Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నానాటికీ పెరిగే ఖర్చులు, గిట్టుబాటు కాని మద్దతు ధరలతో, పంట రుణాలు, పంటల బీమా, ఇన్-పుట్ సబ్సిడీలు అందక రైతులు ఇప్పటికే సతమతమవుతున్నారు. భారత రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి గండికొడుతూ, పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించి మరీ సన్నకారు, చిన్న, కౌలు రైతుల పాలిట ఉరితాళ్ళు కాగల మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. వాటి పర్యవసానాలు అప్పుడే అనుభవంలోకి వస్తున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వ, ప్రయివేట్ మార్కెట్ యార్డులను, వ్యవస్థలను నిర్వీర్యపరుస్తూ అంబానీ రిలయన్స్, అదానీ ఫార్చ్యూన్, మెట్రో, మోర్ వంటి బడా కార్పొరేట్ సంస్థలకు ఎమ్.ఎస్.పి.తో నిమిత్తం లేకుండా ఆరుగాలం కష్టించి పండించిన ఉత్పత్తులను విధిలేక తక్కువ ధరలకు అమ్ముకోవలసిన దుస్థితి కల్పిస్తున్నారు. 175లక్షల టన్నుల ఎఫ్.సి.ఐ. గోదాములను, 35లక్షల టన్నుల సి.డబ్ల్యు.సి. గోదాములను ప్రయివేట్ వారికి కట్టబెడుతూండటమేకాక, రైతుల నుండి పంటలను ప్రత్యేకంగా ధాన్యాన్ని సేకరించేందుకు ఇటీవల కేంద్రం కొత్త నిబంధనలను తెచ్చి, రైతాంగానికి అయోమయ స్థితిని కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలు అమలుకాని అనుభవాలు ఉన్నాయి. రబీ పంటకు సంబంధించిన పైకం నెలలు గడచిపోతున్నా అందని చేదు అనుభవముంది. ఈ పరిస్థితిలో ప్రస్తుత ఖరీఫ్ ధాన్యం అమ్మకాల గురించి రైతాంగం చాలా ఆందోళన చెందుతోంది.
రైతులకు మద్దతు ధరలు విధిగా అందాలన్న అంశం లేకుండా, రైతులకు సరైన రక్షణ కల్పించని కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం వలన రైతులు తీవ్రంగా నష్టపడబోతున్నారు. సరుకు నిల్వ పరిమితులను ఎత్తివేయడమేకాక, రైతుల నుండి కొన్న ధాన్యం, మినుములు, పెసలు, కందులు మున్నగు వాటి ధరల పైన దాదాపు రెట్టింపు మార్జిన్ వేసుకొని అమ్ముతున్న ధరలకు...ఏటా 50శాతం వరకు అధికంగా ధరలు పెంచుకోవడానికి కార్పొరేట్/వ్యాపార సంస్థలకు చట్టబద్ధ అనుమతి ఇచ్చినదే నిత్యావసర వస్తువుల చట్టం-2021. దీని వలన రైతులకు పిసరంత ప్రయోజనం లేకపోగా పేద, సామాన్య వినియోగదారుల పైన పెను భారం పడుతుంది. గత కొంత కాలంగా నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్న పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. మోడీ ప్రభుత్వం ఒకవైపున ప్రతి బడ్జెట్లో దాదాపు లక్ష కోట్ల రూపాయల మేరకు ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్-కస్టమ్స్ సుంకాల రాయితీల ద్వారా బడా, కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరుస్తోంది. మరోవైపున మోపెడ్, స్కూటర్, మోటార్ సైకిల్ వంటివి సామాన్య ప్రజల ప్రయాణ సాధనాలన్న వాస్తవాన్ని విస్మరించి పెట్రోల్, డీజిల్ పైన విపరీతంగా ధరలు పెంచుతోంది. వంటగ్యాస్ పైన ధరలను దాదాపు రెట్టింపు స్థాయికి తీసుకెళుతోంది.
