Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడాది కాలంగా సాగుతున్న రైతాంగ ఉద్యమానికి తలొగ్గి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం రైతులకు, వారి ఐక్య ఉద్యమానికి నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం)కు చారిత్రక విజయం. ఇందులో కేవలం కార్పొరేట్ అనుకూల రైతాంగ చర్యలను రద్దు చేయడం కన్నా మించి మరింత విస్తృతమైన, సుదీర్ఘ కాలంలో తలెత్తే పర్యవసానాలు కూడా ఉన్నాయి.
మొట్టమొదటిది, అన్నింటి కంటే ప్రధానమైనది, రైతాంగ అనుకూల వ్యవసాయం ద్వారా జీవనోపాధిని పొందే రైతుల హక్కును విజయవంతంగా కాపాడుకోవడం. ఇది, మోడీ ప్రభుత్వం పట్టుదలతో అనుసరిస్తున్న నయా ఉదారవాద ఎజెండాకు పెద్ద ఎదురు దెబ్బ.
ఇక రెండవది, రైతాంగ పోరాటం విజయవంతం కావడం నిరంకుశవాదానికి, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడానికి వ్యతిరేకంగా తగిలిన మరో దెబ్బ. కార్మికవర్గం తోడ్పాటుతో రైతాంగం సాగించిన ఈ ప్రజా ఉద్యమం, పార్లమెంట్‌ను తక్కువ చేసి చూసే, పార్లమెంటరీ పద్ధతులను కుదించి, పక్కకు నెట్టే నిరంకుశ వ్యవస్థను బీటలు వారేలా చేసింది.
ఈ మూడు వ్యవసాయ చట్టాలను ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, స్థాయీ సంఘాలకు పంపకుండా గతేడాది జూన్‌లో ఆర్డినెన్సులుగా తీసుకువచ్చారు. ప్రతిపక్ష సభ్యుల వాణిని అణగదొక్కడం ద్వారా, రాజ్యసభలో జరగాల్సిన ఓటింగ్ క్రమాన్ని కూడా జరపకుండానే ఆమోదించేశారు. రైతులు సాగించిన ప్రజా ఉద్యమం ఈ నిరంకుశ వ్యవస్థను ఉలిక్కిపడేలా చేసింది.
గతంలో కూడా, భూ సేకరణ చట్టాన్ని సవరిస్తూ 2015లో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ ఐక్యవేదిక భూమి అధికార్ ఆందోళన్ చేపట్టిన పోరాటంతో ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత ఇది జరిగింది. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో బీజేపీ నాటి గుణపాఠాన్ని మర్చిపోయింది. పలు ఆర్డినెన్స్‌లను, ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చింది. వీటిలో 370వ అధికరణను రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టం వంటివి ఉన్నాయి. ఇక భవిష్యత్‌లో ఇటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుగా మోడీ ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది.
మూడవది, ఏడాదిపాటు సాగిన రైతాంగ ఉద్యమం హిందూత్వ నయా ఉదారవాద ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు మార్గాన్ని చూపింది. ముఖ్యంగా, పార్లమెంట్లో ప్రతిపక్షం బలహీనంగా, సమర్థవంతంగా లేని పరిస్థితుల్లో, ఐక్య వేదికల ద్వారా సాగే ప్రజా పోరాటాలు, ఉద్యమాలు ప్రజలను సమీకరించడానికి, ప్రతిఘటనను పెంపొందించడానికి మార్గం చూపుతాయని నిరూపించింది.
అసలు ఈ దశలో మోడీ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేసింది? పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లు ఈ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్నాయి. సిక్కు రైతు నేతలను ఖలిస్తానీలుగా, జాతి వ్యతిరేకులుగా ముద్రిస్తూ, అణచివేత చర్యలు తీసుకోవడం ద్వారా ఈ పోరాటాన్ని తొక్కి వేయడానికి మోడీ ప్రభుత్వం, పాలక పార్టీలు చర్యలు తీసుకున్నాయి. దాంతో మొత్తంగా పంజాబ్ ప్రజలందరూ బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యమై పిడికిలి బిగించారు. దీంతో బీజేపీ నేత ఎవ్వరూ కూడా పంజాబ్‌లోని ఏ గ్రామానికీ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇటు చూస్తే పంజాబ్ ఎన్నికలు కొద్ది వారాల్లో ఉన్నాయి. దీంతో ఇబ్బందికర పరిస్థితుల్లో పడిన బీజేపీ తన ఒంటరితనాన్ని ఛేదించడానికి ప్రయత్నించే చర్యలు చేపట్టాల్సి వచ్చింది.
