Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజీలేని వామపక్ష భావజాలమే బీజేపీని సైద్ధాంతికంగా ఎదుర్కొంటుంది. మార్క్సిజం - లెనినిజం సైద్ధాంతిక ప్రాతిపదిక మీదే వామపక్ష భావజాలం గత శతాబ్ద కాలంలో ప్రపంచమంతటా వేళ్ళూనుకున్నది. చారిత్రక వాస్తవికత - గతి తార్కిక పద్ధతుల ద్వారా మానవ పరిణామ క్రమం అంతా వర్గపోరాటాల ద్వారానే ముందుకు నడుస్తున్నట్టు ఎప్పటికప్పుడు తేటతెల్లం అవుతున్నది. కనుకనే అంతకు మించిన శాస్త్రీయ సిద్ధాంతం మానవాళి అనుభవంలోకి రాలేకపోతున్నది.
మహత్తర సోవియట్ విప్లవం ఏ తెంచి 104 ఏండ్లు గడిచాయి. ఆ విప్లవం పతనమై మూడు దశాబ్దాలు కావస్తున్నా..., చైనా అగ్రదేశం అంతకంతకూ తనదైన ఆర్థిక విధానాలతో శరవేగంతో విస్తరిస్తున్నా..., ఆయా దేశాల ప్రజలు మార్క్సిజం - లెనినిజం సిద్ధాంతాన్ని విడనాడటానికి ఇష్టపడటం లేదని తెలుస్తున్నది. కాగా కొంగ్రొత్త యువతరం ప్రపంచ వ్యాప్తంగా అన్నిరంగాల్లో సునిశితంగా అధ్యయనం చేసేందుకు తాపత్రయ పడుతున్నట్టు విదితమవుతున్నది. కారణం పేదరికం, ఉపాధి, అసమానత్వం ఈ మూడు సమస్యలే దేశ దేశాలను నేడు అతలాకుతలం చేస్తున్నాయి.
ప్రపంచీకరణ విధానాల ఫలితంగా విజృంభిస్తున్న ద్రవ్య పెట్టుబడి, కమ్ముకుంటున్న కార్పొరేట్ (బహుళజాతి సంస్థలు) రంగం ఈ సమస్యలను మరింత తీవ్రతరం, జటిలం చేయగలవు తప్ప పరిష్కరించలేవు. ఇది అందరికీ అనుభవైక సత్యం. ఎందుకంటే పెట్టుబడిదారి సిద్ధాంతానికి అంతకన్నా వేరే దారిలేదు. దానికి తెలిసిన ఏకైక దారి క్రూరమైన మార్కెట్ దోపిడి. అందుకోసం ఎంతకైనా తెగిస్తుంది. యుద్ధాలు, హింసలు, మారణహౌమాలు ఎక్కడ వీలైతే అక్కడ సృష్టిస్తుంది. అందులో భాగంగానే ఆత్మహత్యా సదృశ్యమైన భూగోళ వినాశనానికి సైతం కారణ భూతమవు తున్నది. అందువల్ల పెట్టుబడిదారీ సిద్ధాంతం లో (సరళీకృత, ప్రయివేటీకరణ విధానాలు) మానవీయ కోణాన్ని వెతకడమంటే నేతిబీరకాయలో నెయ్యిని వెతికిన చందమే అవుతుంది.
కాగా ఈ పరిణామం రాజ్యం పాత్రను పరిమితం చేయడమే కాదు, వివిధ రాజ్యాలపై (ప్రభుత్వాలపై) మార్కెట్ గుత్తాదిపత్యాన్ని సాధించడం కూడా గమనిస్తున్నాం. అందుకే మన ప్రధాని మోడీ గత ఫిబ్రవరిలో ఓ వాణిజ్య సదస్సులో బిజినెస్ (వ్యాపారం) చేయడం మా ప్రభుత్వ బిజెనెస్ (పని) కాదని అన్నారు. వెటకారంగా మాట్లాడినా వాస్తవం అదే. సుమారు వంద ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించి రెండున్నర లక్షల కోట్ల రూపాయల సమీకరించనున్నట్టు తెలిపారు. అంటే ప్రభుత్వ ఆస్తులు, ఆదాయాలు బాజాప్తుగా ప్రయివేటు పెట్టుబడుదారుల చేతుల్లోకి పోవడమే. అనివార్యంగా ప్రజల పేదరికం పెరగడమే. ఉపాధి అవకాశాలు సన్నగిల్లడమే. రైల్వేలు, ఎల్ఐసి, టెలికం సంస్థలు, గనులు, ఓడరేవులు వాటిల్లో ఉన్న విషయం తెలిసిందే.
