Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా సీపీఐ(ఎం) మాజీ కార్యదర్శి వనగంటి ఈశ్వర్ 2020 నవంబర్ 18న, వనపర్తి పట్టణంలో గుండెపోటుతో కన్నుమూశారు. వనపర్తి పట్టణంలో యువజన, కార్మిక ఉద్యమాలు నిర్మించి అంచెలంచెలుగా ఎదిగి వనపర్తి పట్టణ సీపీఐ(ఎం) కార్యదర్శిగా, జిల్లా కమిటి సభ్యుడిగా పనిచేస్తూ 1985లో పార్టీ జిల్లాకార్యదర్శిగా భాద్యతలు చేపట్టారు. ఈశ్వర్ భార్య సత్యమ్మ మహిళా సంఘం కార్యకర్తగా పనిచేశారు. 2015 డిసెంబర్ 18న వనపర్తి టౌన్లో అనారోగ్యంతో ఆమె మరణించారు. తాను ఏ భాద్యతలో ఉన్నా ప్రజల మద్య ఉండేవారు ఈశ్వర్. నిరంతరం ప్రజాసమస్యలపై పనిచేస్తూ కార్యకర్తలను ఉత్సాహపర్చేవారు. జిల్లాలో ప్రజాసంఘాలు, పార్టీ విస్తరణకు కృషిచేశారు. పార్టీ అగ్రనాయకులు సుందరయ్య, రాష్ట్ర కార్యదర్శి మోటూరి హనుమంతరావు గారల ప్రోత్సాహంతో కామ్రేడ్ ఈశ్వర్‌గారు పార్టీ పూర్తికాలం కార్యకర్తగా వచ్చారు. వనపర్తి కేంద్రంగా 1976లో విద్యార్థి ఉద్యమం పున:నిర్మాణం ప్రారంభమయ్యింది.
వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ప్యానల్ వరుసగా ఘనవిజయం సాధించేది. ఈ విజయాన్ని ఓర్వలేని ఆర్ఎస్ఎస్, ఏబీవీపి వారు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నివసిస్తున్న రూంలపై రాత్రిపూట దాడిచేసేవారు. గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ భావాలకు ఆకర్షితులయ్యేవారు. విద్యార్థి ఉద్యమాన్ని, కార్యకర్తలను రక్షించుకోవడానికి పార్టీ కార్యదర్శిగా ఈశ్వర్ గారు ఎంతో కృషిచేశారు. చురుకుగా పనిచేసేవారికి మార్క్సిస్టు సిద్దాంత అంశాలు భోదించేవారు. వనపర్తి కేంద్రంగా ఎస్ఎఫ్ఐ పనిచేస్తూ జిల్లావ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేసింది. ప్రధానంగా సాంఘీక, సంక్షేమ విద్యార్థుల సమస్యలపై కృషిచేస్తూ బలమైన సంఘంగా ఎదిగింది. వనపర్తి కేంద్రంగా విద్యార్థి ఉద్యమం ఎదుగుదలకు ఈశ్వర్ ఎంతో కృషి చేశారు. అప్పుడు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినవారు చాలామంది పార్టీ పూర్తికాలం కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కొందరు ఉద్యోగులుగా ప్రధానంగా ఉపాధ్యాయ రంగంలో పనిచేస్తూ పార్టీకి నిరంతరం అండగా నిలుస్తున్నారు.
1986లో జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు సంభవించి గ్రామాలకు గ్రామాలు వలస బాటపట్టేవి. వయస్సులో ఉన్నవారు పట్టణాలకు వలసపోగా గ్రామాల్లో ముసలివారు, పిల్లలు ఆకలిదప్పులతో అలమటించేవారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కరువు సహాయ చర్యలు చేపట్టాలని పార్టీ పలు ఉద్యమాలు చేపట్టింది. కొంత మంది తిండి దొరకక ఆకలిదప్పులతో అలమటించి చనిపోయారు. గుమ్మడం గ్రామంలో ఇలాంటి సంఘటన జరగగా పార్టీ నాయకత్వం ఆ విషయాన్ని పత్రికలకు వివరించింది. దాంతోపాటు వివిధ గ్రామాలలో చనిపోయినవారి వివరాలు సేకరించి పార్టీ ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళనలు చేసింది. పేదలలో పెద్దకదలిక వచ్చింది. ఎప్పుడు పిలుపులిచ్చినా వందల సంఖ్యలో ప్రజలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆందోళనలకే పరిమితం కాకుండా పార్టీ ప్రజలను ప్రత్యక్షంగా కరువు నుంచి కాపాడుకోవాలని అంబలి కేంద్రాలు నిర్వహించింది. పార్టీ రాష్ట్ర కమిటీ సహాకారంతో 5, 6 గ్రామాల్లో ప్రారంభించిన అంబలికేంద్రాలు క్రమంగా 84 కేంద్రాలకు విస్తరించాయి. ఇతర జిల్లాల నుంచి పార్టీ అంబలి కేంద్రాల నిర్వాహణకు ఆర్థిక సహాయంతోపాటు కార్యకర్తలను పంపించారు. ఈ కేంద్రాల నిర్వాహణకు గ్రామాల్లో డీవైఎఫ్ఐ, రైతు, మహిళా, వ్యవసాయ కార్మిక సంఘాల కార్యకర్తలు రోజుకు 4-5 గంటలు పనిచేసేవారు. అదే సందర్బంగా కర్నూల్ పార్టీ సహాకారంతో మెడికల్ కళాశాల విద్యార్థుల సహాకారంతో అంబలి కేంద్రాల గ్రామాల్లో ఉచిత మెడికల్ క్యాంప్‌లు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాల ప్లానింగ్, అమలులో ఈశ్వర్ కీలకపాత్ర పోషించారు. ప్రజాఉద్యమాల తాకిడికి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి యన్‌టి రామారావు స్వయంగా గుమ్మడం గ్రామాన్ని సందర్శించి జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపడతామని ప్రకటించమే కాకుండా, కరువు పెన్షన్స్ ప్రకటించారు.
