Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19 కల్లోలం కారణంగా ఉద్భవించిన సామాజిక ఆర్థిక ప్రభావంతో అదనంగా 6.7 మిలియన్ల 5 ఏండ్లలోపు బాలలు ప్రమాదకర పోషకాహార లోపంతో బాధపడుతున్నారనీ, సగానికి పైగా బాలల మరణాలు నమోదు అవుతున్నాయని 'యూనిసెఫ్-2020 నివేదిక' కఠిన వాస్తవాలను వెళ్లడించడం విచారకరం. ప్రతి ముగ్గురు బాలల్లో ఒక్కరు తీవ్ర పోషకాహారలోపంతో బాధ పడుతున్నారు. పోషకాహారలోపంతో బాధపడుతున్న బాలలకు కరోనా లాంటి అనేక అంటువ్యాధులు తొందరగా సోకుతాయని తెలుపుతున్నారు. కడుపేదరికం, పని దొరక్క పోవడం మరియు ఆహార అభద్రత కారణాలు బాలల ఆరోగ్యంపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అత్యవసర పోషకాహార సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, ధరలు పెరగడంతో బాలలు కనీస పోషకాహారానికి దూరం అవుతూ, తీవ్ర పోషకాహారలోప స్థితితో 38.4 శాతం శారీరక అభివద్ధి ఆగిపోయిన కారణంగా వయస్సు కన్న అతి తక్కువ ఎత్తుతో (స్టంటింగ్) పొట్టి వాళ్ళలా మారుతున్నారని కూడా గుర్తించారు.
మన దేశంలో మగ శిశువుల కన్న ఆడ శిశు మరణాలు ఎక్కువగా నమోదు కావడం బాధాకరం. దీని కారణంగా మగ ఆడ పిల్లల నిష్పత్తి 1000:900 ఉండడం ప్రకృతి విరుద్ధమని తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 5 ఏండ్ల లోపు మగ బాలలు 7 శాతం మరణిస్తే, మన ఇండియాలో 11 శాతం ఆడ బిడ్డలు మరణిస్తున్నారు. గ్రామీణ, పట్టణ మురికివాడలు, ఎస్సీ, ఎస్టీ, పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో పోషకాహారలోపం, ఆరోగ్య వసతుల లేమి, బాల్యవివాహాలు, పాఠశాలలకు పిల్లలు దూరమవడం, పరిసరాల మరియు వ్యక్తిగత అపరిశుభ్రత, సురక్షిత త్రాగునీరు లేకపోవడం లాంటి సమస్యలు చుట్టు ముట్టుతున్నాయి. దేశ కౌమారదశ (10 - 19 ఏండ్ల) పిల్లల జనాభా 253 మిలియన్లు ఉన్నది. బాల్యవివాహాలు చేసుకున్న కూతుర్ల సంఖ్యలో ప్రపంచ దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. వీరిలో అనారోగ్యం, చిన్నతనంలోనే తల్లి కావడం, పోషకాహారం అందకపోవడం, ఆర్థిక వెనుకబాటుతనం, బలహీన సంతానం ఉండటం వంటి సమస్యలు వెన్నాడుతాయి. కౌమారదశ బాలికల్లో 54 శాతం మరియు బాలురలో 30 శాతం రక్తహీనతతో సతమతం అవుతున్నారు. మన దేశంలో 60-90 శాతం బాలికలు ఏదో ఒక సందర్భంలో లైంగిక అత్యాచారాలు, హింసలు లేదా వేధింపులను అనుభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 189 దేశాల మానవ అభివృద్ధి సూచిక జాబితాలో ఇండియా 130వ స్థానంలో ఉన్నది. భారతదేశ భాగ్యవిధాతలుగా ఎదగాల్సిన బాలలు ఆహారకొరత, పోషకాహారలోపం, అనారోగ్యం, అవిద్య, బాలకార్మిక వ్యవస్థ, బాలల లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు లాంటి తీవ్ర సమస్యలతో సంసారం చేస్తున్నారు.
కరోనాకు ముందు ప్రపంచవ్యాప్తంగా 47 మిలియన్ల బాలలు పోషకాహార (వేస్టింగ్) సమస్యలతో సహజీవనం చేస్తే, ప్రస్తుత కరోనా కాలంలో వారి సంఖ్య 54 మిలియన్లకు చేరడం మొదటిసారి ఈ మిలీనియంలో జరిగింది. కరోనా వ్యాప్తితో పేద దేశాలలోని పోషకాహార లోపంతో బాధపడుతున్న 5 సంవత్సరాల లోపు బాలల సంఖ్య 14.3 శాతం పెరిగిందని గుర్తించారు. దీని పర్యవసానంగా సగానికి పైగా బాలలు పోషకాహారలోపంతో మరణిస్తున్నారని అనుమానిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా 250 మిలియన్ల బాలలకు విటమిన్-ఏ అందలేదని, దాదాపు 25 శాతం వరకు పోషకాహార లోపం పెరిగిందని తేల్చారు. వీటి ఫలితంగా 1.28 లక్షల అదనపు బాలల మరణాలు జరుగవచ్చని విశ్లేషించారు. గర్భిణి స్త్రీలకు అందవలసిన సమతుల పోషకాహారం అందక పోవడం కూడా పరిస్థితి తీవ్రతను మరింత జటిలం చేస్తుందని నివేదిక తెలుపుతోంది. బాలలకు జీవించడం, శారీరకంగా మానసికంగా ఎదగడం, వేధింపుల నుండి రక్షణ పొందడం, అభివద్ధిలో పాలుపంచుకోవడమనేవి రాజ్యాంగ హక్కులని గుర్తించింది. ఆకలి, అకాలమరణాలు, అత్యాచారాలు, బాలకార్మిక దురాచారం, విద్య, పోషకాహారం లాంటి సవాళ్ళను దేశం సమర్థవంతంగా ఎదుర్కోవలసి ఉంది. మన దేశంలో 2012-17 మధ్య కాలంలో 2.43 లక్షల బాలికలు/ మహిళలు కనబడకుండా పోయారు. కోవిడ్-19 కాలంలో రేపటి పౌరుల పోషకాహార హక్కులను కాపాడేందుకు ఆయాదేశాల ప్రభుత్వాలు, సామాన్య ప్రజలు, స్వచ్ఛంధ సంస్థలు, దాతలు వెంటనే స్పందించాల్సిన సమయమిది. ఆహార ఉత్పత్తి రంగాలను ప్రోత్సాహించడం, ఆహార సరఫరా నియంత్రణ, తల్లిపాల రక్షణ, బాలలకు మరియు తల్లులకు సమతుల ఆహార లభ్యతలను కాపాడాల్సి ఉంది. బాలల్లో పోషకాహార లోపాల్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం, పేద కుటుంబాలకు ఆహారాన్ని ఇంటి వద్దనే పంపిణి చేయడం, పాఠశాలల్లో సురక్షిత మధ్యాహ్న భోజనం కల్పించడం లాంటి అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యూనిసెఫ్ ప్రణాళిక ప్రకారం కోవిడ్-19 ధాటికి తట్టుకుంటున్న విశ్వమానవాళి, ముఖ్యంగా ఐదేళ్ల లోపు బాలలను రక్షించుకోవడానికి రెస్పాండ్(స్పందించు), రికవర్(క్షేమంగా బయటపడడం) మరియు రీఇమేజిన్(తిరిగి రూపాన్నివ్వడం) అనబడే త్రిసుత్రాలను ప్రతిపాదించారు. సమస్య జటిలం కాక పూర్వమే తగు చర్యలు తీసుకోవడం, సమస్యలతో సతమతమవుతున్న వారిని రక్షించుకోవడం మరియు బయట పడిన వారిని సంరక్షించుకోవడం ప్రభుత్వాల బాధ్యత.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037
(14 నవంబర్ ''జాతీయ బాలల దినోత్సవం'' సందర్భంగా)