Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాదాపు దశాబ్దకాలంగా దేశ రాజకీయాలను శాసిస్తున్న వ్యక్తిగా నరేంద్ర మోడీ ప్రపంచానికి తెలుసు. పార్లమెంటరీ, పార్లమెంటేతర మద్దతు పుష్కలంగా సంపాదించుకోవటానికి మోడీ అనుసరించిన వ్యూహాలు, సాగించిన ప్రచారం, వేషధారణ, హావభావాలు మొత్తం లెక్కిస్తే గిన్నిస్ రికార్డ్‌లో కాకపోయినా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోనైనా స్థానం దక్కుతుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా కరుడుకట్టిన హింసాత్మక హైందవోన్మాద రాజకీయాలకు కూడా మోడీ ప్రతీకగా నిలిచాడు. పౌర సమాజం మనోభావాలను ఒంటిచేత్తో ప్రభావితం చేయగల శక్తి తనకుందని దేశాన్ని, ప్రపంచాన్నీ నమ్మించాడు. అటువంటి సంఘపరివార్ ఛాందసవాదులకు, ఇటు మార్కెట్ ఛాందసవాదులకు ముద్దుబిడ్డగా మారాడు. అటువంటి ప్రధాని హఠాత్తుగా వివాదాస్పద వ్యవసాయక చట్టాల విషయంలో ప్లేటు ఫిరాయించటం కనీసం సంస్కరణల పేరుతో జాతీయ సంపదపై కన్నేసిన పెద్దలకు మింగుడుపడని వ్యవహారంగా మారింది.
ఇదే ప్రధాని కనీసం డజను సార్లు రైతాంగం ప్రతిపక్షాల ప్రోద్భలంతో, విఛ్చిన్నకర శక్తుల తోడ్పాటుతో, దారితప్పిన కొద్దిమంది సాగిస్తున్న ఆందోళన అని రైతు ఉద్యమాన్ని కొట్టిపారేశారు. ఏడాదిపాటు ఢిల్లీ దిగ్భంధనం ప్రపంచం దృష్టిని ఆకర్షించినా ప్రధాని మాత్రం అసలు అన్ని వేల మంది రాజధాని సరిహద్దుల్లో కూర్చున్న విషయమే కనిపించనట్లు వ్యవహరించారు. రైతు ఉద్యమంపై ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరినీ, దమనకాండను ఏకంగా ఐక్యరాజ్యసమితి మొదలు అంతర్జాతీయ పర్యావరణ కార్యకర్తలు, మానవహక్కుల ఉద్యమకారులు ఖండించినా, అంతర్జాతీయ వేదికలపై పలుసార్లు చుక్కెదురైనా మోడీ చలించలేదు. అటువంటి ప్రధాని గురుపూర్ణిమ సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నల్లచట్టాలుగా రైతులు పిలుస్తున్న ఈ చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రకటనను విశ్లేషించిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక మోడీ గతంలో ఉన్నంత శక్తిశాలిగా కనిపించటం లేదని వ్యాఖ్యానించింది. సాధారణంగా స్వపక్ష, విపక్షాలు, జనంపక్షం నుండి వినవస్తున్న విమర్శలను వంటి మీద వాలిన ఈగకన్నా దారుణంగా తీసేసే ప్రధాని రైతాంగానికి ఆ స్థాయిలో సంజాయిషీ ఇస్తూ మాట్లాడటం గత రెండు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి. ఇది ఎలా సాధ్యమైంది అన్నది తెలుసుకోవాలంటే సంయుక్త కిసాన్ మోర్చా సాగించిన ఉద్యమం, అనుసరించిన ఎత్తుగడలు, అమలు చేసిన ప్రచార వ్యూహాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వివరించటానికి ఒక్క వ్యాసం నిడివి సరిపోదు కనుక ఒకటి రెండు కోణాలను మాత్రమే పరిశీలిద్దాం.
