Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2015లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దాద్రిలో ఆవు మాంసం ఉందనే కారణంతో మహమ్మద్ ఆఖ్లఖ్ అనే వ్యక్తిపై మూక దాడి చేసి, హత్యచేసిన తీరు ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీల దాకా విస్తరించింది. ఆ దాడిలో హంతకులతో పాటు, గోవధ చేశాడనే నెపంతో, బాధితుడైన ఆఖ్లఖ్పైన కూడా కేసు నమోదు చేశారు. అలాంటి అనేక ఘటనల్లో పోలీసుల వ్యూహం (దాడి చేసిన వారితో పాటు బాధితులపై కూడా కేసు నమోదు చేయడం) అదే రీతిలో కొనసాగుతుంది.
మితవాద అల్లరిమూక లాఠీలు, ఇనుపరాడ్లు, త్రిశూలాలు చేబూని క్రైస్తవులను ఆటంకపరచి, ఆస్తులను ధ్వంసం చేసి, గాయపరుస్తారు. పోలీసులు, దాడి చేసిన వారితో పాటు మత మార్పిడికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బాధితులపైన కూడా కేసులు నమోదు చేస్తారు. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం (యూసీఎఫ్) గణాంకాల ప్రకారం, ఈ సంవత్సరం భారత దేశంలో ఇలాంటివి 305 సంఘటనలు జరిగాయి. ప్రధాని నియోజకవర్గం వారణాసి, ప్రయాగ్ రాజ్ (అలహాబాద్), నోయిడా, అయోధ్య, రాంపూర్, బారైచ్, లఖీంపూర్ ఖేరీలలో ఇలాంటి ఘటనలు జరిగినట్టు నివేదికలున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మావ్ జిల్లా, ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
''ఉత్తరప్రదేశ్‌లో మత మార్పిడి వ్యతిరేక చట్టం ముస్లింలతో పాటు క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. అల్లరిమూక లాఠీలు చేతబట్టి, ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, అప్పుడప్పుడు పోలీసులను వెంట తీసుకుని చర్చిలకు వస్తారు. ప్రార్థనలను ఆటంకపరచి, పాస్టర్‌ను కొట్టి, చర్చిని ధ్వంసం చేసి, బైబిల్‌ను అపవిత్రం చేస్తారు. దాదాపు పోలీసులు ఎప్పుడూ మౌనం వహిస్తున్నారు. పోలీసులు, భజరంగ్‌దళ్ లేదా హిందూత్వ సైన్యంతో పాటు పాస్టర్, బాధితుల పైన కూడా కేసులు నమోదు చేసి, బాధితులకు జరిమానాలు విధిస్తారని'' జాన్ దయాళ్ అనే కార్యకర్త చెప్పాడు.
రూర్కీ సంఘటన
అక్టోబర్3న రూర్కీలో 200పైగా అల్లరిమూక ఒక చర్చిలోకి ప్రవేశించి, ఆస్తులను ధ్వంసం చేసి, ఆదివారం ప్రార్థనలకు వచ్చిన వారిపైన దాడి చేశారు. ఆ సమయంలో కేవలం 12 మంది మాత్రమే చర్చిలో ఉన్నారు. ఈ మూకకు నాయకత్వం వహించిన 50 సంవత్సరాల వ్యక్తి చర్చి పాస్టర్ కూతురును భుజం పట్టుకొనగా, మరొకడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అల్లరి మూకలోని మహిళలు ఆ అమ్మాయిని చెంప దెబ్బలు కొట్టి, ఆమె మొబైల్ దొంగిలించారు. చర్చి సహాయకుడైన రాజ్ కుమార్‌ను మెడ పట్టుకొని కిందకు లాక్కొని వెళ్ళి మొఖం, వీపుపై పిడి గుద్దుల వర్షం కురిపించి, తలపై రాడ్‌తో కొట్టారని మానవ హక్కుల సంఘాల కార్యకర్తలకు అతడు చెప్పాడు.
చర్చి చట్ట విరుద్ధంగా నడుస్తుందని అల్లరి మూకలు ఆరోపించాయి. ఆ ఆరోపణలను కొట్టివేస్తూ, సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద 'ఫుల్ గాస్పెల్ ఫెల్లోషిప్ ఆఫ్ ఇండియా' సంస్థకు అనుబంధంగా ఉందని పాస్టర్ చెప్పాడు. తన వాదనను బలపరుస్తూ భూమి అగ్రిమెంట్‌ను నిజనిర్ధారణ టీంకు అందజేశాడు.
