Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీలో నక్షత్రాల హౌటళ్లలో ఉండే వాళ్ళు రైతుల మీద మండి పడుతున్నారు. ఎందుకంటే అక్కడ కాలుష్యానికి కారణం రైతులేనట. వాళ్ళు చేస్తున్న పనులవల్ల వ్యవసాయ వ్యర్థాలను కాల్చగా వచ్చిన పొగ వల్ల దేశ రాజధానిలో విపరీతమైన కాలుష్యం ఏర్పడిందట. తాము ఉండే ఏసీ గదుల్లో హాయిగా ఉంటూ ఆ ఏసీలు విడిచే వేడిని, కాలుష్యాన్ని మరచి పోయి వాళ్ళు మాట్లాడడం చూస్తుంటే ప్రవాహంలో కింద నీళ్లు తాగుతున్న మేక పిల్లని ఆ ఎంగిలి నీళ్లు పైకొస్తున్నాయన్న తోడేలు గుర్తుకొస్తోంది కదూ. నిజంగా సేమ్ టు సేమ్ అలాగే ఉంది ఇది.
ఇక్కడే ఇలా అపోహలు కల్పించి మాట్లాడుతున్నారని అనుకుంటే పొరబాటే. ఎందుకంటే జి-20 దేశాల మీటింగుల్లో అమెరికా లాంటి దేశాలు మాట్లాడే మాటలు గుర్తు చేసుకోవాలి. వాళ్లెప్పుడూ కర్బన ఉద్గారాలు భారత్ లాంటి మూడో ప్రపంచ దేశాల వల్లే వస్తున్నాయని గోల చేస్తుంటారు. తాము చేస్తున్న ప్రయోగాలు, ప్రపంచమంతా చేయిస్తున్న యుద్ధాలు, వాటిల్లో రెండు వైపులా పోరాడుతున్న దేశాలకు తామే ఆయుధాలిచ్చి అక్కడ చేయిస్తున్న కాలుష్యాలు ఇక్కడ కనబడవు. అది ఇంకా పెద్ద తోడేలు. రావణ కాష్టంలా ప్రపంచంలో ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండాలి, తమ ఆయుధ కర్మాగారాలు ఎప్పుడు పనిచేస్తుండాలి. ఎవరూ వాటి గురించి మాట్లాడకూడదు. ఇది ఆ పెద్ద తోడేలు విధానం. దాని తోక పట్టుకొని ముందుకు పోవాలనుకునే వాళ్ళు కూడా అవే మాటలు నేర్చుకోవాలి.
ఇక ఢిల్లీ విషయానికొస్తే న్యాయస్థానమే రైతుల వల్ల వస్తున్న కాలుష్యం మిగతావాటితో పోలిస్తే తక్కువని, టీవీ చర్చల్లో వస్తున్న కాలుష్యం కంటే ఇది తక్కువని సురుకు తగిలించింది. ఆ మాటలు విని వీళ్లకు కొద్దిగా బుద్ధి వికాసం కలుగుతుందా అనుకుంటే కలగదు. వికాస్ మానవ్ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వీళ్ళు చేస్తున్న మనో కాలుష్యం ఇంకా చెప్పాలంటే 'మను' కాలుష్యం విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళు తిరిగే ఖరీదైన వాహనాలు, విమానాలు, వీళ్ళ విలాసాల వల్ల వస్తున్న కాలుష్యాన్ని మాత్రం చెప్పరు గాక చెప్పరు. చెప్పాలంటే పంట పండినన్ని రోజులు ఆ పచ్చదనం వీళ్ళు మరచిపోతారు. ఆ కాలంలో ఎంతో కొంత వాతావరణంలో ఆ పచ్చని పంటలు ఆక్సిజను వదిలే ఉంటాయి. ఆ విషయాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే కానీ చాలా మందికి బుద్ధి వికాసం కలగదు. ఏరు దాటాక తెప్ప తగలేసే జనాలు రైతు పండించిన పంటను ఓ వైపు ఆరగిస్తూనే పంట కోతలు అయిపోయాక మిగిలే వ్యర్థాల గురించి మాట్లాడడం తల్లి పాలు తాగి రొమ్మును గుద్దిన చందంగా ఉంది. ఏరు దాటే వరకు ఓడ మల్లయ్య అని పిలిచి ఆవైపు చేరాక అతడినే బోడి మల్లయ్య అని పిలిచే రకం వీళ్ళు. ఓట్లకోసం, కోట్ల కోసం రైతులను పావులుగా వాడుకునే నైజం బయట పడింది.
