Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోజనంలో ఒకటే తినం. ఒక కూర, ఒక అన్నం విడివిడిగా తినం. రెండూ కలపుకుని తింటాం. ఏది తిన్నా ఉప్పు, కారం తప్పనిసరి. మనసుకు నచ్చే విధంగా చెప్పే విధానమే ఉప్పు కారం. అవి సమపాళ్ళలో ఉండాలి. అందులోని పోషక విలువలే సైన్సు. సమతుల ఆహారం అంటే అన్నింటినీ కలుపుకుని ఉండేదే! అందువల్ల, ఇప్పుడు ఒక్క సైన్స్ - విడిగా మాట్లాడటం వల్ల లాభం ఉండదు. అన్నంతో పాటు పప్పు, పులుసు, చారు, దప్పడం, అప్పడం వగైరా అన్నీ ఉండాల్సిందే. తినేవాళ్ళకు గుడ్డూ, చేప, మాంసం తప్పనిసరే. దేశంలో ప్రజాస్వామ్యమన్నా ఇదే! అన్ని జాతులు, అన్ని వర్గాలు, అన్ని అభిప్రాయాలు, అన్ని ఆలోచనా విధానాలు కలిసే ఉంటాయి. ఉండాలి కూడా! అందుకే, అన్ని రంగాలు, అన్ని విషయాలు కలగలిపి 'వైజ్ఞానిక స్పృహ'తో చెప్పడం ఉండాలి. అది సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, చరిత్ర కావచ్చు. సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవనం ఏదైనా కావొచ్చు. అన్నింటికీ వెన్నెముక అదే! వైజ్ఞానిక స్పృహ లేనిది ఏదీ నిలవదు.
ఒకప్పటి చార్వాక దర్శనం ఎందుకు ఆదర్శమవుతోంది? బుద్ద దర్శనం ఎందుకు ప్రపంచమంతా వ్యాపించింది? అంటే కార్యకారణ సంబంధం వల్లే.. హేతువుతో వైజ్ఞానిక దృక్పథంతో అవి వెలువడ్డాయి గనక! ప్రపంచంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని అవి స్పష్టం చేశాయి.. చేస్తున్నాయి గనక!! హేతువును నిలబెట్టాలని చూశాయి గనక.. ఈ రోజు ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల సారాంశం కూడా అదే కదా? మతాలు ప్రతిపాదించిన సృష్టి సిద్ధాంతమూ, ఆయా మతాల మత గ్రంథాలూ ఎందుకు విమర్శలకు గురవుతున్నాయీ? అంటే, ఎదగని మనుషుల ఎదగని మనస్తత్వాలు, విశ్వాసాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి! అందువల్ల నిజం తెలిసినా అబద్ధాన్ని నమ్ముతామనే వారేమైనా జ్ఞానులవుతారా? అజ్ఞానులవుతారా? ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన సమయం! అందుకే.. అన్నింటికీ అర్థాలు, నిర్వచనాలు మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు చరిత్ర అంటే వేటగాళ్ళు రాసింది కాదు, వేటాడబడ్డవాళ్ళు రాసింది. ''సింహాలు రాయడం ప్రారంభించనంత వరకు వేటగాళ్ళు రాసిందే చరిత్రగా చలామణి అవుతుంది'' అన్నది ఒక ఆఫ్రికన్ సామెత. ఆటవికులు, అణగారిన జాతుల వారు సత్యాన్వేషణలో సింహాల్లా గర్జించనంత వరకు అసలు చరిత్ర మరుగున పడి ఉంటుంది. అన్ని రకాల అభిప్రాయాలకు గౌరవం దక్కాలని మనకుంటుంది. నిజమే! కానీ, కొందరు అబద్ధాలకు నిజాల పాలిష్ కొట్టి తళతళ మెరిపించుకుంటూ వస్తారు. మరి అలాంటి మోసగాళ్ళ ఆటలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎవరిదీ? బాధ్యతగల పౌరులదే కదా?