ఈ మూకదాడి జరగడానికి ముందే ఇలాంటి అనుమానాస్పద చర్యలను గురించి చర్చి పోలీసులకు నాలుగు పర్యాయాలు తెలియపరిచింది. వారికి ఒక ద్వేషపూరితమైన క్రిస్టియన్ వ్యతిరేక బెదిరింపులు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చాయి. మత మార్పిడులు చేస్తున్నారని ఆరోపిస్తూ, వారిపై హింసాత్మక బెదిరింపులకు పాల్పడ్డారు. ''నేను ఎస్పీకి ఈ విషయం పై ఈ-మెయిల్ పంపించా, అక్టోబర్2న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను. వారు మాకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ మాకు ఏ సహాయం అందలేదు. దాడి జరిగిన రోజు కూడా మేం పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాం, కానీ అల్లరిమూక విధ్వంసం పూర్తి చేసిన తర్వాత గంటకు పోలీసులు వచ్చారని'' ఆ పాస్టర్ కూతురు చెప్పింది. పోలీస్ స్టేషన్, చర్చి నుంచి ఒక కిలోమీటర్లోపు దూరమే ఉంటుంది. పోలీసులు రావడానికి ముందు వారు సీసీటీవీ ఫుటేజ్‌ను, మత చిహ్నాలను ధ్వంసం చేసి, చర్చిలో ''జైశ్రీరామ్'', ''హరహర మహాదేవ్'' లాంటి నినాదాలు చేశారు.
మావ్ సంఘటన
భజరంగ దళ్, హిందూ యువ వాహిని లాంటి హిందూత్వ అల్లరిమూకలు అక్టోబర్ 10న ప్రార్థనలకు వచ్చిన క్రైస్తవులపై దాడి చేశాయి. పాస్టర్‌తో పాటు అక్కడికి వచ్చిన వారిని తమతో పోలీస్ స్టేషన్‌కు రావాలని అల్లరిమూక ఒత్తిడి చేసింది. కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘిస్తూ, మతమార్పిడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ క్రైస్తవులపై రాధేశ్యాం అనే వ్యక్తి కేసు పెట్టాడు. అదేరోజు మావ్‌లో వేరే ప్రాంతంలో, హిందూ జాగరణ్ మంచ్ జిల్లా ప్రతినిధి భానుప్రతాప్ సింగ్, ప్రజల మతాన్ని మార్చేందుకు పాస్టర్ ఒక ఇంట్లో ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేశాడని ఆరోపిస్తూ కేసు పెట్టాడు. పోలీసులు పాస్టర్ అబ్రహం షకీల్ అహ్మద్, అతని భార్య ప్రతిభతో పాటు ప్రార్థన నిర్వహించబడిన ఇంటి యజమాని విజేంద్ర రాజ్‌భర్ అతని భార్య గీతాదేవిలను అరెస్టు చేశారు. వారి ప్రకటనలు భిన్నంగా ఉన్నప్పటికీ, వారిని 'ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ రెలిజియస్ కన్వర్షన్ ఆర్డినెన్స్ 2020' కింద కేసు నమోదు చేశారు.
అక్టోబర్ 12న మావ్‌లో జరిగిన మరొక సంఘటనలో, హిందూత్వ అల్లరిమూక మత మార్పిడులకు పూనుకుంటున్నారని ఆరోపిస్తూ, ఇద్దరు క్రైస్తవ నన్స్ను కొట్టి, వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్ళింది. మీర్పూర్ క్యాథలిక్ మిషన్‌కు చెందిన ఒక పాఠశాల ప్రిన్సిపల్ అయిన సిస్టర్ గ్రేసీ మాంటెయిరో, ఆమె సహౌద్యోగి సిస్టర్ రోష్నీ మింజ్‌లు (అల్లరిమూక దాడి చేసినప్పుడు) కారులో ఉన్నారు. నేను, (తన తండ్రిని చూసేందుకు రాంచీ వెళ్తున్న) సిస్టర్ మింజ్ వెంట ఉన్నాను. మింజ్, రాంచీ వెళ్లే వాహనం గురించి తెలుసుకునేందుకు మావ్ బస్‌స్టేషన్‌లోకి వెళ్లినపుడు, నేను, డ్రైవర్ కారులో ఉన్నాము. తరువాత అల్లరిమూక వచ్చి డ్రైవర్ పై దాడి చేసి, బయటకు లాగి, పోలీస్ స్టేషన్ వరకు నడవాలని మమ్ములను ఒత్తిడి చేశారని'' సిస్టర్ మాంటెయిరో నిజనిర్ధారణ టీంతో చెప్పింది.
ఉత్తరప్రదేశ్‌లోని షాజాహాన్‌పూర్‌లో 20 మంది క్రైస్తవులపై జనవరి3న మితవాద తీవ్రవాదులు, మత మార్పిడులకు పూనుకుంటున్నారని నిరూపించలేని ఆరోపణలు చేస్తూ మొదలుపెట్టిన దాడుల కొనసాగింపే రూర్కీ, మావ్లలో జరిగిన దాడులు కూడా. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఆస్తులను ధ్వంసం చేసి, క్రైస్తవులను గాయపరిచిన తరువాత, వారు ఆరోపిస్తున్న మత మార్పిడుల గురించి పోలీసులకు తెలుపడంతో, పాస్టర్‌ను, ముగ్గురు క్రైస్తవులను అరెస్ట్ చేశారు.
