Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశ్న: భారతదేశం మొత్తంగా ఆకలి ఎందుకు పెరిగింది? అందుకు మీరనుకుంటున్న కారణాలేంటి?
జవాబు: దేశంలో భయంకరమైన ఆకలి పరిస్థితులకు, ఆహార అభద్రతకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 'నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5' 2019, పాక్షిక ఫలితాలు, అనేక రాష్ట్రాల్లో పౌష్టికాహారలోపం, ఇప్పటికే అధ్వాన్నంగా ఉన్న పిల్లల ఎదుగుదలలు మందగించాయని తెలియజేస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి, పరిస్థితులను దారుణంగా మార్చివేసింది. దురదృష్టవశాత్తు, ప్రస్తుత పరిస్థితికి అద్దంపట్టే సమాచారం మన వద్ద లేదు. కానీ మహమ్మారి సంక్షోభ పరిస్థితులను సృష్టించిన తరువాతే, గ్రామీణ వేతనాల నిలిపివేత, మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) లాంటి సంక్షేమ పథకాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
ప్రశ్న : గోడౌన్లన్నీ గోధుమ, బియ్యంతో నిండిపోయి ఉంటే, ఆకలి, ఆకలి బాధలు కొత్తగా అనిపిస్తున్నాయి మరి?
జవాబు: ఔను. మహమ్మారి వ్యాప్తి చెందిన కాలంలో మన ఎఫ్సీఐ గోడౌన్లలో ఆహారధాన్యాల నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సమస్య ధాన్యాలు అందుబాటులో లేకపోవడం కాదు, పంపిణీదే సమస్య. ప్రభుత్వం, ఇంత పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉండి, ప్రజలను ఇంత ఆకలికి గురి చేయడం అనైతికం. కరోనా కాలంలో కూడా ప్రభుత్వం, రేషన్ కార్డులు లేని వారికి సబ్సిడీ లేదా ఉచిత ఆహార ధాన్యాలను ఇవ్వడం ద్వారా అందరికీ ప్రజాపంపిణీ వ్యవస్థను అమలు చేయలేదు. రేషన్ కార్డ్ జాబితాల నుండి అనేక మంది పేదలను మినహాయించారు. కేటాయింపులు ఇప్పటికీ 2011 జనాభా లెక్కల ప్రకారమే జరుగుతున్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయాలంటే, ఇప్పుడున్న రేషన్ కార్డుల జాబితాకు 10కోట్ల మంది ప్రజలను కలపాలి. దీనితో గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం, పట్టణ ప్రాంతాల్లో 50శాతం ప్రజలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు పొందుతారు.
ప్రశ్న: ఈ విషయంపై ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని మీరెందుకు అనుకుంటున్నారు?
జవాబు: మన వద్ద 100 మిలియన్ టన్నుల గోధుమలు, బియ్యం ఎఫ్సీఐ గోడౌన్లలో ఉన్నాయి, అయినా ప్రజలు ఆకలితో ఉంటున్నారు. ఇది పూర్తిగా ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వహణలో జరిగిన లోపాల ఫలితంగానే జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఆహార ధాన్యాలను ఒక ధరకు కొనుగోలు చేసి, వాటిని ప్రజలకు తగ్గించి అమ్మితే కూడా దానిని సబ్సిడీగా పరిగణించవచ్చు.
ప్రశ్న:116 దేశాల్లో భారతదేశాన్ని 101వ స్థానంలో ఉంచిన 'గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021' విధానంపై ప్రభుత్వం దాడి చేసింది. మీరు ఆ విమర్శను ఒప్పుకుంటారా?
జవాబు: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021పై ప్రభుత్వం చేస్తున్న విమర్శలు తప్పు. ఆ సూచిక ఒక ఫోన్ ఆధారిత సర్వే, దానిని లెక్కలోకి తీసుకోకూడదనేది ప్రభుత్వ వాదన. కాబట్టి, భారతదేశం ర్యాంక్ ఘోరంగా పెరిగిందని అనలేం కానీ, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021, భారతదేశం ఆకలి సూచికల ర్యాంక్ చాలా దయనీయమైన స్థితిలో ఉందని తెలియజేస్తుంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సూచికలు మొత్తం ఆహార భద్రతను, పిల్లల పౌష్టికాహార లోపాలను, పిల్లల మరణాలను తెలుపుతాయి. ఈ ర్యాంకింగ్ విధానంలో 'ఆకలిని' సూచించలేదు. కానీ మనం ఒక వ్యక్తి తగినంత పౌష్టికాహారాన్ని తీసుకున్నాడా, లేదా అనేది దీర్ఘకాలిక ఆకలి ద్వారా అర్థం చేసుకుంటాం.
ప్రశ్న: నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5'(2019-20) మొదటి దశలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపం, ఎదుగుదల, అనారోగ్యాలకు సంబంధించిన సమాచారం భయంగొల్పే విధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వమేమో పిల్లల పౌష్టికాహార పథకాల్లో కోతలు విధిస్తుంది, కాబట్టి రాష్ట్రాలు ఎందుకు ఆ చర్యలను తీవ్రంగా నిరసించకూడదు?
జవాబు:2015లో బడ్జెట్లో కోతలు విధించినపుడు నిరసించారు, తరువాత కొన్ని బడ్జెట్లను పునరుద్ధరించారు. ఈ పథకాలకు లక్ష్యాలుగా ఉన్న మహిళలు, పిల్లలకు వారి సమస్యలను వినిపించే గొంతులు లేక పోవడం వల్ల దురదృష్టవశాత్తు ప్రభుత్వం దృష్టిలో వారికి ప్రాధాన్యత లేకుండా పోయింది.
ప్రశ్న: నేడు స్థిరంగా పెరుగుతున్న నిరుద్యోగానికి, ద్రవ్యోల్బణానికి, ఆకలికి ప్రత్యక్ష సంబంధం ఉంది. కనీస అవసరాలు తీర్చుకోవడంలో పేదలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సంబంధాన్ని వివరిస్తారా?
జవాబు: ద్రవ్యోల్బణం అంతటా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా వంటకు కీలకమైన వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. భారతదేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువ. ఒకవేళ పని దొరికిన వారు కూడా, చాలా తక్కువ వేతనాలు పొందుతున్నారు. దానితోపాటు ప్రజలకు ఇంతకుముందు వలె ఎక్కువ పనిదినాలున్న పని దొరకడం లేదు. ఇది ప్రజలు తీసుకొనే ఆహార నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కరోనా మహమ్మారికి ముందు కూడా, భారతదేశ ఆహార నాణ్యత తగినంతగా లేదు. పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు, జంతు మాంసం ద్వారా పొందాల్సిన మాంసకృత్తులు తగినంతగా అందడం లేదు.
ప్రశ్న: నిరుపేద వర్గాల ప్రజలకు సబ్సిడీల ద్వారా ఆహార ధాన్యాలను సమకూర్చే 'ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన', 'ఆత్మ నిర్భర్ భారత్ స్కీం' లాంటి పథకాలను ప్రారంభించినట్టు ప్రభుత్వం చెపుతుంది. 2020లో 32.2 మిలియన్ టన్నులు, 2021లో 32.8 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను మొత్తం 80కోట్ల మంది ప్రజలకు కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆకలిని అదుపుచేసేందుకు ఈ చర్యలు ఎలా ప్రభావం చూపిస్తాయి?
జవాబు: ఈ పథకాల ప్రయోజనాలను అందుకునే అవకాశం ఉన్న వారికి ఉపయోగమే. ఈ సంక్షేమ పథకాలకు అవతల ఉన్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది కాబట్టి, వారు ఆ పథకాల ద్వారా లబ్ది పొందలేరు. రేషన్ కార్డులు లేని వారిని కమ్యూనిటీ కిచెన్లు, తాత్కాలిక కార్డులు లేక కూపన్ల ద్వారా ఈ పథకాల్లో చేర్చే ప్రయత్నాలు చాలా పరిమితంగానూ, అదీ కొన్ని రాష్ట్రాలలో మాత్రమే, కొద్దికాలానికే పరిమితమయ్యాయి. అంత పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నప్పుడు, ప్రభుత్వం ప్రజలకు చాలా చేయవచ్చు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాలు, ఐసీడీఎస్ లాంటి పథకాలు కరోనా మహమ్మారి కాలంలో కూడా అమలు జరుపకుండా ఉండడం ద్వారా పిల్లల పౌష్టికాహారానికి కీలకమైన ఈ పథకాలను దూరం చేశారు.
ప్రశ్న: కుటుంబాలు, చిన్న పిల్లలు ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాయి?