కర్బన ఉద్గారాలు మాత్రమే కాదు కంప్యూటర్ ఉద్గారాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ప్రపంచానికంతా తెలుసు కంప్యూటర్లు ఎక్కడినుండి వస్తాయో. పాపం వాళ్ళు ఎంత మంచివాళ్ళు కాకపొతే వాడిపడేసిన తమ పాత కంప్యూటర్లను ఇతర దేశాలకు పంపుతారు. అయితే ఇక్కడున్న మన ప్రభుత్వాలు వాటికి మంచి రేటు కల్పించి మనం కొనుక్కునేలా చేస్తుంది. ఈమధ్య వాట్స్అప్లో ఒక వీడియో వచ్చింది. సముద్రంలో చేపలు పట్టినట్టు ప్లాస్టిక్ వ్యర్థాలను పట్టుకొచ్చి నీళ్లను శుభ్రపరుస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నిటికంటే ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. తన కంటిలో పెద్ద దూలం ఉండేది కనపడదు వాళ్లకు, ఎదుటివాడి కంటిలోని నలుసు మాత్రం బహు బాగా కనిపిస్తుంది.
అడవులు తగ్గిపోతున్నాయి అనంటారు కానీ అడవులను ఎవరు కొట్టేస్తున్నారు అన్న విషయం తెలిసినా చెప్పరు. చెట్లను కొట్టేయడమే కాదు అవి కాలిపోతుంటే ఆర్పే నాధుడే లేదు. అందుకేనేమో తగ్గిపోతున్న చెట్ల స్థానంలో గంజాయి లాంటివి వేస్తున్నారని మా మిత్రుడు చెప్పే మాటలు నిజమనిపిస్తుంది. చెట్లు ఏవైనా చెట్లే కదా అని గంజాయి మొక్కలు నాటుతున్నారు. నిజంగానే గంజాయి మొక్కలు ఆక్సిజను ఇస్తున్న సంగతి అందరూ మరచిపోతున్నారు. అవి వాడి ప్రాణాలు తీసుకునే వాళ్ళ గురించి మాత్రమే చెబుతారు. దేశానికి ఇలాంటి నాయకులను అందించే వాళ్ళే కానీ మంచి నాయకులను ఎవరు తయారు చేస్తున్నారు అని గట్టిగా అడిగితే అది శబ్ద కాలుష్యం కిందికి వస్తుంది. అందుకే మౌనంగా ఉండాలని చెబుతున్నారు. మౌనాన్ని మించిన కాలుష్యం వేరేది లేదు, అంటే మేధావులు మౌనంగా ఉన్నప్పుడు జరిగే నష్టం చెడ్డవాళ్ళు చేస్తున్న నష్టం కంటే ఎక్కువట. అందుకే ప్రపంచానికి ఎటువంటి కాలుష్యం కలిగినా బాధ్యత వహించవలసింది మౌనంగా ఉన్న మేధావులేనని మరవద్దు. సమాజంలో నోరు విప్పి మాట్లాడుతున్న, పోరాటాలు చేస్తున్నవాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్ళతో చేయి కలపమని, నోరు కలపమని, కలం కదిలించమని ఇప్పుడే అడగాలి మనం. అప్పుడు అన్ని కాలుష్యాలు పోతాయి.
ఈ మధ్య మాట కాలుష్యం బాగా పెరిగి పోతోంది. ఎన్నికలు కావచ్చు, లేదా ప్రాంతీయ విషయాలు కావచ్చు... నాయకులూ తమ స్థాయిని, స్థానాన్ని మరచిపోయి మనుషుల మనస్సులో ఒక విధమైన అసహనాన్ని, అసంతృప్తిని కలిగేలా చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయాల మీద ప్రజలకు ఉన్న అభిప్రాయాలకు వీళ్ళు ఇంకా బలాన్ని చేకూరుస్తున్నారు. అందుకే మొదట రాజకీయాల్లో కాలుష్యాన్ని తగ్గించి దానివల్ల ప్రపంచానికి స్వచ్ఛమైన మనుషులను అందించే పనిలో కొందరైనా ఉండాలి. మానవుడు మాటలు నేర్చింది మనిషిగా బతకడానికే కానీ పశువుగా మారడానికి కాదన్న నిష్కల్మషమైన మనసులను మనుషుల్లో నిర్మించాలి.
మా ఆలోచనల్లో ఎటువంటి కాలుష్యం లేదు మేము రైతులవైపే ఉన్నాం అని అకస్మాత్తుగా రైతు బిల్లులను ఉపసంహరించడం వెనుక సర్పాన్ని అణగ దొక్కిన పిపీలకాలు కనిపించడం విశేషం. ఏ మాట వెనుక ఏ కాలుష్యముందో, ఏ ఊహ వెనుక ఏ మర్మముందో, ఏ నిర్ణయం వెనుక ఏ ఆశ ఉందో కనిపెట్టి ఈ కాలుష్య ప్రపంచంలో మనకు కావలసిన మంచిని అందిపుచ్చుకోవాలి. పోరాటమే దానికి ఊపిరి. ఆ ఊపిరికి మనమూ ఒకింత ఆసరా ఇద్దాం, ఆమ్లజనిని అందిద్దాం.
- జంధ్యాల రఘుబాబు
సెల్: 9849753298