Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు రోజులుగా రాష్ట్రంలో గులాబీ దండు ఒక విచిత్రమైన ప్రచారాన్ని మొదలెట్టింది. అందులో కారువేగం 100 స్పీడ్‌తో దూసుకెళ్లుతున్నది. ఇందులేదు. అందులేదు. ఎందెందు వెతికినా అందే గలదన్నట్టు ప్రచార మోత మోగిస్తున్నారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలంటూ సీఎం కేసీఆర్ మహాధర్నా చేపట్టారు. ఇదే సమస్యపై అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు సైతం చేశారు. ఆ విషయాన్ని నాయకులందరూ తమ ప్రసంగాల్లోనూ ఊదరగొట్టారు. అంతవరకు బాగానే ఉన్నది. సావధానంగా విన్నాం. కానీ ఈ క్రమంలోనే రైతాంగ ఉద్యమానికి తలొగ్గిన కేంద్ర సర్కారు సాగు చట్టాలను రద్దు చేసింది. దాన్ని కూడా గులాబీ దండు తమ ఖాతాల్లో వేసుకుంటున్నది. మా(కారు) వల్లేనే సాగు చట్టాలు రద్దు చేసినట్టు ప్రచార మాద్యమాల్లో చెవిలో జొర్రీగాలాగ ఒకటే ప్రచారం చేస్తున్నది. కేసీఆర్ దీక్షకు మోడీ భయపడిపోయి సాగు చట్టాలను రద్దు చేశారంటూ సిగ్గు, శరమూ లేకుండా చెబుతున్నది. ఏడాదికాలంగా ఇల్లు వాకిలి వదిలి, ఎండనకా, వాననకా రైతులు దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడారు. ప్రాణాలకు తెగించి ఎర్రకోటపై రైతు జెండా ఎగురువేశారు. మహౌద్యమంలో 700 మంది ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ కేంద్ర మంత్రి వాహన దాష్టీకానికి ఐదుగురు ప్రాణాలు విడిచారు. అన్ని రాష్ట్రాల్లో రైతులకు మద్దతుగా వివిధ రూపాల్లో పోరాటాలు కొనసాగుతున్నాయి. దేశ, విదేశాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో బీజేపీపై తీవ్రమైన విమర్శలొచ్చాయి. రైతాంగ ఉద్యమానికి ప్రపంచమే నివ్వెరపోయింది. అటువంటి మహత్తర పోరాటాన్ని అవహేళన చేసేలా గులాబీలు వ్యవహరిస్తున్నారు. భారత్‌బంద్ మినహా మరెక్కడా కనిపించని గులాబీ దండు...ఉన్నట్టు ఉండి రోడ్లు మీదికి రాగానే ఏదో అయినట్టు సంకలు గుద్దుకుంటుంది. కేసీఆర్ ఒక రోజు దీక్షతో మోడీ దిగి వస్తే..పెట్రోలు, డిజీల్, గ్యాస్ ధరలు పెరుగుతుంటే ఎక్కడికి పోయింది గులాబీ జ్ఞానం. ధరలతో ప్రజలు బాధ పడుతుంటే ఆనందించారు. బీజేపీకి అవకాశమిచ్చి, ఆశ్రయం కల్పించారు. కారుపై బీజేపీ పాములా బుసలు కొడుతుంటే, భయపడి రోడ్డెక్కారు. నిక్కచ్చిగా పోరాడిన రైతులకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదు. పైగా వరిధాన్యం కోసం దీక్ష చేసిన మీరు..సాగు చట్టాల కోసమే చేసినట్టు చెప్పుకోవడం ఎలా ఉందంటే... ''చెప్పేటోడు చంద్రశేఖరూ... వినేటోళ్లు తెలంగాణ ప్రజలూ'' అన్నట్టు ఉందని జనం నవ్వుకుంటున్నారు.
- కెఎన్ హరి