కరువు సమస్యపై పనిచేసిన పార్టీ ఉద్యమం విస్తరించి క్రమంగా భూ సమస్యలను చేపట్టింది. విద్యార్థి, యువజన ఉద్యమాల నుండి రైతు, వ్యవసాయ, కార్మిక సమస్యలపై పనిచేస్తూ క్రమంగా ఆ సంఘాల నిర్మాణం ప్రారంభమయ్యింది. తూంకుంట గ్రామంలో హరిజన ఊశన్నకు అర ఎకర భూమికి ప్రభుత్వం పట్టా ఇచ్చింది. కానీ, ఈ భూమి మాత్రం భూస్వామి జమ్ముల వెంకటరెడ్డి ఆధీనంలో ఉండేది. పట్టాదారునికే భూమి దక్కాలని ఊశన్నకు పార్టీ అండగా నిలిచింది. ఒక్క ఊశన్న భూమే కాదు చాలా గ్రామాలల్లో ఇలాంటి సమస్యలు బయటపడ్డాయి. పార్టీ నిర్వహించే భూ సదస్సుకు ప్రజలు తండోపతండాలుగా వినతిపత్రాలు తీసుకు వచ్చేవారు. తూంకుంటలో ప్రారంభమైన భూసమస్య ఉద్యమం క్రమంగా కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి తాలూకా వివిధ గ్రామాలకు విస్తరించింది. భూ సదస్సుకు హాజరయ్యేవారు తమ ప్రాంతాల్లో, గ్రామాల్లో భూసదస్సులు పెట్టాలని ఆహ్వానించేవారు. సదస్సులకు వచ్చిన వారు ఎర్ర జెండాలు తీసుకెళ్ళి ఆయా గ్రామాలల్లో చెట్లకు కట్టి తమ భూములు దున్నుకున్న చరిత్రకు కామ్రేడ్ ఈశ్వర్ నాయకుడు.
వనపర్తి పట్టణంలో ఆర్టీసి బస్టాండ్ నిర్మాణం పూర్తి అయిన ప్రారంభానికి నోచుకోకుండా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చేది. ప్రోటోకాల్ పాటించలేదని, శిలాఫలకంపై పేరు లేదని ఎమ్మెల్యే, డా|| బాలకిష్టయ్య, మున్సిపల్ చైర్మెన్ లక్ష్మయ్య మధ్య విభేదాలు తారాస్థాయికి చేరి నిర్మాణం పూర్తి అయినా బస్టాండ్ ప్రారంభానికి నోచుకోలేదు. పాతబస్టాండ్ బస్‌లతో, ప్రయాణీకులతో కిక్కిరిసి పోయేది. ఈ దశలో ఒక విద్యార్థి బస్ ఎక్కడానికి పోయి బస్చక్రాల కిందపడి చనిపోయాడు. పార్టీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని కొత్తబస్టాండ్ ప్రారంభించాలని ఉద్యమం దశలవారీగా నడిపింది. ఒకరోజు ప్రజలను సమీకరించి వనపర్తిలో పెద్ద ఊరేగింపు నిర్వహించి బస్‌డిపో ముందు ధర్నా నిర్వహించారు. ప్రయాణికులను కూడగట్టి కార్యకర్తలు బస్‌లకు అడ్డుగ నిలిచి కొత్తబస్టాండ్ నుంచి బస్‌లు తిరగాలని ఒత్తిడి తెచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర్నా చేసి కొత్తబస్టాండ్‌కు బస్‌లు మళ్ళించారు. అక్కడ ఒక ప్రయాణికుడితో రిబ్బన్‌కట్ చేయించి బస్టాండ్ ప్రారంభించారు. ఆ రోజు నుంచి కొత్తబస్టాండ్ నుండే ఆర్టీసి బస్‌లు తిరుగుతున్నవి. ఈ కార్యక్రమమే బస్టాండ్ అధికారిక ప్రారంభ కార్యక్రమంగా మారింది. ఈ సందర్బంగా పోలీస్‌వారు పార్టీనాయకత్వంపై, కార్యకర్తలపై 18మందిపై కేస్ పెట్టారు. వనగంటి ఈశ్వర్, ఆశీర్వాదం, నాగేశ్వర్ర, డి.కుర్మన్న, కిల్లె గోపాల్, ఆంజనేయులు తదితరులు 3సం||ల పాటు కోర్టుచుట్టూ తిరిగారు. పోలీస్‌లు అక్రమకేస్లు పెట్టారని కోర్టు కొట్టివేసింది. సమస్యలపై ఉద్యమాల ప్లానింగ్‌లో, నిర్వాహణలో ఈశ్వర్ పాత్ర కీలకమయినది. జూరాల ప్రాజెక్ట్ నిర్మానం నత్తనడకగా సాగేది. అరకొర నిధులతో ఈడికగా పనిసాగేది. ఒకవైపు ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే కృష్ణానది నీరు వృథాగా పోయేది. జూరాలకు నిధులు కేటాయించి పనులు వేగవంతం చెయ్యాలని పెబ్బేర్‌లో సదస్సు నిర్వహించాము. ఈ సదస్సు తరువాత ప్రభుత్వంలో కదలిక వచ్చి ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించారు. కరువు, భూ సమస్యల కేంద్రాలు గుర్తించడం, ఉద్యమాలు చెయ్యడంలో పార్టీ గ్రామాలకు విస్తరించింది.
