Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రకటించడం ప్రజాస్వామిక దేశంలో అన్నదాతల అతిపెద్ద విజయం. తాను కూర్చున్న కొమ్మను ఎవ్వరూ నరుక్కోరన్న చందంగా మోడీ కూడా తన రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకునేందుకు అనివార్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలను(ముఖ్యంగా యూపీ) దృష్టిలో పెట్టుకుని వెనక్కి తగ్గాడు. ఇది ఏడాదిగా రైతన్నలు ఢిల్లీలో చేస్తున్న పోరాటానికి గొప్ప ఊరటనిచ్చే విజయం. అయినా అప్రమత్తంగా ఉండాల్సిందే. దీన్ని దేశమంతటా హర్షిస్తుంటే 'నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు' అన్న చందంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, సినీనటి కంగనారౌత్ మరోమారు నోరు పారేసుకున్నరు. రాజాసింగ్ అయితే..'బ్రోకర్లకు శుభాకాంక్షలు' అని మాట్లాడారు. ఢిల్లీలో ఏడాది నుంచి పోరాడుతున్న అన్నదాతలు, రైతు సంఘాల నేతలు, మేధావులను బ్రోకర్ల కింద జమకట్టడం దారుణాతిదారుణం. దీనిని బట్టే బీజేపోళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల లబ్ది మీదనే తప్ప అన్నదాతల మీద ప్రేమ లేదనే విషయం అర్ధమవుతున్నది. బ్రోకర్లు వాళ్లు కాదయ్యా..మీ బీజేపీ నేతలయ్యా. దేశసంపదను కార్పొరేట్లకు కట్టబెట్టి లూటీ చేస్తున్న వాళ్లు కదా బ్రోకర్లు. పదిమందికి అన్నంపెట్టే అన్నదాతలు బ్రోకర్లు ఎట్లా అవుతారు? మిస్టర్ రాజాసింగ్..! కంగనారౌత్ అయితే..'ప్రజాస్వామ్య ప్రభుత్వం పార్లమెంట్లో చేయాల్సిన చట్టాలను రోడ్లెక్కిన కొందరు నిర్దేశిస్తున్నారు. ఇది కూడా మరో జిహాది దేశమే అవుతుంది. ఇలా జరగాలని ఆకాంక్షించేవాళ్లందరికీ నా శుభాకాంక్షలు' అని కారుకూతలు కూసింది. అమ్మా రౌతూ..నీకసలు ప్రజాస్వామ్యమంటే తెలుసా? యస్. రోడ్లెక్కిన ప్రజలే నిర్దేశిస్తారు. ఎందుకంటే.. తాము ఎన్నుకున్న పాలకులు గతితప్పి..దేశ సంపదను గుప్పెడు పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నప్పుడు ప్రజలు అట్లాగే రోడ్లెక్కుతారు. పాలకులు ఏమి చేయాలో నిర్దేశిస్తారు..ఇదే ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకో కంగనా. అన్న'దాతలు'పెట్టే ఆహారం తింటూ వారినే జిహాదీలని అనేందుకు నోరెట్ల వచ్చింది తల్లీ?
- అచ్చిన ప్రశాంత్