జవాబు: అంగన్వాడీ కేంద్రాలు మూతపడడంతో వృద్ధి పర్యవేక్షణ, తీవ్రమైన పౌష్టికాహార లోపాలతో ఉన్న పిల్లలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం లాంటి రోజువారీ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఈ ఆటంకాల వలన పిల్లల పౌష్టికాహారంలో తీవ్రమైన దీర్ఘకాలిక చిక్కులు ఏర్పడవచ్చు. కాగితాల మీద అదనపు పౌష్టికాహారం (వండని ఆహార పదార్థాలను ఇంటికి తీసుకుని పోయే విధంగా) అందించినట్లు కనిపిస్తుంది. కానీ వాటి సరఫరా క్రమబద్ధంగా, కుటుంబాల ఆకలిని తీర్చడానికి తగినంతగా ఉండడం లేదు. అంగన్వాడీ కేంద్రాలను తెరిచి, వాటి ద్వారా సేవలందించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తరువాత, ఇంతకు ముందున్న స్థితికి తిరిగి వెళ్ళడం మాత్రమే సరిపోదు. అంగన్వాడీలలో ఆహార నాణ్యత మెరుగుపరచడం, గుడ్డు, పండ్లను సమకూర్చడంతో పాటు అదనపు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, నిరాశాజనకమైన ఆకలి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తక్షణ ఉపశమనం, ప్రభుత్వ సేవలైన ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్యా వ్యవస్థలను బలోపేతం చేసి వాటిని అందరికీ అందుబాటులోకి వచ్చేట్లు చేయడం, తగిన వేతనాలతో కూడిన (అందరికీ సౌకర్యవంతమైన పని పరిస్థితులున్న) ఉద్యోగ కల్పన వృద్ధికి ప్రభుత్వం హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
ప్రశ్న: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు గత ఎనిమిది నెలలుగా గౌరవ వేతనాలు చెల్లించడం లేదు. రాష్ట్రాలలో ఇది సాంప్రదాయమా? ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వాలపై ఏ విధంగా ఒత్తిడి తేవాలి?
జవాబు: అంగన్వాడీ కార్యకర్తలను ఉద్యోగులుగా గుర్తించడం లేదు, కానీ వేతనాలు లేకుండా పనిచేసే కార్మికులుగా(ఆనొరరీ వర్కర్స్) గుర్తిస్తున్నారు. వారి వేతనాలు చాలా అల్పంగా ఉంటాయి. వారు చేసే పనికి తగిన విధంగా ఉండవు. అనేక రాష్ట్రాల్లో వేతనాల చెల్లింపులు క్రమబద్ధంగా లేకపోవడం ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది. కరోనా మహమ్మారి ఈ పరిస్థితులను మరింత అధ్వాన్నంగా తయారు చేసింది. మహిళలకు, పిల్లలకు నాణ్యమైన సేవలు అందించాలంటే ఈ కార్మికులకు మంచి వేతనాలు చెల్లించడం అవసరం. కార్మికులుగా తగిన వేతనాలు పొందడం వారి హక్కు. కానీ, దానికి బదులుగా వారు చేసే పనిని, ఏ చెల్లింపులు పొందని కుటుంబ బాధ్యతలు నిర్వహించే మహిళల పని కొనసాగింపుగానే పరిగణిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తల సంఘాలు అనేక రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తుతున్నాయి. కొన్ని సంఘాలు పనికి సంబంధించి షరతులతో కూడిన ఒప్పందాలను చేసుకుంటున్నాయి. కార్మికుల సమిష్టి కార్యాచరణ, మహిళలు, పిల్లల హక్కుల కోసం పని చేసే వారి సంఘీభావం, ఒత్తిడులు వారి పనిని ప్రభుత్వం గుర్తించి, తగిన ప్రతిఫలాన్నిచ్చేట్లు చేస్తున్నాయి. ఆశా కార్మికుల పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి. వారంతా మహిళా కార్మికులు. 2015-2020 మధ్య కాలంలో ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలలో 25శాతం బడ్జెట్ కోతలు విధించారు. అలాంటి కోతలు పిల్లల పౌష్టికాహారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆశా, అంగన్ వాడీ కార్యకర్తల పరిస్థితులతో పాటు బడ్జెట్లో కోతలు లేకుండా సరిదిద్దాల్సిన అవసరం ఉంది.
(''న్యూస్ క్లిక్'' సౌజన్యంతో)
తెలుగు:బోడపట్ల రవీందర్, 9848412451