Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరత్ ఇంట్లోకి వస్తూనే కొడుకును చూశాడు. వాడు టీవీలో చిరంజీవి సినిమా ఏదో చూస్తున్నాడు. శరత్‌కు భలే సంతోషమయ్యింది. తనలాగే కొడుకు కూడా చిరంజీవి అభిమాని అయినందున తన ఆస్తి పంచుకున్నాడన్నంత సంతోషమయ్యింది. లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చి సోఫాలో కొడుకు పక్కనే కుర్చున్నాడు. కొడుకు ''ఠాగూర్'' సినిమా చూస్తున్నాడు. అది చూసి తండ్రి మళ్ళీ ఆనందపడ్డాడు. ఆ సినిమా అంటే తనకూ చాలా ఇష్టం!
ఈలోగా హరిత చాయి తీసుకొని వచ్చింది. కొడుకుని చూసి వాడి చేతిలో నుండి రిమోట్ లాక్కుంది. అది చూసి శరత్ వెంటనే హరిత చేతిలో నుండి మళ్ళీ రిమోట్ లాక్కుని కొడుకు చేతిలోపెట్టాడు. ''నా కొడుకును ఠాగూర్ సినిమా చూడనియ్యవా! చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో!'' అన్నాడు స్టయిల్‌గా.
''ఆఁ మీ చెయ్యి రఫ్‌గా ఉంటే, నా చేతిలో బాగా కాగిన జాలిగంటె ఉంది! తెమ్మంటారా? అసలు వాడు పొద్దుటి నుండి ఆ ఠాగూర్ సినిమాలో ఒకే ఒక్క సీన్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. అది తెలుసా?'' అన్నది హరిత సీరియస్‌గా.
శరత్ టీవీ వైపు చూశాడు. ''తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించటం!'' అన్న డైలాగ్ సీన్ మళ్ళీ మళ్ళీ వస్తోంది!
''ఎందుకు నానీ? మళ్ళీ మళ్ళీ అదే సీన్ చూస్తున్నావు?'' అని అడిగాడు శరత్ కొడుకును.
''ఆ డైలాగ్ బాగా నచ్చింది! అసలు ఏ భాషలోనైనా ఆ డైలాగ్ ఉండకూడదు!'' అన్నాడు నానీ.
''ఎందుకురా?'' అడిగాడు శరత్.
''అసలు తప్పుచేయటం ఎందుకు? మళ్ళీ క్షమాపణ అడగటం ఎందుకు? అన్నాడు నానీ.
''వీడేం మాట్లాడు తున్నాడు?'' అంటూ భార్యవైపు చూశాడు శరత్.
''నాకు తెలియదు! మీరే మీ కొడుక్కి సమాధానం చెప్పండి!'' అంటూ వంటింట్లోకి వెళ్ళింది హరిత.
అయోమయంగా కొడుకువైపు చూశాడు శరత్.
ఏదైనా తప్పు చేయటం దేనికి? క్షమాపణ అడగటం దేనికి? క్షమాపణ చెపితే చేసిన తప్పు వల్ల జరిగిన నష్టం భర్తీ అవుతుందా? మళ్ళీ అడిగాడు నానీ.
''క్షమ అనేది చాలా గొప్ప విషయం! అది మన భారతీయ సంప్రదాయం!'' గొప్పగా చెప్పాడు శరత్.
''మరి తప్పు చేయటం ఎవరి సంప్రదాయం?'' మళ్ళీ అడిగాడు నాని.
శరత్‌కు అనుమానం వచ్చింది. ''ఓరేయి! ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు? సూటిగా చెప్పు!'' అడిగాడు.
''నేను సూటిగానే అడుగుతున్నాను! ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు దానివల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అని ఆలోచించరా? ముందుగా చట్టం చేసేసి, తమాషా చూస్తారా? అసలు చట్టం చేసేముందు స్టేక్ హౌల్డర్స్తో చర్చించరా? ఒకవేళ చట్టం చేసేటప్పుడైనా పార్లమెంట్లో చర్చలు జరపరా? ఏమిటిదంతా?'' అని అడిగాడు నాని.
''ఓహౌ రద్దయిన వ్యవసాయ చట్టాల గురించా నీ బాధ!'' అన్నాడు శరత్ తేలిగ్గా.
''ఏమిటి డాడీ అంత తేలికగా మాట్లాడతారు? రైతులను అట్లా తేలికగా తీసుకునే ఈ చట్టాలు చేశారు. చట్టాలు రద్దు చేయమంటే దేశద్రోహులనీ, విదేశీ ఏజెంట్లనీ, వేర్పాటు వాదులనీ, రకరకాల ముద్రలు వేశారు! ఒక సంవత్సర కాలంగా రైతులందర్ని శత్రువులుగా చూశారు! దేశ దేశాలన్నీ తిరుగుతున్న ప్రధానికి ఢిల్లీ పక్కనే రైతులతో మాట్లాడే తీరికలేదు. చట్టాలు పక్కనపెట్టమన్న సుప్రీం కోర్టునే ఖాతరు చేయలేదు!'' అన్నాడు నానీ.
''ఏదైతేనేం చట్టాలైతే రద్దు చేసి క్షమాపణ చెప్పారు కదా!'' అన్నాడు శరత్.
''అదే నాకు నచ్చటం లేదు! మీకు నచ్చితే దేశభక్తి! లేకపోతే దేశద్రోహమా! ఇదేమి నీతి? నిన్నటి దాకా రైతుల మీద నీటి ఫిరంగులు, ముళ్ళకంచెలు, రోడ్డు దిగ్భంధనాలు ఒకటేమిటి? అన్ని ఆయుధాలు ప్రయోగించారు! కసితీరక ఒక కేంద్రమంత్రి కొడుకు తన కారెక్కించి ఆరుగురు రైతుల ప్రాణాలు తీశాడు! గత సంవత్సర కాలంగా 700మందికి పైగా రైతులు దేశభక్తియుత పోరాటంలో వీరమరణం పొందారు. సరిగ్గా చెప్పాలంటే వారందరూ ప్రభుత్వం చేతిలో హత్యగావించబడ్డారు. చైనా, పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల్లో కూడా ఇంతమంది చనిపోలేదేమో? దేశానికి తిండిపెట్టే వారిని ఏ దేశ ప్రభుత్వమైనా ఇట్లా పొట్టన పెట్టుకుంటుందా? దీనికి క్షమించండి! అన్న చిన్న మాట సరిపోతుందా!'' అడిగాడు నాని.
''ఇన్ని రోజులూ రద్దు చేయమన్నారు! రద్దు చేశాక ఇప్పుడు గొడవ చేస్తున్నారు! ఇదేమి పద్ధతి! క్షమించమన్నా తప్పేనా?'' ఆసహనంగా అన్నాడు శరత్!
''ముమ్మాటికీ తప్పే!'' అంటూ కోపంగా వారి సంభాషణలో జోక్యం చేసుకుంది హరిత. ''ఎందుకంటే ఈ క్షమాపణ కోరటంలో హృదయ పరివర్తన లేదు! తప్పుచేశామన్న ఆపరాధభావం లేదు! తప్పు దిద్దుకుంటున్నామన్న నిజాయితీ లేదు! చేసిన తప్పులను చూసిన దేశ న్రపజానీకం చెవి పిండుతుంటే, పెదవులపై నుండి వచ్చిన ఆపద్ధర్మ వ్యాక్యాలవి! ఆ మాటలైనా చెప్పకపోతే ఒంగపెట్టి వీపు పగలకొడతారన్న తెలివిడి చెప్పించిన మాటలవి! అందుకే మా లాంటి వాళ్ళ మనస్సులు శాంతించటం లేదు! గుండెలు మండుతున్నాయి. పాలకుల అహంభావానికి, అధికార మదానికి ఏ ఒక్క సైనికుడో బలైతే దేశమంతా ఆవేదన చెందుతుంది! మరి ఒక్క సంవత్సరం పాలకుల విధానానికి, అహంకారానికి 700మంది రైతులు బలైపోతే, దేశమంతా కన్నీరు పెడుతున్నది. ఈ కన్నీటి ప్రవాహం, ఆగ్రహజ్వాలలుగా మారి, రాబోయే ఎన్నికల్లో తమను దహించి వేస్తుందన్న భయమే క్షమాపణ చెప్పించిదన్న సత్యం దేశ ప్రజానీకం గుర్తించింది! అందుకే క్షమాపణను అంగీకరించలేకపోతున్నాము!'' అన్నది హరిత తీవ్రంగా!
అయినా క్షమాపణ చెప్పవలసిన లిస్టు చాలా పెద్దది! పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా, లేబర్‌కోడ్స్, మానిటైజేషన్ పైప్‌లైన్, రాఫెల్ ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటికీ క్షమాపణలు అర్థించే రోజు దగ్గర్లోనే ఉంది! అయినా సరే మాకు అంటే దేశ ప్రజలకు క్షమాపణ అన్న పదమే కాదు! ఆ మాట చెప్పేవారు కూడా ఇష్టం లేదు!'' అన్నాడు నాని.
- ఉషాకిరణ్,
సెల్:9490403545