Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపావళి పండగ వస్తోందనగా మోడీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ మీద పన్ను తగ్గించింది. పెట్రోలు మీద రూ.5, డీజిల్ మీద రూ.10 చొప్పున తగ్గించింది. ఈ తగ్గింపును ''కోవిడ్ కాలంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ గమనం కుంటుపడకుండా వద్ధి రేటును నిలబెట్టిన దేశ రైతాంగానికి'' అంకితమిచ్చింది. ''రానున్న రబీ సీజన్లో రైతులకు ఈ తగ్గింపు ఒక ఊపునిస్తుంది'' అని ఆశిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తగ్గింపును కేంద్రం ప్రకటించిన వెంటనే ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో బీజేపీ కార్యకర్తలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ధరలను తగ్గించాలంటూ ఆందోళనలకు దిగారు.
రెండు నాల్కల ధోరణి అంటే ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? ఈ నవంబరు వరకూ పెట్రోలు మీద రూ.31, డీజిల్ మీద రూ.33 చొప్పున అదనపు సెస్ విధించింది కేంద్రం. ఈ విధంగా పెట్రో ఉత్పత్తుల మీద ప్రత్యేక అదనపు సెస్ విధించే విధానాన్ని వామపక్ష పార్టీలు ముందు నుంచీ వ్యతిరేకిస్తూనే వున్నాయి.
బేసిక్ స్థాయి పన్నులు, డ్యూటీలకు తోడు అదనంగా సెస్‌ను, సర్చార్జిని విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అనుమతించింది. ఐతే అది ఒక అసాధారణమైన పరిస్థితి తలెత్తినప్పుడు మాత్రమే విధించాలి. కాని బేసిక్ పన్నుల కన్నా అనేక రెట్లు సెస్ లేదా సర్‌చార్జి విధించడం రాజ్యాంగం ఇచ్చిన అనుమతిని దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఈ విధంగా విధించే సెస్ లేదా సర్‌చార్జి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రాష్ట్రాలతో పంచుకోనవసరం లేదు. అంటే ప్రజల మీద అధిక భారాలను మోపడమే కాక, రాష్ట్రాల ఫెడరల్ హక్కుల మీద కూడా ఇది ఒక దాడి అని గ్రహించాలి.
బేసిక్ పన్నుతోబాటు అదనంగా విధించే కొద్దిపాటిమొత్తాన్ని సర్‌చార్జి అంటారు. కాని బేసిక్ పన్నుకు 7 లేదా 8 రెట్లు అదనంగా విధించడాన్ని ఏమనాలి? ఇది ఏ రకంగా సమర్ధనీయం?
రెవెన్యూ గణాంకాలు
పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ ప్రచురించిన గణాంకాలను బట్టి 2020-21లో కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల మీద పన్నుల రూపంలో రూ.3.72 లక్షల కోట్లు వసూలు చేసింది. ఇందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కేవలం రు.18,000 కోట్లు ! స్పెషల్ అదనపు ఎక్సైజ్ డ్యూటీ రూ.1.2 లక్షల కోట్లు, సెస్ రూ. 2.3 లక్షల కోట్లు. అంటే మొత్తం వసూలు చేసిన పెట్రో పన్నులో కేవలం రూ.18,000 కోట్లు మాత్రమే, అంటే 4.8 శాతం మాత్రమే బేసిక్ పన్ను (ఇందులోనూ రాష్ట్రాలకు దక్కేది 41 శాతం మాత్రమే). తక్కిన 95 శాతమూ రాష్ట్రాలతో పంచుకోనవసరం లేదు. నేడు దేశంలో రాష్ట్రాల హక్కులపై దాడి ఏ విధంగా జరుగుతోందో ఈ ఒక్క ఉదాహరణతో చెప్పవచ్చు. ఈ విధంగా రాజ్యాంగం కల్పించిన ఒక అవకాశాన్ని దుర్వినియోగపరుస్తూ రాష్ట్రాల హక్కుల మీద దాడి చేయడం ఎంతవరకూ సమంజసం? దీనిమీద విస్తత స్థాయిలో చర్చ జరగడం అవసరం.
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు కేవలం మూడే మూడు సరుకుల మీద పన్నులు విధించే అధికారాన్ని కలిగివున్నాయి. అవి పెట్రోలు, డీజిల్, మద్యం. ఈ మూడింట్లో పెట్రోలు, డీజిల్ మీద ఆదాయాన్ని ఏకపక్షంగా కేంద్రం చేజిక్కించుకుంటూ రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నది. ఈ అన్యాయాన్ని రాష్ట్రాలన్నీ ఐక్యంగా ఎదిరించాలి.
కీలకమైన ప్రశ్నలు
కోవిడ్-19 వంటి ఒక పెద్ద ముప్పును దేశం యావత్తూ ఎదుర్కుంటున్న సమయంలో సైతం కేంద్రం లక్షల కోట్ల రూపాయలను అదనపు పన్నుల రూపంలో పోగేసుకుంది. మరి ఈ సొమ్మంతా ఎక్కడికి పోయింది?
జీఎస్టీ అమలులోకి వచ్చినప్పుడు కేంద్రం రాష్ట్రాలకు ఒక హామీ ఇచ్చింది. రెవెన్యూ న్యూట్రల్ రేట్‌ను అమలు చేస్తామని చెప్పింది. జీఎస్టి అమలులోకి రాక మునుపు రాష్ట్రాలకు ఎంత రెవెన్యూ వస్తూండేదో దానికి తగ్గకుండా ఉండేలా చూస్తామని ఆ హామీ సారాంశం. జీఎస్టీ అమలు ప్రారంభం అయినప్పుడు సరుకుల మీద పన్ను సగటున 16 శాతం ఉండేది. ఇప్పుడు అది కాస్తా 11.3 శాతానికి తగ్గింది. ఇలా తగ్గినందువలన ఏ వినియోగదారుడికైనా ధరలు తగ్గాయా ? లేదు. పైగా ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. అంటే అటు ప్రజలకు గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు గాని ఈ జీఎస్టీ వచ్చాక ఎటువంటి ప్రయోజనమూ రాలేదు.
ఇప్పుడు సగటున ప్రతీ నెలా జీఎస్టీ రూపేణా సుమారు రూ.1 లక్ష కోట్లు వస్తున్నది. అంటే సంవత్సరానికి రూ.12 లక్షల కోట్లు. అందులో రాష్ట్రాలకు రూ.6 లక్షల కోట్లు, కేంద్రానికి రూ.6 లక్షల కోట్లు వస్తాయి. రెవెన్యూ న్యూట్రల్ రేట్ గనుక అమలు జరిగితే - అంటే సగటు పన్ను 16శాతం కొనసాగివుంటే జీఎస్టీ సంవత్సరానికి రూ.18 లక్షల కోట్లు వచ్చివుండేది. అందులో రాష్ట్రాల వాటా రూ.9 లక్షల కోట్లు అయివుండేది. అంటే అదనంగా రాష్ట్రాలకు రూ.3 లక్షల కోట్లు వచ్చివుండేవి. సగటు మనిషికి అదనపు భారం కాకుండా వుండేలా ఈ రెవెన్యూ న్యూట్రల్ రేట్‌ను అమలు చేయడం ఎలా అన్నది వివరంగా విశ్లేషించి రాష్ట్రాల ఆదాయాలను పరిరక్షించాలి.
ఇంకొకవైపున నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా కేంద్రం దేశ సంపదను భారీ స్థాయిలో అమ్మకానికి పెడుతున్నది. సిబ్బందికి జీతాలు చెల్లించడానికి సైతం కేంద్రం ప్రజల ఆస్థులను అమ్మకానికి పెడుతోంది. నయా ఉదారవాద విధానాల పర్యవసానంగా నేడు లాభాలను ఆర్జించే నవరత్న కంపెనీలను సైతం అమ్మివేస్తోంది.
ఎవరు లాభపడుతున్నారు ?
ఈ చర్యల వలన ఎవరు లాభపడుతున్నారు ? కేవలం వేళ్ళమీద లెక్కించదగ్గ కొద్దిమంది కార్పొరేట్లు మాత్రమే. మానిటైజేషన్ ద్వారా ప్రజల సంపదను అమ్మకానికి పెడితే రూ.6 లక్షల కోట్లు ఆదాయం వస్తుంని అంచనా వేసిన కేంద్రం మరోవైపున కార్పొరేట్లు రుణాలను రూ.8.75 లక్షల కోట్ల మేరకు మాఫీ చేసేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కార్పొరేట్లు బకాయి పడ్డ ఈ మొత్తాన్ని ఇప్పుడు చెల్లించే బాధ్యత బాడ్ బ్యాంక్ తీసుకుంటుంది. ప్రజా ధనంతోటే ఈ బ్యాడ్ బ్యాంక్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒకవైపు ప్రజల సంపదను అతి చౌకగా కార్పొరేట్లకు సమర్పిస్తూ, ఇంకోవైపు ఆ కార్పొరేట్లు ఎగనామం పెట్టిన అప్పులను తీర్చడానికి కూడా ప్రజాధనాన్నే ఖర్చు చేస్తోంది. ఎంత విడ్డూరం ఇది! గత ఆర్ధిక సంవత్సరంలో కార్పొరేట్లు కట్టవలసిన పన్నుల్లో రూ.1 లక్ష కోట్ల మేరకు మాఫీ కూడా చేసేసింది. ఇలా కార్పొరేట్లకు రాయితీలు భారీగా ఇచ్చినందువలన కేంద్రం వద్దనుంచే తనిధులు భారీగా తగ్గిపోయాయి. దాంతోబాటు రాష్ట్రాలకు రావలసిన వాటాలు కూడా తగ్గిపోయాయి. ఇలా తగ్గిపోయిన నిధులను భర్తీ చేసుకోడానికి కేంద్రం భారీగా పెట్రో ఉత్పత్తులమీద పన్నులు విధిస్తోంది. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోడానికి వెచ్చించాల్సిన నిధులనేమో కార్పొరేట్లకు కట్టబెట్టింది. తిరిగి ఆ ప్రజల మీదనే అదనపు భారాలను మోపుతోంది. ఈ తప్పుడు విధానాలను సమిష్టిగా ప్రజలందరూ ప్రతిఘటించాల్సిన తరుణం వచ్చింది.
కె.ఎన్. వేణుగోపాల్