Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొత్తానికి ప్రధాని మోడీ క్షమాపణ కోరారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలనూ రద్దు చేయడానికి నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఆ మేరకు రానున్న పార్లమెంటు సమావేశాలలో చట్టాన్ని చేయబోతున్నట్టు క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఈ మూడు ముక్కలూ చెప్పి అక్కడితో సరిపెట్టివుంటే ఆ ప్రకటనకు ఎంతో కొంత గౌరవం ఉండివుండేది. పోరాడుతున్న రైతుల నమ్మకాన్ని చూరగొని ఉండేది. కాని అలాగే జరిగితే ఇది మోడీ ప్రభుత్వం ఎందుకౌతుంది? మోడీ ప్రకటనలోని మాటల గారడీ బీజేపీ ప్రభుత్వపు కపట నాటకానికి పరాకాష్ట.
ఏదైనా తప్పుచేసి, ఆ తర్వాత దానిని గుర్తించి సరిదిద్దుకోడానికి సిద్ధపడినవారు తప్పు చేసినందుకు క్షమాపణ కోరుతారు. ఇక్కడ ప్రభుత్వం ఏమి తప్పు చేసిందని మోడీ అంగీకరించారు?
ఆ మూడు వ్యవసాయ చట్టాలనూ చేయడం తప్పు అని అన్నారా? లేదు. పైగా ఆ చట్టాలను తమ ప్రభుత్వం చాలా సదుద్దేశంతోనే చేసిందని, అవి రైతులకు చాలా మేలు చేస్తాయని, దీపపు కాంతి లాగా ఆ చట్టాలు స్వచ్ఛమైనవని చెప్పారు. కాబట్టి మోడీ ప్రకటన ప్రకారం ఆ వ్యవసాయ చట్టాలను చేయడం ఏమాత్రమూ తప్పు కానే కాదు.
మరి ఏమిటి తప్పు? ఆ చట్టాలను దేశ రైతాంగం సరిగ్గా అర్థం చేసుకోలేదని మోడీ అన్నారు. అంటే చాలా మంచి చట్టాలైనప్పటికీ వాటిని రైతులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే అసలు తప్పు. అలా వారికి అర్థం అయేలా చేయడానికి దేశంలోని మేథావులందరూ చాలా ప్రయత్నించారట. అయినా ఈ మట్టి (బుర్ర) మనుషులకు అర్థం కాలేదట. అందుకే వాటిని రద్దు చేయాలని పోరాడుతున్నారట.
కాబట్టి చాలా మంచివైన ఆ వ్యవసాయ చట్టాలను రైతులు అర్థం చేసుకోలేకపోవడం, ఆ కారణంగా ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు ఉద్యమాన్ని నడపడం, ఆ క్రమంలో 750మందికి పైగా రైతుల ప్రాణాలు పోవడం - ఇవీ జరిగిన తప్పులు.
అందుకే మోడీ రైతులకు క్షమాపణ చెప్పలేదు. వందలాది రైతుల ప్రాణాలు పోయినందుకు బాధ వ్యక్తం చేయలేదు. ఆ రైతులమీద సైన్యాన్ని, పోలీసులను విచ్చలవిడిగా, చట్ట విరుద్ధంగా ప్రయోగించి నానా ఇక్కట్లపాలూ చేసినందుకు ఇసుమంతైనా విచారం వ్యక్తం చేయలేదు.
ఇంతకీ మోడీ రైతులకు కాకపోతే మరి ఎవరికి క్షమాపణలు చెప్పారు? దేశ జనాభాలో 60శాతం మంది రైతులు, మరో 30శాతం మంది వారికి అండగా నిలిచిన కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. రైతు లకు చట్టాలు అర్థం కాలేదంటే మరి వారి ఉద్యమానికి మద్దతునిచ్చిన వారికీ అర్థం కానట్టే కదా? కాబట్టి తక్కిన వారిని, అంటే ఈ చట్టాలలోని 'మంచి'ని బాగా అర్థం చేసుకుని, వాటిని స్వాగతించిన కార్పొరేట్లను, వారి తైనాతీలను మోడీ క్షమాపణ కోరారు. ఆయన దృష్టిలో ''దేశ్ వాసియో!'' అంటే అంబానీలు, అదానీలు, టాటాలు, ఇంకా ఇంకా అటువంటివారు, వారి అనుంగు భక్తులు మాత్రమే.
వారిని మాత్రం ఎందుకు క్షమాపణ కోరారు? ఆ నల్ల చట్టాలలోని మంచిని రైతులకు బాగా అర్థం అయేలా తమ ప్రభుత్వం చేయలేకపోయింది కనుక క్షమాపణ కోరారు. మోడీ గారి మాటల్లోనే చెప్పాలంటే ''ఎక్కడో మా తపస్సులో లోపం జరిగింది''. మోడీగారు, ఆయన ప్రభుత్వం గత ఏడేండ్లుగా ఎవరి కోసం, ఎవరి కరుణా కటాక్షాల కోసం ఈ ప్రభుత్వాన్ని నడపడం అనే తపస్సు చేస్తున్నారో అందరికీ తెలుసు. నిత్యమూ కార్పొరేట్ల సేవలోనే మునిగి తేల్తూ ఉన్న వైనం అందరికీ తెలిసినదే.
