Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ నా ప్రియాతి ప్రియమైన సేద్యగాడా!
నా మనస్సును దోచుకున్న కృషీవలుడా! ప్రేమిస్తున్నాను నిన్ను. పొంగిపొరలుతున్న ప్రేమతో నా గుండెకు హత్తుకుని చెబుతున్న మాటలివి.నీ సమరం పొందిన విజయం నను ఆనందపరవశంలో ముంచెత్తుతోంది. మూడు చట్టాలతో నీపై యుద్ధం మొదలెట్టిన ప్రభుతనే ముచ్చెమటలు పట్టించి నేలకు వంచిన నీ ఘనతకు నా హృది జేజేలు పలుకుతోంది. ఎన్ని భరించావు..! ఎన్నెన్ని ఓర్చావు..!! నీ సహన సన్నాహానికి నేను ఫిదా అయ్యాను. ప్రేమించడం తెలిసిన వాళ్ళు నిన్ను ప్రేమించకుండా ఎలా ఉంటారు? తుచ్ఛమైన వాంఛలకతీతమైన ప్రేమంటే ఏమిటో తెలుసుకనుకనే నిన్ను ప్రేమిస్తున్నాను. ఆకుపచ్చ చందమామలాంటి నీమోముకంటే అందమైనదేమున్నది చెప్పు. విశ్వజనీనమైన ప్రేమకు నిజమైన పాత్రుడవు నీవు. శ్రమైకజీవన సౌందర్యానికి నిలువెత్తు అర్థానివి నువ్వు. నీ చెమటబిందువుల పరిమళం సమస్త జనుల ఆకలిని తీర్చి అనంత శక్తికి ఆయువు పోస్తున్నది. అంతకన్నా పాటుపడే ప్రాథమిక పనులేమున్నవి. ఈ నేలపైన అన్ని ఊహలకు, భావాలకు, బంధాలకు ఆదిమూలమైన శ్రామికుడవు. అందుకు నీవే నా నాయకుడవు. హీరోలందరిలోకి హీరోవి.
ప్రియనేస్తమా! గాలివానలోనూ, కటికచీకటిలోనూ, మంటలు కురిసే ఎండలోనూ, మరుగుతున్న కాలంలోనూ నీ కాళ్ళూ చేతులనాడిస్తూనే కాలంతో పోటీ పడతావ్! ఎన్ని సవాళ్ళు ఎదురైనా, ఇక్కట్లు ముసురుకున్నా, ప్రకృతి పరీక్షలు పెట్టినా ఒక్క అడుగూ వెనక్కి వేయని నీ మనోనిబ్బరం తరాలుగా మానవులకు తరగని ప్రేరణనిస్తూనే ఉంది. గాయాలైనా, రక్తాలు కారినా లక్ష్యం వీడని నీ లయాన్విత జీవన గమనం నా మనస్సును దోచుకున్నది. నీరెక్క ఆడితేనే కదా నేనిక్కడ పదాల్ని పరుగులు పెట్టించగలిగేది. మన్నులోంచి అన్నాన్ని తీసే మహిమాన్వితుడవు. నిత్య చలన శీలుడవు చైతన్యానికి ప్రతీకవు. ఆకళ్ళ ఎదురు చూపుల్లో అన్నం ముద్దలాంటి నీ ఆకారం అలంకృతమై నన్నాకర్షిస్తోంది. అందుకే నీ మీద మనసు పారేసుకున్నాను. ఎన్ని ఉపమానాల్ని తోడుకురావాలి నిను వర్ణించడానికి... ఎన్ని అలంకారాల్ని వాక్యాలకు తొడగాలి నిన్ను ప్రతిబింబించడానికి.. ఈ నేలకు ప్రాణశక్తిని నిరూపిస్తున్న శాస్త్రవేత్తలా నా ముందు దర్శనమిస్తావు. భూ తల్లిని ప్రాణప్రదంగా గుండెలకద్దుకుని తన ఆలనాపాలనా చూస్తున్న బాధ్యతయుత మానవిలా కదలాడుతుంటావు. కావ్యనాయకునిలా నా కలాన్ని కదిలిస్తుంటావు.
