Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జయ జయహౌ కర్షకా
జయహౌ జన శ్రామికా!
నీ కష్టం ఫలించింది
పోరాటం జయించింది
నిను ముంచే ప్రభుత కుట్ర
భగమై తలవంచెన్ ||జయ||
కార్పొరేటు దోపిడీల
పెట్టుబడుల గుట్టులన్ని
నాగలి కర్రుతో లాగి
నడిబజారులో నిలబడి
ఎలుగెత్తి చాటినట్టి
ఎగిరిన జెండావు నీవు ||జయ||
ఆకలి రగిలే కడుపున
అన్నం ముద్దయి నిలిచిన
వెన్నలాంటి మనసున్న
వెన్నెముకవు దేశానికి
నీ వెన్నును విరిచేందుకు
పన్నిన ద్రోహాలనన్ని
కుమ్మెసిన దమ్మునీది ||జయ||
మట్టిపైన మట్టితోని
గట్టిపడిన గుండె నీది
రెక్కల చలనమ్ములోన
చిక్కబడిన చేతనమది
నెత్తురు చిందినగానీ
ధీరత్వము వీడనిమది ||జయ||
నీదారిలో రోడ్డుపైన
మేకులు దింపిన వారిని
నీ నడకను నిర్భందపు
చెరలో తొసిన ఖలులను
మెడలువంచి నినదించెను
సంఘటితపు సమర గళం ||జయ||
ఇది ఎరుపెక్కిన పోరాటం
నియంతలకు గుణపాఠం
శ్రమనుదోచు నరాధముల
దునుమాడే ఆయుధం
సమర శక్తే ప్రజాబలం
అరుణదీప్తి అజరామరం! ||జయ||
- కె ఆనందాచారి