Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అమెరికాలో కూలుతున్న జఫర్సన్ విగ్రహాలు, రష్యాలో పెరుగుతున్న స్టాలిన్ విగ్రహాలు'' అనే శీర్షికతో అమెరికాలోని అగ్రపత్రికల్లో ఒకటైన ''లాస్ ఏంజల్స్ టైమ్స్'' నవంబరు 20న ఒక విశ్లేషణను ప్రచురించింది. ఇదే సమయంలో ఒక స్మారక చిహ్నానికి ఉన్న చట్టబద్దతను రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటీషన్‌పై రష్యా సుప్రీం కోర్టు విచారణను డిసెంబరు 14కు వాయిదా వేసింది. పూర్వపు సోవియట్‌లో జరిగినట్లు చెప్పే మానవహక్కుల ఉల్లంఘనకు బలైన వారి పేరుతో స్టాలిన్, కమ్యూనిస్టు పార్టీ మీద బురద చల్లేందుకు ఏర్పాటు చేసినదే సదరు స్మారక చిహ్నం.
అనేక దేశాల్లో చరిత్ర గురించి చర్చలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. అమెరికాలో కూడా అదే జరుగుతోంది. లాస్ఏంజల్స్ టైమ్స్ విశ్లేషణ రచయిత నికోలస్ గోల్డ్బెర్గ్ కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను రాశారు. మరోసారి అమెరికన్లు చరిత్ర గురించి పోట్లాడుకుంటున్నారు అనే వాక్యంతో ప్రారంభించారు. తాజమహల్ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలెవరని మహాకవి శ్రీశ్రీ ప్రశ్నించినట్లే అమెరికా నిర్మాతలెవరు, ఏ పునాదులమీద నిర్మించారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ అమెరికా నిర్మాతగా పరిగణించే థామస్ జఫర్సన్ - నాజీల పీచమణచిన కమ్యూనిస్టు నేత స్టాలిన్ల గురించి రాశారు. స్టాలిన్‌ను నియంతగా వర్ణిస్తూ మే నెలలో ఓ సర్వే జరగగా, ఆ సర్వేలో 56శాతం మంది రష్యన్లు స్టాలిన్‌ను గొప్పనేతగా పరిగణించటం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ తన రాజకీయ అవసరాల కోసం స్టాలిన్‌కు పునరావాసం కల్పిస్తున్నారని, గత తరాలు ధ్వంసం చేసిన విగ్రహాల స్థానంలో కొన్ని పట్టణాలలో తిరిగి ప్రతిష్టిస్తున్నారని రచయిత వాపోయాడు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటన ప్రధాన రచయిత ధామస్ జఫర్సన్ ఆరువందల మంది బానిసలను కూడా కలిగి ఉన్నాడని, అలాంటి వ్యక్తి విగ్రహం తమ సిటీహాల్‌లో ఉండటం అవమానకరమంటూ దాన్ని తొలగించాలని న్యూయార్క్ నగరపాలక సంస్థ ఏకగ్రీవంగా తీర్మానించటం గురించి గగ్గోలు పెట్టాడు. అందుకే జఫర్సన్ విగ్రహాలను తొలగిస్తుంటే స్టాలిన్ విగ్రహాలను కొత్తగా పెడుతున్నారంటూ విశ్లేషణ చేశాడు.
సోవియట్‌ను కూల్చిన తొలి రోజుల్లోనే స్టాలిన్ మీద తప్పుడు ప్రచారం చేసేందుకు స్మారకాన్ని ఏర్పాటు చేశారు. 2016లో దాన్ని విదేశీ ఏజంట్‌గా ప్రకటించారు. దాని ప్రకారం మానవహక్కుల సంస్థల పేరుతో దాన్ని నిర్వహిస్తున్నవారి మీద చర్య తీసుకోవచ్చు. రాజకీయంగా తమను అణచివేసేందుకే పుతిన్ ప్రభుత్వం దాన్ని ఎత్తివేసేందుకు పూనుకుందని వారు ఇప్పుడు విమర్శిస్తున్నారు. దానిలో వాస్తవం ఉన్నప్పటికీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా స్టాలిన్ మీద జనంలో పెరుగుతున్న సదభిప్రాయం కారణంగానే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు పుతిన్ కూడా ఎత్తులు వేస్తున్నాడన్నది స్పష్టం. రష్యా కోర్టులో తమ కేసు వీగిపోతే ఐరోపా కోర్టుకు వెళతామని నిర్వాహకులు చెబుతున్నారు. విదేశీ ఏజంట్లనే ముద్రవేసి పుతిన్ తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీస్తున్నాడు. కమ్యూనిస్టు ఎంపీ మీద కూడా తప్పుడు కేసు పెట్టించాడు.
తరత2010లో స్టాలిన్ విగ్రహాలకు మద్దతు ఇచ్చిన వారు 25శాతం, వద్దన్నవారు 36శాతం కాగా ఈ ఏడాది ఆగస్టులో అవి 48-20శాతాలుగా ఉన్నట్లు లెవడా కేంద్రం సర్వే వెల్లడించింది. 2005-21 మధ్యకాలంలో 18-24 ఏండ్ల వయసులో ఉన్న వారిలో స్టాలిన్ పట్ల అభిమానం ఐదు రెట్లు పెరిగింది. స్టాలిన్ గొప్పనేత అని చెప్పిన వారు ఈ ఏడాది మేనెల సర్వేలో 56శాతం మంది ఉన్నట్లు, 2016తో పోల్చితే రెట్టింపు అని లెవడా తెలిపింది. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో సోవియట్ల చర్యలను నాజీలతో పోల్చటాన్ని నిషేధిస్తూ పార్లమెంట్ చేసిన తీర్మానానికి ఈ ఏడాది జూలైలో పుతిన్ ఆమోద ముద్రవేశాడు. యుద్ధంలో పౌరుల నిర్ణయాత్మక పాత్రను తోసిపుచ్చటాన్ని కూడా నిషేధించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పతనంలో స్టాలిన్ పాత్ర చెరిపితే చెరిగేది కాదు. స్టాలిన్ మరణం తరువాత ప్రత్యర్థులు ఆయనపై చేయని తప్పుడు ప్రచారం లేదు. మసోలియం నుంచి భౌతిక కాయాన్ని తొలగించి క్రెమ్లిన్‌లో సమాధి చేశారు. సోవియట్ పతనం ముందు తరువాత కూడా తప్పుడు ప్రచారం సాగినా ఇటీవలి కాలంలో స్టాలిన్ పట్ల రోజు రోజుకూ జనంలో అభిమానం పెరుగుతోంది. స్టాలిన్ గురించి ఇతర దేశాల్లో సాగించిన తప్పుడు ప్రచారం నేపథ్యంలో అనేక మందికి ఈ పరిణామం మింగుడు పడటం లేదు గానీ రష్యన్లు ఆ విధంగా భావించటం లేదు. తమ దేశ ఔన్నత్యం నిలిపిన నేతగా పరిగణిస్తున్నారు.
స్టాలిన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా నాజీలు ఆకస్మికంగా దాడి చేసినప్పుడు ఎర్రసైన్యం పసిగట్టలేకపోయిందంటూ ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఆ కారణంగా 2005 సర్వేలో స్టాలిన్ తగిన సన్నాహాలు చేయలేదనే అభిప్రాయం 40శాతం కలిగి ఉండగా 2021లో 17శాతానికి తగ్గింది. స్టాలిన్ గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలిపేందుకు ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని మాస్కోకు 450 కిలోమీటర్ల దూరంలోని నోవోగోర్డ్ కమ్యూనిస్టులు సన్నాహాలు చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ అధినేత జుగనోవ్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సోషలిస్టు సమాజాన్ని కుప్పకూల్చి జన సంపదలను దోచుకున్న వారు ఎల్సిన్ పేరుతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు స్టాలిన్ పేరుతో ఏర్పాటు గురించి ఎందుకు ఆలోచించకూడదని జుగనోవ్ సహాయకుడు అలెగ్జాండర్ యుషి చెంకో అన్నారు. గతంలో ఎలాంటి అభిప్రాయం వెల్లడించని, సోవియట్ పతనం తరువాత పుట్టి పెరిగిన యువతరం ఇప్పుడు స్టాలిన్ పట్ల సానుకూల వైఖరితో ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి.
వివిధ సర్వేలలో స్టాలిన్ పట్ల సానుకూల వైఖరి వెల్లడి కావటం అంటే నూతన తరంలో సోషలిజం, కమ్యూనిజం పట్ల ఆసక్తి పెరగటం, కూల్చివేసిన సోషలిస్టు సమాజంతో ప్రస్తుత పరిస్థితులను పోల్చుకోవటం సహజంగానే జరుగుతుంది. అది ఇప్పుడున్న పుతిన్ లేదా ఇతర అధికార బూర్జువా పార్టీలకు అంగీకారం కాదు. రెండవది రోజురోజుకూ పుతిన్‌ను సమర్థించేవారు తగ్గుతున్నారు. సర్వేల ఫలితాలు జనంలో చర్చకు దారి తీస్తున్నాయి. ఇది గిట్టనివారు సర్వేలు రష్యా సమాజాన్ని ప్రతిబింబించటం లేదని ధ్వజమెత్తుతున్నారు. కొందరైతే సర్వేల్లో అసలు స్టాలిన్ గురించి అడగాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. రష్యన్ చరిత్రలో స్టాలిన్ పాత్ర గురించి జనం 70శాతం మంది సానుకూలంగా స్పందిస్తున్నప్పుడు పండితులు దాన్ని ఎలా కాదో చెప్పలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. లెవడా సర్వేలు అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి. స్టాలిన్ యుద్ధ విజేత, తెలివిగల నేత అని భావిస్తున్నారు. స్టాలిన్‌ను అభిమానించే వారు పెరగటం అంటే పాలకపార్టీ పట్ల అసంతృప్తి పెరగటంగా భావించవచ్చని కొందరు సూత్రీకరిస్తున్నారు. గతంలో స్టాలిన్‌ను ఒక నియంత, బూచిగా ఒక పథకం ప్రకారం చూపారు. కానీ చరిత్రలో మహత్తర పోరాటం సాగించిన స్టాలిన్ మీద ఎల్లకాలం బురదచల్లటం కొనసాగించలేని స్థితిలో జనాలు నిజాలు తెలుసుకుంటున్నారు. వాటిని పుతిన్ సహిస్తాడా?