ఇరిగేషన్ ప్రాజెక్టులపైన వేలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కల్పించబడిన సాగు నీటిని తక్కువ నీటి తీరువాతో రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. రైతు తన సొంత భూమిలో, సొంత ఖర్చుతో బోరులు వేసి, భూగర్భ జలాలను వెలికితీసి పంటలు పండిస్తూ దేశానికి మేలు చేకూరుస్తూ వున్నందుననే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విధానం వచ్చింది. పేద, బలహీన వర్గాలకు తక్కువ టారిఫ్తో అందించబడుతున్న విద్యుత్ సౌకర్యాన్ని మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన నిలుపుదల చేయించేందుకు పూనుకుంది. విద్యుత్ సంస్కరణల పేరుతో, 11 రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినా విద్యుత్ చట్టాన్ని తెచ్చింది. లక్షల, కోట్ల రూపాయల ప్రజాధనంతో అభివృద్ధి చేయబడిన విద్యుత్ రంగంలోని సంస్థలను కారుచౌకగా అదానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టుతోంది. రైతులకు కనీస మద్దతు ధరలు ఇచ్చేందుకు కృషి చేయలేదుగాని... ఉచిత వ్యవసాయ విద్యుత్, పేద వర్గాల గృహ విద్యుత్ రాయితీల మొత్తాలను ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలంటూ కేంద్రం పెట్టిన నిబంధన వలన రాష్ట్రంలో రైతాంగానికి, పేదలకు అత్యంత తీవ్రంగా నష్టం చేకూరుతుంది.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి (సి2) 50శాతం అదనంగా కలిపి, చట్టబద్ధ కనీస మద్దతు ధరలను ప్రకటించుతామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం తీరా అధికారం చేపట్టిన దరిమిలా అలా చేయడం సాధ్యం కాదని సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. కేంద్రం ప్రకటించుతున్న ఎం.ఎస్.పి. ధరకు చట్టబద్ధత లేకపోవడం వలన దేశంలో యిప్పటి ధరకు కేవలం 6శాతం మంది రైతులకు మాత్రమే ఎం.ఎస్.పి. వలన ప్రయోజనం చేకూరుతూందని ప్రభుత్వం లెక్కలే చెబుతున్నాయి. స్వామినాథన్ సిఫార్సు సి2+50శాతం అమలు కానందువలన రైతులకు ఏటా సుమారు 3లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. అందువల్లనే సంయుక్త కిసాన్ మోర్చా ఈ సిఫార్సును అమలు చేయాలని గట్టిగా పట్టుబడుతోంది. పలు దశాబ్దాల కాలంలో కార్మికులు సంఘటితంగా పోరాడి సాధించుకొన్న హక్కులకు, ప్రయోజనాలకు గండికొడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను బుట్టదాఖలు చేసి, కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా 4 లేబర్ కోడ్లను తీసుకు వచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని కార్మిక సంఘాలు ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
కోట్లాది ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం, ప్రభుత్వరంగ సంస్థలు తీసుకొన్న రుణాలు, సొంత వనరులు మరియు కార్మికులు, ఉద్యోగుల శ్రమతో, స్వేదంతో అభివృద్ధి చేయబడ్డ ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అదానీ, అంబాని వంటి బడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోడి ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతూ ఉంది. లక్షలాదిమంది విద్యార్థులతో సహా తెలుగు ప్రజలు, పోరాడి, దాదాపు 16మంది యువకులు అమరులై సాధించుకొన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా, అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిస్సిగ్గుగా అమ్మివేస్తున్నది. సుమారు 22 వేల ఎకరాలతో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటును కేవలం 30 వేల కోట్ల రూపాయలకు అమ్మివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తొందరపడు తోంది. దేశంలో రెండవ అతి పెద్ద ఆయిల్ కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బి.