Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు అనగా 390 కోట్లు పైబడి (మొత్తం ప్రపంచ జనాభాలో 49.58శాతం) ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా ఖండాల్లో తీవ్రమైన శారీరక, మానసిక, గృహహింసలకు లోనవుతూ జీవితాలు జీవచ్ఛవంలా గడుపుతున్నారు. మనదేశంలో కూడా ప్రతీ 16నిమిషాలకు ఒక మహిళ అత్యాచారం గురవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశంలో రోజుకు సగటున 77లైంగికదాడులు (రేప్స్) జరుగుతున్నాయి. 2020లో మొత్తం మహిళలకు సంబంధించి 3,71,503 కేసులు నమోదు కాగా, వీటిలో గృహహింస కేసులు 30.9శాతం కాగా, అత్యాచారాలు 28,046. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ మహిళా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రపంచ మహిళా రక్షణ సూచిలో భారత్ 133వ స్థానంలో ఉండటం గమనార్హం...
ప్రపంచ వ్యాప్తంగా లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. మహిళలు అంటే చులకన భావం, తక్కువగా చూస్తూ అనేక రకాలుగా అవమానాలు, దోపిడీ చేస్తూ పురుషాధిక్యత ప్రదర్శిస్తూ, నేటికీ అనేక దేశాల్లో పిల్లలుకనే యంత్రాలుగా, మగవాడికి సేవలు అందించే బానిసలుగా చూస్తున్నారు. ఉద్యోగాలు చేసే చాలామంది మహిళల జీతాలు తమ భర్తల చేతుల్లో ఉండటం ఇందుకు ఓ ఉదాహరణ... అలాగే మహిళా ప్రజాప్రతినిధుల కర్తవ్యాలు అన్నీ వారి భర్తలు, కుటుంబ సభ్యులే నిర్వహించుట దాదాపు అన్ని చోట్లా చూస్తున్న వాస్తవ రూపం. చదువుకున్నా చాలామంది మహిళలు పురుషుల నియంత్రణలో ఉండటం గమనార్హం. ఈ పరిస్థితి నుంచి బయటపడినప్పుడే మహిళా సాధికారత సాధించినట్టు... ప్రతీ స్త్రీ విద్య నేర్వాలి. ధైర్యంగా ఉండాలి. ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలి. చట్టాలపై అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే వారికి జరిగే దోపిడీలు, అవమానాల నుంచి బయట పడి, ప్రపంచ పటంలో ప్రముఖ పాత్ర పోషించగలరు.
ప్రస్తుత తరుణంలో ప్రతీ ముగ్గురు స్త్రీలలో ఒకరు సెక్సువల్ హెరాస్మెంట్/ ఫిజికల్ హింసకు గురవుతున్నారు అని గణాంకాలు చెబుతున్నాయి. 52శాతం మహిళలకు మాత్రమే వారికి నచ్చిన రీతిలో వివాహాలు జరుగుతున్నాయి. అక్రమ రవాణా కేసుల్లో 71శాతం మహిళలు, బాలికలే. వీరిలో ప్రతీ నలుగురిలో ముగ్గురు అఘాయిత్యాలకు గురవుతున్నారు. గర్భంలో ఉన్నప్పుడే భ్రూణ హత్యలు 20శాతం జరుతున్నాయి. అంటే ఎంత దారుణ పరిస్థితులు విస్తరించి ఉన్నాయో అర్థం అవుతుంది. కోవిడ్ నేపథ్యంలో మహిళలు, బాలికలపై గృహహింస, అఘాయిత్యాలు ఎక్కువగా జరిగాయి, వీటిలో భాగస్వామి/ కుటుంబ సభ్యులే ఎక్కువగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అని తెలియవచ్చింది. ఈరోజుకీ కూడా 49 దేశాల్లో మహిళలను గృహహింస నుంచి రక్షించేందుకు చట్టాలేలేవు అంటే ఎంత పురుషాధిక్యత కొనసాగుతుందో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు, సిరియాలో శరణార్థుల ఆక్రందనలు ఇందుకు తాజా ఉదాహరణలు.. 30 దేశాల్లో 200 మిలియన్ల 5-15 వయస్సు కలిగిన బాలికల జ్ఞానేంద్రియాలు (ఎఫ్.జి.యమ్) కత్తిరించ బడ్డాయి అని యునిసెఫ్ వంటి సంస్థలు చెబుతున్నాయి... ఎంత ఘోరం. ప్రపంచ వ్యాప్తంగా చిన్నతనంలోనే వివాహాలు చేయడం వల్ల ప్రతీ ఏటా 22,000 మంది జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. దక్షిణ ఆసియాలో 2000మంది మరణిస్తున్నారు. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో 9600 బాలికలు బలైపోయరు. అంతేకాకుండా, యు.ఎన్. ఎఫ్.పి.ఏ నివేదిక ప్రకారం బ్రెస్ట్ ప్లాటినింగ్, బైండింగ్, బ్రాండింగ్, పెదవి డిస్కులు, మెడ పొడిగింపు, బ్రెస్ట్ ఐరనింగ్, వరకట్నం, బాల్య వివాహాలు, శారీరక దాడులు, ఆహార లోపాలు, సంతాన నియంత్రణ, హింసాత్మక ఆచారాలు, నేరాలు, లింగ వివక్షత, దూషణలు, శారీరక మానసిక హింసలు వంటి భాధలకు బాలికలు, మహిళలు గురై జీవచ్ఛవంలా బతుకులు ఈడుస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై హింస నిరోధించే విధంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1979, 1999, 2008లలో వివిధ తీర్మానాలు చేసి, మహిళలకు కనీస రక్షణ, హక్కులు కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 1981నుంచి నవంబర్ 25న మహిళా హింసా వ్యతిరేక దినోత్సవం జరుపుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఈ ఆధునీకరణ ప్రపంచంలో అందరూ సమానమే అనే భావన అందరిలోనూ కలగాలి. సాటి మనిషిగా మహిళలను గౌరవించాలి. స్త్రీ లేనిదే మానవ మనుగడ లేదని గ్రహించాలి. ముఖ్యంగా తల్లి దండ్రులు వారి పిల్లల అలవాట్లపై శ్రద్ధ తీసుకోవాలి. నైతిక విలువలు, కుటుంబ సంబంధాలు తెలపాలి. చదువు, ఉద్యోగం, ఉపాధి పొందుట ద్వారానే మహిళలు ఈ నవీన కాలంలో సమాజంలో సగౌరవంగా బతుకగలరు అనే భావన వచ్చినప్పుడే మహిళల సాధికారత కల సాకారం అవుతుందని ఈ దినోత్సవం సందర్భంగా అందరూ గ్రహించాలి.
అంతర్జాతీయ మహిళా హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా..
- ఐ. ప్రసాదరావు
సెల్ 9948272919