Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ మన రాజ్యాంగానికి ఉన్న పరిమి తులు వివరంగానే చెప్పారు.''మన రాజ్యాంగం యొక్క గొప్పతనం దానిని అమలు చేసే పాలకులు చిత్తశుద్ధి పై ఆధారపడి ఉంటుంది .రాజ్యాంగం అమలులో పాలకులు వైఫల్యం చెందితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఆగ్రహంతో ఉన్న ప్రజలు అగ్గిపుల్ల గీకి మంటల్లో కాల్చేస్తారు. నేను బ్రతికి ఉంటే మొదటి అగ్గిపుల్ల నాదే అవుతుంది'' అంటారాయన.
భారతదేశాన్ని మూడు రాజ్యాంగాలు మూడు వేల ఏండ్లుగా పరిపాలిస్తున్నాయి. మానసిక చట్టాల ద్వారా మనుస్మృతి పరిపాలించగా, స్వాతంత్య్రం కంటే ముందు 200ఏండ్లు బ్రిటిష్ రాజ్యాంగం పరిపాలించింది. దేశ ప్రజలు సామ్రాజ్యవాదులతో పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్న తర్వాత ఏర్పర్చుకున్నది ప్రస్తుత భారత సంవిధానం. కొన్ని పరిమితులున్నప్పటికి ఈ మూడింటిలో ఇదే ప్రగతిశీలమైనది. ఆర్యుల రాక నుంచి 1773ప్లాసి యుద్ధం జరిగేవరకు మనుస్మృతి పరిపాలించింది. ఇది దేశంలోని మెజార్టీ ప్రజలకు చదువు, సంపదలు, ఆస్తులు, ఆభరణాలు, ఆయుధాలు, అధికారాలను నిషేదించింది. కొద్దిమంది అపారమైన సంపదకు అధిపతులు కావడానికీ, కోట్లాది మంది ప్రాథమిక అవసరాలు కూడా తీరకుండా దుుర్భర జీవితాలు గడపడానికి కారణమైంది.
బ్రిటిష్ రాజ్యాంగం తన వ్యాపార దోపిడీ ప్రయోజనాలకోసమైనా కొన్ని విద్యా సంస్థలు, పరిశ్రమలు నెలకొల్పింది. వారి కంపెనీల్లో సరుకులు ఉత్పత్తి చేయడానికీ, వాటిని విక్రయించడానికీ అవసరమైన చదువు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మనుస్మృతి కంటే కొంత మెరుగైన అవకాశాలు, హక్కులు బ్రిటీష్ రాజ్యాంగం ఇచ్చింది. ఇక ప్రస్తుతరాజ్యాంగం గురించి మాట్లాడితే, అసమాన త్యాగాల ఫలమైన ఈ దేశ స్వాతంత్య్ర పోరాట వెలుగులో ఈ రాజ్యాంగం వ్రాయబడింది.
భారత రాజ్యాంగంలోని మౌలిక అంశాలని పరిశీలిద్దాం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం. 1949 నవంబర్ 26న రాజ్యాంగం వ్రాయడం పూర్తయి పార్లమెంట్ ముందుకు వస్తే అది 1950 జనవరి 26 నుంచి ఆములోకి వచ్చింది. నాడు 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 9 షెడ్యూల్స్ కలిగి ఉంది. తర్వాత 105 సార్లు సవరణలు చేయాల్సి వచ్చింది. 2006 న జూన్ 6 నాటికి అది 444 ఆర్టికల్స్ 12 షెడ్యూల్స్, 26 భాగాలుగా రూపుదిద్దుకుంది.
ముఖ్య విషయం ఏమంటే ఇది పార్లమెంట్ చేసిన సాధారణ శాసనం కాదు, రాజ్యాంగ నిర్మాణసభచే తయారు చేయబడిన మౌలికశాసనం. భారత రాజ్యాంగంలో 3,4భాగాలు చాలా ప్రాధాన్యత కలిగినవి. 3వ భాగం పౌరుల ప్రాథమిక హక్కులు తెలియజేయగా, 4వ భాగం పాలకులు సాధించాల్సిన లక్ష్యాలను వివరిస్తుంది. ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం. రాజ్యాంగతత్వం అంతా ప్రవేశికలోనే ఉంటుంది భారత దేశం. సర్వసత్తాక సామ్యవాద లోకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపుదిద్దుకోవడానికి భారత ప్రజలందరూ కంకనబద్ధులు కావాలని ప్రవేశిక నిర్ధేశించింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 19వరకు అన్ని రకాల వివక్షలని నిషేధించాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు కావొస్తుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 ఏండ్లు అవుతుంది. నేటికీ కుల వివక్ష, అంటరానితనం చాపకింద నీరులా ప్రవహిస్తూనే ఉన్నాయి. కుల దురహంకార హత్యలు, సాంఘీక బహిష్కరణలు, దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు నిత్యకత్యమైనాయి. అనేక హక్కులు చట్టాలు జీవోలు ఉన్నప్పటికీ అవి నేరస్తులను ఏమీ చేయలేకపోతున్నాయి.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది రెట్టింపయ్యింది. మతాన్ని రాజకీయాలకు పులిమి మనుషుల మధ్య మత ఘర్షణలు వైషమ్యాలు సష్టిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ రిమోట్ పరిపాలనలో భారత రాజ్యాంగానికి నిత్యం తూట్లు పొడుస్తూనే ఉన్నారు.
ఇది మన స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి వ్యతిరేకం. ప్రశ్నిస్తే దేశద్రోహం, ఉపా వంటి కఠినమైన అక్రమ కేసులు ప్రయోగిస్తున్నారు. బావప్రకటనాస్వేచ్చ అమలుకు నోచు కోవటం లేదు. దేశభక్తి ముసుగు ధరించి దేశ ప్రజలందరి ఉమ్మడి ఆస్థులైన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం, కార్పొట్లరేట్లకు దేశాన్ని దోచిపెట్టడం వంటి దుష్ట చర్యలకు యదేచ్ఛగా తెగబడుతోంది నేటి బీజేపీ ప్రభుత్వం. రాజ్యాంగ సమీక్ష జరపాలనిస్వయానా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడింది అందరికి విదితమే. ఇప్పటికి కూడా రిజర్వేషన్లపై బీజేపీ ఆర్ఎస్ ఎస్ నేతలు విషం కక్కుతూనే ఉన్నారు. రాజ్యాంగ మౌలిక పునాదిగా ఉన్న లౌకికతత్వాన్ని నాశనం చేస్తూ చరిత్రను సైతం వక్రీకరిస్తు న్నారు. విద్య వైద్యం ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేట్ పరం కావొద్దు, సంక్షేమంలోనే ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచాడు. 1991 సంవత్సరం నుండి అమలు చేయబడుతున్న సరళీకరణ విధానాల ఫలితంగా ఇప్పటికే నూటికి 80శాతం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ కార్పొరేట్లకు కట్టబెట్టబడ్డాయి. దీంతో రిజర్వేషన్లు, సామాజిక న్యాయం సమాధి చేయబడింది. ఈ సందర్భంగా రాజ్యాంగ ముసాయిదా పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టే సమయంలో అంబేద్కర్ ప్రసంగ పాఠాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాము.
''నేను రాసిన ఈ రాజ్యాంగం కేవలం రాజకీయ స్వాతంత్య్రాన్ని మాత్రమే సిద్ధిస్తుంది. కానీ సామాజిక ఆర్థీక అంతరాలను అంతం చేయాల్సిన గురుతరబాద్యత ఈ రాజ్యాంగాన్ని అమలు చేయబోయే పాలకులపై ఉంటుంది. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలుజరిపే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే అది దేశ ప్రజలకు చేదు ఫలితాలు ఇస్తుంది''. నేడు సరిగ్గా అదే జరుగుతోంది. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకి ఒకే విలువ ఉంటుంది. కానీ సామాజిక ఆర్థీక సమానతలు వాటంతట అవే తొలగి పోవు. పాలకులు వాటిని రూపుమాపడానికి ఉద్దేశ్యపూర్వక ప్రయత్నం చేయాలి. లేనట్లయితే వాటి చేదు గుళికలు దేశం మింగాల్సి ఉంటుందన్నాడు అంబేద్కర్. అందుకే దేశం రక్షించబడాలి అంటే ముందు రాజ్యాంగాన్ని రక్షించాలి. మతోన్మాదాన్ని వ్యతిరేకించి రాజ్యాంగాన్ని రక్షించడమే నేటి తరం కర్తవ్యం కావాలి.
స్కైలాబ్ బాబు, 9177549646