కాబట్టి ఏతా, వాతా మనకు బోధపడేదేమంటే, మోడీగారు ఈ మారు, ఈ నల్ల చట్టాల విషయంలో సరిగ్గా తపస్సు చేయలేక పోయినందు వలన ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నారు. ఆ దీపకాంతి వంటి స్వచ్ఛమైన చట్టాలను రైతులు ఆమోదించేటట్టు చేయడానికి మరోసారి, మరో అనువైన సమయంలో మళ్ళీ తపస్సు చేయడం ఖాయం అని ఈ ప్రకటన ద్వారా మోడీ కార్పొరేట్లకు భరోసా ఇచ్చినట్టే భావించాలి. ఈ సారి మరింత పకడ్బందీగా తపస్సు చేయడానికి బహుశా ప్లాను వేసుకుంటారు (తపస్సు అంటే రైతుల ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి ఉపయోగించాల్సిన పద్ధతులు- అంటే, బల ప్రయోగం, హింస, కాల్పులు, తప్పుడు ప్రచారం, ఉద్యమంలో చీలికలు సృష్టించడం, అనుమతులు నిరాకరించడం వంటివి అన్నమాట. ఈ మారు తపస్సులో ఇంకా అదనంగా గట్టి చర్యలు ఉంటాయన్నమాట).
నిజానికి తపస్సు చేసింది రైతులు, ఏ మాత్రమూ వెనకడుగు వేయకుండా, మొక్కవోని దీక్షను ఆసాంతం ప్రదర్శించినది ఆ రైతులు. ఆ తపస్సు ముందు మోడీ ప్రభుత్వం ఎత్తులేవీ పారలేదు. అందుచేత ప్రస్తుతానికి తోక ముడిచారు. అంతే.
ఈ మోడీ ప్రభుత్వానికి లేశమైనా నిజాయితీ ఉంటే ఆ రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి తమ ప్రభుత్వాలు, తమ నాయకులు చేసిన తప్పుడు పనులన్నింటికీ ఆ రైతులను క్షమాపణ కోరి ఉండాలి. ఆ ఉద్యమంలో అసువులు బాసిన 750మంది రైతన్నల కుటుంబాలనూ క్షమాపణ కోరి ఉండాలి. రైతులు కోరిన విధంగా కనీస మద్దతు ధర గ్యారంటీ చేసే చట్టాన్ని తీసుకువస్తామని కూడా ప్రకటించి ఉండాలి. కాని అలా చేస్తే తమ కార్పొరేట్ సేవకు భంగం కలుగుతుంది కదా! అందుకే ఈ నిజాయితీ లేని, మోసపూరితమైన ప్రకటన చేశారు. మరోసారి తమ నయవంచన స్వభావాన్ని బైట పెట్టుకున్నారు.
ఈ క్షమాపణల డ్రామా కూడా రాబోతున్న యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే అన్నది ప్రజానీకానికి బాగానే అర్థం అయింది. అందుకే రైతులు తమ డిమాండ్ల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఆచరణలో ఆ డిమాండ్లను మోడీ ప్రభుత్వం ఏ విధంగా నెరవేర్చేదీ చూసిన తర్వాతనే ఆందోళన విరమిస్తామని ప్రకటించింది ఇందుకే.
మోడీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఎప్పుడో ఈ దేశ ప్రజలకు చాలా విషయాల్లో క్షమాపణ చెప్పి ఉండాలి. పెద్దనోట్ల రద్దు ప్రహసనానికి, అడ్డగోలుగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఎప్పుడు బడితే అప్పుడు పెంచివేసినందుకు, కరోనా కష్టకాలంలో నాలుగంటే నాలుగే గంటల వ్యవధిలో లాక్డౌన్ విధించి లక్షలాది వలస కార్మికులను అగచాట్లపాలు చేసినందుకు, కరోనా సమయంలో ఆక్సిజన్‌ను కూడా అందించలేకపోయిన వైఫల్యానికి, గోడౌన్లలో కోట్ల టన్నుల ఆహారధాన్యాలు మూలుగుతున్నా, ప్రజలకు వాటిని పంచిపెట్టకుండా ప్రపంచ ఆకలి సూచికలో మన దేశాన్ని అథమ స్థానంలో నిలబెట్టినందుకు - ఇలా పెద్ద చిట్టాయే అవుతుంది. ఇక జాతీయోద్యమాన్ని కించపరిచినందుకైతే వందల క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది. మరి మత విద్వేష చిచ్చులో వేలాదిమందిని బలి తీసుకున్నందుకైతే ఎన్ని క్షమాపణలు చెప్పినా చాలదు.
రైతు ఉద్యమంలో వ్యక్తమైన చైతన్యమే మరింత మహోధృతమైన ప్రజా ఉద్యమంగా మారినప్పుడు ఆ ప్రజలే ఈ తరహా పాలకులచేత అన్ని క్షమాపణలనూ చెప్పించి తీరతారు. ఆ నాడు నాజీల దుర్మార్గాలకు ఆ తర్వాత కాలంలో వచ్చిన పాలకులు క్షమాపణలు చెప్పలేదా? ఆనాటి ఆ దుర్మార్గాలకు చరమగీతం పాడిన శక్తులే రాబోయే కాలంలో కూడా మరోసారి అటువంటి పాత్రను మన దేశంలో నిర్వహించడం ఖాయం.
- ఎం.వి.ఎస్. శర్మ