Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దేశ భాషలందు తెలుగు లెస్స...' అని మన తేట తెలుగు తియ్యదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు శ్రీకృష్ణ దేవరాయలు. ఆనాటి రాయల వారికి ఎంతమాత్రమూ 'తీసిపోని విధంగా...' ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పొలిటికల్ లీడర్లు... వారి పదునైన మాటలతో మన మాతృభాషను ''సుసంపన్నం'' చేస్తున్నారు. ఈ క్రమంలో సన్నాసులు, లఫంగులు, బద్మాష్లనే ఆణిముత్యాల్లాంటి పదాలు మన తెలంగాణ అధినాయకగణం ప్రసంగాల్లో అలవొకగా అలా అలా దొర్లిపోతున్నాయి. వాటికి సమాన స్థాయిలో ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ స్థాయిలో... మన సోదర ఏపీ వీరాధివీరులు తమ నోటి ద్వారా 'తూటాలను...' వదులుతున్నారు. ఇప్పుడు మీరు చదువుతున్నది ఒక దినపత్రిక కాబట్టి... ఇలాంటి పత్రికల్లో విలేకరులు రాయలేని, జనాలు చదవలేని డైలాగులను వారు దంచికొట్టటం పరిపాటిగా మారింది. వీరిలో మొదటి బహుమతి కొడాలి నానికి ఇవ్వాల్సొస్తే... రెండో బహుమతికి మంత్రి పేర్ని నాని పోటీపడుతూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం తెలంగాణ మంత్రివర్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి... పేర్ని నాని గారి నోట్లో నోరు పెట్టి గెలుక్కున్నారు. నిజామాబాద్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తన ప్రశాంతతను కోల్పోయి... 'అసలు జగన్ మాటిమాటికి మోడీ దగ్గరకు ఎందుకెళుతున్నాడు, అప్పుల కోసం అక్కడికెళ్లి ఆయన ప్రధాని కాళ్లు ఎందుకు పట్టుకుంటున్నాడు...' అంటూ స్పీచ్ దంచికొట్టారు. టీవీ ఛానళ్లు, యూట్యూబ్‌ల పుణ్యమాని... ఆయన ప్రసంగ పాఠం... నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కొచ్చి, వయా కోదాడ మీదుగా విజయవాడకు చేరింది. ఆ వెంటనే అమరావతిలో ఆఘమేఘాల మీద స్పందించిన పేర్ని నాని... 'మా సీఎం అంటే అప్పుల కోసం ప్రధాని కాళ్లు పట్టుకుంటున్నాడు. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మాకు అసెంబ్లీ లేదు, సచివాలయం లేదు, మొన్నీ మధ్యనే వాటిని కట్టుకున్నాం. ఇంకా అనేకం నిర్మించాల్సి ఉంది. అందుకే అప్పుల కోసం మోడీ కాళ్లు పట్టుకుంటున్నాం.. మరి తెలంగాణకు అన్నీ ఉన్నప్పటికీ మీ సీఎం (కేసీఆర్) నెలకోసారి ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు..? మోడీకి ఎందుకు వంగి వంగి దండాలు పెడుతున్నారు...' అంటూ 'పేర్ని శివతాండవం...' చేస్తూ కౌంటర్ ఇచ్చారు. ఇదే విషయమై ఇటీవల తెలంగాణ భవన్లో కలిసిన ప్రశాంత్‌రెడ్డిని కదిలిస్తే... 'ఏదో ఫ్లోలో అలా అన్నా తమ్మీ.. నా ఉద్దేశం అదికాదు...' అంటూ పాత్రికేయులకు కన్నుగీటుతూ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
-బి.వి.యన్.పద్మరాజు