Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ సేవకైనా, శ్రమకైనా ప్రపంచ గుర్తింపులో అత్యంత ప్రసిద్ధి గాంచినది నోబెల్ బహుమతి. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో ప్రకటించిన నోబెల్ బహుమతుల్లో ఆర్థిక శాస్త్రం, శాంతికి ప్రకటించిన నోబెల్ బహుమతులు ఇటు కార్మిక వర్గానికి అటు భావ వ్యక్తీకరణకు పరితపించే అభ్యుదయ వాదులకు ఒక ఊరటనిచ్చాయి. లాభాలు పెంచుకోవడం కోసం వేతనాల కోతనే పరమౌషధంగా భావించే పెట్టుబడిదారీ వర్గానికి ఈసారి ప్రసాదించిన నోబెల్ బహుమతి యొక్క అంతరార్థం ఒక సమాధానం. కనీస వేతనాల పెరుగుదల కొత్త ఉపాధి అవకాశాలను తగ్గించదని నిరూపిస్తూ చేసిన రీసెర్చ్‌కుగానూ ఈ ఏడు అర్థశాస్త్ర నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. తక్కువ వేతనాలను ఇవ్వడం, ఎక్కువ పనిగంటలు పని చేయించుకోవడం వంటివే అధిక లాభాలకు ఆధారాలుగా భావించే యాజమాన్యాలకు ఇది కనువిప్పు కలిగించాలి.
ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా డి. ఆంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్సన్లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందిస్తున్నట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించగానే అనేకులకు ఆశ్చర్యమేసింది. కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశోధనాత్మక సహకారం అందించినందుకుగానూ డేవిడ్ కార్డుకు నోబెల్ అందించారు. ఇక ఆర్థికశాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు కూడా పురస్కారం ఇచ్చారు. సామాజిక శాస్త్రాల్లో ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఉపాధి, ఉద్యోగుల వేతనంపై వలసవిధానం ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఓ వ్యక్తి సుదీర్ఘ విద్య అతని భవిష్యత్తుపై ఏ మేరకు పనిచేస్తుంది? వలసవిధానం తగ్గడం, వ్యక్తి సుదీర్ఘకాలం చదువుకోకపోవడం ఎలాంటి పరిణామలకు దారితీస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం. అయితే ఈ ప్రశ్నలకు తమ సహజ పరిశోధనలతో సమాధానమివ్వొచ్చని శాస్త్రవేత్తలు డేవిడ్, జాషువా, గైడో రుజువుచేశారు. అయితే ఏ దేశ ప్రభుత్వాలైనా, ఏ రంగంలోనైనా ఇలాంటి పరిశోధనలను గుర్తించడమే కాక వాటిని తమ విధానాల్లో భాగం చేసుకున్నప్పుడే ఆర్థిక అసమానతల తొలగింపు సులభమవుతుంది.
భారతదేశంలో కనీస వేతనాల చట్టం 1948లోనే తయారుచేయబడింది. కానీ కనీస వేతనాలు చెల్లించనందుకు ఇంతవరకు ఎవరినీ చట్టం శిక్షించడం లేదు. అయితే ఈ చట్టం ప్రకారం కార్మిక సంఘాలు పోరాటం చేయడం వలన రాష్ట్రాలు కంపెనీల యాజమాన్యాలు కొంతవరకు కనీస వేతనాలు చెల్లించడానికి చర్చలు మాత్రం జరుపుతాయి, కానీ అమలుకు చిత్తశుద్ది లేదు. కనీస వేతనాల్లో ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి, ఒక రంగానికి మరో రంగానికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. షెడ్యూల్డ్ కంపెనీలకు, రిజిస్టర్డ్ కంపెనీలకు, రిజిష్ట్రేషన్ చేయబడని కంపెనీలలో కూడా కనీస వేతనాలు వ్యత్యాసాలతో కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రిజిస్ట్రేషన్ పొందిన కంపెనీల్లో కూడా కింది స్థాయిలోని ఎక్కువ శాతం ఉద్యోగులు ఎలాంటి మస్టర్ లేకుండా డైలీ వేజ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ అదే కంపెనీలో పని చేస్తున్న వారికన్నా తక్కువ వేతనం చెల్లించబడుతుంది. ఇది అనేక సందర్భాలలో కార్మిక సంఘాల సర్వేలలో బయటపడింది. ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. అయితే భారతదేశంలో రిజిస్ట్రేషన్ చేయబడినవి, షెడ్యూల్లో లేని సూక్ష్మ, మధ్యతరగతి, సీజనల్ ఇండిస్టీలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి చోట దోపిడీ మరింత ఎక్కువగా ఉన్నది. మన దేశంలో అత్యంత ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఈ రకమైన దోపిడీయే. కనీస వేతనాల చెల్లింపు నుండి సంఘటిత రంగం కూడా చాలా తెలివిగా తప్పించుకుంటున్నది. కాంట్రాక్టీకరణల ద్వారా నియమించుకున్న ఉద్యోగులకు సదరు కాంట్రాక్టర్ ఎంత వేతనాలు చెల్లిస్తున్నారో విధిగా తెలుసుకోవలసిన బాధ్యత పని చేయించుకుంటున్న సంస్థకు ఉన్నది. ప్రావిడెంట్ ఫండ్, ఈ.ఎస్.ఐ వంటివి చెల్లిస్తున్నాదా లేదా చెక్ చేయవలసింది కూడా కంపెనీయే. కాంట్రాక్టర్ కూడా తను ఏ ఏ హెడ్స్ కింద ఇస్తున్నాడో తెలుపవలసిన బాధ్యత ఉన్నది. అయితే ఇవన్నీ పేపర్ వరకే పరిమితమై బ్యాంకు క్రెడిట్ మరోలా ఉన్నదని కాంట్రాక్టీకరణల ద్వారా నియమించబడుతున్న ఉద్యోగులందరూ వాపోతుంటారు. దీనికి కాంట్రాక్టర్ ఇచ్చే సమాధానం ఏమంటే- ట్రైనింగు, యూనిఫామ్, రిఫ్రెషర్ ట్రైనింగ్, ఇతర మెయింటెనెన్సు వంటివన్నీ మినహాయించుకున్న తర్వాత ఆ విధంగా చెల్లించవలసి వస్తుందని. దీనిలో నిజానిజాలు ఎంత ఉన్నా నష్టపోయేది కార్మికుడే. కనీస వేతనాల అమలు కోసం రాష్ట్రాల పరిధిలో వేజ్ బోర్డులు అని నామకరణం చేయబడ్డాయి కానీ ఇవి నామ మాత్రంగానే ఉన్నాయి. నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి కూడు, గూడు, గుడ్డతో పాటు విద్య, వైద్యం, ఎంటర్టైన్మెంట్ సదుపాయాల కోసం లెక్కించి, ఆ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించడం, అవి అమలు జరిగేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. కానీ ఇది ఈ దేశమంతా అందని ద్రాక్షే. 2020లో భారత రిజర్వు బ్యాంకు జారీ చేసిన వివరాల ప్రకారం జాతీయ సగటు కనీస వేతనం కేవలం 293 రూపాయలే! కేరళ రాష్ట్రం రూ.670లతో మొదటి స్థానంలో ఉండగా, రూ.453లతో జమ్ముకాశ్మీర్, రూ.438లతో తమిళనాడు రాష్ట్రాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అత్యంత అల్పం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రూ.205లు చెల్లించబడగా, గుజరాత్ బీహారుల్లో వరుసగా రూ.233, రూ.267గా ఉన్నది. భారతదేశ టెలికాం రంగంలో సంస్కరణలను ప్రతిపాధించినప్పుడు శ్యాంపిట్రోడా కంపెనీ సీ.ఈ.ఓ జీతాన్ని కంపెనీలోని అత్యధిక జీతానికన్నా మూడింతలు చేయడం ద్వారా క్రింది స్థాయి ఉద్యోగులను మరింత పిండగలరని చెప్పారు. ఈ సూత్రం వంటబట్టించుకున్న రిలయన్స్ జియో క్రింది స్థాయి వర్కర్లకు చాలీచాలని భృతి ఇస్తూ లాభాలు గడిస్తున్నది. అయితే ఉద్యోగులను పిండుకోవడం కాదు, క్రింది స్థాయి వేతనాల్లో పెరుగుదల మార్కెట్‌ను పరుగులు పెట్టించగలదనీ ఆర్థిక మాంద్యానికి సమాధానాలుగా సూచించినప్పుడు కీన్స్ అనే ఆర్థిక వేత్త కూడా అభిప్రాయపడ్డారు. కనీస వేతనాల పెరుగుదల ఉపాధిలేమికీ లాభాల్లో తగ్గుదలకూ దారి తీయదని సాక్షాత్తు ప్రపంచ ప్రసిద్ది నోబెల్ నిర్వహాకులే గుర్తించినందుకు మన పాలకులు ఆ దిశగా ముందడుగు వేయాలి.
