాగే విత్తనాలను నియంత్రిస్తే భూమి మీద జీవాన్నే నియంత్రించవచ్చు. తద్వారా మొత్తం సమాజాన్ని నియంత్రించి, తమ గుప్పిట్లో పెట్టుకొని, ప్రజల జీవితాలతో ఆటలాడుకోవచ్చనేది కార్పొరేట్ల వ్యూహం. ఈ కుట్రకు వత్తాసు పలికే యంత్రాంగమే ఈ మోడీ ప్రభుత్వం. ఈ చట్టాలు అమలులోకి వస్తే మొత్తం వ్యవసాయం, నదులు, అడవులు, చెట్లు, భూగర్భ జలాలు, ఖనిజాలు మొత్తం సమస్త ప్రకృతి సంపదను కార్పొరేట్లు కొల్లగొడతారు. తద్వారా ఈ దేశ ప్రజల జీవించే హక్కును కాలరాస్తారు. ఇక ప్రజలకు మిగిలేది ఆకలి చావులే. మోడీ ఈ రెండున్నర ఏండ్ల పాలనలో 39వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.1998 నుండి రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు నిత్య కృత్యమైనాయి. దీనికి తోడు విద్య, వైద్యం వంటి ప్రాథమిక సేవలు ప్రయివేటీకరణ చేయ బడ్డాయి. వీటి మీద కూడా రైతులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇటు పెరిగపోతున్న ఖర్చులు, వ్యవసాయ సంక్షోభం, కరోనా విలయతాండవం కారణంగా మొత్తం వ్యవస్థే ఒక విష వలయంలో చిక్కుకున్న వేళ ఈ నల్ల చట్టాలు రైతులపై మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా భూమి నుంచి రైతును దూరం చేయడానికి వచ్చాయి. ఇప్పటికే వ్యవసాయ సంక్షోభం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగి యువత పొట్టచేత పట్టుకొని నగరాలకు అడ్డ కూలీలుగా వలసపోయి జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. కరోనా విలయం 20 కోట్ల మంది ప్రజలు వలస కూలీల రూపంలో నిరాశ్రయులైన విషయం బయట ప్రపంచానికి చాటింది. 2020 ఏప్రిల్‌లో లాక్డౌన్ సమయంలో వలస కూలీల సంక్షోభం కళ్ళారా చూసిన ప్రపంచం నివ్వెరపోయింది. ఇలాంటి స్థితిలో ప్రజలకు తిండి పెట్టే వ్యవసాయ రంగం బడా బాబుల చేతిలోకి పోతే కలిగే దుష్ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల అవసరాలకు కాకుండా వ్యాపారం, లాభాల కోసం చేయబడతాయి. దేశీయ అవసరాల కొరకు ఆహార పంటలు పండించకుండా, ఎగుమతుల కొరకు వాణిజ్య పంటలు సాగుచేయబడతాయి.
వ్యవసాయం కార్పొరేట్ బహుళజాతి కంపెనీల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. పెట్టుబడిదారీ విధానంలో వ్యాపారం తప్ప మానవీయతకు తావు ఉండదు. విపరీతంగా రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వలన భూమి నిస్సారమైపోతుంది. జన్యు మార్పిడి పంటల ద్వారా నేల, నీరు, గాలి కలుషితం అవుతాయి. పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుంది. క్యాన్సర్, కరోనా లాంటి కొత్త కొత్త వ్యాధులు విజంభిస్తాయి. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఆహార, ఆరోగ్య భద్రతలు దెబ్బతింటాయి. మానవ నాగరికతలు నదీ పరివాహక ప్రాంతాలలో వ్యవసాయం నుంచే పుట్టినాయి. వ్యవసాయం చేయడం ఒక సజనాత్మక జీవన విధానం. ప్రాణాధార భూ వనరులు బడా బాబులకు అందించడం అంటే ఆకలిని సష్టించడమే.
ఇప్పటికే దేశంలో 50 కోట్ల మంది ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. ఈ ఆకలి మరింత తీవ్రమవుతుంది. ఈ అన్యాయపు చట్టాలు ప్రజల ఆహార భద్రత, జీవించే హక్కును కాలరాస్తాయి. ఇవి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును (ఆర్టికల్ 21) హరించే చట్టాలు. ఇవి రాజ్యాంగ విరుద్ధం. ప్రజలు జీవించే సహజమైన మౌలిక హక్కును హరించే అధికారం పార్లమెంట్‌కు లేదు. కాబట్టి ఈ చట్టాలు చెల్లవు. ఇక్కడ మనుషులు బతకాలి అంటే పోరాడాల్సిందే. ఆ మట్టి చేతులు చేస్తున్న పోరాటానికి అండగా నిలవాల్సిందే. మోడీ రైతు వ్యతిరేక విధానాలను ఓడించాల్సిందే.
అందుకే రైతన్నలు మొక్కవోని దీక్షతో పోరాడుతున్నారు. కానీ ఇంత జరుగుతున్నా మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు .రైతుల ఆందోళనలను చిన్నచూపు చూస్తూ, బల ప్రయోగంతో అణచాలని చూస్తున్నది. ఇందులో భాగమే హర్యానాలోని కర్నాల్ ఘటన. ఈ ఘటనతో ఉద్యమాన్ని ఉధతం చేసే క్రమంలో యుపిలోని ముజఫర్ నగర్లో సెప్టెంబర్ 5న జరిగిన రైతుల మహా పంచాయత్ విజయవంతం అయింది. వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ బడా బాబులకు అందిస్తున్న సేవలను రైతులు అర్థం చేసుకున్నారు. 2013లో ముజఫర్‌నగర్‌లో జరిగిన మత కలహాల ఆసరాగా 2017లో యోగీ సర్కార్ యుపిలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు ముస్లింల మీద దాడి చేసినవారే ఇప్పుడు రైతు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బీజేపీ కుట్రలు ఎంత ప్రమాదకరమో రైతులు గ్రహించారు. ఈ నల్ల చట్టాలు అన్ని మతాల వారి జీవించే హక్కును హరిస్తాయని గుర్తించారు.
అందుకే ఈ పోరాటంలో హిందూ-ముస్లిం ఐక్యతా నినాదాలు హౌరెత్తుతున్నాయి. బీజేపీ హిందూత్వ విధానాలు బడా బాబుల ప్రయోజనాల కోసమేనని రైతులే కాక మిగతా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఈ మహా ఉద్యమం దేశ ప్రజల ప్రయోజనాల కోసమేనని రైతులు ప్రకటించారు. ఇక్కడ మంచి పరిణామం ఏమిటంటే రాబోయే ఎన్నికలలో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని, ఓడించాలని రైతులు పిలుపునిచ్చారు. దేశంలో కొన్ని చోట్ల మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు ఆచరించారు. ఇది నూతన రాజకీయ సంస్కృతికి దారి కావాలి. రేపటి నవ భారత నిర్మాణానికి దిక్సూచి కావాలి. ఇది నేటి చారిత్రక అవసరం.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140