Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాల తరబడి ఆదివాసీలు నిర్లక్ష్యానికి గురయ్యారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ నెల 15న గిరిజన నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా భోపాల్‌లో జరిగిన ఆదివాసీల ర్యాలీలో మాట్లాడుతూ ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో ఆదివాసీలను భాగస్వాములను చేసింది, వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను చేసింది తమ ప్రభుత్వం మాత్రమేనని చెప్పుకున్నారు.
దేశంలోని అడవులు, అటవీ భూములతో అంతర్గతంగా ముడిపడి ఉన్న ఆదివాసీల జీవన శైలిని, వారి జీవనోపాధులను, వారి హక్కులను మోడీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీస్తోంది. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఆదివాసీల ప్రయోజనాల కోసం పని చేస్తున్నామని మోడీ చెప్పుకుంటున్నారు. పైగా బిర్సా ముండా జయంతి ఉత్సవాలు కూడా జరిపారు.
స్వతంత్ర భారతంలోని గిరిజనుల దుస్థితి ఎలా వుందో పెట్టుబడిదారుల అభివృద్ధి పంథాలో గుర్తించవచ్చు. అటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఇటు ప్రయివేటు కార్పొరేట్ సంస్థల ప్రాజెక్టుల కారణంగా ఆదివాసీలు తమ సాంప్రదాయ నివాస ప్రాంతాలకు దూరమవుతున్నారు. చాలామంది ఆదివాసీలు అక్రమార్కులైన కాంట్రాక్టర్ల బానిసత్వంలోకి నెట్టబడుతున్నారు. వారి మౌలిక ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. అయితే 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ క్రమం అలా కొనసాగుతూనే ఉంది. వారు నిర్వాసితులవుతూనే ఉన్నారు. పైగా, గనుల తవ్వకాలు, ఖనిజాలు, ఇతర వెలికితీసే పరిశ్రమల ద్వారా ప్రయివేటు పెట్టుబడిదారులు అటవీ సంపదను, సహజ వనరులను అనుచితంగా కొల్లగొట్టడం మరింత ఎక్కువైంది.
ఐదవ, ఆరవ షెడ్యూల్ ప్రాంతాల్లో గనుల తవ్వకాల లీజుకు, ఇతర ప్రాజెక్టులకు గ్రామసభల అనుమతి తీసుకోవాల్సిన అవసరాన్ని పలు విధానపరమైన చర్యల ద్వారా మోడీ ప్రభుత్వం నీరుగార్చింది. మొట్టమొదటగా గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం-2015ని మోడీ ప్రభుత్వం ఆమోదించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011లో సవరణ చట్టం ఆమోదించడం ద్వారా ప్రవేశ పెట్టిన కొన్ని నిబంధనలను ఈ చట్టం ఎత్తివేసింది.
ఐదవ, ఆరవ షెడ్యూల్ ప్రాంతాల్లో గనుల తవ్వకాలకు లీజులను మంజూరు చేయాలంటే గ్రామసభలను సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఐదవ, ఆరవ షెడ్యూల్ ప్రాంతాల్లో మైనర్ ఖనిజాల మంజూరుకు గిరిజన సహకార సంఘాలకు గల అర్హతను, బొగ్గు కంపెనీలు తమ లాభాల్లో 26శాతం మొత్తాలను జిల్లా ఖనిజ సంస్థలకు ఇవ్వాలన్న తప్పనిసరి నిబంధనను అన్నింటినీ మోడీ ప్రభుత్వం రద్దు చేసింది.
ఆ రకంగా, మోడీ ప్రభుత్వం ఒక వైపు, గిరిజనులు ఎక్కువగా ఉండే అటవీ ప్రాంతాల్లో మైనింగ్, ఖనిజ సంస్థల ఏర్పాటుకు లైసెన్సులు ఇస్తోంది. అదే సమయంలో ఐదవ, ఆరవ షెడ్యూలు ప్రాంతాల్లో గిరిజనుల రాజ్యాంగ బద్ధమైన హక్కులను లాక్కుంటోంది.
భారత అటవీ చట్టం-1927కి ప్రతిపాదించిన సవరణ గ్రామసభల పాత్రను తుడిచిపెట్టడానికి, అటవీ ప్రాంతాలపై వారికి గల హక్కులకు సంబంధించి ఇతర కమ్యూనిటీలతో గిరిజనులను సమానం చేయడానికి, సాగు, చేపల వేటకు గల హక్కు, అటవీ ఉత్పత్తులపై, పచ్చిక బయళ్ళపై గల హక్కు వంటి గిరిజనుల జీవనానికి సంబంధించిన అన్ని అంశాలను నేరపూరితం చేయడానికి దారి తీస్తోంది.
దీంతో, అటవీ చట్ట సవరణ బిల్లుకు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటివరకు బిల్లు ఆమోదం పొందలేదు. అయితే, 2018-19 నాటి ప్రతిపాదిత అటవీ విధానం లేదా అటవీ సంరక్షణ చట్టం-1980కి ప్రతిపాదించిన సవరణలు... ఏవైనా కానీ, మొత్తంగా అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాల కోసం మళ్ళించే ప్రక్రియ సులభతరమవుతుంది. ప్రయివేటీకరణను పెంపొందుతుంది. అడవులను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం ఎక్కువవుతుంది. అడవుల ప్రయివేటీకరణ, వాణిజ్యీకరణపై గ్రామసభ అనుమతి తప్పనిసరి కాగా ఇక ఆ హక్కు లేకుండా చేస్తున్నారు.
ప్రతిపాదిత విధానపరమైన మార్పులన్నీ అటవీ హక్కుల చట్ట నిబంధనలను దెబ్బతీస్తాయి. అటవీ భూములపై గిరిజన తెగలకు గల హక్కులను, దీర్ఘకాలంగా అటవీ ప్రాంతాల్లో నివాసమున్న వారి హక్కులను ఈ చట్టం గుర్తిస్తోంది. సాగు చేసుకోవడానికి వారికి గల హక్కును, పైగా చిన్నపాటి అటవీ ఉత్పత్తులను తీసుకోవడానికి గల హక్కును గుర్తిస్తోంది.
గిరిజనుల హక్కులను లాక్కోవడం పూర్తి స్థాయిలో సాగుతోంది. ఆదివాసీలు, ఆదివాసీ సమాజాలకు అటవీ భూములపై పట్టా కలిగి ఉండే హక్కు, అటవీ భూములను తాము మాత్రమే సాగు చేసుకునే హక్కును ప్రసాదించిన అటవీ హక్కుల చట్టం-2006ని సైతం ఇప్పుడు ఉల్లంఘించేశారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2020 ఆగస్టు 31 వరకు అటవీ భూములపై హక్కు కోసం గిరిజనులు, గిరిజన తెగలు దాఖలు చేసుకున్న క్లెయిమ్‌లలో కేవలం 46.69 శాతం మాత్రమే ఆమోదించారు. అంటే, సగాని కన్నా తక్కువే ఆమోదించారన్న మాట. మధ్యప్రదేశ్‌లో, తమ ప్రభుత్వ గిరిజన అనుకూల విధానాల గురించి మోడీ గొప్పగా చెప్పుకున్న చోట, దాదాపు ప్రతి ఐదు కుటుంబాల్లో మూడు కుటుంబాలు అటవీ హక్కుల చట్టం కింద పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించారు.
మోడీ ప్రభుత్వ హయాంలో ఆదివాసీల సామాజిక సంక్షేమం ఏ తీరున ఉందో తెలియాలంటే ఆదివాసీ పిల్లల దుస్థితి చూస్తే చక్కగా స్పష్టమవుతుంది. మొదటిసారి లాక్డౌన్ పెట్టి స్కూళ్ళను మూసివేసినపుడు... అంటే 2020 మార్చి నుండి...గ్రామీణ ప్రాంతాల్లో 90 నుండి 95 శాతం ఆదివాసీ విద్యార్థులు మొత్తంగా విద్యకు దూరమయ్యారు. ఆదివాసీ విద్యార్థులకు ఆన్లైన్ విద్యా ప్రపంచం మూసుకుపోయింది. మరింతమంది ఆదివాసీ పిల్లలకు విద్యాహక్కు అనేది మనుగడలో లేకుండా పోయింది.
ఆహార భద్రతకు సంబంధించి చూసినట్లైతే గ్రామీణ ప్రాంతాలలోని ఆదివాసీల కుటుంబాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆకలితో మగ్గిపోతున్న సంఘటనలే ఎక్కువ. ఇక మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు పొందడానికి సంబంధించి అత్యంత తీవ్రంగా దెబ్బ తినేవారు వీరేనని చెప్పుకోవచ్చు.
ఆదివాసీల పట్ల మోడీ ప్రభుత్వ వైఖరి మితవాద అస్తిత్వ రాజకీయాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఆదివాసీ సమాజంతో తనకు గల అనుబంధాన్ని రాముడికి ఆయనకు గల ఆదర్శప్రాయమైన విలువలతో పోల్చు కున్నారు మోడీ. ఈ సందర్భంగా తన ప్రసంగంలో రాముడిని ప్రస్తావించారు. బహు కొద్ది స్థాయిలోనే అయినా ఆదివాసీలను హిందూత్వ వ్యవస్థ లోకి తీసుకువచ్చే ప్రాజెక్టుతో సమానంగా దీన్ని చూడవచ్చు.
ఆదివాసీ ప్రముఖులను ప్రశంసించడం, వారి పేర్లను రైల్వే స్టేషన్లకు పెట్టడం, వారికి విగ్రహాలు నిర్మించడం సరేసరి. మరోవైపున అటవీ భూములపై, అడవులపై వారి హక్కును కాలరాస్తున్నారు. వారి ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందుత్వ కార్పొరేట్ పాలనా వ్యవస్థకు ఆదివాసీలే ప్రధాన బాధితులయ్యారు.
-'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం