Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ వ్యయానికి కావలసిన సొమ్మును సమీకరించడానికి ప్రధాన ఆర్థిక వనరుగా పెట్రో ఉత్పత్తులమీద పన్నులను పెంచడం మోడీ ప్రభుత్వానికి ఒక విధానంగా ఉంది. మాంద్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థ ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా డిమాండ్‌ను పెంచడానికి, తద్వారా ఆ మాంద్యాన్ని అధిగమించడానికి పూనుకోవడం జరుగుతుంది. ఐతే ఆ వ్యయాన్ని పెంచడం కోసం మోడీ చేపట్టిన విధానం ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి కావలసిన ఊపును ఇవ్వకపోగా ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచడానికి దారి తీస్తున్నది. ప్రభుత్వ వ్యయానికి కావలసిన అదనపు ఆర్థిక వనరుల కోసం సంపన్నులమీద పన్నులు అదనంగా వేయడం (సంపద పన్ను వేయడం అన్నింటిలోకీ మెరుగైన మార్గం) దీనికన్నా మెరుగైన విధానం. అలా విధించిన అదనపు పన్నుల వలన వచ్చే అదనపు ద్రవ్యాన్ని ప్రభుత్వపు అదనపు వ్యయం కోసం వినియోగిస్తే అప్పుడు ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి కావలసిన ఊపు రావడమే గాక ద్రవ్యోల్బణం పెరగకుండా అదుపులో ఉంచవచ్చు.
ఒక సరళమైన ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని వివరించవచ్చు. అదనంగా రూ.100 ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనుకుందాం. పెట్రో ఉత్పత్తులమీద అదనపు పన్ను విధించడం ద్వారా ఆ మొత్తాన్ని రాబట్టిందనుకుందాం. అలా పెంచిన అదనపు పన్ను వలన అన్ని రకాల సరుకుల ధరలూ పెరుగుతాయి. రవాణా చార్జీలు పెరగడం ప్రధానంగా జరుగుతుంది. దానికి తోడు వంటగ్యాస్ ధర కూడా పెరుగుతుంది. అందువలన జీవన వ్యయం పెరుగుతుంది. ఈ పెరుగుదల ప్రభావం సంపన్నుల మీద కన్నా, శ్రామిక ప్రజానీకం మీద మరింత ఎక్కువగా పడుతుంది. శ్రామిక ప్రజలు సంపాదించే ఆదాయాలను పూర్తిగా ఖర్చు చేస్తారు. వారి నిజ ఆదాయాలు ధరల పెరుగుదల వలన పడిపోతాయి. అందువలన వారి వాస్తవ వినియోగం కూడా పడిపోతుంది. అందుచేత పెట్రో ఉత్పత్తులమీద అదనంగా రూ.100 పన్ను పెంచినందువలన, శ్రామిక ప్రజల నిజ వినిమయం దాదాపు రూ.100 మేరకు పడిపోతుంది. ఇంకోవైపు ఆ రూ.100 మేరకు ప్రభుత్వ వ్యయం పెరిగినందువలన స్థూల డిమాండ్ రూ.100 మేరకు పెరుగుతుంది. ఈ రెండు రకాల ఫలితాలనూ కలిపి చూసుకుంటే మొత్తం మీద స్థూల డిమాండ్ పెరిగినదేమీ ఉండదు. అందుచేత ఇటువంటి ద్రవ్య విధానం వలన ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి కావలసిన ఊపు రాదు.
పైగా ధరలు పెరిగినందువలన ఆర్థిక వ్యవస్థ పుంజుకోకపోగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఆ విధంగా రెండు విధాలా దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోతున్నది. అక్టోబర్ 2020తో పోల్చి చూసుకుంటే అక్టోబర్ 2021 నాటికి ద్రవ్యోల్బణం 4.48శాతం పెరిగింది. మరోవైపు పారిశ్రామిక మాంద్యం యధావిధిగా కొనసాగుతూనేవుంది. ఇంకోపక్క భారతీయ ఆహార సంస్థ దగ్గర భారీ పరిమాణంలో ఆహార ధాన్యాల నిల్వలు పోగుబడివున్నాయి. సెప్టెంబర్ 2021నాటికి గతేడాదితో పోల్చుకుంటే పారిశ్రామిక వృద్ధి కేవలం 3.1శాతం మాత్రమే పెరిగింది. అదే ఆగస్టు 2021తో పోల్చుకుంటే సెప్టెంబర్ 2021కి పారిశ్రామిక ఉత్పత్తి 2.6శాతం తగ్గిపోయింది.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్రవ్య విధానం వలన శ్రామిక ప్రజల నిజ ఆదాయాలు పడిపోవడమే గాక ఉపాధి అదనంగా కల్పించినది కూడా ఏమీ లేదు. ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమల స్థాపక సామర్థ్యం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం. మరోవైపు భారీ పరిమాణంలో ఆహార ధాన్యాల నిల్వలు నిరుపయోగంగా పడివున్నాయి. అంటే ఆర్థిక వ్యవస్థ మందకొడిగా నడుస్తోంది. ఇటువంటి సమయంలో ఒక ప్రభుత్వం అనుసరించకూడని ఆర్థిక విధానాన్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో సంపన్నుల లాభాలను గాని, వారి సంపదను గాని దెబ్బ తీయకుండానే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే విధానాన్ని చేపట్టే వీలుంది.
ప్రభుత్వం దగ్గర ఉన్న ఆహార నిల్వలను, పరిశ్రమలకు ఉన్న పూర్తి స్థాపక సామర్థ్యాన్ని వినియోగించుకునేలా ప్రభుత్వ వ్యయం ఉండాలి. దానికి బదులుగా మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఖర్చు పెంచడానికి పూనుకుంది. (ఇప్పుడు ఆ ఖర్చు కూడా తగ్గిపోతోందనుకోండి) ఇందుకోసం శ్రామిక ప్రజలనుండి అదనంగా పిండుకుంటోంది. కాని ఇప్పటికే ఉన్న అదనపు ఆహార నిల్వలను గాని, పరిశ్రమల స్థాపక సామర్థ్యాన్ని గాని ముట్టుకోవడమే లేదు.
దీనికి ప్రత్యామ్నాయ విధానాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులమీద పన్నులను తగ్గించి, ద్రవ్యలోటును పెంచి అదనపు వ్యయాన్ని ఇప్పడు చేస్తున్న మాదిరిగానే చేసిందనుకుందాం. అప్పుడు అదనంగా ఖర్చు చేసిన రూ.100 మేరకు స్థూల డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో ఆ అదనపు ఖర్చు కోసం ఎవరిపైనా అదనపు భారాన్ని మోపలేదు కనుక ఇంకెక్కడా కూడా ఉన్న డిమాండ్ పడిపోదు. అంటే మొత్తంగా స్థూల డిమాండ్ పెరుగుతుంది. అలా పెరిగిన మేరకు ఆర్థిక కార్యకలాపాలు విస్తృతమౌతాయి. ఉపాధి అదనంగా కలుగుతుంది. అదే సమయంలో ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఆ విధంగా శ్రామిక ప్రజలకు పెరిగిన ఉపాధి ద్వారా, తగ్గిన ధరల ద్వారా- రెండు విధాలుగానూ ప్రయోజనం కలుగుతుంది.
అయితే, ఈ విధంగా అదనపు ప్రభుత్వ వ్యయాన్ని చేపట్టడం కోసం ద్రవ్యలోటును పెంచడం వలన వేరే ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతాయి. దీని వలన సంపదలో అసమానతలు పెరుగుతాయి. ద్రవ్యలోటును పెంచి వ్యయం అదనంగా చేపట్టినప్పుడు అందుకోసం అవసరమైన సొమ్మును ప్రయివేటు రంగం నుండి అప్పుల రూపంలో ప్రభుత్వం సమీకరించాల్సి ఉంటుంది. (విషయం తేలికగా అర్థం కావడానికి వీలుగా ఈ ఉదాహరణలో విదేశాల నుండి అప్పులు సమీకరించే అవకాశం గురించి ప్రస్తావించడం లేదు) అలా ప్రయివేటు పెట్టుబడిదారుల నుండి అప్పు రూపంలో ప్రభుత్వం సమీకరించే రూ.100ను ఖర్చు చేసినప్పుడు పెరిగిన ఆర్థిక కార్యకలాపాల ద్వారా అంతిమంగా ఆ రూ.100 తిరిగి ఆ పెట్టుబడిదారుల వద్దకే చేరుతుంది. మొదట ఆ రూ.100ను ప్రభుత్వానికి అప్పుగా ఇవ్వడానికి ఆ పెట్టుబడిదారులు తాము చేసే వ్యయాన్ని తగ్గించుకోవలసిన అవసరం ఏమీ ఉండదు. వారివద్ద ఉన్న మిగులు నుండే ఆ అప్పు ఇస్తారు. అలా అప్పుగా ఇచ్చినందువలన వారి వ్యయం ఏమీ తగ్గదు. మరోవైపు వారిచ్చిన అప్పు మళ్ళీ మరో రూపంలో వారి వద్దకే చేరుతుంది. పైగా ప్రభుత్వం వారికి ఆ రూ.100 బకాయిని కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ ద్రవ్యలోటును పెంచి ప్రభుత్వ వ్యయాన్ని అదనంగా చేపట్టే విధానం పెట్టుబడిదారుల సంపదను బ్రహ్మాండంగా పెంచుతుంది. అలా వారి సంపద పెరగడానికి కార్మికులు కూడా అదనంగా ఏమీ వొదులుకోనవసరం లేదు. ఆర్థిక వ్యవస్థలో వినియోగం కాకుండా ఉండిపోయిన పరిశ్రమల స్థాపక సామర్థ్యం, ఆహార నిల్వలు - వీటి వల్లనే పెట్టుబడిదారు లకు అదనపు సంపద చేకూరుతుంది. ఇక్కడే ప్రత్యక్ష పన్నుల పాత్ర ముందుకొస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం రూ.100 మేరకు ప్రత్యక్ష పన్నులను అదనంగా పెంచిందనుకోండి. అప్పుడు ప్రభుత్వ బడ్జెట్ అదనపు లోటు పెరగకుండా బాలెన్స్డ్గా ఉంటుంది. అదనంగా ప్రభుత్వం చేపట్టిన రూ.100 వ్యయానికి సరిపడా అదనపు పన్నుల ద్వారా రూ.100 ఆదాయం సమకూరుతుంది. అప్పుడు ప్రభుత్వం అదనంగా అప్పు చేయవలసిన అవసరమూ రాదు. ఆ పెట్టుబడిదారులకు అదనంగా సంపద పెరిగిపోయే పరిస్థితీ రాదు.
వివిధ రకాల ప్రత్యక్ష పన్నులలోకెల్లా సంపద పన్ను విధించడమే అత్యంత ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యయం పెరిగినందువలన సంపన్నుల దగ్గరకి వచ్చిపడే అదనపు సంపదను ఆ విధంగానే ప్రభుత్వ తిరిగి రాబట్టగలుగుతుంది. మరోవైపు అదనపు ప్రభుత్వ వ్యయం వలన అదనంగా ఉపాధి కల్పన జరగడమే గాక ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉంటుంది. ఆ విధంగా సంపద పన్ను విధించడం వలన ప్రభుత్వం తన లక్ష్యాన్ని (ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుండి బైటకు తేవడం) నేరుగా చేరుకుంటుంది. ఈ విధంగా చేయడం వలన దేశీయ పెట్టుబడిదారులకు ఇప్పుడున్న సంపద ఏమీ తగ్గిపోదు. వారి వద్ద అదనంగా అమితంగా సంపద పేరుకుపోకుండా నిరోధించడానికి వీలు కలుగుతుంది. అందుచేత సంపదపన్ను విధించి అదనపు ప్రభుత్వ వ్యయాన్ని చేపట్టి ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుండి బైటకు తీసుకురావడం అనేది మోడీ ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కన్నా, ద్రవ్యలోటును పెంచి అదనపు వ్యయాన్ని చేపట్టే విధానం కన్నా మెరుగైనది.
మరి అటువంటప్పుడు ఈ ప్రభుత్వం ఆ మెరుగైన విధానాన్ని ఎందుకు అనుసరించడం లేదు? ఎందుకు శ్రామిక ప్రజల కొనుగోలు శక్తిని, దానితోబాటు దేశీయ డిమాండ్‌ను దెబ్బతీసే విధంగా పెట్రో ఉత్పత్తులమీద పన్నులను అదనంగా విధిస్తోంది? అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి కోరికల మేరకు, దాని ప్రతినిధులుగా వ్యవహరించే ఐఎంఎఫ్ వంటి సంస్థలు విధించే షరతులకు లోబడి, మోడీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సంపద పన్నుకు వ్యతిరేకం. దేశీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న కార్పొరేట్ శక్తుల పెత్తనాన్ని సంపద పన్ను దెబ్బ తీస్తుంది. మోడీ ప్రభుత్వం ఈ కార్పొరేట్ శక్తులను హృదయపూర్వకంగా బలపరుస్తోంది. ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి బడ్జెట్ లోటును పెంచడానికి కూడా వ్యతిరేకం. అలా పెంచివేయకుండా ప్రభుత్వాలను నియంత్రించడానికే ఎఫ్ఆర్బిఎం చట్టం వచ్చింది. ఆ చట్టం జీడీపీలో ఒకానొక శాతానికి మించి ద్రవ్యలోటు ఉండరాదని నిర్దేశిస్తోంది. అందువలన ఇక మోడీ ప్రభుత్వానికి మిగిలిన దారి పరోక్ష పన్నులను పెంచి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడమే. అందుకే ఈ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎప్పటికప్పుడు అదనంగా పనునలను పెంచుకుంటూపోతోంది. అంటే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ తప్పుడు ద్రవ్య విధానం పూర్తిగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నిర్దేశించిన విధానాల చట్రానికి లోబడే అమలు అవుతోంది.
కాని, ఇప్పుడు అంతర్జాతీయమార్కెట్లో చమురుధరలు పెరుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం ప్రస్తుత విధానాన్నే కొనసాగిస్తే, మరింతగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగి, దాని వలన ద్రవ్యోల్బణం మరింత వేగంగా పెరుగుతుంది. అలా ద్రవ్యోల్బణం పెరగకుండా అదుపు చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులమీద తాను విధిస్తున్న అదనపు పన్నులను తగ్గించాలి. కాని అప్పుడు ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. కనుక ద్రవ్యలోటును పరిమితిలోనే ఉంచడానికి ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకోవలసివుంటుంది. అది మరింత నిరుద్యోగాన్ని పెంచుతుంది.
ఆ విధంగా మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలను అమలు చేయడం వలన దేశంలో అదనపు పారిశ్రామిక సామర్థ్యం ఉన్నా, ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నా ఉపయోగించుకోలేని స్థితిలో పడింది. ఆ ఆదేశాలకు లోబడిన కారణంగా, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి చర్యలు ఏవి తీసుకున్నా అవి నిరుద్యోగం మరింత పెరిగిపోడానికే దారి తీస్తాయి. ఇదే ఈ ద్రవ్య విధానాల లోపం.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్