పార్టీ స్వంత కార్యాలయాల నిర్మాణం చేయడంలో కూడా ఈశ్వర్ పాత్ర కీలకమయినది. వనపర్తిలో పార్టీకి సొంత కార్యాలయం లేక పలుసార్లు కార్యాలయాలు మారాల్సి వచ్చేది. స్వంత కార్యాలయమే పరిష్కారమని ఆలోచించి భగత్‌సింగ్ నగర్లో స్థలం కొని, కార్యకర్తల శ్రమదానాలతో పార్టీ కార్యాలయ నిర్మాణం 3నెలల్లో పూర్తి చేశారు.
ప్రతీ సంవత్సరం కొత్తగా ఉద్యమంలోకి వచ్చే విద్యార్థి, యువజనులకు వేసవికాలంలో నాలుగు, అయిదు రోజులు శిక్షణా తరగతులు డివిజన్ల వారిగా క్రమం తప్పకుండా నిర్వహించటంలో, రాష్ట్రక్లాసులకు జిల్లా నుండి ఆయా ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యేలా ప్రోత్సహించడంలో ఈశ్వర్ పాత్ర మరువలేనిది. ఈ క్రమంలో 1989 తర్వాత జిల్లాలో కొల్లాపూర్, వనపర్తి, అచ్చంపేట్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి పలుగ్రామాలల్లో పార్టీ ప్రజాసంఘాలు విస్తరించాయి. ఓర్వలేని పాలక పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్‌పార్టీ, నక్సలైట్లతో కుమ్మక్కై పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం ప్రారంభించారు.
ఉద్యమంపై, కార్యకర్తలపై దాడులు జరిగిన ప్రతి సందర్బంలో ఈశ్వర్ పార్టీని కార్యకర్తలను కాపాడుకోవడానికి రాత్రనక పగలనక పని చేశారు. ఈశ్వర్‌గారు ఆఫీస్ నిర్వాహణ, సమయపాలన, కార్యకర్తలతో చనువుగా ఉండడం, వారి కష్టసుఖాలు పంచుకోవడంలో ముందుండేవారు. 2004 సంవత్సరంలో జిల్లా కార్యదర్శిగా రిలీవ్ అయిన తరువాత మహబూబ్‌నగర్‌లో కొంత కాలం పనిచేసి తరువాత వనపర్తి డివిజన్లో పనిచేయాలనే తపనతో అక్కడికి వెళ్ళారు.ప్రజలకు మరింత చేరువ కావాలని ఎప్పుడో వదిలేసిన చదువు తిరిగి మొదలు పెట్టి 5 సంవత్సరాలు లా చదివి లాయర్‌గా వనపర్తిలో పనిచేశారు. భార్య సత్యమ్మ ఆనారోగ్యానికి గురికావడంతో ఆమెకు చికిత్స చేయిస్తూ అన్ని సేవలు తనే చేసేవాడు. సత్యమ్మ మరణం ఈశ్వర్ గారిని బాగా కుంగదీసింది. అప్పుడప్పుడు కుమారుల దగ్గరికి వెళ్ళివచ్చినా ఎక్కువ సమయం వనపర్తిలోనే గడిపేవారు. చివరకు 2020 నవంబరు 18న అకస్మాత్తుగా కన్నుమూశారు. కామ్రేడ్ ఈశ్వర్ నిర్మించిన ఉద్యమం విస్తరిస్తున్నది. ఎందరో కార్యకర్తలు నాయకులుగా ఎదిగారు. మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నిర్మాణంలో, విస్తరణలో ఈశ్వర్ కృషి ప్రధానమైనది. ఆయన నడిచిన మార్క్సిజం, లెనినిజం బాటనే ప్రజల విముక్తి మార్గం. ఆ బాటలోనే కడవరకు కొనసాగడమే ఆయనకు నిజమైన నివాళి.
- కిల్లె గోపాల్