Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడు సంవత్సరాలలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ సుంకాన్ని 5, 10 రూపాయలు తగ్గించింది. ఇదేదో ప్రజలకు భారీగా తాయిలం ఇచ్చినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. బీజేపీ యెతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాలని బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నది. ఇంత కాలానికి కేంద్రప్రభుత్వం కొంతమేరకైనా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం సంతోషకరం, అయితే పెట్రోల్ డీజిల్ ధరలు ఇంతగా పెరగటానికి కారణాలు, ఇప్పటికైనా గణనీయంగా తగ్గించడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలి. కనీసంగా 2020 ఫిబ్రవరి నాటికి ఉన్న ధరలనైనా పునరుద్ధరించాలి.
కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా పెట్రోల్ డీజిల్ పై గతంలో ఎన్నడు లేనంత భారీ మొత్తంలో ఎక్సైజ్ సుంకాలను పెంచింది. ఆ విధంగా ప్రజలపై భారం మోపి కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపుకున్నది. మరీ ముఖ్యంగా 2020 సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భారీగా తగ్గినప్పటికీ మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు గణనీయంగా పెరగడం ఒక పెద్ద వింత. ఇది ప్రభుత్వ మాయాజాలం.
2014 కు ముందు ఆ తరువాత ఇంధన ధరలు
2014 మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు బ్యారెల్ ధర 108 డాలర్లు ఉంటే రిటైల్ మార్కెట్ డీజిల్ ధర 52.51 రూపాయలు, పెట్రోల్ ధర 63.33 రూపాయలు ఉండేది. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 80 డాలర్లు ఉంటే లీటరు పెట్రోల్ ధర 111.17 రూపాయలు, డీజిల్ ధర 102 రూపాయలుగా ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ సుంకం పెట్రోల్ పై 33 రూపాయలు డీజిల్ పై 32 రూపాయలు విధించింది. ఇది గతంలో పెట్రోల్ పై 9.48 రూపాయలు డీజిల్ పై 3.56 రూపాయలు ఉండేది. ప్రస్తుతం భారీగా పెంచి కొంచెం తగ్గించినప్పటికీ ప్రస్తుత పెట్రోల్ డీజిల్ ధరలను 2014 ధరలతో పోల్చినట్లయితే పెట్రోల్ పై 300 శాతం డీజిల్ పై 600 శాతం ధరలు పెంచి సామాన్యులపై విపరీతమైన భారం మోపింది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిత్య జీవిత సరుకుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. సాధారణ ప్రజల జీవితాలు భారంగా మారాయి. ఒక లెక్క ప్రకారం 2015 నుండి 2020 వరకు మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు సుమారు 6,07,580 కోట్లు రాయితీలు ఇచ్చింది. ఇదిగాక కార్పొరేట్ సంస్థలు పన్ను ఎగవేత కారణంగా ప్రభుత్వ ఖజానాకు దాదాపు మరో 20 లక్షల కోట్లు గండిపడింది. ఆ విధంగా కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు ప్రజలపై విపరీతమైన భారాలు మోపి కార్పొరేట్లకు వరాల జల్లు కురిపించి వారి సేవలో కేంద్ర ప్రభుత్వం లీనమైంది. వాస్తవం ఇది కాగా పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం సంపన్నుల పై ఉంటుంది తప్ప సామాన్యులకు ఏమి కష్టం కాదని స్వయాన ఉత్తరప్రదేశ్ మంత్రివర్యులు చెప్పటం హాస్యాస్పదం.
