Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఫీడింగ్ అమెరికా' లాభాపేక్షలేని ఆకలి ఉపశమన సంస్థ. అమెరికా ఆహార బ్యాంకులు ఉచితంగా ఆహారాన్ని అందిస్తాయి. కరోనా విశ్వమహమ్మారితో ఉపాధులు తగ్గి అనేక కుటుంబాలు బాధపడుతున్నాయి. పెరిగిన ఆహార అవసరాలను తీర్చలేక ఇబ్బంది పడుతున్న ఆహార బ్యాంకులు పెరుగుతున్న ఆహార ధరలు, సరఫరా గొలుసు సమస్యలతో కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి.
అధిక ధరలు, పరిమిత ఆహార పదార్థాల లభ్యత వలన కొన్ని కుటుంబాల అవసరాలు పూర్తిగా తీరడంలేదు. మంచి వంట నూనెకు బదులు నాసిరకం నూనె వాడాల్సివస్తోంది. ఆహార బ్యాంకులు రెండేండ్ల క్రితం కంటే రెట్టింపు ధరకు కొంటున్నాయి. క్రిస్మస్ వేడుకలకు తగినంత ఆహార పదార్థాలను అందించలేమని ఆందోళనచెందుతాయి. ''ఆహార పదార్థాల ధరలు పెరిగితే ఆహార అభద్రత పెరుగుతుంది. ఆహార ఇబ్బందులు అనుభవిస్తున్నవారికి అది మరింత తీవ్రమవుతుంది'' అని ఫీడింగ్ అమెరికా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కేటీ ఫిట్జ్గెరాల్డ్ అన్నారు. ఫీడింగ్ అమెరికా దేశవ్యాప్తంగా 200 ఆహార బ్యాంకులను సమన్వయ పరుస్తోంది. ''విశ్వమహమ్మారి గతంలో ఎప్పుడులేని విధంగా అవసరాలను పెంచింది. ఈ అవసరాలను తీర్చడానికి ఆహార బ్యాంకులు బాగా విస్తరించాయి. ఈ బ్యాంకులు గతంలో కంటే 2, 3 రెట్లు ఎక్కువగా పెరిగిన ఆహార ఖర్చులను భరించలేవు'' అని ఆమె చెప్పారు. సరఫరా గొలుసు అంతరాయాలు, తగ్గిన ఆహార పదార్థాల లభ్యత, పనివారి కొరత వగైరా సమస్యలు స్వచ్ఛంద సంస్థల ఖర్చులను, ఇబ్బందులను పెంచాయి. 2007-09 ఘోర మాంద్యంలో కూడా ఇంతటి తీవ్రమైన ఆకలి చూడలేదని వృద్ధులు అన్నారు. దక్షిణ అమెరికా నుండి వలసవచ్చినవారి (లాటినోలు) నిరుద్యోగం 18.9శాతానికి చేరింది. లాటినోలు, నల్లజాతివారిలో 20శాతం పస్తులుంటున్నారు. కోటి మంది అమెరికా ప్రజలు ఆహారం కోసం స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడతారు. రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. విరాళంగా ఇచ్చిన ఆహారాన్ని తరలించడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. దీనికి తోడు కర్మాగారాలలో, ఓడరేవుల వద్ద అడ్డంకులు పెరిగాయి. దీని వలన అన్ని రకాల ఆహార వస్తువులను పొందడం కష్టతరంగా మారింది.