తరువాత నెలలో అదే రీతిలో, మత తీవ్రవాదులు కాన్పూర్‌లో జరుగుతున్న ఒక చర్చి సమావేశాన్ని ఆటంక పరిచారు .క్రైస్తవ మతంలోకి మారడానికి పాస్టర్, పంకజ్ మాలిక్ ప్రజలకు ఆర్థిక ప్రోత్సాహకాలను ఇవ్వజూపుతూ, మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. దాడి చేసిన నేరస్తులు పోలీసులను పిలవగా వారు పాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఒక నెల తరువాత, బరెయిలీలోని మెథాడిస్ట్ చర్చి గోడలను నేలమట్టం చేశారు. ఫిబ్రవరిలో అంబేద్కర్ నగర్‌లోని తన నివాసంలో ఆదివారం ప్రార్థనలు చేస్తున్న పాస్టర్ అంజీత్ కుమార్‌ను, ఇంట్లోకి చొరబడి మత మార్పిడులకు పాల్పడుతున్నాడని తిట్టారు. ఆయనకు ప్రైవేట్‌గా ఆరాధించే అనుమతి ఉన్నప్పటికీ, ప్రార్థనల కోసం ఎవరినీ ఆహ్వానించకుండా పోలీసులు నిషేధించారు.
కొన్ని రోజుల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో, పాస్టర్ జితేంద్రవర్మ ఒక ప్రార్థనా సమావేశాన్ని నిర్వహిస్తుండగా, ఒక అల్లరిమూక ఒక పోలీసు కానిస్టేబుల్‌తో వచ్చి, ప్రార్థన చేసుకుంటున్న వారిని తిట్టడం మొదలు పెట్టారు. బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయనే ఆరోపణలు మళ్ళీ తెరపైకి తెచ్చారు .ఇదే విధమైన సంఘటనలు కాన్పూర్, ఆగ్రా, బిజ్నోర్, అజమ్ ఘర్, రాంపూర్, ఔరియా, మహారాజ్ గంజ్, జాన్పూర్లలో చోటు చేసుకున్నాయని నివేదికలున్నాయి.
ప్రధానంగా మీడియా ఈ దాడుల గురించి తెలియ చేయకుండా దాటేస్తున్నది. ప్రజల దష్టికి వచ్చిన విషయాలన్నీ పోలీసులు తమదైన శైలిలో చెప్పిన విషయాలే. ''మీడియా, ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుంది. ఒకదానితో ఒకటి సంబంధం లేని ఈ దాడులన్నీ చెదురుమదురుగా జరిగినవేనని ప్రభుత్వం చెపుతుంది. ఇది పచ్చి అబద్ధం. కెనడాలో ఒక సిక్కు, న్యూయార్క్‌లో ఒక హిందువు దాడికి గురైతే, ప్రధానమంత్రితో పాటు ప్రతి ఒక్కరు ఆ దాడులను ఆక్షేపిస్తారు. కానీ మన భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులపై పదుల వందల సంఖ్యలో జరుగుతున్న దాడులపై మీడియా మాత్రం ఆసక్తి చూపదు. ఇటీవల కాలంలో జరిగిన పార్లమెంట్ సమావేశాలలో గానీ, ఉత్తరప్రదేశ్ విధానసభలో గానీ ఈ దాడుల గురించి ఎటువంటి ప్రస్తావన లేదని'' జాన్ దయాళ్ అన్నాడు.
మైనారిటీలపై జరుగుతున్న దాడుల క్రమంలోనే, ప్రస్తుతం క్రైస్తవులపై జరుగుతున్న దాడులు జరుగుతున్నాయి. ఇటీవల 'యునైటెడ్ ఎగెస్ట్ హేట్' , యూసీఎఫ్‌తో కలిసి ఏపీసీఆర్ ఒక పత్రికా సమావేశం నిర్వహించింది. భారతదేశంలో ఈ సంవత్సరం మొదటి 273 రోజుల్లో నమోదైన 305 హింసాత్మక ఘటనలలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైన రాష్ట్రాలు వరుసగా ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లు ఉన్నాయి. లాభాపేక్షలేని సంస్థ, 'యూనిటీ ఇన్ కంపాషన్' అధ్యక్షురాలు మీనాక్షీ సింగ్, ''క్రైస్తవులు చాలా పెద్ద ఎత్తున మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు కానీ, వారి సంఖ్యను చూసినప్పుడు దానికి భిన్నంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ జనాభా సంఖ్య తగ్గుతున్న విషయాన్ని గమనించాలని'' వ్యాఖ్యానించింది.
మత మార్పిడులకు వ్యతిరేకంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు.''గూండాలు మైనారిటీల చిహ్నాలను, శిలువ, బైబిల్, ఖురాన్లపై దాడులు చేసి, అపవిత్రం చేసి, వాటిని ధ్వంసం చేస్తున్నారు. దాడులు చేసిన వారికి వ్యతిరేకంగా కేసులు నమోదు చేసే క్రమంలో మౌల్వీలను, పాస్టర్లను కూడా అదుపులోకి తీసుకుంటున్నారని'' దయాళ్ అన్నాడు.
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
జియాఉస్సాలమ్