Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీర్ దాస్.. ఓ ప్రముఖ స్టాండప్ కమెడియన్.. ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గల కెనడీ సెంటర్లో నిర్వహించిన ప్రదర్శనలో 'టూ ఇండియాస్' పేరుతో ఆయన చదివిన ఓ ఆంగ్ల పద్యం వివాదాస్పదమైంది. 'ఐ కమ్ ఫ్రమ్ టూ ఇండియాస్' అంటూ సాగిన ఆ పద్యాన్ని కొందరు తీవ్రంగా విమర్శిస్తుండగా.. మరి కొందరి నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది.
'నేను భారత్ నుంచి వచ్చాను. అక్కడ గాలి నాణ్యత సూచి 9000 ఉంటుంది. కానీ మేం ఇంటి డాబాపైనే పడుకుంటాం. నక్షత్రాలను చూస్తాం'.. 'నేను శాఖాహారిగా ఉండటం గర్వంగా భావించే భారత్ నుంచి వచ్చాను. కానీ కూరగాయలు పండించే రైతుల మీద నుంచే విచక్షణా రహితంగా వాహనాలు నడుపుతుంటాం'.. అంటూ సాగింది వీర్ దాస్ పద్యం. అయితే ఒక సందర్భంలో 'భారత్‌లో మహిళలను పగలు పూజిస్తారు, రాత్రివేళల్లో వారిపై సామూహిక అత్యాచారాలు చేస్తారు'.. అంటూ పేర్కొన్నారు. అయితే భారతదేశంలోని సమస్యలను చర్చించడంపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా.. అమెరికా వెళ్లి అక్కడ మాట్లాడడం ఏంటంటూ చాలా మంది విమర్శించారు.
విమర్శించే వారితోపాటు సమర్థించే వారి సంఖ్య కూడా తక్కువేమి లేదు. తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో వీర్ దాస్ కూడా స్పందించారు. 'ఇది రెండు వేర్వేరు భారతదేశాల గురించిన ఒక వ్యంగ్య నాటిక' అని చెప్పుకొచ్చారు. 'ప్రతీ దేశానికి మంచి చెడులు, చీకటి, వెలుగు ఉంటాయి. ఇదేం రహస్యం కాదు. నాటిక వల్ల మనమంతా ప్రేమించే, గర్వించే, విశ్వసించే భారతదేశానికి అమెరికా వేదికపై భారీ చప్పట్లు లభించాయి. దయచేసి ఎడిట్ చేసిన కాపీలను చూసి మోసపోకండి' అంటూ వీర్ దాస్ చెప్పుకొచ్చారు.
దాదాపు ఏడు నిమిషాల పాటు సాగిన వీర్ దాస్ పద్యం కేవలం చేదు నిజాలను మాత్రమే బహిర్గతపర్చలేదు. నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై మాత్రమే చర్చించలేదు. భారతదేశం రెండు కోణాలను ఈ పద్యం ఆవిష్కరించింది. భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మహౌన్నతమైన సంస్కతిని, స్ఫూర్తిదాయకమైన తత్వాన్ని ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది. వీర్ దాస్ టూ ఇండియాస్లో తాను గర్వించదగిన భారతదేశం గురించి కూడా మాట్లాడారు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఆయన పద్యం వీడియో క్లిప్పులను కట్ చేసి చూపిస్తుండడంతోనే సమస్యంతా వచ్చి పడింది.
సమస్యలపై మాట్లాడితే నష్టమా..?
సమస్యలను కప్పిపుచ్చి ఉంచడం అంటే దేశానికే నష్టం చేకూర్చడమే. అంతేకాకుండా దేశ సమస్యలను దేశం లోపలే చర్చించాలనుకోవడం ఒక మానసిక రుగ్మతగా చెప్పవచ్చు. విదేశీ వేదికలు, డాక్యుమెంటరీల ద్వారా అమెరికాకు చెందిన నిఘా సంస్థలను, ఆ దేశ యుద్ధ తంత్రాలను ఎడ్వర్ట్ స్నోడెన్ విమర్శించడం, అప్ఘనిస్తాన్కు చెందిన ఒక వ్యక్తి అమెరికా లేదా బ్రిటన్‌లో తాలిబాన్ల పాలనను, అక్కడి పరిస్థితులను విమర్శించడం తప్పు పట్టలేం కదా. అక్కడికి చెందిన వ్యక్తులు ఇది తమ దేశాలనూ అవమానించడమే అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడి ప్రజలు కూడా దేశ సమస్యలను దేశం లోపలే చర్చించుకోవాలని చెప్తే సమర్థిస్తారా..! ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయేమోననే భావనతో సమస్యలపై గళమెత్తడం మానేయాల్సిందేనా..! భారత్‌లో నెలకొన్న సమస్యలు అమెరికాకు తెలియవా? గ్లోబలైజేషన్ ప్రపంచంలో భారత్ ఒక భాగం. ప్రపంచ దేశాలతో వాణిజ్యం చేస్తున్నాం. కొన్ని వస్తువులను ఎగుమతి చేస్తుండగా, మరి కొన్నింటిని దిగుమతి చేసుకుంటున్నాం. 2019 డేటా ప్రకారం 27లక్షలకు పైగా భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. అదే సందర్భంలో ఏడు లక్షలకు పైగా అమెరికన్లు ఇండియాలో నివాసముంటున్నారు. అంతేకాకుండా పర్యాటకంగా చాలా మంది వస్తూ, వెళ్తూ ఉంటారు. అమెరికాలో 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమం జరిగినా, అక్కడి రాజధానిలో అల్లర్లు జరిగినా ఇండియాలోని ప్రతి ఒక్కరికి ఆ సమాచారం అందుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు, రాజకీయ నాయకుల బాగోతాలను, కొన్ని దేశాల కుట్రలను బయటపెట్టేందుకు అంతర్జాతీయంగా జర్నలిస్టు లందరూ కలిసి ఒక కన్సార్టియంగా ఏర్పడుతున్న కాలమిది. ప్యారడైజ్ పేపర్స్, పనామా పేపర్స్, ఫేస్ బుక్ పేపర్స్ అంటూ దేశాలనే కదిలించేసే, కుట్రలను బహిర్గతం చేసే కథనాలను వివిధ దేశాలకు చెందిన జర్నలిస్టులందరూ కలిసి బయటపెట్టారు. ఇలాంటి కాలంలో అమెరికా వేదికపై భారతదేశ సమస్యలను లేవనెత్తారని వీర్ దాస్ ను విమర్శించడం సరికాదు.
భారతదేశ చేదు నిజాలను ప్రపంచం ముందు బహిర్గతపరిచింది వీర్ దాస్ ఒక్కరే కాదు. వీర్ దాస్ లేవనెత్తిన అంశాలను టైమ్ మ్యాగజైన్ ఎప్పుడో ప్రచురించింది. న్యూ యార్క్ టైమ్స్ లో సైతం ఇలాంటి కథనాలను రాశారు. గార్డియన్, వాల్ స్ట్రీట్ జర్నల్, లాస్ ఏంజెల్స్ టైమ్స్ లాంటి ఎన్నో పత్రికలు భారతదేశంలో జరుగుతున్న ఘటనలను రిపోర్ట్ చేశాయి. యునైటెడ్ నేషన్స్, యూఎన్ డీపీ, ప్రపంచ బ్యాంకు, ప్యూ రీసెర్చ్ సెంటర్, ఎకనామిస్ట్ గ్రూప్ లాంటి సంస్థలు భారతదేశానికి సంబంధించిన అంశాలను పరిశోధించి, వాటిపై నివేదికలు రూపొందించి ప్రపంచదేశాల ముందుంచాయి. అంతేకాకుండా యూ ట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా సాధనాల ద్వారా ప్రతి చిన్న విషయం ప్రపంచానికి నిమిషాల్లోనే తెలిసిపోతున్న కాలమిది. వీర్ దాస్ ప్రదర్శనకు వచ్చిన అత్యధిక మంది ప్రేక్షకులు అమెరికన్లు కారు.. వారు వివిధ దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు. కాబట్టి వీర్ దాసే మొట్టమొదటిసారిగా యూఎస్‌లో భారతదేశ అంశాలను లేవనెత్తారని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది. సమస్యలు అన్ని దేశాల్లోనూ ఉంటాయి. ప్రపంచంలో ఏ చోట అన్యాయం జరిగినా దానిని ఎక్కడైనా లేవనెత్తే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. మీరు భారతదేశ ప్రతిష్టను ప్రపంచదేశాల ముందు మెరుగుపర్చాలనుకుంటే ముందుగా దేశంలో ఉన్న సమస్యలను గుర్తించి, అంగీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అనంతరం వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. బేధాలు లేకుండా సత్వర న్యాయాన్ని అందించే, సమస్యలను లేని భారతాన్ని సృష్టించడమే అసలైన దేశభక్తి.
- ఫిరోజ్ ఖాన్
సెల్:9640466464