ఆహార బ్యాంకులు ఆకలిగొన్నవారికి ఆహార పదార్థాలు తగ్గించవల్సిరావడం, పెరిగిన ధరలకు అనుగుణంగా ఖర్చులు తగ్గించడానికి నాసిరకం పదార్థాలతో ఆహారం చేయవల్సిరావడం చాలా అవమానకర విషయం. అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలకు అన్యాయం చేయడం అని ఫిట్జ్గెరాల్డ్ చెప్పారు. ఖరీదైన శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో, ఓక్లాండ్లోని అల్మెడ కౌంటీ కమ్యూనిటి ఆహార బ్యాంక్ ఆహారం కోసం నెలకు అదనంగా రూ.45 లక్షలు ఖర్చుచేస్తోంది. పెరిగిన అవసరాలతో ఇప్పుడు 2000 టన్నుల ఆహారాన్ని పంపిణీ చేయడానికి నెలకు రూ.75 లక్షలు వెచ్చిస్తున్నట్లు ఓక్లాండ్ ఆహార బ్యాంక్ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ మైఖేల్ ఆల్ట్ఫెస్ట్ చెప్పారు. విశ్వమహమ్మారికి ముందు 1200 టన్నుల ఆహారం కోసం ఇందులో నాలుగో వంతు ఖర్చయ్యేది.
డబ్బాలలో ఆకుపచ్చ చిక్కుళ్ళ, పీచెస్ (కండ, విత్తనాలు గల దొండ పండ్ల లాంటి పండ్లు) ధర దాదాపు 9శాతం, డబ్బాలలోని మాంసం, ఘనీభవించిన టిలాపియా చేపల ధర 6శాతం కంటే ఎక్కువ, గడ్డకట్టిన 2.25 కిలో గ్రాముల కోడి మాంసం డబ్బా 13శాతం, ఎండు ఓట్ మీల్ ధర 17శాతం పెరిగాయి. బుధవారాల్లో, తూర్పు ఓక్లాండ్లోని చర్చి బయట వారానికోసారి పంచే ఆహారం కోసం వందలాది ప్రజలు వరుసలో ఉంటారు. షిలో మెర్సీ హౌస్ ఆ రోజుల్లో సుమారు 300 కుటుంబాలను పోషిస్తోంది. ఇది విశ్వమహమ్మారి కాలంలో 1,100 కుటుంబాలను పోషించేది. కరోనా తగ్గినప్పటికీ ప్రతివారం కొత్త వ్యక్తులు వస్తూనే ఉన్నారు. మాకు ఆహారాన్ని కొనే స్థోమత లేదని చాలా మంది చెబుతున్నారు. పెరగని ఆదాయం, పెరిగిన ధరలతో వారు కొనగల ఆహారంతో కడుపు నిండడంలేదు. మే నెలలో కమ్యూనిటి మార్కెట్లను ప్రారంభించారు. అక్కడి రిఫ్రిజిరేటర్లలో పాలు, గుడ్లు, బీరువాలలో బన్నులు, రకరకాల రొట్టెలు ఉంటాయి. ప్రజలు వీటిని ఉపయోగించవచ్చు. కాలిఫోర్నియా రాష్ట్రం కొన్ని ఆహార పదార్థాలు సరఫరా చేస్తోంది. ప్రత్యేక అవసరాలు తీరుస్తోంది. చాలా మంది ఫెడరల్ సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం (స్నాప్-ూచీAూ) వంటి ప్రభుత్వ పథకాల సహాయంపై ఆధారపడతారు. ఇవి భోజనానికి సరిపోతాయి. అయితే ఇంటి నెల అద్దె రూ.1 లక్షా 65 వేలు. ప్రయాణ ఖర్చులు, చలిమంటల నూనె ధరలు పెరిగాయి. పాలు, పండ్లు, కూరగాయలు, మాంసం ధరలు చాలా ఎక్కువ. వినిమయ ఖర్చులు 6.2శాతం పెరిగాయి. ఇటీవల పెరిగిన వేతనాలు పెరిగిన ద్రవ్యోల్బణంలో కొట్టుకుపోయాయి. ఆదాయం సౌకర్యంగా బతకడానికి