ఓ.నా చెలికాడా! ఈ నిరాశా నిర్జీవ నిరాసక్త పయనంలో ఎన్ని ఆశలు రేపావు నాలో! చూపులన్నీ అయోమయంలో పడి చీకటిలో తడుముకుంటున్న వేళ ఎన్ని కలల్ని పండించావు నిండుగా. రేపటిపైన చిగురించే ఉత్సాహాన్ని పూయించిన శ్రమదినకరుడవు నువ్వు. పాదాలుతడబడుతున్నప్పుడు, పాషాణం పగబడుతున్నపుడు, ధైర్యపు శరాలను సంధించిన నీ సంఘటిత పదజడి నాలో నూతన శక్తిని నింపింది. నీ మోమును చూస్తేనే వెయ్యి ఏనుగుల బలం నాలో నిండుతుంది. కోట్లకొలది శక్తిధార నాలోకి ప్రవహిస్తూ ఉత్తేజితమవుతాను. గెలుపురేఖలపైనే కాదు నడచిరావడంతోనే నాక్కొంచెం నమ్మిక చిక్కింది. మరింత ముందుకు కదిలించింది. నవోష్టదీప్తి దారినితెరిపించింది. విజయమంతా గెలవడంలో కాదు, గెలుపు సాధనకు నడవడంలోనే వుంది కదా! ఇదిగో నా నెనర్లు.
కర్షకప్రియా! ప్రేమను పదితో గుణించి ప్రకటిస్తున్నా... ఎంత ప్రేమ నీకు ఈ నేలపై... మట్టిపై నీకున్న మమకారం, అనురాగం, అభిమానం, అనుబంధం... ఇంతకన్నా దేశాన్ని ప్రేమించడం ఇంకేమున్నది! ఎవరుంటారు నీకంటే దేశభక్తులు! దేశ భక్తులు ఎలా వుంటారనేదానికి నిలువెత్తు నిదర్శనంగా నీ ఉనికి మా మదిలో ముద్రించబడుతోంది. ఈ నేల కోసం, నేలపై నీ మనుషుల స్వేచ్ఛకోసం, ఉరితాడును ముద్దాడిన భగత్‌సింగ్ వీరత్వ వారసత్వం, చేవగల చైతన్యం ఇంకా ప్రవహిస్తూనే వున్నదన్నదానికి రుజువుగా నీ త్యాగం నన్ను కదిలిస్తూనేవుంది. దేశభక్తి అంటే మట్టికాళ్ళ చేతుల మనుషులతో పాటుగా నేల గర్భంలోంచి మొలకొత్తే బంగారు పంటను కాపాడుకోవటం కూడా అని చెప్పటానికి ఏడు వందల మంది ప్రాణాలను బలిగా విసిరిన మీ త్యాగాన్ని చరిత్ర కన్నీళ్ళతో శ్లాఘిస్తున్నది. 'మనం విజయం సాధిస్తాం. లేదంటే ఇక్కడనే మరణిస్తాం, కానీ వెనుదిరిగేదే లేదన్న మీ ధృఢదీక్షాదక్షతలు నా హృదయంలో విశ్వాసాన్ని ఊపిరిగా నింపాయి. విజయం అప్పుడే ఖరారైంది. ఉద్యమం ఆవిష్కృతమైంది.
ఇండ్లనొదలి, పిల్లలనొదలి, ఆకలినొదలి, ప్రజాస్వామిక పద్ధతినొదలకుండా పన్నెండునెలల పోరుబావుటా ఎగురుతూనే ఉంది. ప్రపంచ చరిత్రలో ఇది లిఖించబడుతుంది. మరో స్వాతంత్య్ర పోరాటానికి రూపంగా నిలచిన ఢిల్లీ సరిహద్దుల గుడారాలు, రాబోయే సమరశీల ముట్టడులకు సంకేతాలు. నైతికను దెబ్బతీసినా, కుట్రలపై కుట్రలు చేసినా, రోడ్లపై ముళ్ళు పాతినా, వీపులపై రక్తాలు కారినా టియరుగ్యాస్ బుల్లెట్లు పేలినా, అన్యాయం రంకెలేసినా, అక్రమం అధికారమై కత్తులు దూసినా ఎత్తినజెండా దింపని వీరుడివి నీవు. నిన్ను ఉగ్రవాదివన్న వాడి మాట ఉఫ్‌మని రాలిపడింది. దేశద్రోహివన్న పలుకు పాతాళానికి డొల్లింది. ఆందోళన జీవులన్న నోరు క్షమాపణ కోరింది. కార్లతో తొక్కించిన వాళ్ళ కాలం మూడుతోంది. కొంత కాలం పట్టవచ్చుకాక, కష్టమూ నష్టమూ ఎదురవ్వవచ్చు కూడా, కానీ సత్యం జయిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. అందుకు నువ్వు నిలువెత్తు సాక్ష్యానివి.
మీరంటే ఎంత ప్రేమంటే...
మనుషుల్ని మతాలుగానో, కులాలుగానో, ప్రాంతాలుగానో విడగొట్టి, చిచ్చు పెట్టి మంటలురేపే వాళ్ళ దుష్ట తలంపులను దగ్ధం చేసిన ధీరోదాత్త మానవీయ మహాబలుడవు నీవు. తుచ్చులు, ఆధిపత్య అహంకార దుష్టులు, ఆడ వాళ్ళంటే వంటింటికే పరిమితమంటూ, పిల్లలు కనటానికే అంటూ నోరు పారేసుకుంటున్న వాళ్ళ మూతులకు మూతలు బిగించిన ఘనత మీదే కదా! ఆడవాళ్ళు కూడా... మేమూ మీలో సగమూ అని ధర్నాడేరాల కింద ధైర్యాన్ని నింపుతూ చేతులు బిగించి కలిపిన దృశ్యం, ఆకాశంలో సగంలా ఎగిరిన స్వేచ్ఛా గీతపు సౌందర్యం కదూ! ఎంతటి ఉదాత్త సంఘర్షణ నీది. పోరాటపు పొలికేకలో పొల్లులన్నీ పొరపొచ్చాలన్నీ ఎగిరిపోయి, సమానతా బీజానికి నాంది పలుకుతుందని నిరూపించిన నిరుపమాన ప్రేమికా! నీకు వేలవేల వందనాలు... అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను. కరోనా ప్రళయం విజృంభిస్తున్న సమయాన కరుణలేని ప్రభుత నీపై మూడు చట్టాలతో ముప్పేటదాడికి పూనుకుంటే, నువ్విక కదలలేవని, ఉద్యమాన్ని నడపలేవని చంకలెగరేస్తుంటే... కార్పొరేట్ మోసగాళ్ళుకు సాగును సకలం వడ్డించేందుకు సిద్ధమవుతుంటే... ఆగగామంటూ లేచి అన్నీంటినీ ఎదిరించి, శక్తులననన్నీ కలిపి కవాతు చేస్తూ ఎర్రకోటపైకి లాంగ్ మార్చ్‌ను నడిపించిన యుద్ధనైపుణ్యపు యోధడవు నువ్వు. వాళ్ళ సంపన్నుల సేవకులు, దోపిడి శక్తులకు ఊడిగం చేసే బానిసలు. నువ్వు స్వేచ్ఛా నినాదపు శంఖారావానివి. శ్రమఫలాలకై ఉద్యమించుకెరటానివి. రాబోయే తరాల కోసం పరితపించే హృదయానివి. మన సంపద సృష్టి కర్తవు. వాళ్ళు భక్షకులు, పరాన్నభుక్కులు. నవ్వు పంచేవాడివి. ప్రాణాలకూ తెగించి పరులమేలు ఎంచేవాడివి. అందుకే ప్రియా నిన్ను ప్రేమిస్తున్నాను.
నా ప్రియ మిత్రమా!
ప్రేమంటే స్వేచ్ఛ కదా! సమాన భావన కదా! స్నేహమయి జీవనం కదా! బాధ్యతల పంపకం, హక్కుల వినియోగిత కదా! ఒకరికోసం ఒకరు నిలబడటం, త్యాగానికి వెరవక పోవటమే కదా! నేనున్నాననే భరోసా, రేపటి కోసం ఆశను ఆశయానికి జత చేయటమే కదా! అవన్నీ నీలో చూశాను సఖుడా! నీతి, నిజాయితీ, నిబద్ధత, విశ్రమించని అంకిత భావం నీలో నిండుగానే చూశాను. అందుకే... అందుకే మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను. నీతో అనుచరణమై నిలుస్తాను. నాగేటి సాళ్ళలో నీతోనే నడుస్తాను.
- కె. ఆనందాచారి