భావ ప్రకటనా స్వేచ్ఛకు ఊపిరినిచ్చిన
నోబెల్ శాంతి బహుమతి
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం కలం సాయంతో పోరు సాగించిన పాత్రికేయులు మరియా రెస్సా, దిమిత్రి మురాతోవ్‌లు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. విలేకరులపై నిరంతర దాడులు, వేధింపులు, హత్యలు ఎదుర్కొనే దేశాల్లో వీరు వాక్ స్వాతంత్య్రం కోసం శ్రమించారు. ప్రజాస్వామ్యం, పాత్రికేయ స్వేచ్ఛకు ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో భావవ్యక్తీకరణ హక్కు కోసం ధైర్యంగా నిలబడ్డ విలేకరులకు వీరు ప్రతినిధులు. శాంతిని పెంపొందించడానికి ఈ స్వేచ్ఛ చాలా ముఖ్యం. మరియాది ఫిలిప్పీన్స్ కాగా దిమిత్రి స్వస్థలం రష్యా. ఈ పాత్రికేయుల నోరు నొక్కేయడానికి ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. భావవ్యక్తీకరణ, పత్రికాస్వేచ్ఛ లేకుంటే దేశాల మధ్య సోదరభావాన్ని పెంపొందించలేమని.. నిరాయుధీకరణ, మెరుగైన ప్రపంచ క్రమానుగతిని సాధించలేమని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ బెరిట్ రెయిస్ ఆండర్సన్ బహుమతి ప్రకటన సందర్భంగా పేర్కొనటం గమనార్హం.
రాప్లర్ పేరుతో.. మరియా ఒక వార్తా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అధికార ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్తె తెచ్చిన వివాదాస్పద 'యాంటీ డ్రగ్' కార్యక్రమంపై ఆమె సాహసోపేతంగా విమర్శనాత్మక కథనాలు రాశారు. డ్రగ్ మాఫియా సభ్యులుగా పేర్కొంటూ వేల మందిని అంతమొందించిన తీరును వెలుగులోకి తెచ్చారు. తనకు నోబెల్ రావడం వల్ల ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కచ్చితంగా అసంతృప్తికి గురై ఉంటుందని మరియా వ్యాఖ్యానించారు. ఇంకా ఆమె ''ఫిలిప్పీన్స్‌లో నేను, నా సహచర పాత్రికేయులు నిరంతరం వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొన్నాం. ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులకు, పాత్రికేయ స్వేచ్ఛకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులకు ఇది ప్రబల ఉదాహరణ'' అని అనటం, ఫేస్బుక్ వంటి సామాజిక మీడియా దిగ్గజాలు విద్వేషంతో చేసే అసత్య ప్రచారాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని పేర్కొనడం గమనిస్తుంటే... పెట్టుబడి శాశిస్తున్న ఏ దేశ పాలనల్లోనైనా సత్యాన్ని బయటికి రానివ్వటం లేదని అర్థమవుతుంది. మనదేశంలో కూడా సత్యాన్ని వెలికి తీయజూసిన గౌరీ లంకేశ్‌ను నాలుగేండ్ల క్రితం బెంగుళూరులో నిర్దాక్షిణ్యంగా మతతత్వ శక్తులు చంపేశాయి. అత్యాచార బాధితురాలికి పోలీసులు నిర్వహించిన అసంబద్ద అంత్యక్రియలను కవర్ చేయడానికి వెళ్ళిన సిద్దికీ కప్పన్ అనే రిపోర్టర్‌ను ఊ.ఏ.పి.ఏ క్రింద జైల్లో వేశారు. మొన్నటికి మొన్న త్రిపుర అల్లర్లను కవర్ చేస్తున్న హెచ్.డబ్ల్యూ న్యూస్‌కు చెందిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. ఇంకా కల్బుర్గీ, పన్సారే వంటి అనేక సంఘటనలు ఇందుకు ఉదాహరణలుగా ఉన్నాయి.
1993లో రష్యాలో ప్రారంభమైన 'నవోయా గజెటా' దినపత్రిక వ్యవస్థాపకుల్లో దిమిత్రి మురాతోవ్ ఒకరు. ఇది.. రష్యాలో అత్యంత స్వతంత్ర పత్రిక. వాస్తవ ఆధారిత పాత్రికేయం, వృత్తిపరమైన నిబద్ధతను చాటింది. దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలను 'నవోయా గజెటా' ప్రచురించింది. దీంతో ఎన్నోసార్లు ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అయినప్పటికీ దిమిత్రి మురాతోవ్ వెనకడుగు వేయకుండా తన సిద్ధాంతాలను కొనసాగిస్తూ వచ్చారు. మీడియా స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు. అయితే జర్నలిజంలో కఠోరమైన కార్యాన్ని నెరవేర్చుతున్న వారికీ, ఆర్థికరంగంలో వాస్తవాలను విశ్లేషిస్తున్న వారికీ నోబెల్ ఇవ్వటం హర్షించదగినది. కాగా ఇది నచ్చనివారికీ, విలేకరులు, సంపాదకుల పట్ల కక్షతో వ్యవహరించే వారికీ చెంపపెట్టు లాంటిది.
- జి. తిరుపతయ్య
సెల్:9951300016