Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్నటిదాకా కరోనా వైరస్‌తో అల్లకల్లోలమై, లక్షలాది మంది దేశీయులను కోల్పోయినా, తన వ్యాపార సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయినా, కుంగిపోకుండా తేరుకుని, మనోనిబ్బరంతో ఆ దేశం ముందడుగేస్తున్నది. ఆర్థిక వనరుల సాధన కోసం తన వ్యాపార సంస్థలకు ఊతమిచ్చి, భయం భయంగా బతుకీడుస్తున్న తన దేశ ప్రజలకు భరోసా కల్పిస్తూ, తమ తమ పనుల్లో పునర్నిమగమయ్యేలా ప్రోత్సహిస్తూ, ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా నిలిచింది. అదే ఉహాన్ నగరం పేరుతో విశ్వవ్యాప్తంగా మారుమోగి, డ్రాగన్‌గా పేరుగాంచిన చైనా దేశం. కరోనా ప్రభావంతో ప్రపంచం తలకిందులుకాగా, అన్ని దేశాలు ఆర్థిక పురోగతిని వీడి, మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ నెం.1గా వెలుగొందుతున్న అమెరికా కూడా ఇందుకతీతం కాకపోగా, ఇప్పటికీ కొలుకోలేకపోతున్నది. కానీ, చైనా మాత్రం వీటన్నీటిని వీడి, చక చకా ఆర్థిక పురోగతి సాధిస్తూ, జనాభాలోనే కాదు అభివృద్ధిలో సైతం ముందంజలో ఉన్నానని నిరూపిస్తున్నది. గడిచిన కొద్దీ మాసాల్లో చైనా సంపద మూడురెట్లు పెరిగిందని, అమెరికాను దాటుకుని చైనా మొదటిస్థానానికి చేరిందని 'బ్లూమ్ బర్గ్' కథనం పేర్కొంది. ''మెక్ కిన్సె అండ్ కో'' అనే పరిశోధనా విభాగం 10దేశాల బ్యాలెన్స్ షీట్లను పరిశీలించి ఈ నివేదిక రూపొందించింది. ప్రపంచ ఆదాయంలో 60శాతం కన్నా ఎక్కువ కలిగిన ఈ పది దేశాల ఆర్థిక వ్యయాలను పరిశీలిస్తున్న మెక్ కిన్సె అండ్ కో ఈ వివరాలను వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం 60శాతం సంపద కలిగిన దేశాలు అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడన్లు. ప్రపంచ నెట్ వర్త్ 2021లో అనూహ్యంగా 514 ట్రిలియన్ డాలర్లకు చేరిందని, ఇది 2000లో 156 ట్రిలియన్ డాలర్లు అని తెలిపింది. ఇందులో చైనాకు అత్యధిక వాటా లభించిందని, ప్రపంచ ఆదాయంలో దాదాపు మూడో వంతు చైనా సొంతమైందని వివరించింది. 68శాతం గ్లోబల్ నెట్ వర్త్ రియల్ ఎస్టేట్‌లోనే ఉందని తెలిపింది. మెకన్సీ ఏజెన్సీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2021లో సంపద 156 ట్రిలియన్ డాలర్ల నుంచి 514 ట్రిలియన్ల డాలర్లుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దాంట్లో ఒక్క చైనాలోనే సంపద మూడో వంతు పెరిగినట్లు తేల్చేశారు. 2000సంవత్సరంలో ఏడు ట్రిలియన్ల డాలర్లు ఉన్న చైనా సంపద ఇప్పుడు 120 ట్రిలియన్ల డాలర్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా చేరిన తర్వాత ఆ దేశ సంపద దూసుకెళ్తున్నట్లు మెకన్సీ తన రిపోర్ట్‌లో తెలిపింది. మరో వైపు అమెరికాలో ప్రాపర్టీ విలువలు పెరిగినా.. ఆ దేశ సంపద 90ట్రిలియన్ల డాలర్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 68శాతం నికర సంపద మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెషినరీ, ఎక్విప్మెంట్, ప్రాపర్టీ, పేటెంట్స్ లాంటి వద్ద కొంత బ్యాలెన్స్ సంపద ఉన్నట్లు గుర్తించారు. ఈ నివేదిక ప్రకారం రెండు దశాబ్దాల్లో నికర ఆస్తుల విలువ అమాంతంగా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా స్థూల జాతీయోత్పత్తి పడిపోయింది. దీని ద్వారా ఆస్తుల విలువ పెరిగి.. వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. ఆస్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయి దీర్ఘకాల సగటు కంటే దాదాపు 50 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంపద వృద్ధి చెందడం పలు దుష్ఫ్రబావాలకు దారి తీసే అవకాశా లున్నాయి. ద్రవ్యోల్బణానికి మించి ఈ ఆస్తుల విలువ పెరగడం అనేక ప్రశ్నలను రేకేత్తిస్తున్నది. రియల్ ఎస్టేట్ విలువ పెరగడం వల్ల నివాసా లను అనేక మంది కొనుగోలు చేయలేక ఇబ్బందు లకు గురవుతున్నారు. దీని వల్ల ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది. 2008లో అమెరికాలో గృహాలకు సంబంధించి బబుల్ ఇలాగే పేలి పోయింది. దీనివల్ల ప్రాపర్టీ డెవలపర్స్ కూడా ఇబ్బంది పడవచ్చు. ప్రపంచ జీడీపీని పెంచడం కోసం ఉత్పాదకతపై పెట్టుబడులు పెట్టడమే దీనికి ఏకైక పరిష్కారంగా తేల్చి చెబుతుంది మెకన్సీ నివేదిక.
-ఇ. సంజీవ రెడ్డి, సెల్: 9948639636