''ప్రజల మెదళ్ళను ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రతి సంవత్సరం వందల బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నా''రని కుండబద్దలు కొట్టి చెప్పాడు నోమ్ఛాస్కీ. కొందరు దేవుణ్ణి మొక్కుతారు. మరికొందరు పశువుల్ని, పక్షుల్ని, వృక్షాల్ని పూజిస్తారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మాత్రం బజారుపాలు చేస్తారు. అన్నం, నీళ్ళూ ఇవ్వకుండా బలవంతంగా చంపేస్తారు. ఆధ్యాత్మికంగా కాదురా బాబూ సామాజికంగా ఆలోచించండి.. అని చెప్పాలనిపిస్తుంది! ప్రఖ్యాత తెలుగు రచయిత గుడిపాటి వెంకటాచలం తన రచన 'దైవమిచ్చిన భార్య'లో ఏమన్నాడో చూడండి. ఆయన హేతువాది కాదు.. ''హిందువుల అబద్దం, మోసం, క్రౌర్యం, బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం.. ఇవన్నీ నన్ను ఎంతో కలతపెట్టాయి. పసుపు ముద్దల్ని, రాళ్ళనీ, పటాల్ని, దేవుళ్ళు అనుకుని పూజ చేయడం హైన్యమనిపించింది. నాకు నీతి వర్తన మీద పట్టు ఎక్కువయ్యింది. ఈ అబద్దపు నీతికాక, నిజమైన నీతి కనుక్కుని, దాన్ని జీవితంలో అనుష్టించాలని దృఢ నిశ్చయం చేసుకున్నాను'' అని అన్నారాయన. దేవుడున్నాడనేది అబద్దం! దేవుళ్ళెవరూ లేరన్నది సత్యం. 'దేవుడు నమ్మిన వారికి మాత్రమే ఉన్నాడు. నమ్మని వారికి లేడు..' అనేది వంచన. నమ్మినా, నమ్మకపోయినా దేవుడు లేడన్నది నిజం! ఏ గ్రంథమైనా చదివితే జ్ఞానం కాకుండా పుణ్యం వస్తుందని చెప్పేవాణ్ణి నేరుగా తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి. అలాంటి గ్రంథాల్ని ఏం చేయాలో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా? క్రీస్తు జన్మదినంగా చెప్పబడే డిసెంబర్ 25 కూడా శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి లాగా ఊహాజనితమైందేనని నిర్దారణ జరిగిందని తెలుసుకుంటే మంచిది.
ఆఫ్రికాలోని జాంబియన్ చర్చ్ పాస్టర్ జేమ్స్.. తనను తాను 'దైవదూత'గా భావించుకున్నాడు. ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి పెద్ద సాహసమే చేశాడు. తనను సజీవ సమాధి చేయాలని, తను మళ్ళీ తిరిగి లేచివస్తానని.. తన అనుచరులకు చెప్పాడు. అందరూ చూస్తూ ఉండగానే అనుచరులు అతని కాళ్ళూ, చేతులూ కట్టేసి పూడ్చిపెట్టారు. ఒకటి రెండు రోజులు గడిచినా అతను లేచిపైకి రాలేదు. అనుమానంతో అనుచరులు తవ్వితీస్తే పాస్టర్ జేమ్స్ చనిపోయి ఉన్నాడు. ఇలాంటి మూఢనమ్మకాలు ఆఫ్రికాలో సర్వసాధారణమైపొయ్యాయి. చనిపోయినవాడు లేచి రావడం రాసుకున్న కథల్లో తప్ప, నిజంగా ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. అది ఏసు క్రీస్తు విషయంలోనైనా అంతే. ఇలాంటి మూఢ నమ్మకాలు ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికీ పరిమితమై లేవు. అలాంటి విశ్వాసాలు విశ్వవ్యాప్తం. అయినా ఈ విషయంలో భారతదేశం మాత్రం