పి.సి.ఎల్) సంస్థకు దాదాపు 7లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆస్థులుండగా సుమారు 50 నుండి 60వేల కోట్ల రూపాయలకు అమ్మివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. రైల్వేలు, జాతీయ రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టులు మొదలగునవి కాక పల్లెలలో, పట్టణాలలో ఖాళీగా వున్న స్కూళ్ళు-కాలేజీల స్థలాలు, సామాజిక ఉమ్మడి స్థలాలు/భూములు వంటి వాటిని కూడా 'మానిటైజేషన్' చేసేందుకు కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. ప్రజా సంపదను కొద్దిమంది అదానీ, అంబానీ వంటి ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం చూస్తూ ఉంటే మోడీ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీని మించిపోతోంది. కార్పొరేట్లకు ఊడిగం చేయడంలో మోడీ ప్రభుత్వం తరిస్తూ వుంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టులను, ముంబై ఎయిర్ పోర్టుతో సహా 6 ఎయిర్ పోర్టులను గౌతమ్ అదానీకి కట్టబెట్టిన తీరు ఇందుకు ప్రత్యక్ష తార్కాణం. అత్యంత విలువైన అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం కొరకు తరతరాలుగా జీవనాన్ని కొనసాగిస్తూన్న ఆదివాసీ ప్రజలను బయటకు గెంటేందుకు మోడీ ప్రభుత్వం అటవీ సవరణ చట్టాన్ని తీసుకురావడం అన్యాయం. కార్పోరేట్టు యధేచ్ఛగా అటవీ సంపదను ప్రత్యేకంగా బాక్సైట్ వంటి విలువైన ఖనిజ సంపదను దోచుకోడానికి ఈ అటవీ సవరణ చట్టం తీసుకురాబడింది.
మోడీ ప్రభుత్వం తీసుకొంటున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తూ ఉన్న పౌర సంఘాలను, మేధావులను, సామాజిక ఉద్యమకారులను వేధిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ, భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూంది. లఖింపూర్ ఖేరిలో చోటుచేసుకున్న సంఘటనలు యిందుకు ప్రత్యక్ష తార్కాణం. సుప్రీమ్ కోర్టు మందలించినప్పటికీ, ఫోరెన్సిక్ లేబొరేటరీ, కేంద్ర హోం సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, అతని అనుచరులు తుపాకులతో కాల్చారన్న వాస్తవాన్ని నిర్ధారణ చేసినప్పటికీ, నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు ఆ సంఘటనలో చనిపోయినప్పటికీ, ఇప్పటి వరకు యూపీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వం నుండి అజరు మిశ్రాను బర్తరఫ్ చేయకపోవడం సిగ్గుచేటు. మన దేశవ్యాప్తంగానే కాక, విదేశాలలో ఉన్న భారతీయులు, పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ మోడీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూండటం ఎంతమాత్రం క్షమార్హం కాదు. అనేక విధాలుగా ఆటంకాలు కల్పిస్తున్నప్పటికీ, అసత్య ప్రచారం చేస్తున్నప్పటికి, రెచ్చిపోకుండా శాంతియుతంగా జాతిపిత మహాత్మాగాంధి చూపిన బాటలో దాదాపు సంవత్సరంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దాదాపు 400 రైతు సంఘాలు ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. లక్ష్యాలను సాధించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని చాలా స్పష్టంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు తెలియచేయాలని సంయుక్త మోర్చా, ఆలిండియా ఐక్యవేదిక, ఆదివాసీ, యువజన, మహిళా కళాకారుల సంఘాలన్నీ పిలుపు నిచ్చాయి. యావన్మంది ప్రజలు ఈ నిరసన కార్యక్రమా లలో పాల్గొని, తాను అనుసరిస్తున్న దుష్ట విధానాలను మోడి వెనక్కు తీసుకొనేలా, ఒత్తిడి తెచ్చేందుకు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.
- వడ్డే శోభనాద్రీశ్వర రావు