Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరైనా బోడగుండుతో ఎదురైతే చాలు గుండెందుకు కొట్టించుకున్నావు అని అడుగుతాము. మొక్కు తీర్చుకున్నామనో, తాతో, నాయనమ్మో కాలం చేశారనో వారి నుంచి సమాధానం వస్తుంది. పెద్దలైతే దీన్ని లైట్‌గా తీసుకుంటారు. కానీ పిల్లలైతే ఓరే గుండుగా అంటూ ఆట పట్టిస్తుంటారు. గుండు కనిపించకుండా కొంత మంది క్యాప్ పెట్టుకుని కవర్ చేస్తారు. పదిహేను రోజుల్లో జుట్టు పెరుగుతుంది. దాన్ని మరచిపోతారు. సాధారణంగా అయితే ఇదే గుండు కథ. కానీ మోసకారి గుండుగాళ్ల గురించి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఇందిరాపార్కు వరి దీక్షలో కొత్తకథ వివరించారు. ఆ కథ విన్న తర్వాత సభ గోల్లుమన్నది. గుండు, అరగుండు, బోడ గుండుగాళ్లు రాష్ట్రంలో విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నారు. గులాబీలకు గులాంగిరి చేస్తూ సారా, సోడాల్లా కలిసిపోయి దావత్‌లు చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. తాగుబోతులు, గుండుగాళ్లు కలిసి రైతులకు పంగనామాలు పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. వరి ధాన్యం కొనే విషయంలో గులాబీదండు, కాషాయదండు రైతులను గందరగోళపరుస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఆ గుండుగాళ్లను వారి పార్టీ నేతలే నమ్మడం లేదు.. ఇక తెలంగాణ ప్రజలెలా నమ్ముతారంటూ ప్రశ్నించారు. ధాన్యం సమస్యను పెద్దది చేయకుండా రాష్ట్రంలో గుండుగాళ్లను కట్టడి చేయాలంటూ గులాబీలు కేంద్రాన్ని వేడుకున్నారట. 'ఈ గుండుగాళ్లు ఇక నుంచి కల్లాలపొంటి తిరగరు, రైతులను పరామర్శించరు, చనిపోయిన రైతులవద్దకు వెళ్లరు. ఆ పూచీ మాదే' అంటూ కేంద్ర మంత్రి వారికి హుకుం జారీ చేశారట!. ''వానాకాలం ధాన్యం కొనకుండా యాసంగి ధాన్యం గురించి రాష్ట్ర మంత్రులు కేంద్రంతో మాట్లాడి మోసం చేస్తున్నారు. ధాన్యం కొనకుండా జాగ్రత్తలు తీసుకునేందుకే టీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్రంలో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు గుండుగాళ్లు లొల్లి చేయకుండా నోరుమూయించారు. అందుకే అంతా గప్‌చుప్'' అంటుండు పీసీసీ ప్రెసిడెంటు. ఇంతకీ గా గుండుగాళ్ళెవరో అర్థమైందా?
- గుడిగ రఘు