సరిపోదు. మంచి ఆదాయం ఉన్నవాళ్లకు, పొదుపుగా బతికేవాళ్లకు జీవితం అంత కష్టంగా లేదు. కాని క్రిస్మస్ లాంటి సందర్భాలలో పిల్లల ఖర్చులు భరించటం కష్టంగా ఉంది. పెరిగిన ఆహార ఖర్చులను భర్తీ చేయడానికి స్నాప్ ప్రయోజనాలను అత్యవసరంగా పెంచడానికి తక్షణ ప్రణాళికలు లేవు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఏర్పాటుచేసిన స్నాప్ ప్రయోజనాలలో శాశ్వత పెరుగుదల, ఆహార బ్యాంకుల తాజా నిధులు అధిక భారాన్ని తగ్గించడంలో సహాయ పడగలవు. పాఠశాలలు తెరిచారు. ఉచిత మధ్యాహ్న భోజనాలు, కొన్ని సందర్భాల్లో ఉచిత అల్పాహారం పిల్లల ఆకలి తీర్చగలవు. ట్రాన్స్నేషనల్ ఫుడ్స్ ఇంక్, ఫీడింగ్ అమెరికాతో అనుబంధించబడిన 100 కంటే ఎక్కువ ఆహార బ్యాంకులకు ఆహార పదార్థాలను సరఫరా చేస్తుంది. ఆసియా నుండి సరఫరా అయ్యే పలు రకాల పండ్లు, ఆహార పదార్థాల డబ్బాలు రవాణా వాహనాలలో స్థలాభావం వల్ల విదేశాల్లో చిక్కుకున్నాయని ట్రాన్స్నేషనల్ ఫుడ్స్ ఇంక్ అమ్మకాల ఉపాధ్యక్షుడు బ్రయాన్ నికోల్స్ చెప్పారు. సరఫరాల సమస్యలు తీరుతున్నట్లు, ధరలు స్థిరపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే విశ్వమహమ్మారి సమయంలో చాలా మంది రవాణా వ్యాపారం నుండి బయటపడిన నేపథ్యంలో పెరిగిన ధరలు తగ్గకపోవచ్చు. కరోనాకు ముందు ఆసియా నుండి వచ్చే కంటైనర్ సగటు ధర రూ.3 లక్షలు. నేడు అదే కంటైనర్ రూ.13.5 లక్షలు. 18 టన్నుల ఒక ట్రక్ వేరుశనగ వెన్న ధర 2019 జూన్ నుండి ఆగస్టు వరకు 80శాతం పెరిగి రూ.38.25 లక్షలకు చేరుకుంది. గతేడాదిలో వెన్న, జున్ను 19శాతం పెరిగాయి. పశుమాంసం టోకు ధర 3 నెలల్లో 5శాతం పెరిగింది. గడ్డకట్టిన ఒక టర్కీ కోడి మాంసం ఖర్చు రూ.750 నుండి రూ.1125కు పెరిగింది. విరాళాలు తగ్గుతున్నాయి. ఆహారాన్ని కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చవుతోంది. తగినంత పండుగల ఆహారాన్ని అందించలేక దానికి బదులుగా ఇతర రకాల నాసిరకం ఆహారాన్ని సరఫరా చేయవలసి వస్తోందని గతేడాది 2లక్షల మందికి పైగా 11.3వేల టన్నుల ఆహారం అందించిన ఒక ఆహార బ్యాంకు బాధపడింది. అల్మెడ కౌంటీ కమ్యూనిటీ ఆహార బ్యాంకు క్రిస్మస్ సందర్భంగా 60,000 గడ్డకట్టిన కోళ్లను, 30,000 టర్కీ కోళ్లను ఉచితంగా అందించడానికి ఆదేశాలిచ్చింది. అమెరికాలో ఆకలి, ఉచిత ఆహార సరఫరాలు ఆశ్చర్యం. ఆహార బ్యాంకులు ఇబ్బందు ల్లో ఉండటం మరింత ఆశ్చర్యం. అగ్రరాజ్యం బోలుతనాన్ని బయట పెడతాయి. ఇప్పటికైనా మనం ప్రపంచ పోలీసు ఉచ్చు నుండి బయట పడాలి.
- సంగిరెడ్డి హనుమంత రెడ్డి
సెల్:9494204545