పంజాబ్‌లో ఎన్నికల అవకాశాలను త్యాగం చేయాల్సి ఉంటుందని బీజేపీ భావించినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో కూడా ముప్పు పొంచి ఉంది. ఎలాంటి వ్యయ ప్రయాసలకోర్చైనా, దీన్ని ఎంత మాత్రమూ అలక్ష్యం చేయకూడదన్న పరిస్థితి తలెత్తింది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో గత ఏడాది కాలంలో పోరాటానికి మద్దతుగా మొత్తంగా రైతాంగాన్ని సమీకరించడంతో వారందరూ ఏక తాటిపైకి వచ్చారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రైతాంగంలో మెజారిటీ వర్గాలు బీజేపీకి ఓటు వేశాయి. 2013లో ముజఫర్‌నగర్ అల్లర్ల అనంతరం తలెత్తిన జాట్ ముస్లింల విభేదాలను చాలావరకు ఈ రైతాంగ పోరాటం పరిష్కరించింది. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ అల్లర్లు బీజేపీకి ఉపయోగపడ్డాయి. ముజఫర్‌నగర్‌లో సెప్టెంబరులో జరిగిన బ్రహ్మాండమైన ర్యాలీ ఈ మేరకు శక్తివంతమైన సందేశాన్ని పంపింది. కేంద్ర సహాయ మంత్రి కుమారుడు కారు నడిపి నలుగురు రైతుల మరణానికి కారణమైన లఖింపూర్ ఖేరి దారుణం తర్వాత రైతాంగ ఉద్యమానికి సానుభూతి, మద్దతు రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించింది.
2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి మార్గం వేస్తుందని అమిత్ షా పదే పదే చెబుతూ వస్తున్నారు. అందువల్ల బీజేపీకి సంబంధించినంత వరకు, ఉత్తరప్రదేశ్ అనేది ఒక కిరీటం వంటిది. దాన్ని కాపాడుకోవడానికి తహతహలాడుతూ ఉంటుంది. ఆదిత్యనాథ్ ప్రభుత్వం సాగించే నిరంకుశ పాలన కారణంగా ప్రజల్లో మద్దతు తుడిచిపెట్టుకుపోతుండడంతో... రైతాంగ ఉద్యమం వల్ల దానికి ఎదురవుతున్న ముప్పు మరింత పెరిగింది. ఇక, ఉత్తరప్రదేశ్‌లో నష్టాలను భర్తీ చేసుకోవాలంటే కొంతమేర వెనక్కి తగ్గడం మంచిదని మోడీ భావించారు. ఈ చర్య వెనుక మరో కారణం కూడా కనిపిస్తోంది - రైతాంగ ఉద్యమం, అది లేవనెత్తే అంశాలు మొత్తంగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. అదలా కొనసాగు తున్నంత వరకు తన విచ్ఛిన్నకర మతోన్మాద ఎజెండాపై ప్రజల దృష్టి పడేలా చేయడం కష్టసాధ్యమవుతుందని బీజేపీ భావించింది.
రైతాంగ సమస్యను తన దారికి అడ్డు రాకుండా చేసుకుంటే ఇక రెచ్చగొట్టే తన హిందూత్వ ఎజెండాను మళ్ళీ లేవనెత్తేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని బీజేపీ ఆశిస్తోంది. అయితే, రైతుల సమస్యలు ఒక్కసారిగా అదశ్యమై పోలేదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించడమనేది రెండో కీలకమైన డిమాండ్ అని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. రైతులను తీవ్రంగా దెబ్బ తీసేలా విద్యుత్ పంపిణీని ప్రయివేటీకరించేందుకు ఉద్దేశించిన విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలన్నది మరో డిమాండ్ అని గుర్తుచేసింది. ఈ డిమాండ్ల సాధన కోసం ఎంతకాలం పోరాటం నిర్వహిస్తారనేది సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించాల్సి ఉంది. అయితే, ఒక విషయం మాత్రం స్పష్టమైంది. హిందూత్వ నయా ఉదారవాద నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగే పోరాటం కొత్త దశకు చేరుకుంది. రైతాంగ ఉద్యమం సాధించిన అనూహ్యమైన ఐక్యత రూపంలో, కార్మిక వర్గ ఉద్యమంతో పెరుగుతున్న కలయికతో వర్గ రాజకీయాలు ఆవిర్భవించాయి. గతేడాది నవంబరు 26న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపిచ్చిన సార్వత్రిక సమ్మె, అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ ఇచ్చిన ఢిల్లీ చలో నినాదంతో ఈ ప్రజా పోరాటం ఆరంభమైందని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది. అప్పటి నుండి, పలు ఉమ్మడి పిలుపులు, రైతాంగ కార్మికవర్గ పోరాటాలు వరుసగా ప్రారంభమయ్యాయి.
వామపక్షాల నేతృత్వంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు తమ తమ రంగాల్లో విస్తృతమైన ఐక్యతను నిర్మించడంలో కీలక పాత్ర పోషించాయి. సంయుక్తంగా కార్మిక, కర్షక చర్యలను పెంపొందించడానికి దోహదపడ్డాయి. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన రెండు రోజుల సమ్మె పిలుపుతో సహా రాబోయే పోరాటాలన్నీ విజయవంతం కావడానికి ఈ పరస్పర సహకారం దోహదపడుతుంది.
సీపీఐ(ఎం), వామపక్షాల కోణం నుండి చూసినట్లైతే, ఈ పరిణామాలన్నీ వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నింటినీ సమీకరించే దిశగా కీలకమైన చర్యలే. హిందూత్వ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమర్ధవంతమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించగలిగేవే.
- 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం