Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సి.బి.ఐ'', ''ఇ.డి'' - ఈ రెండు కేంద్ర సంస్థల డైరెక్టర్ల పదవీ కాలాన్ని ప్రస్తుతం ఉన్న రెండేండ్ల నుంచి ఐదేండ్లకు పొడిగిస్తూ మోడీ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులను జారీ చేసింది. ఈ రెండు కేంద్ర సంస్థలూ పాలక పార్టీ చేతుల్లో పనిముట్లుగా, ఆ పార్టీ ఎండాను ముందుకు తీసుకుపోడానికే పని చేస్తున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిపక్ష పార్టీల నేతలను, ప్రభుత్వ చర్యలను విమర్శించే మేథావులను, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించి నిలదీసే వారిని ఈ సంస్థలు తమ లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అందుచేత వాటి డైరెక్టర్ల పదవీకాల పరిమితిని పెంచడం ఆ సంస్థల స్వయంప్రతిపత్తిని మరింతగా దెబ్బ తీసి, వాటి అధికారులను తమకు మరింత లొంగివుండేలా చేయడం కోసమేనని గ్రహించడానికి పెద్ద పరిజ్ఞానమేమీ అవసరం లేదు.
ఒకప్పుడు సుప్రీం కోర్టు సిబిఐని 'పంజరంలో చిలక' అని అభివర్ణించింది. కాని మోడీ అధికారానికి రెండోసారి వచ్చిన తర్వాత ఈ సంస్థలు రాజ్యాంగం ప్రకారం మనకు సంక్రమించిన వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను స్వాహా చేసే రాబందుల్లాగా తయారయ్యాయి. ఈ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయకుండా గతంలోనే సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. ఆ సంస్థల ఉన్నతాధికారుల పదవీకాల పరిమితిని ఒకవేళ పెంచవలసివస్తే అది చాలా తక్కువ కాలానికే పెంచాలని, పెండింగులో ఉన్న విచారణను పూర్తి చేయడానికి మాత్రమే ఆ విధంగా చేయాలని స్పష్టంగా చెప్పింది. అటువంటి చర్య అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే తీసుకోవాలని కూడా చెప్పింది. అందుకే ప్రతిపక్షాలు, వాటితోబాటు సవ్యంగా ఆలోచించే వారందరూ నేడు ప్రజాస్వామ్య హక్కులకు, వ్యక్తిగత స్వేచ్ఛకు వాటిల్లుతున్న ముప్పు గురించి ఆందోళన పడుతూ హానికరమైన ఈ ఆర్డినెన్సుల జారీని వ్యతిరేకిస్తున్నారు.
పథకం ప్రకారం సాగుతున్న కుట్ర
ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మొత్తంగానే పాలనా వ్యవస్థను మార్చివేయడానికి కుట్ర జరుగుతోందని భావించాల్సి వస్తోంది. దానివెనుక ఉన్న సైద్ధాంతిక పునాదిని మనం పూర్తిగా అవగతం చేసుకోవాలి. జమ్ము, కాశ్మీర్లో సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక యువకుడిని కాల్చి చంపడాన్ని ప్రశ్నించిన ఒక మానవ హక్కుల కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ట్రెయినీ పోలీసు ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ పౌర సమాజం ''యుద్ధ రంగపు నాలుగో పార్శ్వం'' అని పేర్కొన్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో యుద్ధం చేయడం ఖరీదైన వ్యవహారం అని, పౌర సమాజాన్ని లోబరుచుకుని, కుట్రలతో, ఎత్తుగడలతో ఆ సమాజం ద్వారానే దేశ ప్రయోజనాలను దెబ్బ తీయడం శత్రువు వ్యూహంగా ఉందని దోవల్ అంటున్నారు. పౌర సమాజం పట్ల తన ద్వేషాన్ని వ్యక్తం చేస్తూ పోలీసు అధికారులంతా దేశాన్ని ఆ పౌర సమాజం బారినుండి రక్షించుకోడానికి సిద్ధం కావాలని ఆయన తెలిపాడు. అంతర్లీనంగా చట్టానికి కట్టుబడి వ్యవహరించాలన్న సూత్రాన్ని ఆయన దెబ్బ తీస్తున్నారు.
నేడు పోలీసులు ఏ చట్టాలనైతే గౌరవించి నడుచుకోవాలో, ఆ చట్టాలన్నీ బ్రిటిష్ వలస పాలకుల కాలంలో రూపొందినవే. వాటిని జారీ చేసినప్పుడు ఏ విధమైన ప్రజాస్వామ్యయుత చర్చా జరపలేదు. దేశద్రోహ చట్టం ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఈ చట్టాలను అస్పష్టమైన పరిభాషలో, ఏ విధంగానైనా దుర్వినియోగపరచడానికి వీలు ఉండేలా రూపొందించారు. ఏ విధమైన దుర్వినియోగాన్నైనా పరిశీలించి, సరిదిద్దే అవకాశం న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది. అలా సరిదిద్దడం ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పరిధిలో లేదు. దోవల్ చెప్పిన సిద్ధాంతం ఒక పోలీసు రాజ్యం కోసం ఒక పోలీసువాడు ప్రతిపాదించిన సిద్ధాంతం. ప్రభుత్వాన్ని సవాలు చేసే ప్రతీ వాడినీ దేశానికి శత్రువుగా పరిగణించాలని ఆ సిద్ధాంతం చెప్తోంది. పౌర సమాజం యుద్ధరంగపు నాలుగో పార్శ్వం అని అనడం వెనుక అర్థం ఇదే. జనరల్ బిపిన్ రావత్ మరో ముందుడుగు వేసి జమ్ము కాశ్మీర్ ప్రజానీకం ఉగ్రవాదుల్ని చితక్కొట్టి చంపెయ్యడానికి సిద్ధంగా ఉండడం చాలా మంచి విషయం అని బహిరంగంగానే ప్రకటించారు. ఈ విధమైన నిర్ధారణకు అతను రావడానికి వెనక కొన్ని గుర్తు పట్టడానికి వీలులేని సోషల్ మీడియా పోస్టులు మాత్రమే ఆధారాలుగా ఉన్నాయి. కాని ఇంకో పక్క దేశంలో చాలా చోట్ల జరిగిన ఎన్కౌంటర్ హత్యలకు సంబంధించి ఆధారాలు గుట్టలు గుట్టలుగా ఉన్నా, మన మిలిటరీ జనరల్ వాటిని చూడలేకపోతున్నారు. అవన్నీ పోలీసులు ఆత్మరక్షణ కోసం చేసినవేనన్న వాదనను సమర్ధిస్తున్నారు. కొంతమంది మూకలు చట్టంతో నిమిత్తం లేకుండా, విచారణ అవసరం లేకుండా, తమ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించడాన్ని ప్రోత్సహించడం తప్ప ఇది వేరొకటి కాదు.
ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దోవల్, రావత్ వంటి వారికి వత్తాసునిచ్చేలా ఉన్నాయి. ''కొందరు కొన్ని సందర్భాలలో మాత్రమే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టు, మరికొన్ని సందర్భాలలో జరగనట్టు పరిగణిస్తున్నారు. రాజకీయపు కళ్ళద్దాల్లోంచి చూసినప్పుడు మాత్రమే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టు అనిపిస్తుంది. ఈ విధంగా చూడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో కొందరు దేశ ప్రతిష్టనే మసకబారుస్తున్నారు. ఆ విధంగా రాజకీయ కోణం నుంచి మానవ హక్కులను చూడడం అటు మానవ హక్కులకు, ఇటు ప్రజాస్వామ్యానికి కూడ హానికరం'' అని మోడీ అన్నారు. నిరాధారంగా మానవ హక్కులను, రాజ్యాంగపరమైన హక్కులను కించపరచడం చూస్తే ఈ దేశం ఒక నిర్బంధ రాజ్యం దిశగా అడుగులు వేస్తోందని అనిపిస్తున్నది.
క్రూర చట్టాల ప్రయోగం, దుర్వినియోగం
దేశద్రోహ చట్టం, ఉపా (సవరణ) చట్టం, జాతీయ భద్రతా చట్టం వంటి క్రూరమైన చట్టాలను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల త్రిపురలో మైనారిటీలపై జరిగిన హింసాకాండ అనంతరం వాస్తవాలను తెలుసుకోడానికి అక్కడికి వెల్ళిన సుప్రీం కోర్టు న్యాయవాదులను, పాత్రికేయులను ఉపా చట్టం కింద బుక్ చేయడం చూస్తే ఈ చట్టాల ప్రయోగం ఏ వికృత స్థాయికి చేరిందో బోధపడుతుంది. దేశద్రోహ నేరం కింద కేసులను ఎదుర్కొన్న వారిలో 9శాతం, ఉపా చట్టం కింద కేసులు ఎదుర్కొన్నవారిలో 11శాతం కొన్ని సంవత్సరాలపాటు నిర్బంధంలో ఉన్న తర్వాత ఎటువంటి ఆధారాలూ లేవని పోలీసులే ఆ కేసులు మూసేశారు. దేశద్రోహ నేరం కింద అరెస్టయిన వారిలో కేవలం 17శాతం మంది మీద మాత్రమే చార్జిషీట్లు దాఖలు చేశారు. అదే ఉపా చట్టం కింద అరెస్టయిన వారిలో 9శాతం మంది మీద మాత్రమే చార్జిషీట్లు దాఖలయ్యాయి. దేశద్రోహ నేరం రుజువై శిక్షలు పడినవారు కేవలం 3.3శాతం మాత్రమే. ఇతర నేరాలతో పోల్చితే దేశద్రోహ నేరం కింద, ఉపా కింద శిక్షలు పడినవారి సంఖ్య చాలా స్వల్పం.
జాతీయ నేరాల రికార్డు ప్రకారం 2016తో పోల్చితే 2019లో దేశద్రోహ నేరం కింద కేసులు బుక్ అయినవి ఏకంగా 165శాతం పెరిగాయి. ఉపా చట్టం కింద 33శాతం పెరిగాయి. ఈ క్రూర చట్టాలను ఏమాత్రమూ విచక్షణ చూపకుండా విచ్చలవిడిగా ఏవిధంగా ప్రయోగిస్తున్నారో, ఆ చట్టాలలో పేర్కొన్న లక్ష్యాలకు ఉద్దేశాలకు సంబంధం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నారో పై వివరాలే తెలియజేస్తున్నాయి.
నిర్భంధ రాజ్యాన్ని సాయుధీకరించడం
నిరసనల గొంతు నులిమేయడానికి ఉపయోగిస్తున్న సాధనాలు చూస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం అవుతున్నదో కనపడుతుంది. రక్షణ అవసరాలకు మాత్రమే ఉపయోగించడానికి రూపొందిన పెగాసస్ గూఢచర్య సాధనాన్ని వినియోగించడం మీద చెలరేగిన వివాదం ఒక ప్రధాన ఉదాహరణ. అటువంటి సాధనాలద్వారా వ్యక్తిగత గోప్యతకు కలిగే హాని ఏ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా ముప్పే. ఈ విషయం మీద సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది. ఆ వివరాలను బహిర్గతం చేయడం దేశ రక్షణకు చేటు తెస్తుందన్న ప్రభుత్వ వాదన చెల్లనిది. ఆ గూఢచర్య సాధనాన్ని కలిగివుండడమే వ్యక్తిగత గోప్యతకు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం అని ప్రభుత్వానికి తెలుసు.
అటువంటిదే కేంద్ర హోంమంత్రి ఇచ్చిన ఓ ప్రకటన. డిల్లీ మత ఘర్షణలలో జరిగిన హింసాకాండకు బాధ్యుల్ని చేస్తూ కొందరిపై కేసులు నమోదు చేయడానికి ముఖాలను గుర్తించే టెక్నాలజీని ఉపయోగించామని ఆయన తెలిపారు. అటువంటి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా నేరస్తులు అని నిర్థారించడానికి ఏ చట్టమూ అనుమతించదు. అంటే చట్టం అనుమతించని పద్ధతులను సైతం వినియోగించి ప్రభుత్వంపై ఎవరూ నోరెత్తకుండా చేస్తున్నారన్నమాట. బీమా కొరెగావ్ కేసులో నిందితులలో ఒకరి ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపే పేరుతో దానిలో తప్పుడు సాఫ్ట్వేర్ జొప్పించి సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన వైనం చూస్తే గుండెలు ఝల్లుమంటాయి.
రానున్న రోజుల్లో...
దేశ ఆర్థిక విధానాలు ఆర్థిక, సామాజిక అసమానతలను విపరీతంగా పెంచివేస్తున్నాయి. అత్యధిక ప్రజానీకం పేదరికంలోకి నెట్టివేయబడుతూ ఉంటే, మరోవైపు సంపన్నులు, మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే కార్పొరేట్లు తమ సంపదను పెంచుకుంటున్న తీరు ఎంతమాత్రమూ సహించరానిది. దీనికి తోడు నిరుద్యోగం భరించలేనంత స్థాయికి చేరుకుంది. జీవనోపాధి కరువైపోతున్నది. చివరికి బతకడమే అసాధ్యం అయిపోతున్నది. ప్రజల ముందు మరో దారి కనిపించడంలేదు. మన దేశంలో పెరుగుతున్న ఆకలి సమస్యను అంతర్జాతీయ సమాజం సైతం గమనిస్తోంది. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. అయినా, ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఆహారధాన్యాలను పంచిపెట్టడానికి సుముఖంగా లేదు. ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యవహారం మీద విమర్శలు రాకుండా పోయే ప్రసక్తే లేదు. అటువంటి విమర్శల గొంతుకలను నులిమేందుకే ప్రభుత్వం నిర్బంధరాజ్యం వైపు అడుగులు వేస్తోంది.
ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరి మన ప్రజాస్వామ్య, లౌకిక గణతంత్ర వ్యవస్థకి చేటు తెస్తున్నది. మానవ హక్కుల మీద, వ్యక్తిగత స్వేచ్ఛ మీద ఇప్పుడు సాగుతున్న దాడులను తిప్పికొట్టాలంటే అందుకోసం విశాల ఐక్యతతో ప్రతిఘటనను నిర్మించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థపై సాగుతున్న దాడిని తిప్పికొట్టకుండా ప్రజల జీవనోపాధి కోసం, వారి మనుగడ కోసం సాగించే పోరాటాలు ముందుకు సాగలేవు. ఈ రెండింటినీ మేళవించి పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడం మన కర్తవ్యం.
(స్వేచ్ఛానుసరణ)
- నిలోత్పల్ బసు