పెట్టుబడిదారులు ప్రతి వస్తువు అమ్మకం - కొనుగోలుపై నియంత్రణ సాధిస్తారు. రాజ్యం తందానా అంటూ వారికి వంత పాడుతుంది. ప్రజలు బికారులై రోడ్డున పడతారు. రైతులు కార్మికులు అలాంటి దుర్భర స్థితికి నెట్టబడటాన్ని నేడు మనం కళ్ళారా చూస్తున్నాం. పాలకులు ఎన్ని మాటలు చెప్పినా అవి మాయమాటలుగానే మిగిలిపోతున్నాయి తప్ప, కనీస ఉపశమనాన్ని, భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. అంటే రాజ్యం కేవలం రెగ్యులేటర్ అప్పారటస్ (సంక్షేమ స్వభావం లేని అసమర్ద పర్యవేక్షణ)గా మారిందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇందుకు భిన్నమైనది సోవియట్ విప్లవం. అది విజయవంతం అయ్యాక కామ్రేడ్ లెనిన్ సారధ్యంలో శ్రమజీవుల హక్కుల సాధనకు పెద్దపీట వేసింది. కష్టజీవుల రాజ్యంగా పేరుగాంచింది. అంటే శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వడానికి నడుం కట్టింది. జమిందార్లు, సంస్థానాధీశుల వంటి ఫ్యూడల్ ప్రభువుల భూములు, ఆస్తులు, కర్మాగారాలు ప్రభుత్వపరం చేయడానికి ప్రాధాన్యతను ఇచ్చింది. సమిష్టి వ్యవసాయ క్షేత్రాల ద్వారా ఉత్పత్తిని పెంచింది. విద్యా, వైద్యం వంటి వాటిని ఉచితం చేసింది. ప్రయివేటు ఆస్తులు, వ్యాపకాలు నామమాత్రంగానే ఉండేవి. దాంతో ఆర్థిక అసమానతలు తగ్గి పేదరికం లేకుండా ప్రజల కనీస అవసరాలు తీరేవి. ఉపాధి తరతమ స్థాయిలో జాతి, లింగ భేదం లేకుండా అందరికీ లభ్యమయ్యేది. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడాలేని విధంగా పనిచేసే హక్కును ప్రాథమిక హక్కుగా చేసింది.
సోవియట్ రాజ్యాంగం కల్పించిన మరోముఖ్య విషయం ఏమిటంటే.. స్త్రీల విషయంలో ప్రపంచం ఇంకా సరిగ్గా కళ్ళు తెరవకముందే పురుషులతో పాటు స్త్రీలకు సమానంగా ఓటుహక్కు కల్పించింది. ప్రజాస్వామ్యానికి పురిటిగడ్డ అని చెప్పుకునే ఇంగ్లండ్‌లో సైతం 1928లో, అంటే ఓ దశాబ్దం తర్వాతనే మహిళలకు ఓటుహక్కు వచ్చింది. నల్లజాతి మగవారికి ఆడవారికి 1965లోగానీ ఎన్నో పోరాటాల తరువాత గానీ అమెరికాలో ఓటుహక్కు రాలేదు. నేడు ఓట్ల కోసం మనదేశంలో మాయపథకాలు ఎన్నెన్నో వెల్లువెత్తుతున్నాయి. అవినీతి యధేశ్చగా తాండవిస్తున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థలో పాలకుల పరిమితి ఇది. ఏడేండ్ల క్రితం ప్రధాని మోడీ అధికారంలోకి రాగానే సోషలిజాన్ని, శాస్త్రీయతను విడనాడి,ర క్రమేణా సాగుతున్న పెట్టుబడిదారీ విధానం హిందుత్వంలోకి ప్రవహిస్తుందని అందరూ ఆనాడే ఊహించారు. ఆ జమిలి తత్వం ఫాసిజం వైపునకు నడిపిస్తున్నట్టు అర్థమవుతూనే ఉన్నది. ఇదే విషయాన్ని టైమ్-100 కథనం వర్ణించింది. 'భారతదేశం లౌకికవాదానికి దూరమయింది. హిందూ అతివాదాన్ని స్వీకరించింది. ముస్లిం మైనార్టీ హక్కులు దెబ్బతింటున్నాయి. ఇంటర్నెట్ గ్రూప్‌ల మూసివేత డబ్భైశాతం భారతదేశంలోనే అమలైంది. కోవిడ్ మరణాలను తక్కువ చేసి చూపింది.' ఈ కథనం పాలకుల బండారాన్ని బయటపెట్టింది.
వాస్తవాలతో కూడిన శాస్త్రీయ విశ్లేషణే ఎక్కడైనా ఎప్పుడైనా నిజాలను నిగ్గుతేల్చు తుంది. మార్క్సిజం లెనినిజం శక్తి కూడా అదే. ఆ భావజాలం మాత్రమే ప్రజలను ప్రగతికి చేరువ చేస్తుంది. కనుకనే రోజాలగ్జంబర్గ్, గ్రాంసీ వంటి మార్క్సిస్టు ఆధునికులు విద్యను మూడు రకాలు గా వర్గీకరించారు. 1. సాధారణ విద్య-లోకం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడు తుంది. 2. ఉపాధి విద్య - బతుకు తెరువుకు అవసరమైన నైపుణ్యతను అందిస్తుంది. 3. విముక్తి విద్య - సకల మానవాళిని దోపిడీ నుండి పీడన నుండి విముక్తి చేయడానికి తోడ్పడు తుంది. శాస్త్రీయత, కళలు, పరిశోధన, తత్వం, తర్కం అన్ని ఇందులో మిళితమై ఉంటాయి. ఈ విద్యకు అంతం లేదు. శాంతి, సమభావం, ప్రజాస్వామ్యమే దీని ఆకర్షణా శక్తి. అందుకే నవయువత రాబోవు యుగం దూతలుగా వామపక్ష భావజాలం ముంగిళ్ళల్లోకి మరల చేరుకుంటున్నారు.
- కె. శాంతారావు
సెల్: 9959745723