Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక కళాకారుని సృజనాత్మక స్వేచ్ఛను పరిరక్షించేందుకు తమిళనాడులో నేతలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే చెప్పాలి. తమిళనాడులో సినిమా అనేది సామాజిక, రాజకీయ ప్రచార సాధనంగా పని చేస్తూ ఉంటుంది. అందువల్ల కోలివుడ్లో రాజకీయ నేతలు, సామాజిక సాంస్కృతిక గ్రూపులు దాడులకు దిగడం సర్వ సాధారణం. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన, సంచలనం రేకెత్తించిన 'జై భీమ్' చిత్రంపై అనవసర రాద్థాంతం చేస్తున్నాయి. వాస్తవికంగా జరిగిన, పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన ఒక సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అయితే దీనిపై కొన్ని రాజకీయ, కుల, మితవాద సంస్థలు ఉలిక్కిపడ్డాయి. తమిళనాడులో అత్యంత వెనుకబడిన తరగతికి చెందిన వన్నియార్లను ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుగా చిత్రీకరించారంటూ కులాల రంగును పులిమే యత్నం చేస్తున్నారు. పైగా చిత్రంలోని విలన్‌ను హిందువుగా చూపించారని పేర్కొంటున్నారు. అయితే చిత్రంలోని కొన్ని ప్రధాన పాత్రలు తప్ప మిగిలినవన్నీ కల్పిత పాత్రలుగానే చూపించారు. చిత్రంలో విలన్ అయిన పోలీసు అధికారి గురుమూర్తి ఇంట్లో గోడపై వేలాడుతున్న 1995 నాటి కేలండర్పై వన్నియార్ సంఘం, దాని రాజకీయ విభాగమైన పిఎంకెలు కలత చెందాయి. ఆ కేలండర్పై అగ్నికుండం చిత్రం ఉంది. ఆ చిహ్నాన్ని వన్నియార్లు ఉపయోగిస్తారు. ఆ కేలండర్పై వివాదం తలెత్తడంతో చిత్ర నిర్మాణకర్తలు ఆ స్థానంలో హిందూ దేవత చిత్రాన్ని పెట్టారు. అయినా వివాదం సద్దుమణగలేదు. చనిపోయిన వన్నియార్ నేత కడువెట్టి జె.గురును గుర్తుకు తెచ్చేలా కావాలనే విలన్‌కి గురుమూర్తి అని పేరు పెట్టారని విమర్శించారు. వాస్తవ ఘటనలో పోలీసు అధికారి పేరు ఆంథోనీసామి అని, అతను క్రైస్తవుడు అని, కానీ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ చిత్రంలో హిందువు పేరు పెట్టారని కొంతమంది బీజేపీ నేతలు, వాటి అనుబంధ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై నటుడు, సహ నిర్మాత సూర్య, దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ స్పందిస్తూ... చిత్రంలో సన్నివేశాలు కానీ, పేర్లు కానీ ఉద్దేశ్యపూర్వకంగా పెట్టినవి కావని వివరణ ఇచ్చారు. తనకు బెదిరింపులు వచ్చినా క్షమాపణ చెప్పేందుకు సూర్య తిరస్కరించారు. ఇటు వంటి సంకుచిత రాజకీయాలు మానుకోవాలని, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తించాలని, దాన్ని పరి రక్షించాలని పిఎంకె నేత డాక్టర్ రామదాస్‌ను సూర్య కోరారు.
ఇదొక్క సంఘటనే కాదు, ఇలాంటివి గతంలో కూడా చాలా జరిగాయి. కోలివుడ్లో సినీ రంగాన్ని ఏలి తర్వాత రాజకీయ రంగానికి వచ్చి ముఖ్యమంత్రి అయిన వారు ఉన్నారు. అయినా కానీ వారు కళాకారుని సృజనాత్మక స్వేచ్ఛను పరిరక్షించేలా చర్యలు తీసుకోవడంలో విఫల మయ్యారు. 1987లో విడుదలైన 'ఒరు ఒరు గ్రామత్తిలే' చిత్రం విడుదలకు ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఆర్థిక ప్రామాణికాల ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని ఆ చిత్రం సందేశం ఇవ్వడమే చేసిన తప్పుగా మిగిలింది. అలాగే 2013లో ముస్లిం సంస్థల నుండి నిరసనలు వచ్చినందుకు కమల్‌హాసన్ తీసిన 'విశ్వరూపం' చిత్రాన్ని జయలలిత ప్రభుత్వం నిషేధించింది. పైగా భద్రతను కల్పించేందుకు తగినంతమంది పోలీసులు లేరంటూ ఆ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు కూడా.
'ది హిందూ' సౌజన్యంతో
- డి. సురేష్ కుమార్