Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సైకో ఫ్యాన్సీ' అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఒక జాఢ్యం. దీనిబారిన పడుతున్న 'సైకో ఫ్యాన్స్ (మానసిక అభిమానులు)'ల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండట ఆందోళనకరం. తమకిష్టమైన వ్యక్తులు, సినిమా స్టార్లు, నాయకులను విపరీతంగా అభిమానించటం, పూజించటం వీరి మొదటి లక్షణం. సరే... ఎవరిష్టం, ఎవరి అభిమానం వారిదని కాసేపు సరిపుచ్చుకుందాం. వారిని పూలతో పూజిస్తారో, కొబ్బరికాయలు కొట్టి కీర్తిస్తారో మనకనవసరం. కానీ ఈ పిచ్చి ఇంకా ముదిరి ఇప్పుడు పాకాన పడుతూ జనాల్ని అల్లకల్లోలం చేయటం ప్రమాదకర సంకేతం. సాగుకు సంబంధించిన నల్ల చట్టాలను రద్దు చేస్తామంటూ ప్రధాని మోడీ ప్రకటించి.. స్వయంగా అన్నదాతలకు క్షమాపణ చెప్పారు. 'త్వరలో జరగబోయే రాష్ట్రాల ఎన్నికల కుతంత్రం' ఆయన ముఖుళిత హస్తాల్లో దాగుందనే నిజాన్ని గ్రహించినా... గ్రహించనట్టు నటిస్తున్న కొందరు 'ఫ్యాన్స్...' రైతు ఆందోళనల వల్ల దేశానికి ఒక పెను ప్రమాదం రాబోతున్నదనీ, దాన్ని నివారించటానికే ఆయా చట్టాలను రద్దు చేస్తున్నట్టు మోడీ ప్రకటించారంటూ ఆయన్ను ఆకాశానికెత్తేస్తున్నారు. అదే నిజమైతే... ఇంత పెద్ద సైన్యం, రాజకీయ, అధికార యంత్రాంగం చేతిలో ఉన్నప్పుడు ఆ పెను ప్రమాదాన్ని ఇన్నాళ్లూ ఎందుకు బయటపెట్టలేకపోయారు..? ఎందుకు నివారించలేకపోయారన్న దానికి మాత్రం సదరు ఫ్యాన్స్ సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు తెలంగాణలో సైతం ఇదే రకమైన ఫ్యాన్స్ రెండు రోజులుగా తెగ హడావుడి చేస్తుండటం గమనార్హం. ఏడాది కాలంగా కొనసాగుతున్న రైతు ఉద్యమాన్ని చిన్న చూపు చూస్తూ 'ఒక్కరోజు కేసీఆర్ ధర్నా చేస్తేనే... కేంద్రం గడగడలాడింది. దెబ్బకు మోడీ దిగొచ్చి సాగు చట్టాలను రద్దు చేశారు...' అంటూ అదే పనిగా ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారు. ఎవరో చోటా, మోటా కార్యకర్తలు ఇలా కామెంట్ చేశారంటే అది వారి అవగాహనా రాహిత్యం అనుకోవచ్చు. కానీ సాక్షాత్తూ సీనియర్ మంత్రులైన నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గొంగిడి సునీత ఇదే రకంగా మాట్లాడటాన్ని ఏమని అర్థం చేసుకోవాలి. నిజంగా కేసీఆర్ మూడు గంటలపాటు చేసిన ధర్నాకే కేంద్రం గడగడలాడితే, ప్రభుత్వ ఆస్తుల ప్రయివేటీకరణ, విద్యుత్ సవరణ బిల్లులు, పంటలకు మద్దతు ధరలు తదితరాంశాలపై కేసీఆర్ సారు రోజుకో ధర్నా చేస్తే, అన్నీ పరిష్కారమైపోతయి గదా... అంటూ తెలంగాణ జనాలు నవ్వుకుంటున్నారు. శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో రైతు ఉద్యమాన్ని సీఎం సాబ్ కీర్తించారు... ఇప్పుడైనా ఈ గులాబీ నేతలు మారతారా..? లేక 'బత్తాయిల' మాదిరిగా 'గులాబీ'జామ్‌లు అనిపించుకుంటారా..? వేచి చూద్దాం. -బి.వి.యన్.పద్మరాజు