డీజిల్ ధరల పెంపు ఆర్టీసీపై ప్రభావం:
2014లో మోడీ ప్రభుత్వం వచ్చే నాటికి లీటరు డీజిల్ ధర రిటైల్ మార్కెట్లో 56.71 రూపాయలు ఉంది. ప్రస్తుతం అది 102 రూపాయలకు చేరింది. అంటే దాదాపు ఈ ఏడు సంవత్సరాల కాలంలో లీటరు డీజిల్ పై 55 రూపాయలు అదనపు భారం మోపి రవాణా రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. దీనితో టీఎస్ ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడినది. టీఎస్ ఆర్టీసీ వివిధ రూట్లలో పదివేల బస్సులతో రోజువారి 30 లక్షల కిలోమీటర్లు తిప్పుతూ సుమారు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తుంది. ఈ ఏడు సంవత్సరాల కాలంలో సుమారు 140.40 కోట్ల లీటర్ల డీజిల్ వాడింది. ఫలితంగా ఆర్టీసీపై పడిన అదనపు భారం, (1). 2014 డీజిల్ ధర తో స్థిరీకరించి గత ఏడు సంవత్సరాల కాలంలో ఏటా డీజిల్ ధర పెరుగుదలతో పోల్చినప్పుడు పెరిగిన భారం సుమారు 1921 కోట్లు రూపాయలు, (2). ఈ కాలంలో టి ఎస్ ఆర్టిసి వాడిన డీజిల్ పై కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ సుంకం సుమారు 2003 కోట్ల రూపాయలు (3). రాష్ట్ర ప్రభుత్వ సుంకం సుమారు 1880 కోట్ల రూపాయలు భారం పడింది. మొత్తంగా ఈ ఏడు సంవత్సరాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో టిఎస్ఆర్టిసి ఆదాయాలను సుమారు 5,814 కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి. ఇంత చేసి దొంగే దొంగ దొంగ అన్న చందంగా టి ఎస్ ఆర్ టి సి అసమర్థ ఆర్టీసీ గా ప్రభుత్వాలు ముద్రవేసి నిందిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5,814 కోట్ల రూపాయలు లూటీ చేయకుండా ఉండి వుంటే టీఎస్ ఆర్టీసీ కి ఆర్థిక ఇబ్బందులు ఉండేవికాదు. తగిన ఆదాయాలు లేవనే నెపంతో హైదరాబాదు నగరములో సుమారు 800 బస్సులు రద్దు చేసిన కారణంగా సాధారణ ప్రయాణీకులు, విద్యార్థులు, చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురి చేయబడినారు.
పి వైష్ణవి అనే విద్యార్థిని వారి ఊరి నుండి బస్సు నడపడం రద్దు చేసినందున ప్రైవేట్ ఆటోలో చెల్లించే ఛార్జీల స్తోమత లేనందున స్కూలుకు వెళ్లలేక పోతున్నాను అని సీజేఐ ఎన్.వి రమణ గారికి లేఖ రాస్తే సీజేఐ గారు టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్ గారికి లేఖ వ్రాస్తూ ఊరికి బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని కోరారు. వెంటనే యం.డి సజ్జనార్ గారు బస్సును పునరుద్ధరించడం మనకు ఏం తెలియజేస్తున్నది?. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల నిర్వాకంతో లక్షల మంది విద్యార్థులు, సామాన్యులు, చిరుద్యోగులు, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
విమాన ఇంధన ధరలు
భారతదేశంలో సంపన్నులు వాడే విమాన ఇంధనం (ఏవియేషన్ ట్రిబ్యూన్ పూయల్ ఎ.టి.ఎప్/జెట్ పూయల్) లీటరు ధర 79 రూపాయలు ఉంటే అతి సామాన్యులు వాడే పెట్రోల్ ధర 105.84 రూపాయలు ఉంది. ఇది విమాన ఇంధన ధరలతో పోల్చితే సుమారు 33 శాతం ఎక్కువగా ఉంది. అయితే విమాన ఇంధనం ధర దాదాపు పెట్రోల్ ధర కంటే అతి ఖరీదైనదిగా ఉండాలి. కానీ విమాన ఇంధనం పై అతి తక్కువ ఎక్సైజ్ సుంకం వేసి సాధారణ ప్రజలు, చిరు ఉద్యోగులు వాడే పెట్రోల్ పై మరియు ఆర్టీసీ వెహికిల్స్ ఇతర రవాణా వాహనాలు వాడే డీజిల్ పై అధికంగా పన్నులు విధించడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నీచమైన చర్య.
ఈ మొత్తం పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గించడం సాధ్యమేనని రుజువు అవుతోంది. అలా చేయటానికి బదులు కుట్ర పూరిత రాజకీయ ప్రయోజనాలతో నామ మాత్రంగా సుంకాలు తగ్గించడం ప్రజలను మోసగించడం తప్ప మరొకటి కాదు. ఈ తగ్గింపు కూడా ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలలో పెద్ద ఎదురుదెబ్బ తగిలిన తరువాత చేసింది. వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలనే కుట్ర ఇందులో దాగి ఉంది. కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన భారతీయ ఓటర్లను ఇలాంటి కుట్రలతో మోసగించాలను కోవటం పొరపాటు అని రానున్న కాలంలో ప్రజలు తీర్పు నివ్వాలి. అది ఇష్టారీతిగా వ్యవహరించే ప్రభుత్వాలకు సరైన గుణపాఠం అవుతుంది. తెలంగాణతో సహా దేశంలోని ప్రజలంతా రానున్న కాలంలో కుట్రపూరిత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే వారికి తగిన శాస్తి చేయవలసిన అవసరం ఉంది.
- పవణ్ కళ్యాణ్ కుడిధల