Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్నిరంగాల్లో రాణిస్తున్న మహిళలకు నేడు విద్య, ఉద్యోగాల్లో కొంత మేర రిజర్వేషన్లు లభిస్తున్నాయి. కానీ ఎప్పుడో 105 ఏండ్ల కిందటే దేశంలో 1916లో తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని ధొండో కేశవ కార్వే మహానీయుడు ముంబైలో ఏర్పాటు చేశారు. అది నేడు శ్రీమతి నాథీబాయి దామోదర ఠాకర్సే మహిళా విశ్వవిద్యాలయంగా భాసిల్లుతున్నది.
ఒక పురుషుడు విద్యావంతుడైతే అతను మాత్రమే వృద్ధి చెందుతాడు, అదే మహిళ చదువుకున్నట్టయితే కుటుంబం మొత్తం విద్యావంతులవుతారని ఒక నానుడి. మనదేశంలో మహిళల చదువుకు అంత ప్రాధాన్యత ఏర్పడింది ఈఅర్ధ శతాబ్దం నుంచే. అయితే అనుకున్నట్టుగా మహిళల చదవు విషయంలో ఇంకా వెనకబాటు తనమే కనిపిస్తున్నది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. విద్యను అందించేందుకు అనువైన కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తృతంగా లేకపోవడం కూడా వాటిల్లో ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రత్యేకంగా మహిళలకు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి విద్యార్థినిలు దరఖాస్తు చేసుకునే వారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు పూర్తయినా ఇంకా దీని ఏర్పాటుపై ఎలాంటి ఆలోచన చేయకపోవడం ఆశ్యర్యం కలిగిస్తున్నది. అన్నిరంగాల్లో రాణిస్తున్న మహిళలకు నేడు విద్య, ఉద్యోగాల్లో కొంత మేర రిజర్వేషన్లు లభిస్తున్నాయి. కానీ ఎప్పుడో 105 ఏండ్ల కిందటే దేశంలో 1916లో తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని ధొండో కేశవ కార్వే మహానీయుడు ముంబైలో ఏర్పాటు చేశారు. అది నేడు శ్రీమతి నాథీబాయి దామోదర ఠాకర్సే మహిళా విశ్వవిద్యాలయంగా భాసిల్లుతున్నది.
ఆంధ్ర ప్రదేశ్‌లో 1983 ఏప్రిల్ 14న నాటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇదే స్ఫూర్తితో తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ మదర్ థెరీసా పేరిట మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు.కర్ణాటకలోని విజయపురలో 2003లో మహిళా విశ్వవిద్యాలయాలను స్థాపించారు. వీటిబాటలో మిగతా రాష్ట్రాలు కూడా మహిళలకు ప్రత్యేక విశ్వ విద్యాలయాలను నెలకొల్పాయి. ఇలా దేశంలో మొత్తం 14 మహిళా విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉంటే హుమానిటీస్, సైన్స్, మేనేజ్మెంట్, ఫార్మసీ, కంప్యూటర్ సైన్సెస్, ఇంజినీరింగ్ విభాగాలలో ప్రత్యేక కళాశాలలు ఏర్పాటై పూర్తిగా వారికే సీట్లు లభిస్తాయి. దీనికి నిదర్శనంగా...ఆంధ్ర ప్రదేశ్‌లోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 59 రకాల కోర్సులు ఏర్పాటయ్యాయి. వీటిలో నాలుగు వేల మంది విద్యార్థినిలు చదువుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా మహిళా మెడికల్ కాలేజిని స్విమ్స్ యూనివర్శిటీకి అనుబంధంగా నెలకొల్పారు. దీన్ని మహిళా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా చేరిస్తే బాగుండేది.
తెలంగాణ ఏర్పడిన తరువాత పద్మావతి విశ్వవిద్యాలయం పరిధి పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కే పరిమితిమైంది. దీని పరిధిలో తెలంగాణ కళాశాలలు గానీ, విద్యార్థినిలు చేరడానికిగానీ అవకాశాలు లేవు. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కొత్తగా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా మహిళా విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటయితే మహిళా విద్యావికాసంలో ముందడుగు పడినట్టవుతుంది. విద్యార్జన ద్వారానే మహిళల చైతన్యం, ఉద్దరణ సాధ్యమవుతుందనేది సత్యం. దీనికోసం ప్రత్యేక మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటైతేనే తెలంగాణ మహిళలు ఉన్నత విద్యలో మరింత ముందంజ వేయగలుగుతారు. తెలంగాణలో ఇప్పటికే 20 దాకా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో నాలుగోదిగా గుర్తింపు పొందుతుంది.
తెలంగాణలో మహిళా జనాభా కోటి 75 లక్షలకు పైమాటే. వీరిలో గ్రామీణ మహిళా జనాభా కోటి ఆరు లక్షల 90 వేల మంది. పట్టణ జనాభా 67 లక్షల ఐదు వేలుగా ఉంది. ఇక మహిళా అక్షరాస్యత శాతం 57.99 శాతం మాత్రమే. గ్రామస్థాయిలో అక్షరాసత్య పెంపునకు కృషిగా ఒకవైపున కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బాలికల గురుకుల విద్యాలయాలు దోహదపడుతున్నాయి. అయితే ఉన్నత విద్యలో మహిళలకు విశ్వవిద్యాలయం ఉంటే ఏటా నాలుగు నుంచి ఐదు వేల మంది ఉన్నత విద్యాధికులు తయారవుతారు. ఒక విధంగా లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఫార్మాసిస్టులు, పరిశోధకులు ఇలా ఎంతోమంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడడానికి వీలుకలుగుతుంది. ఇలా ఉద్యోగాలు చేసుకునే మహిళల శాతం పెరుగుతుంది. ఇది సమగ్ర మహిళా వికాసానికి దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. ఏ సమాజంలో అయితే ఉన్నత విద్యావంతులైన మహిళలు ఉంటారో దాని రూపు రేఖలు సమూలంగా మారిపోతాయి. కాబట్టి దీన్ని సమాజాభివృద్ధి కోణంలో కూడా ఆలోచించి తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. దీన్ని సాహసానికి మారుపేరుగా నిలిచిన రాణి రుద్రమ పేరుతో నెలకొల్పితే చారిత్రక నేపథ్యం కూడా తోడవుతుంది. ఈవిషయంలో మహిళా విద్యావంతులు, మేధావులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉంది.
- కె. బాలకిషన్ రావు
9966554945.