Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టం రోజు రోజుకు నిర్వీర్యం అవుతున్నది. కూలీల వలసలు నివారణ కోసం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం అమలులో అనేక లోపాలు జరుగుతున్నాయి. చట్టం స్ఫూర్తికి విఘాతం కలిగే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. యంత్రాలు, కాంట్రాక్టర్లు ఉండకూడదు అని ఉపాధి హామీ చట్టం చెబుతుంటే అందుకు భిన్నంగా ఉపాధి హామీ చట్టంలో యంత్రాలు వాడటం, కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పడం, కూలీల ప్రయోజనాల కంటే ఇతర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కూలీల నోట్లో మట్టి కొడుతూ వారికి కేటాయించిన డబ్బులను ఇతర రంగాలకు మళ్లీస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి తుట్లు పొడుస్తున్నాయి. ప్రతి కుటుంబానికి వంద రోజుల పని బాధ్యతగా కల్పించాల్సి ఉండగా కేవలం సగటున 45రోజుల నుండి 75రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారు. ప్రస్తుతం రోజువారి వేతనం రూ.245లు ఇస్తున్నారు. పని చేసిన 15రోజుల్లోగా వేతనాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం రెండు, మూడు నెలలకు వేతనం ఇస్తున్నది. గతంలో కూలీలు ఎన్ని రోజులు పని చేశారు. రోజు వారి కూలీ ఎంత పడింది. గడ్డపార వాడితే దాని పారితోషికం ఎంత? వాటర్‌కు ఎంత? ఉపాధిహామీ మేట్‌కు పారితోషికం ఎంత? అనే వివరాలతో కూడిన ప్లే స్లిప్ ఇచ్చేవారు. గత సంవత్సర కాలంగా ఈ వివరాలతో కూడిన ప్లే స్లిప్ రాకపోవడంతో వారికి కూలి ఎంత పడింది. గడ్డపార వేసినందుకు వచ్చే పారితోషకం, వాటర్‌కు వచ్చే పారితోషకం, మేట్‌కు ప్రతి కూలీపై వచ్చే పారితోషకం, ఎన్ని రోజులు పని చేశాం... రోజు ఎంత కూలీ పడింది అనే వివరాలు తెలియని పరిస్థితి నెలకొంది. అలాగే పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు గాయాలైన వారికి బిల్లులు సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. సంవత్సరాలు అవుతున్నా బిల్లులు రాని పరిస్థితి. అలాగే ప్రభుత్వం కుటుంబానికి వంద రోజులు ఇవ్వడం మూలంగా ఒక ఇంట్లో నలుగురు ఉంటే కేవలం 25 రోజులు మాత్రమే ఆ కుటుంబానికి ఉపాధి హామీలో పని దొరికే పరిస్థితి ఉంది. యంత్రాలు రావడం మూలంగా కూలీలకు పని దొరికే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో 100శాతం వరి కోత మిషన్లతో కోతలు కోస్తున్నారు. దీని మూలంగా కూలీలకు నెల 15రోజులు పని కోల్పోయే పరిస్థితి ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో యంత్రాల రాకతో కూలీల అవసరం చాలా తగ్గింది. కేవలం నాటుకు మాత్రమే కూలీలు అవసరం. అందువల్ల ఉపాధి హామీ కూలీలలో ఉపాధి హామీ ఈ పథకం ద్వారా 200రోజులు పని కల్పించాలని డిమాండ్ వస్తున్నది. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో కనీస సౌకర్యాలైన తాగునీరు, టెంటు, మెడికల్ కిట్టు, పార, గడ్డపార, తట్ట వంటివి ఇవ్వడం లేదు. గత 10 సంవత్సరాల క్రితం గడ్డపారలు ఇచ్చారు తప్ప నేటికీ కొత్త గడ్డపారలు ఇవ్వలేదు. దీనివల్ల కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పనిముట్లు ఉంటేనే పని ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం పనిముట్లు ఇవ్వకపోవడం, క్యూబిక్ మీటర్ రేటు పెంచకపోవడం మూలంగా కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం రూ.245లు దినసరి వేతనం ఇస్తున్నా సగటున కూలీలకు రూ.80ల నుండి రూ.120లు వరకు మాత్రమే రోజువారి వేతనం అందుతుంది. గతంలో 60శాతం కూలీలకు పనులు కల్పించి 40శాతం మెటీరియల్ కోసం ఖర్చు చేసేవారు. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా కేవలం 40శాతం మాత్రమే కూలీలకు పని కల్పించి వేతనాలు ఇస్తున్నారు. 60శాతం మెటీరియల్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఉపాధి హామీ నిధులను కూలీల కోసమే ఖర్చు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ డబ్బును గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి, గ్రామ పంచాయతీ, అంగన్వాడి, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, స్మశాన వాటికలు, పల్లె ప్రకతి వనం, డంపింగ్ యార్డ్, రైతు వేదికల నిర్మాణం తదితర వాటి కోసం ఈ నిధులను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మరో పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల క్రితం తొలగించింది. వాటి బాధ్యతను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కేటాయించడం జరిగింది. ఈ పథకం అమలుకు పంచాయతీ కార్యదర్శులకు సంబంధం లేదు. కానీ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పజెప్పడం మూలంగా వారికి అవగాహనలేక ఉపాధి హామీ పని సక్రమంగా జరగడం లేదు. అనేకమంది మరుగుదొడ్లు ఇంకుడు గుంతలు నిర్మించుకుని సంవత్సరాలు అవుతున్నా నేటికీ బిల్లులు చెల్లించలేదు.
హరితహారం పేరుతో ప్రతి సంవత్సరం లక్షలాది మొక్కలను నాటుతున్నారు తప్ప వాటి రక్షణకు తీసుకుంటున్న చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. పేద ప్రజల కోసం తీసుకువచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ చట్టం స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను అనుసరిస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు ఆలోచించి ప్రజల కోసం ఈ దేశంలో మొట్టమొదటగా వచ్చిన పని గ్యారెంటీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుకుందాం. ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయాలని ఆశిసిద్దాం.
- ఎం సైదులుa
సెల్:8106778287