మోడీ ఈ ప్రకటనకు ముందు గత ఏడాదిగా జరిగిన కొన్ని పరిణామాలు గుర్తు చేసుకుందాం. మోడీ వందిమాగధులు ఎంత భీకరంగా మాట్లాడినా ఆర్థిక వ్యవస్థ మాత్రం పట్టాలు ఎక్కనని ఏడేండ్లుగా మొరాయిస్తోంది. 2004-2014 మధ్య కాలంలో సగటు అసంఘటిత కార్మికుడు, గ్రామీణ కార్మికుల వేతనాలు ఎంతో కొంత పెరిగాయి. కానీ ఈ ప్రయోజనం 2014 తర్వాతి కాలంలో సంఘటితరంగ కార్మికుల వేతనాలతో పాటు బ్యాంకుల్లో నిల్వ ఉంచుకున్న నగదుపై వడ్డీతో వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. కార్మికులకు ఈపిఎఫ్‌లో నిల్వపెట్టుకున్న వేతనాల విలువ కూడా ఆర్థిక వ్యవస్థతో పాటే పతనమవుతూ వచ్చింది. కోవిడ్ సృష్టించిన కల్లోలం కష్టజీవుల జీవితాలను అతలాకుతలం చేసింది. ఇవన్నీ చాలవన్నట్లు గడచిన ఏడేండ్లలో మత విద్వేషాలు పతాక స్థాయికి చేరాయి. విద్వేషపూరిత మనోభావాలనే ఓట్లుగా మార్చుకునేందుకు సంఘపరివారం అధికారంలో ఉన్న బీజేపీ అండదండలతో చేయని ప్రయత్నం లేదు. ఈ వైఫల్యాలన్నీ జనాన్ని గంగానదిలో శవాలుగా మార్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అప్పటికే సంయుక్త కిసాన్ మోర్చా బెంగాల్, తమిళనాడుల్లో నిర్వహించిన సభలు ఆయా రాష్ట్రాల్లో రైతాంగాన్ని ప్రభావితం చేశాయి. మోడీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా ఉన్న నమ్మకాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సైతం బీజేపీని ఓడించేందుకు కంకణం కట్టుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. పదేళ్ల క్రితం మతోన్మాద కలహాలతో రక్తసిక్తమైన ముజఫర్‌నగర్‌లోనే సుమారు ఐదు లక్షల మంది రైతులతో సంయుక్త కిసాన్ మోర్చా సభ నిర్వహించటంతో యోగి బృందంలో ఆందోళన మొదలైంది. అయినా ఈ వెరపు కళ్లబడకుండా జాగ్రత్తపడటానికి బీజేపీ నేతలు, ప్రధాని, యోగి ఆదిత్యనాథ్‌లు శాయశక్తులా ప్రయత్నిస్తున్న తరుణంలో లఖింపూర్‌లో అధికారమదంతో కేంద్ర మంత్రి కొడుకు రైతాంగాన్ని కార్లతో తొక్కిచ్చాడు. ఇవన్నీ సాంప్రదాయక మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా జనానికి చేరుతూనే ఉన్నాయి. ఇవన్నీ తాజాగా జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సభ్యుల ఆందోళనకు కారణమయ్యాయి. వారం రోజుల క్రితం పంజాబ్ బీజేపీ ప్రతినిధి బృందం కూడా ప్రధానిని కలిసి వ్యవసాయ చట్టాలపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోలేకపోతే రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో జనం దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదని తేల్చి చెప్పాయి. ఈ తక్షణ పరిణామాలు బీజేపీ వ్యూహకర్తలకు పనిపెట్టాయి.
ఏ ఉద్యమాన్నైనా నిర్వీర్యం చేయాలంటే ముందు ఉద్యమ లక్ష్యాలను ఉద్యమ నాయకత్వాన్ని అప్రతిష్టపాల్చేయటం పాలకవర్గం చేసే తొలి చర్య. రైతు ఉద్యమం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అదే పని చేసింది. సామదాన బేధ దండోపాయల ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమాన్ని అప్రతిష్టపాల్జేయాలని ప్రయత్నం చేసింది. గోదీమీడియా సహకారం ప్రభుత్వానికి ఎటూ ఉంది. ఏడాది పాటు జరిగిన ఢిల్లీ దిగ్భంధనం గురించి మొదట్లో రాత్రి తొమ్మిది గంటల వార్తల్లో హౌరా హౌరీ చర్చలు జరిపిన ఛానెళ్లు తర్వాతి కాలంలో కనీసం స్క్రోలింగ్‌కు కూడా అవకాశమివ్వలేదు. ఈ విషయాన్ని సంయుక్త మోర్చ గమనించింది. ప్రభుత్వం నోరు నొక్కుతున్న ఉద్యమానికి సామాజిక మాధ్యమాలు కొత్త గొంతుకలనిచ్చాయి. వందల కొద్దీ స్థానిక యూట్యూబ్ ఛానెళ్లు తెరమీదకు వచ్చాయి. లక్షల మందికి ఈ ఛానెళ్లు ఏ రోజుకారోజు ఉద్యమ వార్తలు చేరవేసే సాధనాలుగా మారాయి. ఈ పరిణామం ఓ రకంగా ప్రధాన స్రవంతి మాధ్యమాల విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేసేదని చెప్పకతప్పదు.
ఈ ఉద్యమం ముందుకు తెచ్చిన మరో కీలక అంశం కార్మిక కర్షక మైత్రి. తొలుత కేవలం రైతాంగ ఉద్యమంగా మొదలైనా అతి తక్కువ కాలంలోనే సమజాంలోని భిన్న తరగతులు వర్గాలు ఈ ఉద్యమ స్రవంతిలో భాగమయ్యాయి. తొలుత సంఘీభావ చర్యలకు పరిమితమైన కార్మిక సంఘాలు తర్వాతి కాలంలో రైతు ఉద్యమ లక్ష్యాలను దేశవ్యాప్తంగా చేరవేసే సాధనాలుగా మారాయి. ఈ మొత్తం ఉద్యమంలో కనీసం సంఘీభావంకూడా తెలపని సంస్థలు బీజేపీ, ఆరెస్సెస్‌కు సంబంధించిన కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాలు మాత్రమే. ఈ విధంగా రైతు ఉద్యమం బీజేపీ సంఘపరివారం కపట నాటకాన్ని కూడా బట్టబయలు చేయగలిగింది.
ఈ ఉద్యమం ముందుకు తెచ్చిన మరో విషయం జనబాహుళ్య సాంస్కృతిక రూపాలు. అప్పటి వరకూ సాంస్కృతికంగా సంపన్నవంతమైన పంజాబ్ ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ వికాస్ రావల్ సేకరించిన వివరాల మేరకు కనీసం రెండు వేల యూ ట్యూబ్ పాటలు, వ్యాఖ్యలు, ప్రదర్శనాత్మక సందేశాలతో కూడిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఒక్కో పాట కనీసం రెండు మూడు కోట్లమందికి తక్కువగాకుండా జనానికి చేరింది. వేల సంఖ్యలో ఉద్యమ గేయాలు జానపద కళారూపాలు ఆవిష్కృత మయ్యాయి. నిరనస శిబిరాలనే కాక దేశవ్యాప్తంగా ప్రజానీకాన్ని చేరుకున్నాయి.
సాధారణంగా జానపదకళారూపాలు వంశచరిత్ర లతోనో, ప్రభుత్వ జయగానాలతోనో, ప్రభుత్వ పథకాల ప్రచార సాధనాలుగానో కాక రాజకీయ అర్థ్రశాస్త్ర పాఠాలతో నిండాయి. ప్రపంచీకరణ దశలో వ్యవసాయ రంగంపై పెట్టుబడి ఆధిపత్యంతో సాగుతున్న దోపిడీని విప్పి చెప్పాయి. రైతు, కూలీ కష్టాలకు అక్షర రూపాన్నిచ్చాయి. ప్రభుత్వ పరిభాష, టీకా తాత్పర్యాలకు భిన్నంగా వర్తమాన పరిస్థితికి తాత్పర్యం చెప్పాయి. ప్రభుత్వం నిశ్శబ్దంతో ఈ ఉద్యమాన్ని పీకనులమాలని ప్రయత్నం చేస్తే మట్టిగొంతుకలు మహౌపాధ్యాయులై ఏడాది పాటు సార్వత్రిక సమరశంఖారావాన్ని పూరించాయి. ఫలితంగా మోడీకి దిగిరాక తప్పలేదు.
- కొండూరి వీరయ్య
సెల్:8971794037