నిస్సందేహంగా అగ్రస్థానంలో ఉంది. అమ్మవారు పూనింది. దేవేరి వచ్చింది.. అని ఊగిపోవడం, దేవుడు కలలో కనబడ్డాడనడం, దెయ్యం పట్టిందనడం, గెంతులు వేయడం, అరవడం, ఏడవడం, సైతాను పట్టిందని తాయత్తు కట్టుకోవడం, నెమలి ఈకలతో, కొరడాలతో కొట్టించుకోవడం వగైరా.. ఇలా చేస్తున్న వాళ్ళందరూ మానసిక రోగులు. వీరితో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమాల్లో స్త్రీలు ఎక్కవగా ఉంటారు. పురుషులు ఉండరని కాదు కాని, తక్కువగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి 'హిస్టీరియా' అనే మానసిక వ్యాధి ఉన్నట్టు! టీవీల్లో, సోషల్ మీడియాలో కొందరు అంధవిశ్వాసాల సన్యాసులు / సన్యాసినులు జనాలకు చిట్కాలు నూరిపోస్తుంటారు. తీరని కష్టాల్లో ఉన్నవారు ఉప్పుతో ఇలా చేస్తే అరవై నిముషాల్లో (గంటలో) మీ కష్టాలు తీరిపోయి డబ్బు మీ ఇంటికి వచ్చి పడుతుంది అని చెప్తారు. ఇందులో ఉన్న ఆధ్యాత్మికత, సంప్రదాయం ఏమిటో వారికి తప్ప ఎవరికీ తెలియదు. డబ్బు ఆశ చూపి జనాల్ని బుట్టలో వేసుకోక పోతే... అది వారే ఆచరించి, అంబానీలో ఆదానీలో అయిపోవచ్చుకదా? ''నాతో శృంగారం చేస్తే నా శక్తులన్నీ మీలో ప్రవేశిస్తాయి'' అని ప్రకటించుకుని పదకొండు మంది మహిళల్ని వశపరుచుకున్న బురిడి బాబా - విశ్వచైతన్య విషయం 2021 అక్టోబర్లో వెలుగులోకి వచ్చింది. అతని నుండి పోలీసులు 26లక్షల నగదు, అతని రెండో భార్య పేర ఉన్న 1.30కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. ఈ విషయాలన్నీ నల్లగొండ ఎస్పీ ప్రెస్కు తెలియజేశారు. దివ్యశక్తుల పేర జనాన్ని మోసం చేయడానికి ఈ దేశంలో కేటుగాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమంటే, మోసపోవడానికి సిద్ధంగా మహిళలే ఎక్కువగా ముందుకొస్తున్నారు? మతం పేరుతో కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్న ఆధ్యాత్మిక వ్యాపారస్తుల్ని నమ్మి, సామాన్య జనం ధన, మాన, ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. మతం పేరుతో, భక్తి పేరుతో దివ్య శక్తుల పేరుతో జనం డబ్బు ఖర్చు చేయడం మాని.. అదే డబ్బుతో కనీసం జీవిత భీమా చేయించుకుంటే వారికి లాభదాయకంగా ఉంటుంది. వారి మరణానంతరం వారి కుటుంబ సభ్యులైనా సుఖపడతారు!
సంప్రదాయ వాదులు మన తిండిని కూడా మనల్ని సక్రమంగా తిననివ్వరు. అన్నం తింటున్నప్పుడు చెయ్యి నాకడానికి క్కూడా ఓ''శాస్త్రం'' చెపుతారు. మనువాదుల దిక్కుమాలిన 'చేయి నాకుడు శాస్త్రం' విని పొరపాటున నమ్మారో.. ఇక అంతే! అన్నం తినేప్పుడు అరచేయిని ఎటువైపు నాకితే ఏమవుతుందో నన్నది చెప్పి డబ్బులు లాగుతారు. అది వారి అస్థిత్వాన్ని చాటుకోవడానికే తప్ప, సామాన్య జనానికి ఏమాత్రం పనికిరాదు. కొందరు 'ఆవకాయ శాస్త్రం' చెపుతారు. ఎలాగంటే... ఆవకాయ నవగ్రహ స్వరూపమని చెప్పి విపులంగా వివరిస్తారు కూడా. ఆవకాయలోని ఎరుపు రంగు రవికి అంటే సూర్యుడికి ప్రతిరూపమని, ఆవకాయలోని వేడి తీక్షణత-కుజుడని, ఆవకాయలోని వేసే నూనె, ఉప్పు - శనికి ప్రతిరూపాలని చెపుతారు. ఆవకాయలో వేసే మెంతులు, పసుపూ గురువని.. అలాగే మామిడికాయలోని ఆకుపచ్చరంగు బుధుడని, అందులోని పులుపు శుక్రుడనీ చెపుతారు. ఇంకా ఆవకాయతినగానే కలిగే అలౌకికానందం కేతువని, తిన్నాకొద్దీ తినాలనే ఆశ రాహువని, ఆవకాయ కలుపుకునే అన్నం - చంద్రుడనీ కూడా చెపుతారు. అంతే కాదు, ఆవకాయ పళ్లెంలో ఎక్కడ వేసుకుని తినాలో కూడా చెపుతారు. ఆవకాయ కంచంలో ఆగేయమూల వేసుకుని నవగ్రహస్త్రోత్రం చెప్పుకుని తింటే సమస్త గ్రహ దోషాలు మటుమాయమవు తాయని నమ్మబలుకుతారు. నమ్మిన వాళ్ళు తమకు తాము చెవుల్లో పూలుపెట్టుకున్నట్టే. ఇలాంటివి వింటున్నప్పుడు మనువాదులు తెలియకుండా వేటాడు తున్నారని గానీ, సామాన్య ప్రజలు వేటాడబడు తున్నారని గానీ ఏమాత్రం అనిపించదు. తమకు తెలియని ఏదో గొప్ప జ్ఞానం బోధిస్తున్నారన్న భ్రమ కల్పిస్తారు. అసలైతే ఇలాంటివన్నీ పిచ్చివాగుడు కింద జమకట్టి జాగ్రత్తగా ఉన్నవాడే వివేకవంతుడు. అరబ్షేక్లు గాని, బిల్గేట్స్గాని, పోనీ మన అంబానీ ఆదానీలు గాని ఇలా ''శాస్త్రోక్తంగా'' చేయి నాకి అంతవాళ్ళయ్యారా? ఇలాంటి పిచ్చి శాస్త్రాలు చెప్పేవాడే గుడ్డ సంచీ ఓటి పట్టుకుని ఇల్లిల్లు తిరుగుతుంటాడు.. గమనించండి!
ఉత్తరప్రదేశ్లో గంగా యమున నదుల మధ్య ఉన్న నగరం ఫతేపూర్. అక్కడ ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క పండితుడి చొప్పున 211 పండితులు 211 ఆవులకు శ్రీమద్భాగవత కథను వినిపించారు. పశువులకు, గీత వినిపించినా, సంగీతం వినిపించినా వాటిలోని సారాన్ని గ్రహించే మేధస్సు, అనుభూతి చెందే మనస్సు ఆవులకు లేదన్న విషయం మూర్ఖ పండితులకు లేకపోయె కదా? ఏ తల్లిదండ్రులైనా వారి జీవిత కాలంలో ఏ దేవుణ్ణీ ప్రత్యక్షంగా చూసి ఉండరు. అయినా తమ పిల్లలకు బాల్యంలోనే 'అదిగో జేజ, దేవుడు -దండం పెట్టు' అని అబద్దాలతో మౌఢ్యం ఊబిలోకి తోసేస్తారు. ఇక అంతే.. వారు జీవిత కాలం లల్లల్లా అని మూఢ భక్తిలో కొట్టుకు ఛస్తుంటారు. దీనికి బెట్రండ్ రసెల్ సరైన వివరణ ఇచ్చారు. ''భయాల మీద ఆధారపడిందే మతం! చావు భయం, ఓటమి భయం, ఎన్నెన్నో తప్పిదాల భయం, పొరపొచ్చాల భయం. ఈ భయానికి పుట్టిందే క్రూరత్వం. నేను మతాన్ని - భయానికి పుట్టిన రోగంగా పరిగణిస్తాను. అంతే కాదు, మానవ జాతికి దాపురించిన ఒక చెప్పలేని దుస్థితిగా భావిస్తాను!'' అని! అగ్రవర్ణాలు - నిమ్నవర్గాల్ని, తెల్లవాడు - నల్లవాణ్ణి, ఉన్నవాడు - లేనివాణ్ణి, పురుషుడు-మహిళను నిరంతరం వేటాడే పనిని అడ్డు కోవాల్సిందే! వేటాడబడ్డ వాళ్ళు తిరగబడుతున్నారు. కాలం తిరగబడుతోంది. మానవత్వ-సమానత్వపు గాలులు వీస్తున్నారు!
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు